
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ లెక్కల మాష్టారే కరెక్ట్ ఆయనైతేనే నీకు చర్మం వలిచేసి బుద్ధి చెబుతాడు..
-ఒక పిల్లాడికి తండ్రి వార్నింగ్ ...
మాస్టర్ గారండీ.. ఆ శీనుగాడు మా గుంటడే .. బడి నుంచి వచ్చాక పుస్తకాలు సంచి ఇంట్లో పడేసి బావుల్లోనూ చెరువుల్లోనూ ఈతకని తిరుగుతున్నాడు తప్ప పుస్తకం తీయడం లేదు.. చదవడం లేదు.. మీరు వాణ్ని ఏమాత్రం వదలొద్దు... చేమడాలు వలిచేయండి.. నేనేం అనుకోను.. ముందు వాణ్ని దారిలో పెట్టండి
-టీచర్‌తో ఒక తండ్రి వేడుకోలు..
ఒరేయ్ ఇక ఆడింది చాలు.. ఆదివారం కూడా చదూకోమన్నాడు సైన్స్ మాస్టర్.. అయన ఇల్లు ఈ దారిలోనే .. మనం ఇంకా ఈ మామిడి తోటల్లో తిరిగి.. ఆయనకు దొరికిపోతే మాత్రం మనం అయిపోయినట్లే.. ఇక ఇదే ఆఖరాట వెళ్లిపోదాంరా.. నాకు భయమేస్తోంది..
-పిల్ల గ్యాంగులో ఒకడి ఆందోళన
ఒరేయ్ బెల్లం తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పాములు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లాడు వినడం లేదు.. మీరైనా చెప్పండి టీచర్ గారు.. వీడికి మేమంటే భయం లేకపోతోంది.. మీరే వీడికి రెండు వేసి దారిలో పెట్టండి
-మాష్టర్ వద్ద ఒక తల్లి విజ్ఞాపన
పాతికేళ్ల క్రితం టీచర్ అంటే బడిలోనే కాదు.. ఊళ్ళో.. గుడిలో.. పెళ్ళిలో.. సంతలో.. మార్కెట్లో ఎక్కడ కనిపించినా టీచర్ గానే చూసేవాళ్ళు.. ఎక్కడ ఆయన ఎదురైనా పక్కకు తప్పుకోవడం.. కూడా లేచి నిలబడి గౌరవించడం.. ఇంట్లో భయం లేకపోతే నేరుగా తల్లిదండ్రులే స్కూలుకు వచ్చి టీచరుకు చెప్పి మరీ తమ బిడ్డల్ని దారిలో పెట్టించడం నాటి సమాజపు సంస్కృతి.. స్కూలు టైములోనే కాదు.. తమ జీవితంలో ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ గానే గౌరవించి.. భయభక్తులతో ఉండేవాళ్ళు.
కానీ కాలం మారింది.. టీచర్ అంటే జీతం తీసుకుని పని చేసే ఒక పనివాడు.. ఒక ఉద్యోగి.. అంతేతప్ప అయన తమకు ఇంకేం కాడు కాలేడు. అయినా మనను టీచర్ కొట్టడం ఏంది.. కొడితే ఊరుకుంటామా.. ఇదే దారిలో వెళ్తాడు కదా.. సాయంత్రం చూసుకుందాం లే .. అన్నట్లుగా పిల్లల తీరు ఉండగా.. ఏంది టీచర్ మా వాణ్ని కొట్టిర్రట.. వాణ్ని మేమె ఏనాడూ ఏమీ అనలేదు. మీరు కొడితే ఎట్లా .. చదువు చెబితే చెప్పండి.. లేకుంటే లేదు.. వాడికి చదువురాకున్నా ఫర్లేదు.. కొట్టుడు మాత్రం వద్దు.. ఈసారి కొడితే ఊరుకునేది లేదు.. అంటూ టీచర్లకే పేరెంట్స్ వార్నింగ్ ఇస్తున్న కాలం ఇది.

అల్లరి చేసినా .. చెప్పినమాట వినకపోయినా చేతులు ఒళ్ళు వాచిపోయేలా టీచర్లు కొట్టినా ఏమీ అనని రోజులు పోయి.. మావాణ్ని కొడితే నీకు పడతాయి మాస్టర్ గారు ఎన్ని వార్నింగ్ ఇస్తున్న రోజులు వచ్చాయి.. పిల్లల్ని దండించడాన్ని అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ వ్యూస్ పెంచుకునే మీడియా లైన్లోకి వస్తుంది.. పిల్లల హక్కుల సంఘాలు సంస్థలు కూడా యాగీ చేయడానికి ఎల్లపుడూ సిద్ధమే.. టీచర్ చేతిలో బెత్తం ఏనాడైతే మూలకు చేరిందో ఆనాడే పిల్లల్లో అల్లరి పెరిగింది.. భయం బాధ్యత స్థానంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.. టీనేజీలోనే దురలవాట్లు.. నేరాలకు సిద్ధం అవుతున్నారు..
ఇలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ.. వారిని ఏమీ నిందించలేక.. దండించలేక.. శిక్షించలేక.. అనలేక ఒక హెడ్ మాస్టర్ మనస్తాపంతో కుమిలిపోతూ.. మీరు మారరు.. మిమ్మల్ని నేను మార్చలేను.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు.. మీకు భయం లేదు.. గౌరవం లేదు.. అయినా మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. ఇకపై మీ ఇష్టం అంటూ గుంజిళ్ళు తీశారు.. ఇది అయన ఆవేదన కాదు.. సమాజంలో విద్యార్థులు.. తల్లిదండ్రుల పరిస్థితిని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఆనాడు గురువు గురించి వేమన రాసిన పద్యాన్ని ఒకసారి గుర్తి చేసుకుందాం
‘గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో
అజునకైనా వాని యబ్బకైన
తాళపుచెవి లేక తలుపెట్లు లూడునో
విశ్వదాభిరామ వినురవేమ’
గురువుతో శిక్ష అనుభవించకుండా చదువు ఎలా వస్తుంది అంటాడు వేమన.. కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు.. ఇప్పుడు దండించకపోతే వారు మున్ముందు మరింతగా రాటుదేలిపోతారన్నది వేమన ఉద్దేశ్యం.. అది నాడు.. నేడు.. ఏనాడైనా చెల్లుబాటు అవుతుంది. అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే స్పష్టం అవుతోంది.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment