humor
-
అభిషేకిద్దాం... ఆచరిద్దాం...
ఆత్మీయం ఆయనకు నైవేద్యంగా చక్రపొంగలి అవసరం లేదు. పులిహోర ప్రసక్తేలేదు. పాయసాన్నాలు తినిపించనక్కరలేదు. నెత్తిమీద నాలుగు చెంబుల నీళ్లు గుమ్మరిస్తే చాలు. లింగడు కాస్తా ఉబ్బులింగడయిపోతాడు. నాలుగు మారేడు దళాలు తెంపి ముఖాన పారేస్తే సరి, పట్టరానంత సంతోషపడిపోతాడు. చిటికెడంత విభూది తీసుకుని ఆయన ముఖాన మూడు రేఖలు దిద్ది, మన నుదుటన కాసింత పులుముకుంటే చాలు... మనకు వెన్నుదన్నవుతాడు. చేతిలో ఏమీ లేనినాడు భక్తితో చెంబెడు నీళ్లు సమర్పిస్తే చాలు... పంచభక్ష్యపరమాన్నాలూ పెట్టినంతగా పొంగిపోతాడు. అందుకే ఆయన పేదల పెన్నిధయ్యాడు, పేదదేవుడయ్యాడు. అయితే, ఇంతటి బోళావాడిలోనూ మానవుడికి మల్లే కోపం ఉంటుంది. కరుణ తొణికిసలాడుతుంటుంది. హాస్యం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. అనుగ్రహం ఉంటుంది. సత్యం ఉంటుంది. నృత్యం ఉంటుంది. ప్రణయం ఉంటుంది. భార్యకు తనలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఆది దేవుడాయన. అందుకే మహాకవి కాళిదాసు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే.. అంటూ అమ్మవారిని, అయ్యవారిని కీర్తించడానికి కారణమిదే. పార్వతీ పరమేశ్వరులు వాక్కు– అర్థంలా విడదీయరాని బంధమై ఒకే శరీరంలో ఒకే ఆత్మగా కొలువున్నారని తన్మయభావనతో కొలుస్తాడు. ఈ సందర్భంగా ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే... కార్తీక సోమవారాలేవిధంగా శివప్రీతికరమైనవో, అదేవిధంగా శ్రావణమాసంలోని ప్రతి సోమవారం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఆ ముక్కంటిని మనసారా అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, ఆయనలోని మంచి లక్షణాలను అలవరచుకునేందుకు ప్రయత్నిద్దాం... ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం. -
స్వామి సోడాకాయానంద!
హ్యూమర్ ‘‘ఏంట్రా విశేషాలు?’’ ఎరక్కపోయి అడిగా మా రాంబాబు గాడిని. ‘‘ఏం లేదురా మొన్న ఊరెళ్లి వచ్చా. చాలా రోజుల తర్వాత అక్కడ సోడా తాగా. నిజానికి దాన్ని సోడా అని అంటాంగానీ అది రెండు కూరగాయలకు సరిపెట్టు అయిన ఒక వెజిటెబుల్’’ అన్నాడు రాంబాబు. ‘‘అది వెజిటెబుల్ ఏమిట్రా నా తలకాయ’’ అన్నాను. ‘‘కూరగాయ లేదా కాయ గూర అనే దాంట్లో ‘కాయ’ అనే శబ్దం ఉంది చూశావా? అలాగే సోడానూ సోడాకాయ అంటారు. అలాగే దానిలోని గోలీని గోలీకాయ అంటారు. చూశావా... ఇలా రెండు కాయ శబ్దాలను తనలో దాచుకున్న దానిని వెజిటబుల్ అంటే తప్పేమిటి? కాకపోతే కాస్త సొరకాయ వంటి షేపుతో, టెంకాయ వంటి నీళ్లతో నిండి ఉండే కాయేరా ఈ సోడాకాయ’’ అన్నాడు వాడు. అక్కడితో ఆగకుండా... ‘‘మన సిటీలో కనిపించడం లేదు కానీ... మొన్న ఊరెళ్లినప్పుడు గోలీ సోడా కనిపించగానే అలా పాతజ్ఞాపకాల్లోకి వెళ్లిపోయా. అలా ఒల్డ్ మెమరీస్‌లో చాలా సేపు ఉండిపోయా. అంతేకాదు... కాసేపు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను’’ అన్నాడు వాడు ఎమోషనల్ అయిపోతూ. ‘‘సోడా తాగావు. ఆనందించావు. కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు?’’ అడిగా. ‘‘అరేయ్... సోడా ఎంత గొప్పది రా. నీళ్లను రీ-ఇన్ఫోర్సు చేస్తే ఉండే పవర్ సోడాలో ఉంటుంది. నాలుగైదు గ్లాసుల దాహం ఒక్కటంటే ఒక్క సోడాయే తీరుస్తుంది. ఏదైనా చెబితే ఆర్చేవారా, తీర్చేవారా అంటుంటారు చూశావా... కానీ సోడా కచ్చితంగా తీర్చేదేరా. దాహం తీర్చే పరమాద్భుతమైన వరప్రదాయని అది. చూడ్డానికి ఏదో సోడాలా అలా నిరాడంబరంగా కనిపిస్తుంది కానీ... అది నిజంగా ఫిలాసఫీని చెప్పే గురువురా’’ అన్నాడు. ‘‘కళ కళ కోసమే అన్నట్లు సోడా సోడా కోసమే. మహా అయితే తాగడం కోసమే. అంతే. నువ్వు దానికి లేనిపోని మహిమలు అంటగట్టకు, దాని మహత్యాలు చెప్పి నన్ను విసిగించకు’’ అన్నాను. ‘‘నిజం రా. సోడాలో ఒక తత్వబోధ ఉంది. ఒక పరమార్థం ఉంది. ఒక సందేశం ఉంది. అందులోని గోలీని చూశావా?’’ అన్నాడు వాడు. ‘‘చూశాను. నాకు మామూలు గోలీలాగే కనిపించింది. అందులో ఏముంది గొప్ప?’’ అడిగా. ‘‘గుండెలో పదిలంగా ఉంచుకోవాల్సిన జ్ఞానాన్ని అహంకరించుకొని తలకు ఎక్కించుకోకూడదు సోడాలోని గోలీలా. పనికిరాని గ్యాస్ అండ చూసుకొని అహంకరించి అట్టడుగు వర్గాలైన నీళ్లకు దూరంగా ఉండిపోవాలని కోరుకోకూడదు. ఏదో ఒక రోజు ఆ దురంహంకారాన్ని బలంగా నొక్కి కిందికి దించేసేలా గర్వభంగం జరుగుతుందని బోధిస్తుంటుంది రా గోలీ. ఏ గ్యాసునైతే తనకు అండ అనుకొని గోలీ గురుత్వాకర్షణ శక్తిని ఎదురు నిలిచిందో, ఏ గ్యాసునైతే నమ్ముకుని గోలీ సోడా మూతిని అంటిపెట్టుకొని ఉన్నత స్థానంలో ఉన్నానంటూ నీలిగిందో... కాస్తంత ఒత్తిడితో అదే గ్యాసు పైకి తేలిపోతుంది. తన నుంచి దూరంగా వెళ్లిపోతుంది. తాను దూరంగా ఉంచుదామనుకున్న అట్టడుగున ఉన్న ఆ నీరు తనను దాటుకుంటూ తన మీదుగానే తాగేవాడి నోట్లోకి వెళ్లిపోతాయి. అందుకే అహంకారం ఎప్పటికైనా కుయ్యిమనే శబ్దం చేస్తూ తస్సుమంటుందనే తత్వజ్ఞానం బోధిస్తుంది సోడా కాయలోని గోలీకాయ. అంతేకాదు సోడాకాయ ఆత్మజ్ఞానాన్నీ బోధిస్తుంది’’ అన్నాడు రాంబాబు. ‘‘అసలు సోడాకాయకూ, ఆత్మజ్ఞానానికీ సంబంధం ఏమిట్రా’’ అంటూ వాణ్ణి నిలదీశాను. ‘‘చెబుతా విను. నీ దేహాత్మ సోడాకాయ లాంటిది. అందులోని నీళ్లు పరమాత్మ స్వరూపం. పైన ఉండే గ్యాసు నీకు ఊపిరిని అందించే వాయువు. ఏదో ఒక రోజున నీకు ఆయువు తీరిపోక తప్పదు. ఆయువు తీరాక వాయువు కూడా ఉండదు సోడాలో! ఆరోజున నీ సోడాకాయ లాంటి నీ దేహాత్మను వీడి నీళ్లనే ఆ పరమాత్మ వెళ్లిపోతుంది. ఈ జ్ఞానం కలిగిన నాడు బయటకు వచ్చిన ఆ గ్యాసు... సోడా మూతి దగ్గర కాసేపు జ్ఞాన చక్రంలా ఆవరించుకొని ఉంటుంది. జీవితం బుద్బుద ప్రాయమైనదని ఖాళీ అయిన సోడాకాయ మళ్లీ మళ్లీ నిండుతుందనీ, నిండినది ఖాళీ అవుతుంటుందని... ఈ మహాచక్రం ఇలా సాగుతూ ఉంటుందని తత్వ బోధ చేస్తుంటుందిరా ఆ పరమ గురువైన ఆ మహా సోడాకాయానంద’’ అన్నాడు. ‘‘నువ్వు అంటే నిజమే అనిపిస్తుంది కానీ సోడాకాయ ఎందుకు రా అలా కు..య్.. మంటూ ఈల వేస్తుంది. అలా విజిల్ వేయడం తప్పు కదా’’ అన్నాను. ‘‘అది పోకిరీ విజిల్ కాదు రా... మళ్లీ మళ్లీ పుట్టే దాహార్తిని తీర్చడం కోసం నన్ను నేను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకొని పుడుతూ ఉంటా అని చెప్పేందుకు ఓ మృదుమధురమైన పాటలాంటి స్వరంరా అది. నీలాంటి అజ్ఞానులు దాన్ని విజిల్ అని పొరబడుతుంటారు’’ అంటూ నాకు జ్ఞానబోధ చేశాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!
హ్యూమర్ ‘‘కోడి దాని రెక్కల కింద అలా తన తలను దాచుకుందేం నాన్నా’’ అడిగాడు ఏడేళ్ల మా బుజ్జిగాడు. ‘‘అంటే... దానికి జ్వరమొచ్చిందన్నమాట. జ్వరం తగ్గే వరకూ అది అలా తన తలను రెక్కల చాటున దాచుకుంటుందన్నమాట’’ వివరించాను. ‘‘అరె... అసలే దాని ఒళ్లు వెచ్చగా ఉంటుంది. మొన్న కోడిని కాసేపు పట్టుకుంటే తెలిసింది... దాని ఒళ్లు ఎంత వేడిగా ఉంటుందో! ఇప్పుడు దానికి జరం వచ్చిందని నువ్వు అంటున్నావు. అలాంటప్పుడు దాని తల మరింత వేడెక్కి పోతుంది కదా. ఒళ్లు అలా కాలిపోతున్నప్పుడు మళ్లీ తల అలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా’’ అన్నాడు వాడు. అది తల ఎలా పెట్టుకుందో తెలియదు గానీ... నాకు మాత్రం తలపట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. మా బుజ్జిగాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ కోళ్ల పెంపకం కార్యక్రమం పెట్టుకున్న దగ్గర్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అవి ముఖ్యంగా మా బుజ్జిగాడి సందేహాల రూపంలో ఆ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాడి డౌట్ల కారణంగా నేను అడుగేసినప్పుడల్లా కోడి రెట్టలో కాలేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏదో నేను మరచిపోయినా మావాడు వాటికింత మేత వేస్తాడు కదా అని లేనిపోని ఈ పెంపక కేంద్రం మొదలుపెట్టాను. నేను వాటిని పెంచుతున్నానా... మావాడి డౌట్సును పెంచుతున్నానా అన్నది అర్థం కాకుండా పోయింది. వాడు మళ్లీ తన డౌట్ గుర్తు చేస్తూ... ‘‘జరం వచ్చినప్పుడు అలా తలపెట్టుకోవద్దు అని కోడికి చెప్పు నాన్నా’’ అన్నాడు వాడు. కోడికి మన లాంగ్వేజీ అర్థం కాదన్నా వినేట్టు లేడు. ఒకవేళ మన భాష అర్థం కాదని అంటే... ‘బో... బో...బో అంటే తిండి తినమని కదా. ఇష్షు ఇష్షు అంటే దూరం పొమ్మని కదా’ అని... ‘కోడి భాష... అనువాదం... కొన్ని మెళకువలు’ అని నాకు కొత్తగా కొన్ని కోడిపదాలు నేర్పేట్టు ఉన్నాడు అనుకున్నాను. వాడి సందేహం తీర్చడం కోసం అప్పటికప్పుడు ఒక ఐడియా ఫ్రేం చేసుకున్నాను. దాన్ని అమల్లో పెట్టాను. ‘‘ఒరేయ్... మొన్న నాకు జలుబు చేసినప్పుడు వేణ్ణీళ్లలో విక్స్ వేసుకొని ఆవిరి పట్టుకున్నాను గుర్తుందా. అప్పుడు వద్దంటున్నా నా దుప్పట్లోకి నువ్వు దూరావు. అప్పుడు నాకులాగే ఇప్పుడు మన ఈ కోడికీ జలుబు చేసిందన్నమాట. పాపం... అది ఆవిరి పట్టుకోడానికి వేణ్ణీళ్లు పెట్టుకోలేదు కదా. అందుకే రెక్కల చాటున ఉన్న వేడిని తన ముక్కు రంధ్రాల్లోకి పంపించుకుంటుదన్నమాట. అలా అది తనకు తాను ఆవిరిపెట్టుకుంటోంది’’ అని వివరించాను. ‘‘ఓహో... పాపం... దాని ముక్కు తుడుచుకోవడం ఎంత కష్టం నాన్నా. అందుకే చిరాకుగా అది ఒక్కోసారి తన గోళ్లతో ముక్కును గీరుకుంటోంది. పాపం... దానికి దురద పెట్టి గీరుకుంటుందేమో అనుకున్నా. ఆహా... ఇప్పుడు అర్థమైంది. నిజానికి అది ముక్కు తుడుచుకుంటుందన్నమాట అన్నాడు వాడు. వాడితో ఎందుకొచ్చిన గొడవ అంటూ ‘ఆ... అవునవును’ అన్నాను. రెండ్రోజుల క్రితం కొన్ని డబ్బులు బ్యాంకులో వేయడానికి బయల్దేరాను. ఇంట్లో తన పనుల్లో కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నాడని వాణ్ణి నాకు అప్పగించింది మా ఆవిడ. ‘‘డిపాజిట్ ఫామ్ నింపాక ఏదో క్యూలో నించోవడమే కదా. బుజ్జిగాణ్ణి వెంట తీసుకెళ్లండి. ఇక్కడుంటే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు’’ అంది. ‘‘అవున్నాన్నా.. అచ్చం మన కోడిలాగే. అదీ ఎప్పుడూ ఒకటి కెలుకుతూ ఉంటుంది కదా’’ అన్నాడు వాడు. పైగా పొదిగి పిల్లలు పెట్టాక మా కోడి అంతటిది పిల్లలను వెంటేసుకొని పెరట్లో తిరుగుతూ ఉంది. మనిషినయ్యాక బిడ్డను బయట తిప్పకపోతే ఎలా అనుకొని వాణ్ణి వెంటతీసుకొని బ్యాంకుకు వెళ్లా. అక్కడికి వెళ్లాక కౌంటర్లో డిపాజిట్ డబ్బులు ఇవ్వడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాను. ‘‘అవునూ... మొన్న ఆ అంకుల్ ఎవరో వచ్చి అడిగితే డబ్బులు లేవన్నావు. ఇప్పుడు మళ్లీ బీరువాలోంచి తీసి బ్యాంకులో వేస్తున్నావు ఎందుకు?’’ అని అడిగాడు వాడు. అలా బ్యాంకు వాళ్ల ముందు... అక్కడున్న వాళ్ల ముందు నా పరువు తీశాడు వాడు. అసలే నాది చిన్న మెదడు. పైగా అది ఫారం కోడి మెదడులా అయిపోయింది. ఏదో మొన్నంటే జలుబూ-జ్వరం అని ఒక కథ అల్లాను గానీ కాస్త క్యాషూ కామర్సూ వ్యవహారాలంటే నాకు కంగారు. అందుకే నాకు ఏం చేప్పాలో తోచలేదు. ఇంటికెళ్లాక మీ అమ్మ చెబుతుందని తప్పించుకున్నాను. కానీ ఇంట్లోకి వెళ్లాక మళ్లీ అదే ప్రశ్న వేశాడు వాడు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే మా ఆవిడ కల్పించుకుంది. ‘‘ఒరేయ్... పొదగడం అంటే మొన్న అడిగితే మీ నాన్న చెప్పలేకపోయారు కదా. చెబుతా విను. ఇప్పుడూ... కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకో. అది ఏటీఎమ్ నుంచి డెరైక్ట్‌గా డబ్బులు తీసుకున్నట్లు అన్నమాట. కానీ అవే గుడ్లను కోడి కింద పెట్టేశామనుకో. మొన్న ఆ కోడి పొదగడం చూశావు కదా... అలా బ్యాంకువాళ్లు ఆ డబ్బును తమ వద్ద దాచుకుని, డబ్బు తాలూకు పిల్లలు చేసి మనకు అప్పగిస్తారన్నమాట. అచ్చం మన కోడి పిల్లల్లాగే! ఇప్పుడు నీకు అర్థమైందా పొదగడం అంటే ఏమిటో?’’ అని వివరించింది మా ఆవిడ. మా ఆవిడ తాలూకు కోచింగులోని టీచింగ్ మెలకువలు చూసి కోడి కెలికిన పెంటకుప్పలా అయిపోయింది నా మైండు. కానీ ఆమె చెప్పిన పాఠం మాత్రం బురదలో కోడి కాలి గుర్తులా నా మెదడులో అలా నిలిచిపోయింది. - యాసీన్ -
గొప్పల 'సెల్'ఫీస్...!
హ్యూమర్ ‘‘వేమన ఉన్న రోజుల్లో మేం లేము. ఆయన ఉన్న రోజుల్లో మేం గనక ఉండి ఉంటే...’’ అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది సెల్‌ఫోన్. ‘‘వేమన ఉండి ఉంటే ఏమయ్యేది?’’ అడిగింది ల్యాండ్‌లైన్ హ్యాండ్ సెట్. ‘‘ఏమయ్యేది అని నెమ్మదిగా అడుగుతావేం... ‘చేతిలోన సెల్లు... చెవిలోన హెడ్ఫోను... అరచేత పట్టు ఇంటర్నెట్టు... అందులోనీ ఫేస్‌బుక్‌కు, టాపు రేపు వాట్సాప్పు... చేత సెల్లు లేని బాధ ఇంతింత గాదయా’... అంటూ మమ్మల్ని వర్ణిస్తూ పద్యాలు చెప్పే వాడు. ఇప్పుడు ప్రతివాడూ మా సర్వీస్ తీసుకునే వాడే, మమ్మల్ని తిట్టేవాడే’’ అంది సెల్‌ఫోన్. ‘‘మిమ్మల్ని తిడుతున్నారా... ఎవరూ? ఏమంటున్నారు?’’ అడిగింది హ్యాండ్సెట్. ‘‘మేము వచ్చి మానవ సంబంధాలను మంటగలిపామంట. ప్రతివాళ్లూ మాలోనికి తలదూరుస్తున్నారట. మేం కూడా యథాశక్తి వాళ్ల జీవితాల్లోకి తలదూరుస్తున్నామంట. ఒక్క మాటేమిటీ... పెళ్లిళ్లు కూడా మా ద్వారానే... విడాకులూ మా ద్వారానేనట’’... అంది సెల్‌ఫోన్ బాధగా. ‘‘అరె... ఒక రింగుల రింగుల సంకెళ్ల ద్వారా ఆ ల్యాండ్ఫోన్కి మేం బందీలమయ్యామే. కానీ మీరు అలా కాదు కదా. స్వేచ్ఛగా బహు స్వతంత్రంగా ఉన్నారని మేం మిమ్మల్ని చూస్తూ కుళ్లుకుంటూ ఉన్నామే. మీకు తిట్లు తప్పడం లేదన్నమాట’’ సానుభూతిగా అంది ల్యాండ్‌ఫోన్ హ్యాండ్ సెట్. ‘‘తిట్లా... మామూలుగా కాదు. కర్ణపిశాచి అనీ... అదనీ ఇదనీ. అరె... అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ మాలోనే ఇంతగా తలదాచుకుంటున్నారే...’’ అంటుండగా సెల్‌ఫోన్ మాటల ఫ్లోకి అడ్డుపడింది ల్యాండ్‌ఫోన్. ‘‘తల దాచుకోవడమేమిటి? అసలు తలదాచుకోవడమనే మాటకు అర్థమేమిటో తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి’’ అంటుండగానే రోషంగా తలెత్తింది సెల్‌ఫోన్. ‘‘పెద్ద పెద్ద మాటలేమీ కాదు. ఉన్న వాస్తవమే. ఎవరినైనా పలకరించాల్సి వస్తుందనీ, ఎదుటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని తెలియగానే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాలో తలదాచుకుంటారు. తమ మెదడు తినేసేవాళ్లు అవతలికి పోయారని తెలిసేవరకూ అలా దాచుకున్న తలను మళ్లీ ఎత్తరు. పైగా మేమిప్పుడు మనషులు దారితప్పకుండా చూసే వాళ్ల పాలిటి గైడ్లం కూడా’’ అంది గొప్పగా. ‘‘మీరేంటి గైడ్లేమిటి? ఎందుకలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు’’అంది హ్యాండ్సెట్ అక్కసుగా. ‘‘మేం మనుషుల పాలిటి గైడ్లం అన్న మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ప్రతి కారూ... ప్రతి వాహనమూ తాము దారి తప్పకుండా ఉండటం కోసం మా సహాయం తీసుకుంటున్నారు. తాము వాహనంలో కూర్చుని ఎక్కడున్నదీ... ప్రయాణించాల్సిన రూట్ ఏదీ... ఇవన్నీ తెలిసేలా మాలోనే రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకుని, ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ప్రయాణాలు చేసేవారికి తమ సీటు ఎంత ముఖ్యమో... వాళ్ల గైడ్‌గా మాకూ అంతే ప్రాధాన్యం. డ్రైవింగ్ సీటుకు ఎదురుగా మమ్మల్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ప్రతివాహనంలోనూ మాకో స్టాండు ఏర్పాటు చేస్తున్నారు తెల్సా’’ అంది సెల్‌ఫోను. ‘‘అవును. గతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము తమ హోదాకు చిహ్నంగా మమ్మల్ని భావించేవారు’’ అంటూ ఉండగానే సెల్‌ఫోన్ అడ్డుకుంది. ‘‘ఇప్పుడు మీరు మీ పాత గొప్పల్ని చెప్పుకుంటున్నారే... అప్పుడలా బతికాం అంటూ ఇప్పుడు మీ గత ప్రాభవం గురించి ప్రశంసించుకుంటున్నారు కదా. అలాంటిది ఇప్పుడు మాగురించి పరమ వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు గబుక్కున ‘పొగుడుకోవడం’ అనేశారు మేమెంత హర్టయ్యామో తెలుసా’’ అంది సెల్‌ఫోన్ నిష్ఠూరంగా. ‘‘మేం మోగితే తప్పనిసరిగా మమ్మల్ని ఎత్తుకునే వారు. కానీ మీరు మోగితే ఎదుటివాళ్ల కాల్ తాము తీసుకోనక్కర్లేదని తెలిస్తే ఠక్కున మీ పీక నొక్కేసున్నారు కదా. మాకు అలాంటి అగౌరవాలు ఉండేవి కావు తెలుసా’’ అంటూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకుంది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘నోర్మూసుకోండి. ఇంటర్నెట్తో అనుసంధానమై ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అందిస్తున్న మేమెక్కడ. ఇప్పుడు ఇంటర్‌కమ్ స్థాయికి దిగిపోయిన మీరెక్కడ. ఏదో మా ఆవేదన వెలిబుచ్చుకోవాలనుకుంటే మధ్యన మీ బోడి గొప్పలేమిటి?’’ కోప్పడింది మొబైల్‌ఫోన్. ‘‘ఎంత అందరించిపోయినా డైనోసార్లు డైనోసార్లే... అందుకే ఎంతగా ప్రాచుర్యం పొందినా, ఎంతగా మీమీద మనషులు ఆధరపడ్డా మీరు మీరే. స్టేటస్ సింబల్‌లా మేము మేమే. తమ కుర్చీ కంటే ఎత్తై స్థానంలో పెట్టుకునే మేమెక్కడా... మగాళ్ల జేబుల్లోనూ, ఆడవాళ్ల హ్యాండ్‌బ్యాగుల్లోనూ తలదాచుకునే మీరెక్కడ’’ అంటూ ఈసడించింది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘అంత మిడిసిపడ్డందుకే అంతరించిపోయి డైనోసార్లలా మిగిలారు’’ అంది మొబైల్. ‘‘డైనోసార్‌లో ‘సార్’ అనే మాట ఉంది. సెల్లు అనే మాట సొల్లులా ఉంది. అందుకే పరిమితంగా పనిచేసినామా కాలంలో మేమంటే ఎంతో గొప్ప. మంచి తివాచీ పరిచి మమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకునేవారు. మీరు ఇన్నిన్ని పనులు చేస్తున్నా, డేటూ టైమూ క్యాలెండరూ కెమెరా ఉన్నా మీకు గౌరవం జీరో. పైగా ఏడాదికోసారి కొత్త మోడల్ రాగానే మిమ్మల్ని చెత్త అంటూ పారేస్తారు’’ అంది ల్యాండ్‌లైను ఫోన్. ‘‘చెత్త అయినా, తిట్టుకున్నా సరే... ఇప్పట్లో మేమే మనుషుల చేతి ఆభరణం. మహామహుల తల చుట్టూ చక్రం తిరుగుతున్నట్లుగా... ఫైల్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మాలోనూ అలాంటి చక్రమే తిరుగుతూ ఉంటుంది’’ అంది సెల్. ‘‘అదీ సంగతి. రహస్యం తెలిసిపోయింది. మీకు తలతిరుగుడు ఎక్కువనే సంగతి తెలిసే మనుషులు మీ సేవలు తీసుకుంటూనే మిమ్మల్ని లోకువ కడుతున్నారేమో. అందుకే చేతవెన్నముద్ద పద్యం టైప్‌లో కాకుండా వేమన మిమ్మల్ని చెప్పులో రాయి, చెవిలో జోరిగ టైప్ పద్యం చెబుతాడని మీరన్నది నిజమే’’ అంటూ ‘సెల్’విచ్చింది ల్యాండ్ఫోను. - యాసీన్ -
చెంచాతుర్యం... దాని మహత్యం!
హ్యూమర్ ‘‘ఒరేయ్... చెంచాను కాస్త చిన్న చూపు చూశారేమోనని అనిపిస్తోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు స్పూన్‌తో అన్నం ప్లేట్లో కూర పెట్టుకుంటూ. ‘‘చెంచాకు చిన్నచూపు ఏమిట్రా?’’ అడిగాను నేను అయోమయంగా. ‘‘చెంచాగాడు అనే మాట విన్నావా?’’ అడిగాడు వాడు. ‘‘విన్నాను’’ జవాబిచ్చాను. ‘‘మరి... ఆ మాట తప్పుకదా. నమ్మకమైన సహచరుడినీ, ఎప్పుడూ వెంట వెంట ఉండే అనుచరుణ్ణీ అలా చెంచాతో పోల్చి చెంచాగాడు అని కించపరచడం సరికాదు కదా’’ అన్నాడు వాడు. దాంతో రాంబాబుగాడు చెప్పే మాట కూడా లాజికల్‌గా కరక్టే కదా అనిపించి ‘‘అవును రా’’ అన్నాను. ‘‘అంతేకాదు రా... పాశ్చాత్యులు ఏదో స్పూన్ పట్టుకు తింటుంటారనీ, మనం స్పూన్‌తో తినం అనీ అంటుంటారు గానీ... నిజానికి స్పూన్ కనిపెట్టింది కూడా మనమేరా. విదేశీయులు మన స్పూన్‌ను కిడ్నాప్ చేశారు’’ అన్నాడు వాడు. ‘‘అదేమిట్రా. మనం చేత్తోనే కదా తింటాం. వాళ్లే కదా చెంచాను మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదెలా నిజం?’’ అడిగాను. ‘‘ఒరేయ్... ఉగ్గుపాలతో పెట్టిన విద్య అనే సామెత విన్నావ్ కదా. అంటే మనవాళ్లు పాలు పట్టడానికి ప్రత్యామ్నాయంగా ఉగ్గు కనిపెట్టారు. అలాంటప్పుడు చెంచాను మనం కనిపెట్టినట్టే కదా’’ ‘‘చెంచాకూ, ఉగ్గుకూ సంబంధం ఏమిట్రా?’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... చిన్న ఉగ్గుగిన్నెకు కాస్త పొడవైన కాడ పెట్టామనకో. అది స్పూనే అవుతుంది. అలా మనం కనిపెట్టిన చెంచాను పాశ్చాత్యులు కొట్టేసి, దానికి పేటెంట్ పట్టేశారు. ఉగ్గుపాలు పట్టడం అనే మాటను స్పూన్ ఫీడింగ్ అని వాళ్లు ట్రాన్స్‌లేటింగ్ చేసుకున్నారు. అంతేకాదు. నీలాంటి అమాయకుల చేత దాన్ని తామే కనిపెట్టినట్లుగా అనిపిస్తున్నారు. చూశావా... వాళ్ల అతితెలివితేటలూ!’’ అన్నాడు వాడు. ‘‘నిజమేరా. నువ్వు చెప్పాక తెలుస్తోంది’’ అన్నాను నేను. ‘‘ఆ... కరక్టే కదా. గంటె, గరిటె, చిల్లు గంటె, జల్లిగంటే అనే పెద్ద పెద్ద వాటికే మన వంట ప్రక్రియలో స్థానం ఉన్నప్పుడు... స్పూన్‌ను వాళ్లు కనిపెట్టడానికి ఆస్కారమే లేదు కదా. పైగా పాయసంలో గరిటలా పాడు బతుకు వద్దు అనే సామెత మనకు ఎప్పుడో ఉంది. ఎన్నో రకాల గరిటెలూ, గంటెలూ మన దగ్గర ఉన్నప్పుడు స్పూన్‌ను వాళ్లు కనిపెట్టి, దాన్ని మన దగ్గరకు వాడకంలో తెచ్చి ఉద్ధరించారనడానికి ఆస్కారమే లేదు. మనం ఈ విషయం కనిపెడతామేమోనని, అది వాళ్లదేనని చెప్పడానికి ఇంగ్లిష్‌లో కొన్ని సామెతలు కూడా సృష్టించే కుట్ర చేశారు’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటా కుట్ర?’’ అడిగా. ‘‘నోట్లో వెండి చెంచాతో పుట్టడం అన్న సామెత ఇంగ్లిష్‌లోనే ఉందనీ, దాన్ని మన వారు కాపీ కొట్టారనీ భ్రమింపజేశాడు ఇంగ్లిష్ వాడు’’ అన్నాడు వాడు కోపంగా. ‘‘నిజమేరోయ్’’ అన్నాను. ‘‘అసలు... చెంచా అన్నమాట ఎలా పుట్టిందో తెల్సా నీకు?’’ అడిగాడు. ‘‘తెలియదు రా’’ ‘‘నోట్లో చెంచా పెట్టుకొని అందులో గోలీ పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఆడే ఆట చూశావు కదా. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ గోలీ కిందపడిపోతుంది. అది ‘చంచలమైనది’ అంటూ చెబుతూ ముందు రెండక్షరాలనూ తీసుకొని చెంచా అనే మాటను సృష్టించారురా మన తెలుగువాళ్లు. అలా చెంచా అనే మాట పుట్టిందన్నమాట. అంతేకాదు... పొడవు, బరువు, టైమ్‌లకు ఫిజిక్స్‌లో లెంగ్త్, మాస్, టైమ్ అనే ప్రధానమైన డైమన్షన్లు ఉన్నట్లే స్పూన్కు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాల్రా! ఈ విషయం చెంచా అనే కొలతకు తగిన స్థానం కలిగించమంటూ వరల్డ్ ఫిజిక్స్ అసోసియేషన్ వారికీ, సైంటిస్టులకూ ఓ విజ్ఞాపన ఇద్దామని అనుకుంటున్నా’’ అన్నాడు వాడు. ‘‘అదెలా... లెంగ్త్, మాస్, టైమ్... ఈ మూడే కదా ప్రధానమైన అంశాలు. చెంచాకూ వాటికీ సంబంధం ఏముంది’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... పొడవు, పదార్థమూ, సమయాలలాగే చెంచా కూడా ప్రత్యేకమైన కొలతే! అందుకే ఫలానా మందు ఎంత తీసుకోవాలి అని అడిగితే ఒక టీ స్పూను తీసుకోవాలంటారు. అలాగే వంటలో ఫలానా దినుసు ఎంత వాడాలంటే ఒక టేబుల్ స్పూన్ అంటారు. మరి అలాంటప్పుడు అది కూడా ఒక యూనిట్టే కదా. ఆలోచించు’’ అన్నాడు వాడు. ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘సరే రా. నువ్వు లెటర్ రాయి. దానికి అవసరమైన స్టాంపులు నేను అంటిస్తాను’’ అన్నాను వాడితో. ‘‘నువ్వురా నాకు అసలు సిసలైన చెంచాగాడివి’’ అంటూ ప్రశంసించాడు వాడు. - యాసీన్ -
కోడి కూత... రాంబాబు మేత!
