పనామా సిటీ: అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో మైఖేల్ హరికేన్ తీవ్రరూపం దాలుస్తోంది. అత్యంత ప్రమాదకర కేటగిరీ–4 తుపానైన మైఖేల్ ధాటికి గాలులు ఉధృతంగా వీస్తుండటంతోపాటు సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయని అధికారులు చెప్పారు. బుధవారం సాయంత్రానికి (అమెరికా కాలమానం ప్రకారం) తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని మయామిలోని జాతీయ తుపాను కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 230 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయనీ, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారొచ్చని తుపాను కేంద్రం హెచ్చరించింది. సముద్రపు అలలు 14 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడొచ్చనీ, కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవ్వొచ్చని తెలిపింది. ఇలాంటి తుపానును గతంలో తామెప్పుడూ చూడలేదని స్థానికులు కొందరు చెబుతున్నారు. మైఖేల్ హరికేన్ అత్యంత విధ్వంసకరంగా మారొచ్చనీ, ఫ్లోరిడాకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment