వేపాలే... నిభకలే... పమీలే!!
నవ్వింత: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్నది లోకాన వాడు. అది అక్షరాలా నిజమే. అయితే ఎలా తప్పిస్తాడు?
ఓరోజు నిద్రలేచే సమయానికి నా ఒంటిపై ఎర్రటి పెద్ద పెద్ద దద్దుర్లు కనిపించాయి. కాస్త పరిశీలనగా చూద్దును కదా... మా ఆవిడ ఒంటిపై కూడా. ‘‘పదపద హాస్పిటల్‌కు వెళ్దాం’’ అన్నాను.
‘‘అక్కర్లేదు’’ అంది మా ఆవిడ.
‘‘ఇంత పెద్దగా ఎర్రగా దద్దుర్లు వస్తే వద్దంటావ్?’’ ఆశ్చర్యంగా అడిగా.
‘‘ఇదంతా మన బుజ్జిగాడి ప్రతాపం. వాడు నరకంలో శిక్షలకు ట్రైనింగ్ క్లాసు ఇప్పిస్తున్నాడు. ఇది ‘మిక్రినజంభో’ శిక్ష’’
‘‘ఇది అపరిచితుడు సినిమాలోని ఓ శిక్ష కదూ. దాన్ని వీడు మనకెలా వేశాడు? ఎందుకు వేశాడు?’’ మళ్లీ నా ఆశ్చర్యం.
‘‘వీడు పొద్దస్తమానం బెడ్‌పై కూర్చుని లేస్ అనీ, కుర్‌కురేలనీ, పిక్నిక్‌లనీ రకరకాలు తింటుంటాడు కదా. అలాగే కాస్త కాస్త పొడి రాలేలా ఆ చాక్లెట్లు, తీపి పదార్థాలు తింటాడు. దాంతో వాటికోసం చీమలు వచ్చేసి పనిలోపనిగా మనల్నీ కుడతాయి. అలా ‘క్రిమిభోజనం’ శిక్షను భరించగలిగేలా వీడు మనకిప్పుడు కోచింగ్ ఇస్తున్నాడన్నమాట. ఇదొక్కటే కాదు, ఇలాంటివెన్నో శిక్షలు వేస్తూ, అమలు పరుస్తూ ఉన్నాడూ, ఉంటాడు’’
‘‘ఛ... ఊర్కో. వాడినంతలేసి మాటలెందుకంటావ్. వాడి చేష్టలను మనమెప్పుడైనా శిక్షగా ఫీలయ్యామా?’’ అన్నాను. ‘‘అదే వాడి గొప్పదనం’’ అంటూ... వాడి శిక్షాస్మృతుల్లో కొన్నింటిని వివరించింది మా ఆవిడ. (గమనిక: ఇక్కడ స్మృతి అంటే మా జ్ఞాపకం అని అర్థం. అనగా మావాడు విధించిన శిక్షల తాలూకు జ్ఞాపకాలని తాత్పర్యం).
‘‘వీడు అప్పుడే నా పొట్టలోంచి బయటకు వచ్చాడు కదా. అలా వచ్చినవాడు ఊరుకుంటాడా...? రాత్రి ఏ రెండింటికో, మూడింటికో మేల్కొని ఓ గంటా అరగంటా అడుకుని మళ్లీ పడుకుంటాడు. అమెరికాకు వెళ్లి ఇండియాకు వచ్చిన వారు ఇక్కడి రాత్రిని అక్కడి పగలుగా అనుకుని మెలకువతో ఉండటం, మళ్లీ పగటివేళ అక్కడి రాత్రి అలవాటుతో పడుకోవడం చేస్తుంటారు. వాళ్లకా జెట్‌లాగ్ ఉన్నట్టే... మన బుజ్జిగాడికి పొట్టలాగ్ ఉంటుందన్నమాట. వాడి మానాన వాడు నిద్రపోవడం లేదా వాడికిష్టమొచ్చినప్పుడు మళ్లీ నిద్రలేవడం చేస్తాడు. అది మనం నిద్రపోయేవేళా లేక మెలకువతో ఉండే వేళా అన్నది వాడికి అనవసరం కదా. అలా వాడెప్పుడు మేల్కొంటాడో అని మనం ఎదురుచూస్తూ... మీరూ, నేనూ వంతుల వారీ వాచ్‌మేన్ డ్యూటీలు చేసిన విషయం గుర్తులేదా? హు... ఈ లోకంలో ఒబామా అయినా ఒకటే. ఐరాస చీఫ్ అయినా అంతే. బిడ్డను కన్న తర్వాత వాచీతో నిమిత్తం లేకుండా కళ్లు వాచిపోయేలా డ్యూటీలు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులందరినీ ‘వాచ్‌మేన్ విత్ గోల్డెన్ వాచీ విత్ కళ్లూ ఒళ్లూ వాచి’ అందాం’’
‘‘దీనికి ఏదైనా పేరుపెట్టరాదూ?’’
‘‘వేపాలే-నిభకలే-పమీలే అందాం’’ ‘‘అంటే?’’
‘‘వేళాపాళాలేకుండా నిద్రాభంగం కలిగించేసి పక్కమీది నుంచి లేపేయడం’’ అని జవాబిచ్చింది మా ఆవిడ.
‘‘అన్నట్టు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తూ వస్తూ ఉన్న ఆరోజు మీకు గుర్తుందా?’’ అడిగింది మా ఆవిడ. ‘‘అదెలా మరచిపోగలను చెప్పు. ఆ రోజే కదా మనవాడు నా మీద సూసూ పోశాడు. ఆ తడిసీట్లలోనే కూర్చుని, తడిబట్టలతోనే జర్నీ అంతా చేశాం. అంత తడితో వణుకుతూ పడుకుని మరీ వచ్చాం కదా’’
‘‘చూశారా... నాకు తెలిసి నిశ్చింతగా నిద్రపోవడాన్ని మీ మగాళ్లంతా కాస్త మొరటుగా ‘తడిబట్టేసుకుని పడుకోవడం’ అంటుంటారు కదా. ఆ నానుడి ఇలాంటి అనుభవం నుంచే పుట్టుకొచ్చిందేమో?! ఇలా కొడుకులందరూ నరకం ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు చూపిస్తారు. అక్కడి శిక్షల్ని ఇక్కడ కొద్ది డోసుల్లో అమలు చేస్తూ మనతో కాస్త రిహార్సల్స్ చేయిస్తారు. దాంతో మనం పున్నామ నరకాన్ని, అక్కడి శిక్షలనూ సులభంగా అధిగమించగలమన్నమాట’’ ఉపదేశించింది మా ఆవిడ.
‘‘అవున్నిజమే కదా’’ అనిపించింది. ఏదో సందర్భంలో ‘‘నరకము కూడా సుఖమే కదా... నీ శిక్షలతో, నీ టార్చర్లతో... నీ కోసమె నే జీవించునదీ’’ అంటూ పేరడీ పాడుతుంటే, ‘ఇదే పాటను మరోలా విన్నానే’ అన్నాడు మావాడు. ‘‘ఆ అసలు పాట నిజమో కాదో గానీ... బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులూ ఏకగ్రీవంగా, ఏకకంఠంతో ఒప్పుకునేది... ఇప్పుడు నేను పాడే పాటే’’ అంటూ బల్లగుద్ది చెప్పేశా. పైగా దీనికి మా ఆవిడ ఒత్తాసుకూడా ఉంది. ఇంక నాకేం భయ్యం?
- యాసీన్