
లండన్: అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా శనివారమే బ్రిటన్ చేరుకున్నారు. ప్రధాని కియర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఇకముందు కూడా అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్టార్మర్ పునరుద్ఘాటించారు.
మూడేళ్లుగా తమకు బ్రిటన్ అందిస్తూ వస్తున్న మద్దతుకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేతలిద్దరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పు, అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి తదితరాలు ప్రస్తావనకు వచి్చనట్టు సమాచారం. ఆదివారం లండన్‌లో యూరప్ నేతల భేటీ జరగనుంది. అందులో జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశముంది. ఉక్రెయిన్ యుద్ధం, యూరప్ భద్రతే ప్రధాన అజెండాగా భేటీ జరగనుంది. నిజానికి మార్చి 6న పారిస్‌లో యూరప్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్ ఆహ్వానంపై యూరప్ దేశాధినేతలంతా లండన్‌లో భేటీ కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.