Navvinta
-
గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడిలో స్థితప్రజ్ఞత మరీ ఎక్కువైపోయింది. ఏం చెప్పినా అందులోంచి తాత్వికతను తవ్వి తీస్తున్నాడు. మొన్న నేనూ వాడూ ఆఫీసులోకి ప్రవేశించాక ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో లిఫ్ట్ మిస్సయ్యింది. సినిమాకు వెళ్లాక మన ముందు వాడికి టికెట్టు దక్కి, మనకు చిక్కనప్పటి బాధ ఆవరించి... నిరాశతో ‘అబ్బా’ అన్నాను. ‘‘హు... జీవితంలోనే లిఫ్ట్ దొరకలేదు. ఆఫ్టరాల్ ఈ లిఫ్ట్ మిస్సయితే బాధేముందిలేరా’’ అన్నాడు వాడు. ‘‘ఇందాకే కదరా, బస్సు మిస్సయితే ఎవరో బైకువాడు లిఫ్ట్ ఇచ్చాడు అన్నావ్’’ అని అడిగా. ‘‘కానీ బస్సులో నా స్వీట్హార్ట్ వెళ్తోంది కదా. బైకు లిఫ్టు దొరికిందని ఆనందించనా, బస్సు మిస్సయిందని విచారించనా?’’ ఊరెళ్దామని ఓరోజు రాత్రి ఎనిమిదింటికి వెళ్లాల్సిన రైలును పట్టుకోడానికి బయల్దేరాం మేం. కానీ నిమిషమున్నర వ్యవధిలో రైలు కాస్తా పాముల వాడి చేతుల్లోంచి పారిపోయే పాములా జారిపోయింది. పారిపోవడంతో సరిపెట్టిందా... చివరి బోగీ వెనక నల్లటి బ్యాక్‌గ్రౌండ్ మీద ‘ఎక్స్’ అనే అక్షరంతో వెక్కిరించింది. ‘ఆన్సర్‌షీటు మీద నీ జవాబు తప్పురా అనే మార్కే సదరు ఎక్స్’ - అంటాడు వాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి ఊరడిద్దామని ‘‘పోతే పోనీలేరా... ఇంకో రైల్లో వెళదాం లే’’ అన్నాను. ‘‘తప్పిపోయిన రైలుకు రిజర్వేషనైన టికెటుంటుంది. అయినా మిస్సవ్వక తప్పదు. ఇప్పుడెక్కాల్సిన రైలుకు రిజర్వేషనుండదు. అయినా ఎక్కక తప్పదు. అదేరా జీవితం’’ అన్నాడు వాడు. నిజమేననిపించింది. ‘‘నా బాధల్లా రైలు మిస్సయినందుకు కాదురా. మన చేతిలో టికెటు ఉన్నా, అధికారికంగా రిజర్వేషన్ చేయించుకుని సుఖంగా వెళ్లాల్సిన బెర్త్ అక్కడే ఉన్నా... దాని మీద ఎవడో తాను ఊహించని విధంగా, హాయిగా ప్రయాణిస్తుంటాడు. అధికారికంగా మనకు దఖలు పడాల్సిన సుఖాన్ని ఇంకెవడో అయాచితంగా అనుభవిస్తాడు. ఇదే జీవితం’’ అన్నాడు వాడు. అక్కసు లేదా అసూయ అనండి, మానవసహజమైన వాడి వైఖరికీ, ప్రవర్తనకూ సాటి మనిషిగా పూర్తిగా మద్దతుపలికాన్నేను. ఈమధ్యే రాంబాబు గాడికి మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లడం కుదరలేదు. వాడు కాస్త కోలుకున్నాక క్రమం తప్పక మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాడితో జాయిన్ కావడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో అప్పుట్లో మిస్ అయిన పరామర్శనూ, ఓదార్పునూ, ధైర్యాన్నీ ఒకే డోసులో ఇద్దామని- ‘‘పోన్లేరా... మైల్డ్ స్ట్రోకే కదా. మొదటి స్ట్రోకు వచ్చాక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే దాదాపు నలభై ఏళ్లు బతికారు ఏఎన్నార్. మామూలువాళ్ల కంటే ఇలా స్ట్రోక్ వచ్చాక జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నవాళ్లే సుదీర్ఘకాలం జీవించార్రా’’ అంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మామూలు వాళ్లైనా సరే అర్జెంటుగా గుండెపోటు తెచ్చుకోవడం చాలా అవసరం, అదెంతో మంచిది అన్నంత ఇన్స్పైరింగ్గా ఓ లెక్చర్ ఇచ్చా. రోడ్డు మీద మేము వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ కనిపించింది. దాన్ని చూడగానే మళ్లీ మా రాంబాబుగాడిలో తాత్వికత నిద్రలేచింది. ‘‘హు... ఈ గుండే... దానితో నడిచే ఈ జీవితమూ ఆయిల్ ట్యాంకర్ వంటివేరా’’ అన్నాడు వాడు. నేను బిత్తరపోతూ అదేంట్రా అన్నాను. ‘‘చూశావా విచిత్రం... ఆయిల్ ట్యాంకర్ నిండా అనేక గ్యాలన్ల ఇంధనం ఉంటుంది. కానీ ఆ వాహనానికి గుండె కాయలాంటి చిన్న ట్యాంకర్లో ఉండే పెట్రోలు నిండుకుంటే అంతటి ఆయిల్ ట్యాంకరూ ఆగిపోతుంది. అలాగని నేరుగా ట్యాంకరులోని ఇంధనాన్ని వాహనానికి ఉన్న ట్యాంకులో పోసుకోడానికి వీలు కాదు. మన గుండె కూడా అంతేగదరా. దాని నాలుగ్గోడల నిండా ఎప్పుడూ రక్తం ఉండనే ఉంటుంది. అలాంటి గుండె కూడా మెదడుకు తన ఆధార్ కార్డూ, తన రేషన్ కార్డూ గట్రా చూపించి తన కోటా రక్తాన్ని మాత్రమే తాను వాడుకోవాలి. అన్ని అవయవాలకూ రక్తం సరఫరా చేసే దానికే రక్తం అందకపోతే, ఎంతటి మనిషైనా అంతటితో పోవాల్సిందే కదా. ఇది కూడా టికెట్టుండీ రెలైక్కలేకపోవడం, మన స్వీట్ హార్ట్ బస్సులో ఉండీ, బస్సెక్కలేకపోవడం లాంటిదే కదరా. జ్ఞానాన్ని నేర్చుకోవాలనే గుణం ఉండాలిగానీ... గుండెపోటూ గురువవుతుంది, ఆయిల్ ట్యాంకరూ అవధూత అవుతుంది. మిస్సయిన బస్సూ మహాతత్వ సారాన్ని బోధిస్తుంది’’ అంటూ పెద్ద పెద్ద మహాయోగులూ, యోగగురువులూ ఇచ్చేలాంటి స్పీచ్ ఇచ్చాడు వాడు. - యాసీన్ -
మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!
నవ్వింత మా బుజ్జిగాడు ఒకరోజు అకస్మాత్తుగా... ‘‘నాన్నా, నాగుపాముకు గాగుల్స్ అంటే చాలా ఇష్టం కదా’’ అని అడిగాడు. కాసేపు నా మతి (అలా షికారుకు) పోయి, మళ్లీ తిరిగి మెదడులోకి తిరిగి వచ్చాక వాణ్ణి అడిగా... ‘‘నాగుపాముకూ, గాగుల్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అని. ‘‘అదే నాన్నా... మాకు సైన్స్ క్లాస్‌లో చెప్పారు. నాగుపాము పడగ మీద స్పెక్టకిల్స్ ఉంటాయట. ఆ కళ్లజోడు గుర్తు కూడా పర్మెనెంటుగా ఉంటుందట. అంటే కళ్లజోడు జారిపోకుండా ఉంటానికేమో కదా నాన్నా’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... అవి కళ్లజోడు వంటి ముద్ర మాత్రమే. అంతేగానీ, ఏ రేబాన్ గ్లాసులో, పోలీస్ బ్రాండ్ స్పెట్సో కావు. ఇలాంటి అరకొర నాలెడ్జ్‌తో బుర్ర చెడగొట్టుకోకు. నా బుర్రతిరిగేలా చేయకు’’ అని వాడికి వార్నింగ్ ఇచ్చా. సైన్స్ క్లాస్ గోల అలా ముగిసిందా! మళ్లీ సోషల్ క్లాస్‌లో జరిగిన మరో సంఘటనతో నా ఒంట్లోంచి నేనే బయటకు దూకి... కాసేపటిగ్గానీ మళ్లీ నా దేహంలోకి దూరలేకపోయా. ‘‘నాన్నా... శనిగ్రహం చుట్టూ అలా రింగులు ఎందుకుంటాయో, మిగతా గ్రహాలకు ఎందుకుండవో నాకు తెలిసిపోయింది’’ అన్నాడు. ‘‘ఎందుకురా?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఎందుకంటే... శనిగ్రహం తాలూకు దుష్టగ్రహ ప్రభావం తనమీదే పడకుండా అలా రింగులుంటాయి’’ అన్నాడు వాడు. ‘‘మోకాలికీ బోడిగుండుకూ ముడెయ్యకు. శనిగ్రహం చుట్టూ రింగులుంటే దాని ప్రభావం దాని మీద పడకుండా ఉండటమేంటి?’’ అడిగాన్నేనను. ‘‘మొన్న మన ఇంటికి వచ్చిన అంకుల్గారూ... అన్ని వేళ్లకూ రింగ్స్ పెట్టుకున్నారు కదా. ‘అన్ని రింగ్స్ ఎందుకూ’ అని నువ్వు అడిగితే... కొన్ని గ్రహాల దుష్టప్రభావం తన మీద పడకుండా ఉండటానికీ, తనకు అంతా మంచి జరిగేందుకూ అని జవాబిచ్చారు కదా. ఇక శనిగ్రహం మాట అంటావా! ‘శనిలా పట్టుకున్నావు, శనిగాడు’ లాంటి పదాలతో పాపం ఆ గ్రహంపై అందరూ ఆగ్రహిస్తూ, దాన్ని ఆడిపోసుకుంటుంటారు కదా నాన్నా. అందుకే తన చెడు తనకే తగలకుండా ఆ ఒక్క గ్రహానికే రింగులుంటాయని నాకు అర్థమైపోయిందిలే’’ అన్నాడు.ఈసారి నేను నా మతి పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ... అలా పోయిన సదరు మతిని వెతికి మళ్లీ మైండ్‌లో సెట్ చేసుకోడానికి నాకు చాలా టైమే పట్టింది. ‘‘నాన్నా... దున్నపోతు మీద వర్షం పడితే, ఎంత తడిసినా దానికి ఏమీ కాదట కదా. మా తెలుగు క్లాస్‌లో మా సార్ ఈ సామెత చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నా. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా దానికి ఏమీ కాదెందుకో తెలిసింది. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ అన్న సామెత ఎందుకు పుట్టిందో కూడా అర్థమైంది’’ అన్నాడు వాడు. చిన్నప్పట్నుంచీ చదువుకునే తెలుగే కదా. ఈ క్లాసుతో ప్రమాదమేమీ ఉండదులే అనుకున్నా. అయినా ఆసక్తిని చంపుకోలేక అడిగితే, ‘‘ఎందుకంటే... దున్నపోతుకు ఏ జలుబో గిలుబో చేసిందనుకో. దానికి విక్సో, జండూబామో, టైగర్బామో రాసేవాళ్లు ఎవరుంటారు నాన్నా? అందుకే దేవుడలా ఏర్పాటు చేశాడన్నమాట’’ అని జవాబిచ్చాడు. మా బుజ్జిగాడు లెక్కల్లో కాస్త పూర్. అవేవో చెబుదామని పూనుకుని, కూడికలయ్యాక, తీసివేతలు చెబుతున్నా. ‘‘నీ దగ్గర వంద రూపాయలున్నాయనుకో. అందులో ఇరవై పెట్టి లాలీపాప్‌లు కొనుక్కుని మిగతా డబ్బులు జేబులో వేసుకున్నావనుకో. నీ జేబులో ఉన్న డబ్బులెన్నీ?’’ అన్నా. వాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఆ భంగిమ నాకు నచ్చింది. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారంటే... సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. ‘‘అదీ... అదీ... అలా ఆలోచించాలి. చెప్పు... ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాచకుండా చెప్పు’’ అంటూ ప్రోత్సహించా. ‘‘కంగారూకు సంచి ఎందుకుంటుందో నాకిప్పుడు తెలిసింది’’ అన్నాడు. ‘‘సడన్‌గా లెక్కల నుంచి మళ్లీ బయాలజీకి వెళ్లావెందుకు రా’’ అన్నాను విసుగ్గా, ఒకింత ఆందోళనగా. ‘‘ఎందుకంటే... అది లాలీపాప్ కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని దాచుకోడానికి దేవుడు దానికి ముందే ఒక జేబు కుట్టేశాడు నాన్నా. మనలా షర్టూ, ప్యాంట్లకు జేబులు కుట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు’’ అన్నాడు వాడు. ఈ సారి నా మతి మళ్లీ పోయింది. కానీ షికారుకు కాదు. అది పారిపోయింది. అలా పోయిన నా మతి ఇప్పట్లో దొరుకుతుందో, లేదో?! - యాసీన్ -
ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే!
నవ్వింత ‘‘థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును ఎలా కనిపెట్టాడో తెలుసా?’’ అకస్మాత్తుగా అడిగాడు మా రాంబాబు. ‘‘చక్కగా ధాబాలో కూర్చుని ఈ ఉల్లిగడ్డను నంజుకుంటూ పరోఠా తినాల్సిన సమయంలో మాట్లాడాల్సిన టాపికా ఇది?’’ అంటూ కాస్త చిరాకు పడ్డాన్నేను. ‘‘ఈ టైమ్‌లోనే ఎందుకంటే... పరోఠాతో పాటు ఇచ్చిన ఈ చిన్న చిన్న చిన్నుల్లి ముక్కల్ని చూశాక ఉల్లి షేపు గుర్తొచ్చింది. దాని షేపు గుర్తురాగానే ఎడిసన్గారికి కూడా ఎలక్ట్రిక్ బల్బు రూపు స్ఫురించి ఉంటుంది. దాంతో బహుశా మనవాడు అచ్చం ఉల్లిగడ్డ షేపులోనే కరెంటు బల్బుకు రూపకల్పన చేసి ఉంటాడనిపించి అలా మాట్లాడానన్నమాట. ఒక్క పరోఠాతో అనేమిటీ... ఉల్లి దోశ తోడ ఉల్లమ్ము రంజిల్లు / ఉల్లి లేక గారెకు రుచియె లేదు / తల్లి కంటే ఉల్లికి ప్రాధాన్యమందుకే / విశ్వదాభిరామ వినురవేమా! అన్నార్రా అందుకే’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్... ఈ సైన్సు విషయాలూ, ఆ తిండి పద్యాలూ ఆపేసి, హ్యాపీగా సినిమా కబుర్లు చెప్పుకుంటే సరదాగా ఉంటుందీ, తిండితో పాటూ కబుర్లలోనూ మసాలాకు మసాలా’’ అన్నాన్నేను. ‘‘అలాగే... నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మాటకొస్తే సినిమాలకు మాత్రం... ఉల్లి చేసిన సాయం అంతా ఇంతా ఉందా? హీరో తల్లి కంటతడి పెట్టుకుంటూ ఉండి, తీరా హీరోగారు అది చూసి ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో అని సాకును ఉల్లిపాయ మీదకు తోసేసిన సినిమాలు ఎన్ని లేవు? అంతెందుకు... ఓ సినిమాలోనైతే... పెళ్లి చేసి పంపిస్తే తన చెల్లి ఉల్లిపాయ కోసి, కళ్లు మండేలా చేసుకుంటుందని అసలామెకు పెళ్లే చేయనంటాడు ఓ హీరో. సినిమా హీరోల తల్లి పాత్రలను దృష్టిలో పెట్టుకునే మూవీ కథ ముందుకు సాగడానికి ‘తల్లి చేసే మేలు కంటే ఉల్లి చేసే మేలే గొప్ప’ అన్న సామెత పుట్టిందేమోరా. అంతెందుకు మరో హిట్ సినిమాలో వంటింట్లో నుంచి మసాలా వాసనలు రావడం లేదు కాబట్టి హీరోయిన్ వంట చేస్తోందో లేదో అని విందుకు వచ్చిన వాళ్లు భయపడుతుంటే... హీరో వచ్చేసి ఉల్లిని సగానికి కోసి దానిపై దోమల మందు స్ప్రే చేస్తాడు. దాంతో ఘుమఘుమలాడే మసాలా వాసనలు వస్తున్నట్లు ఫీలై అతిథులు తెగ సంతృప్తిపడతారు. అదీ ఉల్లి గొప్పదనం. వంటలోనే కాదు... సినిమాలో మసాలాకూ ఉల్లి కావాల్సిందేరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్ రాంబాబూ... ఎలా తిప్పి చెప్పినా మళ్లీ ఆవు కథకే వచ్చినట్లుగా ఈ ఉల్లి లొల్లి ఏమిట్రా బాబూ? వదిలేయ్... ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడు. సరదాగా హీరోలనూ, వాళ్ల తల్లులనూ, అతగాడి చెల్లెళ్లనూ వదిలేసి... హాట్‌హాట్‌గా హీరోయిన్ల గురించి మాట్లాడు. వినడానికి ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నాను మళ్లీ. ‘‘అలాగేరా... నువ్వు చెప్పినట్టే హీరోయిన్స్ గురించే మాట్లాడుకుందాం. హీరోయిన్ను కళ్లప్పగించి చూసేలా చేయాలంటే, ఆడియన్స్ అందరికీ ఆమె గ్లామరస్‌గా కనిపించాలంటే ‘ఉల్లిపొర’లాంటి చీర కట్టాల్సిందే. ఆ తర్వాత ఆ చీరలో తనను వానలో తడపాల్సిందేరా. నిజానికి సమస్త తెలుగు ప్రజలందరూ పల్చటి చీరకు ఉపమానంగా ఉల్లినీ, దాని పైపొరనీ వాడారంటే... దానిపై సినిమావాళ్లతో పాటు అందరికీ ఎంత గౌరవం ఉందో చూశావా?’’ అన్నాడు రాంబాబుగాడు. ఎలాగైనా సరే... వాడు మాట్లాడే టాపిక్ మారుద్దామని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నా. అందుకే ఉల్లితో ఎలాంటి సంబంధం లేని అంశాన్ని డిస్కషన్‌కు తెద్దామనే కృతనిశ్చయంతో ‘‘ఒరేయ్... బంగారం ధర క్రమంగా తగ్గుతోందటరా! ముప్ఫయి రెండు వేలు, ముప్ఫయిమూడు వేల నుంచి దాదాపు పాతికవేలకు వచ్చేసిందట తెలుసా? మీ ఆవిడకు బంగారం కొనాలనుకుంటున్నావ్ కదా. ఇదే మంచి అవకాశం. కొనకపోయావా?’’ అంటూ వాణ్ణి టోటల్‌గా మరోవైపునకు లాక్కుపోయినట్లుగా ఫీలయ్యా. ‘‘బంగారం అంటే గుర్తొచ్చిందీ... అదంటే ఆడవాళ్లకు బలే మోజురా. అందుకే కూరలు వండేటప్పుడూ, తాలింపులు వేసేప్పుడూ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు రంగుకు వచ్చేవరకూ వేయిస్తారు. అదేమిటోగానీ... బంగారం రంగు వచ్చేవరకు వేయిస్తేనే వంటకం రుచిగా ఉంటుంది. అంతకంటే మాడితే కూర టేస్టు పోతుంది. ఇలా ఉల్లికీ... వంటనూనెలలో అది బంగారు రంగు పుంజుకోడానికీ... రుచికీ ఉన్న సంబంధమేమిటో తెలియడం లేదురా. ఉల్లీ... చిల్లీ ఈ రెండూ లేకపోతే వంటే లేదురా’’ అంటూ బంగారం మార్కెట్ నుంచి తిరిగి తిరిగి మళ్లీ ఉల్లిదగ్గరికే వచ్చాడు వాడు. ‘‘ఒరేయ్... నేనో కొత్త సామెత సృష్టిద్దామనుకుంటున్నానురా. నువ్వు పొరబాటున ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువు అవునో కాదోగానీ, ఉల్లికి మాత్రం దాసుడివేరా’’ అన్నాన్నేను కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. అన్నట్టు ఈ కన్నీళ్లకు కారణం ఉల్లి మాత్రం కాదు! - యాసీన్