స్తంభించిన జనజీవనం
రవాణాకు తీవ్ర అంతరాయం
వాషింగ్టన్/లండన్: కనీవినీ ఎరగనంతటి భారీ మంచు అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తోంది. అమెరికాలో మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. బ్రిటన్‌లో హిమ బీభత్సం కొనసాగుతోంది. పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
అమెరికాలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సరీ్వస్ తెలిపింది. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోందని హెచ్చరించింది. ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని హెచ్చరించింది. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మామూలుగా చలి అంతగా ఉండని మిసిసిపీ, ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడతాయని హెచ్చరించారు.
ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, బాలి్టమోర్, ఫిలడెల్ఫియా నగరాలను మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సాస్, ఇండియానాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. మిస్సోరీ, ఇల్లినాయీ, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోనూ భారీగా మంచు కురియనుంది. విమాన సరీ్వసులు కూడా ప్రభావితమవుతున్నాయి.
బ్రిటన్లో కరెంటు కట్
యూరప్ అంతటా ఆదివారం భారీగా మంచు వర్షం కురిసింది. బ్రిటన్, జర్మనీల్లో ప్రధాన నగరాల్లో హిమపాతంతో ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. విమానాలు నిలిపేశారు. బ్రిటన్లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్‌లో ఎనిమిదో హెచ్చరిక జారీ చేశారు. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగనుంది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైలు ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment