స్వామి సోడాకాయానంద! | yasin humor story! | Sakshi
Sakshi News home page

స్వామి సోడాకాయానంద!

Published Sun, Sep 25 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

స్వామి సోడాకాయానంద!

స్వామి సోడాకాయానంద!

హ్యూమర్
‘‘ఏంట్రా విశేషాలు?’’ ఎరక్కపోయి అడిగా మా రాంబాబు గాడిని.   ‘‘ఏం లేదురా మొన్న ఊరెళ్లి వచ్చా. చాలా రోజుల తర్వాత అక్కడ సోడా తాగా.  నిజానికి దాన్ని సోడా అని అంటాంగానీ అది రెండు కూరగాయలకు సరిపెట్టు అయిన ఒక వెజిటెబుల్’’ అన్నాడు రాంబాబు.
 ‘‘అది వెజిటెబుల్ ఏమిట్రా నా తలకాయ’’ అన్నాను. ‘‘కూరగాయ లేదా కాయ గూర అనే దాంట్లో ‘కాయ’ అనే శబ్దం ఉంది చూశావా? అలాగే సోడానూ సోడాకాయ అంటారు. అలాగే దానిలోని గోలీని గోలీకాయ అంటారు. చూశావా... ఇలా రెండు కాయ శబ్దాలను తనలో దాచుకున్న దానిని వెజిటబుల్ అంటే తప్పేమిటి?

కాకపోతే కాస్త సొరకాయ వంటి షేపుతో, టెంకాయ వంటి నీళ్లతో నిండి ఉండే కాయేరా ఈ సోడాకాయ’’ అన్నాడు వాడు. అక్కడితో ఆగకుండా... ‘‘మన సిటీలో కనిపించడం లేదు కానీ... మొన్న ఊరెళ్లినప్పుడు గోలీ సోడా కనిపించగానే అలా పాతజ్ఞాపకాల్లోకి వెళ్లిపోయా. అలా ఒల్డ్ మెమరీస్‌లో చాలా సేపు ఉండిపోయా. అంతేకాదు... కాసేపు కన్నీళ్లు కూడా  పెట్టుకున్నాను’’ అన్నాడు వాడు ఎమోషనల్ అయిపోతూ.
 ‘‘సోడా తాగావు. ఆనందించావు. కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు?’’ అడిగా.
 
‘‘అరేయ్... సోడా ఎంత గొప్పది రా. నీళ్లను రీ-ఇన్‌ఫోర్సు చేస్తే ఉండే పవర్ సోడాలో ఉంటుంది. నాలుగైదు గ్లాసుల దాహం ఒక్కటంటే ఒక్క సోడాయే తీరుస్తుంది. ఏదైనా చెబితే ఆర్చేవారా, తీర్చేవారా అంటుంటారు చూశావా... కానీ సోడా కచ్చితంగా తీర్చేదేరా. దాహం తీర్చే పరమాద్భుతమైన వరప్రదాయని అది. చూడ్డానికి ఏదో సోడాలా అలా నిరాడంబరంగా కనిపిస్తుంది కానీ... అది నిజంగా ఫిలాసఫీని చెప్పే గురువురా’’ అన్నాడు.
 ‘‘కళ కళ కోసమే అన్నట్లు సోడా సోడా కోసమే. మహా అయితే తాగడం కోసమే. అంతే. నువ్వు దానికి లేనిపోని మహిమలు అంటగట్టకు, దాని మహత్యాలు చెప్పి  నన్ను విసిగించకు’’ అన్నాను.
 
‘‘నిజం రా. సోడాలో ఒక తత్వబోధ ఉంది. ఒక పరమార్థం ఉంది. ఒక సందేశం ఉంది. అందులోని గోలీని చూశావా?’’ అన్నాడు వాడు.
 ‘‘చూశాను. నాకు మామూలు గోలీలాగే కనిపించింది. అందులో ఏముంది గొప్ప?’’ అడిగా.
 ‘‘గుండెలో పదిలంగా ఉంచుకోవాల్సిన జ్ఞానాన్ని అహంకరించుకొని తలకు ఎక్కించుకోకూడదు సోడాలోని గోలీలా. పనికిరాని గ్యాస్ అండ చూసుకొని అహంకరించి అట్టడుగు వర్గాలైన నీళ్లకు దూరంగా ఉండిపోవాలని కోరుకోకూడదు. ఏదో ఒక రోజు ఆ దురంహంకారాన్ని బలంగా నొక్కి కిందికి దించేసేలా గర్వభంగం జరుగుతుందని బోధిస్తుంటుంది రా గోలీ.

ఏ గ్యాసునైతే తనకు అండ అనుకొని గోలీ గురుత్వాకర్షణ శక్తిని ఎదురు నిలిచిందో, ఏ గ్యాసునైతే నమ్ముకుని గోలీ సోడా మూతిని అంటిపెట్టుకొని ఉన్నత స్థానంలో ఉన్నానంటూ నీలిగిందో... కాస్తంత ఒత్తిడితో అదే గ్యాసు పైకి తేలిపోతుంది. తన నుంచి దూరంగా వెళ్లిపోతుంది. తాను దూరంగా ఉంచుదామనుకున్న అట్టడుగున ఉన్న ఆ నీరు తనను దాటుకుంటూ తన మీదుగానే తాగేవాడి నోట్లోకి వెళ్లిపోతాయి. అందుకే అహంకారం ఎప్పటికైనా కుయ్యిమనే శబ్దం చేస్తూ తస్సుమంటుందనే తత్వజ్ఞానం బోధిస్తుంది సోడా కాయలోని గోలీకాయ. అంతేకాదు సోడాకాయ ఆత్మజ్ఞానాన్నీ బోధిస్తుంది’’ అన్నాడు రాంబాబు.
 
‘‘అసలు సోడాకాయకూ, ఆత్మజ్ఞానానికీ సంబంధం ఏమిట్రా’’ అంటూ వాణ్ణి నిలదీశాను.
 ‘‘చెబుతా విను. నీ దేహాత్మ సోడాకాయ లాంటిది. అందులోని నీళ్లు పరమాత్మ స్వరూపం. పైన ఉండే గ్యాసు నీకు ఊపిరిని అందించే వాయువు. ఏదో ఒక రోజున నీకు ఆయువు తీరిపోక తప్పదు. ఆయువు తీరాక వాయువు కూడా ఉండదు సోడాలో!  ఆరోజున నీ సోడాకాయ లాంటి నీ దేహాత్మను వీడి నీళ్లనే ఆ పరమాత్మ వెళ్లిపోతుంది. ఈ జ్ఞానం కలిగిన నాడు బయటకు వచ్చిన ఆ గ్యాసు... సోడా మూతి దగ్గర కాసేపు జ్ఞాన చక్రంలా ఆవరించుకొని ఉంటుంది.  జీవితం బుద్బుద ప్రాయమైనదని ఖాళీ అయిన సోడాకాయ మళ్లీ మళ్లీ నిండుతుందనీ, నిండినది ఖాళీ అవుతుంటుందని...

ఈ మహాచక్రం ఇలా సాగుతూ ఉంటుందని తత్వ బోధ చేస్తుంటుందిరా ఆ పరమ గురువైన ఆ మహా  సోడాకాయానంద’’ అన్నాడు.
 ‘‘నువ్వు అంటే నిజమే అనిపిస్తుంది కానీ సోడాకాయ ఎందుకు రా అలా కు..య్..  మంటూ ఈల వేస్తుంది. అలా విజిల్ వేయడం తప్పు కదా’’ అన్నాను.
 ‘‘అది పోకిరీ విజిల్ కాదు రా... మళ్లీ మళ్లీ పుట్టే దాహార్తిని తీర్చడం కోసం నన్ను నేను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకొని పుడుతూ ఉంటా అని చెప్పేందుకు ఓ మృదుమధురమైన పాటలాంటి స్వరంరా అది. నీలాంటి అజ్ఞానులు దాన్ని విజిల్ అని పొరబడుతుంటారు’’ అంటూ నాకు జ్ఞానబోధ చేశాడు మా రాంబాబు గాడు.
- యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement