చైల్డ్ ప్రాడిజీ ప్రయత్నాలూ... నా వైల్డ్ ట్రాజెడీ అనుభవాలూ!!
నవ్వింత
అప్పుడప్పుడూ బాలమేధావుల గురించి న్యూస్‌పేపర్లలో వచ్చినప్పుడు నాక్కాస్త అసూయగా ఉంటుంది. వెంటనే మా బుజ్జిగాడూ చైల్డ్ ప్రాడిజీ అయిపోయుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నా ఈ ప్రయత్నంలో భాగంగా దేశాలూ రాజధానులూ లేదా పెద్ద పెద్ద పదాల సెల్పింగులు చెబుదామనుకుంటే అవన్నీ ఇప్పటికే అందరూ చేసేశారు. అందుకే వాణ్ణి మాస్టర్ ఆఫ్ ఆల్ చేద్దామని నిర్ణయించుకున్నా. పురాణాలూ, నీతిపద్యాలూ, జనరల్ నాలెడ్జీ, న్యూస్‌పేపర్ రీడింగూ... గోనెసంచిలో సరుకులు కూరికూరి నింపినట్లుగా అన్నింటినీ ఏకకాలంలో వాడి బుర్ర అనే బస్తాలోకి నింపాలని నిర్ణయించుకున్నా.
పొద్దున్నే కాసేపు న్యూస్ పేపర్ చదివి వినిపించాక... సబ్జెక్టు మార్చి పురాణాల్లోని హిరణ్యాక్షుడి వృత్తాంతం చెప్పా. వాడి మాటలతో నా బుర్ర తిరిగిపోయింది.
‘‘అన్నట్టు నాన్నా... నువ్వు చెప్పినట్టుగా భూమిని చాపచుట్టినట్టు చుట్టేసిన హిరణ్యాక్షుడి వృత్తాంతంలో హిరణ్యాక్షుడు భూకబ్జాకు పాల్పడ్డాడన్నమాట. ల్యాండ్ మాఫియాకు ఆద్యుడు అతడేనేమో. అందరి భూముల్నీ లాక్కున్నాడంటే తొలి ల్యాండ్‌గ్రాబింగ్ కేసు కూడా అతడిదేనేమో!? అందుకే భగవంతుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అందరికీ భూమిని సమానంగా పంచి, సత్యయుగంలో సామ్యవాదాన్ని నెలకొల్పి ఉంటాడు కదా’’ అన్నాడు. నేనేదో విడివిడిగా వార్తల్నీ, పురాణాల్నీ, సివిక్సూ గట్రా బోధిస్తే... వాడు అన్నింటినీ కలగలిపి సొంతం వ్యాఖ్యానాలు చెప్పడంతో నాకు మాటపడిపోయింది.
ఈ న్యూస్‌పేపర్లు అచ్చిరాలేదని టీవీ చూపిద్దామని నిర్ణయించుకున్నా. పెద్ద పెద్ద కట్టడాలైన మలేషియాలోని పెట్రొనాస్ టవర్స్ చూపించా. ‘‘చూశావా... పెట్రోనాస్ టవర్స్ రాత్రిపూట పెట్రొమాక్స్ లైట్ల కాంతిలా ఎలా వెలుగుతున్నాయో. టోక్యో స్కై స్క్రేపర్సూ, టొరంటో టవర్సూ చూడు’’ అన్నా. వెంటనే వాడు ఛానెల్ మార్చేసి... నాకు యానిమల్ ప్లానెట్ చూపిస్తూ... ‘‘నువ్వే ఇది చూడు. అంత చిన్న తేనెటీగ... తన మల్టీస్టోరీడ్ బిల్డింగును అలా తల్లకిందులుగా కట్టుకుంటూ తన తేనెపట్టు నిడివి పెంచుకుంటూ పోతుంటే... భూమిపై ఒకదాని మీద మరో అంతస్తు కట్టుకుంటూ పోవడంలో విచిత్రం ఏముంది’’ అంటూ చప్పరించాడు. ‘‘అయినా నిట్టనిలువుగా కట్టడం గొప్పా... తలకిందులుగా నిర్మించడం గొప్పా?’’ అన్నాడు.
ఈసారి, అల్లసాని వారి ప్రబంధాల్లో అల్లిక జిగిబిగి బాగుంటుంది కాబట్టి టంగ్‌ట్విస్టర్స్‌లాంటి పద్యాలుండే ప్రవరుడి వృత్తాంతం చెప్పా. ‘‘కటకచరత్కరేణు కరకంపిత సాలమున్, శీతశైలమున్’’ పద్యం చెబుతూ, హిమాలయాల్లో ఏనుగులు చెట్లను కదలిస్తున్నాయన్న అర్థం ఎలా ఉన్నా... ‘‘కటకచరత్కరేణు కరకంపిత - విపరీతంగా చలిపెడుతుంటే ఆ వణుకు వల్ల రెండు పలువరసలూ కటకటా కొట్టుకుంటున్న సౌండు వినిపిస్తోంది చూడు’’ అని పరవశంగా అన్నాను.
‘‘అవున్నాన్నా... ప్రవరుడు లేపనం పూసుకుని హిమాలయాలకు వెళ్లాలని ముందే డిసైడ్ చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు అక్కడ విపరీతంగా చలేస్తుందనీ, మంచు తాలూకు తడికి లేపనం కడుక్కుపోయే ప్రమాదం ఉందనీ ఎందుకు ఊహించలేదు? ఒక ఉలెన్ దుస్తుల్తో ఒంటిని నిండా కప్పి ఉంటే లేపనం అంత త్వరగా కడుక్కుపోయేది కాదు కదా. దారితప్పిపోకుండా హ్యాపీగా తిరిగి వచ్చేవాడు కదా’’ అన్నాడు.
ఆ దెబ్బతో ప్రబంధాలు వదిలేసి కనీసం నీతి పద్యాలైనా చెబుదామని అనుకున్నా. వేమన, సుమతీ శతకాలైతే తేలిగ్గా ఉంటాయని, భాస్కర శతకం ఎంచుకున్నా. ‘‘ఒరేయ్... పండితులైన వారికి తగిన గుర్తింపు లేకపోయినా వారి పాండిత్యానికి తక్షణం వచ్చే ఢోకా ఏమీలేదు. ఎలాగంటే... కోతులు చెట్టు కొనకొమ్మన ఉంటే... కింద గండభేరుండాలూ, సింహాలూ ఉంటాయంటాడ్రా కవీ... ఈ పద్యంలో’’ అన్నా.
‘‘అన్నట్టు నాన్నా... సింహాలు భూమ్మీద తిరుగుతుండటం ఓకే... మరి గండభేరుండాలూ పైన ఎగరకుండా భూమ్మీదే తిరుగుతుంటాయని చెప్పడం వింతగా లేదూ’’ అన్నాడు. అంతే... నా కళ్లు బైర్లుగమ్మాయి. ‘‘అంతటి మహాకవీ అవాస్తవం రాశాడంటే నమ్మలేం నాన్నా. ఎంత ఎగిరినా... ఆహారం కోసం కిందికి దిగాల్సిందే కదా. ఆ సంగతి రాసుంటాడు భాస్కర శతకకారుడు’’ అంటూ తన సందేహాన్ని వాడే తీర్చుకుని, నా సందేహాన్నీ తీర్చాడు.
ఎవడికి ఉండే తెలివి వాడికి ఉంటుంది. పనిగట్టుకుని బాలమేధావుల్ని చేద్దామనుకుంటే పరిస్థితి ఇలాగే తగలడుతుందని బోధపడిన తత్వంతో వాడి మానాన వాణ్ణి ఎదగనిద్దామని నిశ్చయించుకున్నా.
- యాసీన్