మిఠాయి కొట్టున పకోడి పొట్లం! | mithai shop in pakodi packet! | Sakshi
Sakshi News home page

మిఠాయి కొట్టున పకోడి పొట్లం!

Published Wed, Dec 9 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

మిఠాయి కొట్టున పకోడి పొట్లం!

మిఠాయి కొట్టున పకోడి పొట్లం!

హ్యూమర్
వస్తూ వస్తూ రైల్వేస్టేషన్‌లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను.
‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను.
 
‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు.
 అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు  కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు.

దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను.
 ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా.

మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు.

అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా.  
 ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా.

ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ.
 
‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా.
 ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు.

అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా.

అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు.
 ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను.
 ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా?

ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు  మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement