చీమ.. ఓ అల్పజీవి. కానీ.. ఒకప్పుడు పరిమాణంలో హమ్మింగ్ బర్డ్ అంత పెద్ద చీమలు పిపీలిక సామ్రాజ్యాన్ని ఏలాయట. ఇటీవల లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్ ఏళ్ల కిందట మహా భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు తేల్చారు. చీమ జాతుల్లో ఏకంగా 30 ఏళ్లు జీవించేవి కూడా ఉండటం విశేషమే. కాగా.. చీమలు వేడి వాతావరణంలోనే జీవించడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షాకాలం, శీతాకాలంలో చలికి తట్టుకోలేక మన ఇళ్లల్లోకి చొరబడి తలదాచుకుంటాయని.. వంటింట్లోని ఆహార పదార్థాలను దోచుకుపోతాయని వెల్లడించారు.
సాక్షి, అమరావతి: అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో 47 మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు అక్కడి కాలనీలను పాలించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హమ్మింగ్ బర్డ్ పరిమాణంలో ఉండే రాణి చీమ శిలాజాన్ని 2011లో కనుగొన్నారు. రెండు అంగుళాలకు పైగా సైజులో ఉన్న ఈ శిలాజాన్ని డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ సైన్సెస్‌లో భద్రపరిచారు. అంతకు ముందు టైటానోమైర్మా జాతికి (2 అంగుళాల పొడవు, 16 సెంటీమీటర్ల రెక్కలు) చెందిన చీమ శిలాజాన్ని జర్మనీలో గుర్తించారు. చీమలు చల్లటి రక్తం (కోల్డ్ బ్లడెడ్) కలిగిన జాతికి చెందినవి. వాటి శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని సూర్యరశి్మపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికే ఇష్టపడతాయి. గ్లోబల్ వారి్మంగ్ చీమ జాతిని భయపెడుతున్నా.. కొంచెం తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలుతున్నాయి. అందుకే శీతాకాలంలో (డిసెంబర్–జనవరి మధ్య) బయట చీమలు కనిపించవు. ఆహార పదార్థాలు ఉండే ఇళ్లలోకి చొరబడి జీవనం సాగిస్తాయి.
డైనోసార్లు అంతరించినా.. ఇవి బతికే ఉన్నాయ్
జీవుల్లో అత్యంత సంపన్నమైన (సోషల్ ఇంజనీరింగ్), శక్తివంతమైన సమూహాలలో చీమలకు ప్రత్యేక స్థానం ఉంది. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. చీమలకు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కిందట మయన్మార్‌లో 99 మిలియన్ సంవత్సరాల క్రితం ‘హెల్ యాంట్’ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్‌బర్గ్‌లోని జూలియస్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భూమిపై 20 క్వాడ్రిలియన్ (20 వేల ట్రిలియన్) చీమలు ఉన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించింది. వీటి సంఖ్య గతంలో కంటే రెండు నుంచి 20 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 2.5 మిలియన్ చీమల జనాభా ఉండటం గమనార్హం.
వీటి బరువు 12 మిలియన్ టన్నులు
ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు (చీమల బయోమాస్ 12 మిలియన్లు) ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల బయోమాస్‌లో దాదాపు 20 శాతం. బయోమాస్ అనేది జీవుల్లోని కర్బనాల మొత్తం బరువుగా కొలుస్తారు. చీమలు మొక్కల విత్తనాల పంపిణీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ సంచార ప్రాంతాలతో పోలిస్తే అడవుల్లో, ఆశ్చర్యకరంగా శుష్క ప్రాంతాల్లో చీమలు సమృద్ధిగా పెరుగుతున్నాయి.
30 ఏళ్ల జీవన కాలం
చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారి్మక చీమల జీవిత కాలం మూడేళ్లలోపు (కొన్ని కారి్మక చీమలు స్వల్పకాలమే జీవిస్తాయి) ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణీ చీమ కాలనీ స్థాపకురాలు. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అమెరికాలోని ఇడాహోలోని తన సహజ నిర్మాణంలో ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు నివసించింది. క్వీన్ బ్లాక్ గార్డెన్ చీమలు ల్యాబ్ సెట్టింగ్‌లలో 28 సంవత్సరాల వరకు జీవించినట్టు గుర్తించారు. మారికోపా హార్వెస్టర్ చీమకు 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి (ట్రోఫాలాక్సిస్ ప్రక్రియ) ఉపయోగిస్తాయి.
ఏడాదిలో 50 టన్నుల మట్టి తరలింపు
చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమల జట్టు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. శరీరంలోని రంధ్రాల వ్యవస్థను (స్పిరకిల్స్) శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు.
ఇదే అతిపెద్ద చీమల కాలనీ
ఐరోపా, జపాన్, అమెరికా అంతటా అతిపెద్ద చీమల కాలనీ వ్యాపించింది. తొలుత వీటిని మూడు ప్రత్యేక కాలనీలుగా భావించారు. ఇక్కడ అర్జెంటీనా చీమ జాతి ఒక్కటే ఉండటంతో మనుగడ కోసం ఒకదానితో మరొకటి పోరాడుకోవడానికి నిరాకరించడంతో కాలనీ చాలా పెద్దదిగా పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ కాలనీ 3,750 మైళ్ల మేర విస్తరించి ఉందని.. అందులో 370 మిలియన్ చీమలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment