కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!! | Hen Lessons... some facts !! | Sakshi
Sakshi News home page

కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!

Published Sun, Sep 18 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!

కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!

హ్యూమర్
‘‘కోడి దాని రెక్కల కింద అలా తన తలను దాచుకుందేం నాన్నా’’ అడిగాడు ఏడేళ్ల మా  బుజ్జిగాడు. ‘‘అంటే... దానికి జ్వరమొచ్చిందన్నమాట. జ్వరం తగ్గే వరకూ అది అలా తన తలను  రెక్కల చాటున దాచుకుంటుందన్నమాట’’ వివరించాను. ‘‘అరె... అసలే దాని ఒళ్లు వెచ్చగా ఉంటుంది. మొన్న కోడిని కాసేపు పట్టుకుంటే తెలిసింది... దాని ఒళ్లు ఎంత వేడిగా ఉంటుందో! ఇప్పుడు దానికి జరం వచ్చిందని నువ్వు అంటున్నావు. అలాంటప్పుడు దాని తల మరింత వేడెక్కి పోతుంది కదా. ఒళ్లు అలా కాలిపోతున్నప్పుడు మళ్లీ తల అలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా’’ అన్నాడు వాడు. అది తల ఎలా పెట్టుకుందో తెలియదు గానీ... నాకు మాత్రం తలపట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది.
   
మా బుజ్జిగాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ కోళ్ల పెంపకం కార్యక్రమం పెట్టుకున్న దగ్గర్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అవి ముఖ్యంగా మా బుజ్జిగాడి సందేహాల రూపంలో ఆ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాడి డౌట్ల కారణంగా నేను అడుగేసినప్పుడల్లా కోడి రెట్టలో కాలేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏదో నేను మరచిపోయినా మావాడు వాటికింత మేత వేస్తాడు కదా అని లేనిపోని ఈ పెంపక కేంద్రం మొదలుపెట్టాను. నేను వాటిని పెంచుతున్నానా... మావాడి డౌట్సును పెంచుతున్నానా అన్నది అర్థం కాకుండా పోయింది. వాడు మళ్లీ తన డౌట్ గుర్తు చేస్తూ... ‘‘జరం వచ్చినప్పుడు అలా తలపెట్టుకోవద్దు అని కోడికి చెప్పు నాన్నా’’ అన్నాడు వాడు.
 
కోడికి మన లాంగ్వేజీ అర్థం కాదన్నా వినేట్టు లేడు. ఒకవేళ మన భాష అర్థం కాదని అంటే... ‘బో... బో...బో అంటే తిండి తినమని కదా. ఇష్షు ఇష్షు అంటే దూరం పొమ్మని కదా’ అని... ‘కోడి భాష... అనువాదం... కొన్ని మెళకువలు’ అని నాకు కొత్తగా కొన్ని కోడిపదాలు నేర్పేట్టు ఉన్నాడు అనుకున్నాను.
 
వాడి సందేహం తీర్చడం కోసం అప్పటికప్పుడు ఒక ఐడియా ఫ్రేం చేసుకున్నాను. దాన్ని అమల్లో పెట్టాను.
 ‘‘ఒరేయ్... మొన్న నాకు జలుబు చేసినప్పుడు వేణ్ణీళ్లలో విక్స్ వేసుకొని ఆవిరి పట్టుకున్నాను గుర్తుందా. అప్పుడు వద్దంటున్నా నా దుప్పట్లోకి నువ్వు దూరావు. అప్పుడు నాకులాగే ఇప్పుడు మన ఈ కోడికీ జలుబు చేసిందన్నమాట. పాపం... అది ఆవిరి పట్టుకోడానికి వేణ్ణీళ్లు పెట్టుకోలేదు కదా.

అందుకే రెక్కల చాటున ఉన్న వేడిని తన ముక్కు రంధ్రాల్లోకి పంపించుకుంటుదన్నమాట. అలా అది తనకు తాను ఆవిరిపెట్టుకుంటోంది’’ అని వివరించాను.
 ‘‘ఓహో... పాపం... దాని ముక్కు తుడుచుకోవడం ఎంత కష్టం నాన్నా. అందుకే చిరాకుగా అది ఒక్కోసారి తన గోళ్లతో ముక్కును గీరుకుంటోంది. పాపం... దానికి దురద పెట్టి గీరుకుంటుందేమో అనుకున్నా. ఆహా... ఇప్పుడు అర్థమైంది. నిజానికి అది ముక్కు తుడుచుకుంటుందన్నమాట అన్నాడు వాడు.
 వాడితో ఎందుకొచ్చిన గొడవ అంటూ ‘ఆ... అవునవును’ అన్నాను.
    
రెండ్రోజుల క్రితం కొన్ని డబ్బులు బ్యాంకులో వేయడానికి బయల్దేరాను. ఇంట్లో తన పనుల్లో కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నాడని వాణ్ణి నాకు అప్పగించింది మా ఆవిడ.
 ‘‘డిపాజిట్ ఫామ్ నింపాక ఏదో క్యూలో నించోవడమే కదా. బుజ్జిగాణ్ణి వెంట తీసుకెళ్లండి. ఇక్కడుంటే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు’’ అంది.
 ‘‘అవున్నాన్నా.. అచ్చం మన కోడిలాగే. అదీ ఎప్పుడూ ఒకటి కెలుకుతూ ఉంటుంది కదా’’ అన్నాడు వాడు. పైగా పొదిగి పిల్లలు పెట్టాక మా కోడి అంతటిది పిల్లలను వెంటేసుకొని పెరట్లో తిరుగుతూ ఉంది. మనిషినయ్యాక బిడ్డను బయట తిప్పకపోతే ఎలా అనుకొని వాణ్ణి వెంటతీసుకొని బ్యాంకుకు వెళ్లా. అక్కడికి వెళ్లాక కౌంటర్లో డిపాజిట్ డబ్బులు ఇవ్వడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాను.
 
‘‘అవునూ... మొన్న ఆ అంకుల్ ఎవరో వచ్చి అడిగితే డబ్బులు లేవన్నావు. ఇప్పుడు మళ్లీ బీరువాలోంచి తీసి బ్యాంకులో వేస్తున్నావు ఎందుకు?’’ అని అడిగాడు వాడు. అలా బ్యాంకు వాళ్ల ముందు... అక్కడున్న వాళ్ల ముందు నా పరువు తీశాడు వాడు. అసలే నాది చిన్న మెదడు. పైగా అది ఫారం కోడి మెదడులా అయిపోయింది. ఏదో మొన్నంటే జలుబూ-జ్వరం అని ఒక కథ అల్లాను గానీ కాస్త క్యాషూ కామర్సూ వ్యవహారాలంటే  నాకు కంగారు. అందుకే నాకు ఏం చేప్పాలో తోచలేదు. ఇంటికెళ్లాక మీ అమ్మ చెబుతుందని తప్పించుకున్నాను. కానీ ఇంట్లోకి వెళ్లాక మళ్లీ అదే ప్రశ్న వేశాడు వాడు.
 ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే మా ఆవిడ కల్పించుకుంది.
 
‘‘ఒరేయ్... పొదగడం అంటే మొన్న అడిగితే మీ నాన్న చెప్పలేకపోయారు కదా. చెబుతా విను. ఇప్పుడూ... కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకో. అది ఏటీఎమ్ నుంచి డెరైక్ట్‌గా డబ్బులు తీసుకున్నట్లు అన్నమాట. కానీ అవే గుడ్లను కోడి కింద పెట్టేశామనుకో. మొన్న ఆ కోడి పొదగడం చూశావు కదా... అలా బ్యాంకువాళ్లు ఆ డబ్బును తమ వద్ద దాచుకుని, డబ్బు తాలూకు పిల్లలు చేసి మనకు అప్పగిస్తారన్నమాట. అచ్చం మన కోడి పిల్లల్లాగే! ఇప్పుడు నీకు అర్థమైందా పొదగడం అంటే ఏమిటో?’’ అని వివరించింది మా ఆవిడ.
 మా ఆవిడ తాలూకు కోచింగులోని టీచింగ్ మెలకువలు చూసి కోడి కెలికిన పెంటకుప్పలా అయిపోయింది నా మైండు. కానీ ఆమె చెప్పిన పాఠం మాత్రం  బురదలో కోడి కాలి గుర్తులా నా మెదడులో అలా నిలిచిపోయింది.
- యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement