గొప్పల 'సెల్'ఫీస్...!
హ్యూమర్
‘‘వేమన ఉన్న రోజుల్లో మేం లేము. ఆయన ఉన్న రోజుల్లో మేం గనక ఉండి ఉంటే...’’ అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది సెల్‌ఫోన్.
‘‘వేమన ఉండి ఉంటే ఏమయ్యేది?’’ అడిగింది ల్యాండ్‌లైన్ హ్యాండ్ సెట్.
‘‘ఏమయ్యేది అని నెమ్మదిగా అడుగుతావేం... ‘చేతిలోన సెల్లు... చెవిలోన హెడ్‌ఫోను... అరచేత పట్టు ఇంటర్నెట్టు... అందులోనీ ఫేస్బుక్కు, టాపు రేపు వాట్సాప్పు... చేత సెల్లు లేని బాధ ఇంతింత గాదయా’... అంటూ మమ్మల్ని వర్ణిస్తూ పద్యాలు చెప్పే వాడు. ఇప్పుడు ప్రతివాడూ మా సర్వీస్ తీసుకునే వాడే, మమ్మల్ని తిట్టేవాడే’’ అంది సెల్‌ఫోన్.
‘‘మిమ్మల్ని తిడుతున్నారా... ఎవరూ?
ఏమంటున్నారు?’’ అడిగింది హ్యాండ్‌సెట్.
‘‘మేము వచ్చి మానవ సంబంధాలను మంటగలిపామంట. ప్రతివాళ్లూ మాలోనికి తలదూరుస్తున్నారట. మేం కూడా యథాశక్తి వాళ్ల జీవితాల్లోకి తలదూరుస్తున్నామంట. ఒక్క మాటేమిటీ... పెళ్లిళ్లు కూడా మా ద్వారానే... విడాకులూ మా ద్వారానేనట’’... అంది సెల్‌ఫోన్ బాధగా.
‘‘అరె... ఒక రింగుల రింగుల సంకెళ్ల ద్వారా ఆ ల్యాండ్‌ఫోన్‌కి మేం బందీలమయ్యామే. కానీ మీరు అలా కాదు కదా. స్వేచ్ఛగా బహు స్వతంత్రంగా ఉన్నారని మేం మిమ్మల్ని చూస్తూ కుళ్లుకుంటూ ఉన్నామే. మీకు తిట్లు తప్పడం లేదన్నమాట’’ సానుభూతిగా అంది ల్యాండ్‌ఫోన్ హ్యాండ్ సెట్.
‘‘తిట్లా... మామూలుగా కాదు. కర్ణపిశాచి అనీ... అదనీ ఇదనీ. అరె... అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ మాలోనే ఇంతగా తలదాచుకుంటున్నారే...’’ అంటుండగా సెల్‌ఫోన్ మాటల ఫ్లోకి అడ్డుపడింది ల్యాండ్‌ఫోన్.
‘‘తల దాచుకోవడమేమిటి? అసలు తలదాచుకోవడమనే మాటకు అర్థమేమిటో తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి’’ అంటుండగానే రోషంగా తలెత్తింది సెల్‌ఫోన్.
‘‘పెద్ద పెద్ద మాటలేమీ కాదు. ఉన్న వాస్తవమే. ఎవరినైనా పలకరించాల్సి వస్తుందనీ, ఎదుటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని తెలియగానే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాలో తలదాచుకుంటారు. తమ మెదడు తినేసేవాళ్లు అవతలికి పోయారని తెలిసేవరకూ అలా దాచుకున్న తలను మళ్లీ ఎత్తరు. పైగా మేమిప్పుడు మనషులు దారితప్పకుండా చూసే వాళ్ల పాలిటి గైడ్‌లం కూడా’’ అంది గొప్పగా.
‘‘మీరేంటి గైడ్‌లేమిటి? ఎందుకలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు’’అంది హ్యాండ్‌సెట్ అక్కసుగా.
‘‘మేం మనుషుల పాలిటి గైడ్‌లం అన్న మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ప్రతి కారూ... ప్రతి వాహనమూ తాము దారి తప్పకుండా ఉండటం కోసం మా సహాయం తీసుకుంటున్నారు. తాము వాహనంలో కూర్చుని ఎక్కడున్నదీ... ప్రయాణించాల్సిన రూట్ ఏదీ... ఇవన్నీ తెలిసేలా మాలోనే రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకుని, ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ప్రయాణాలు చేసేవారికి తమ సీటు ఎంత ముఖ్యమో... వాళ్ల గైడ్‌గా మాకూ అంతే ప్రాధాన్యం. డ్రైవింగ్ సీటుకు ఎదురుగా మమ్మల్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ప్రతివాహనంలోనూ మాకో స్టాండు ఏర్పాటు చేస్తున్నారు తెల్సా’’ అంది సెల్‌ఫోను.
‘‘అవును. గతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము తమ హోదాకు చిహ్నంగా మమ్మల్ని భావించేవారు’’ అంటూ ఉండగానే సెల్‌ఫోన్ అడ్డుకుంది.
‘‘ఇప్పుడు మీరు మీ పాత గొప్పల్ని చెప్పుకుంటున్నారే... అప్పుడలా బతికాం అంటూ ఇప్పుడు మీ గత ప్రాభవం గురించి ప్రశంసించుకుంటున్నారు కదా. అలాంటిది ఇప్పుడు మాగురించి పరమ వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు గబుక్కున ‘పొగుడుకోవడం’ అనేశారు మేమెంత హర్టయ్యామో తెలుసా’’ అంది సెల్‌ఫోన్ నిష్ఠూరంగా.
‘‘మేం మోగితే తప్పనిసరిగా మమ్మల్ని ఎత్తుకునే వారు. కానీ మీరు మోగితే ఎదుటివాళ్ల కాల్ తాము తీసుకోనక్కర్లేదని తెలిస్తే ఠక్కున మీ పీక నొక్కేసున్నారు కదా. మాకు అలాంటి అగౌరవాలు ఉండేవి కావు తెలుసా’’ అంటూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకుంది ల్యాండ్‌లైన్ ఫోన్.
‘‘నోర్మూసుకోండి. ఇంటర్‌నెట్‌తో అనుసంధానమై ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అందిస్తున్న మేమెక్కడ. ఇప్పుడు ఇంటర్‌కమ్ స్థాయికి దిగిపోయిన మీరెక్కడ. ఏదో మా ఆవేదన వెలిబుచ్చుకోవాలనుకుంటే మధ్యన మీ బోడి గొప్పలేమిటి?’’ కోప్పడింది మొబైల్‌ఫోన్.
‘‘ఎంత అందరించిపోయినా డైనోసార్లు డైనోసార్లే... అందుకే ఎంతగా ప్రాచుర్యం పొందినా, ఎంతగా మీమీద మనషులు ఆధరపడ్డా మీరు మీరే. స్టేటస్ సింబల్‌లా మేము మేమే. తమ కుర్చీ కంటే ఎత్తై స్థానంలో పెట్టుకునే మేమెక్కడా... మగాళ్ల జేబుల్లోనూ, ఆడవాళ్ల హ్యాండ్‌బ్యాగుల్లోనూ తలదాచుకునే మీరెక్కడ’’ అంటూ ఈసడించింది ల్యాండ్‌లైన్ ఫోన్.
‘‘అంత మిడిసిపడ్డందుకే అంతరించిపోయి డైనోసార్లలా మిగిలారు’’ అంది మొబైల్.
‘‘డైనోసార్‌లో ‘సార్’ అనే మాట ఉంది. సెల్లు అనే మాట సొల్లులా ఉంది. అందుకే పరిమితంగా పనిచేసినామా కాలంలో మేమంటే ఎంతో గొప్ప. మంచి తివాచీ పరిచి మమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకునేవారు. మీరు ఇన్నిన్ని పనులు చేస్తున్నా, డేటూ టైమూ క్యాలెండరూ కెమెరా ఉన్నా మీకు గౌరవం జీరో. పైగా ఏడాదికోసారి కొత్త మోడల్ రాగానే మిమ్మల్ని చెత్త అంటూ పారేస్తారు’’ అంది ల్యాండ్‌లైను ఫోన్.
‘‘చెత్త అయినా, తిట్టుకున్నా సరే... ఇప్పట్లో మేమే మనుషుల చేతి ఆభరణం. మహామహుల తల చుట్టూ చక్రం తిరుగుతున్నట్లుగా... ఫైల్ డౌన్‌లోడ్ అవుతున్నప్పుడు మాలోనూ అలాంటి చక్రమే తిరుగుతూ ఉంటుంది’’ అంది సెల్.
‘‘అదీ సంగతి. రహస్యం తెలిసిపోయింది. మీకు తలతిరుగుడు ఎక్కువనే సంగతి తెలిసే మనుషులు మీ సేవలు తీసుకుంటూనే మిమ్మల్ని లోకువ కడుతున్నారేమో. అందుకే చేతవెన్నముద్ద పద్యం టైప్‌లో కాకుండా వేమన మిమ్మల్ని చెప్పులో రాయి, చెవిలో జోరిగ టైప్ పద్యం చెబుతాడని మీరన్నది నిజమే’’ అంటూ ‘సెల్’విచ్చింది ల్యాండ్‌ఫోను.
- యాసీన్