పొంచి ఉన్న‘ఫణి’ ముప్పు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయుగుండం తుపానుగా మారేందుకు శరవేగంగా దూసుకొస్తోంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ఆగ్నేయ చెన్నైకి 1,410 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలికి 1,060 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,690 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది. ఇది శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, తదుపరి 12 గంటల్లో తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ శుక్రవారం రాత్రి వెబ్సైట్లో పేర్కొంది.
శ్రీలంక తీరానికి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు– దక్షిణ కోస్తాంధ్రల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలో జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
మే 1 నుంచి అతి భారీ వర్షాలు
తుపాన్ తీరం దాటిన తర్వాత మే 1వ తేదీ నుంచి పెనుగాలులు వీస్తూ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎక్కువ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దానికి పేరు పెడతారు.
ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించనున్నారు. తుపానువల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సమయంలోనూ మిగిలిన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, వడగాడ్పుల వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.