హ్యూమర్ ‘‘ఆహా... ఆ గారెలను చూశావా... వాటిని చూస్తుంటే గుండ్రటి నూనె స్విమ్మింగ్‌పూల్‌లో ఈదుతున్న గజ ఈతగాడు ఫెల్ప్స్‌కు తాతల్లా అనిపించడం లేదూ?’’ అన్నాడు మా రాంబాబు గాడు బజ్జీల బండి దగ్గర మూకుడులో వేగుతున్న గారెలను చూస్తూ. నేను జవాబిచ్చేలోగా మళ్లీ వాడే అందుకొని... ‘‘ఒలింపిక్స్‌లో మనకు పతకాలూ అవీ రాకపోతేనేం...! చూశావా..? బాగా వేగి గోల్డ్ కలర్లోకి మారిన ఆ గారెలను చూడు. వాటిని చూస్తుంటే మూకుడు నిండా కళకళలాడుతున్న బంగారు పతకాల్లాగే లేవూ?’’ అన్నాడు వాడు. ‘‘అవున్రా’’ అన్నాను నేను. వాడు పెట్టించిన గారెలు తింటూ వాడితో ఏకీభవించకపోతే బాగుండదని మొహమాటంగా ఏదో అన్నాను. ‘‘అయితే... గారెలకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. గారెలకు ఉన్న మంచి పేరు దెబ్బతీయడానికి ఒక వ్యవస్థే పనిచేస్తోంది రా. గారెలకు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. గారెలకు జరుగుతున్న ఈ అన్యాయానికి కుమిలిపోతున్నానురా’’ అన్నాడు రాంబాబు. రోజూ సాయంత్రం కాగానే బజ్జీల బండి వాడి దగ్గరికి వెళ్తుంటాడు వాడు. ఇవ్వాళ నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడ ప్లేట్లో నిండుగా గారెలు తింటూ మొదట తన్మయత్వంలో మునిగిపోయాడు. అంతలోనే తన తన్మయత్వాన్ని భగ్నం చేసుకొని అకస్మాత్తుగా ఆ మాట చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. ‘‘ఎవరురా? గారెలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదెవరు?’’ అడిగాను నేను. ‘‘ఇంకెవరూ డాక్టర్లు. ఎందుకో డాక్టరంతా మూకుమ్మడిగా గారెలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ప్రతి సలహాలోనూ మసలుతున్న నూనెలో వేగినవి తినవద్దని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మొత్తం వైద్యవర్గాలన్నీ గారెలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఉంది’’ అన్నాడు వాడు. ‘‘పండగలు పబ్బాలు వస్తే చేసుకునే వంటకాల్లో గారెలే ముఖ్యమైనవి. డాక్టర్లు కూడా బహుశా గారెలు తింటూనే ఉంటారు. అలాంటప్పుడు వాటికి వ్యతిరేకంగా డాక్టర్లు కుట్ర పన్నుతున్నారని ఎలా అంటావు? ఒకవేళ చేసినా ఆ కుట్ర ఎందుకు నిలుస్తుంది?’’ అడిగా. ‘‘లేదురా. మనలాంటి గారె అభిమానుల మనోభావాలను డాక్టర్లు మాటిమాటికీ గాయపరుస్తున్నారు. అంతేకాదు అనేక మంది గారె కార్మికుల ఉపాధిని కూడా వాళ్లు దెబ్బతీస్తున్నారు. ఇదే డాక్టర్లు చేస్తున్న కుట్ర. వాళ్లు మాటిమాటికీ నూనెలో వేయించేవాటిని తినవద్దని చెబుతున్నారు కదా! తద్వారా పరోక్షంగా గారెలనూ తినవద్దని డాక్టర్లు చెబుతున్నట్లే కదా’’ లాజిక్ లాగాడు వాడు. ‘‘ఒరేయ్... మిరపకాయ బజ్జీలు, బోండాలూ, గారెలూ... ఇవన్నీ నూనెలో వేయించేవే. ప్రత్యేకంగా గారెల మీదే కుట్ర పన్నుతున్నారని నువ్వెలా అంటావ్’’ అడిగాను వాణ్ణి. ‘‘మిరపకాయ బజ్జీలే అనుకో. శనగపిండి వల్ల కొద్దిగా తినగానే కడుపు ఉబ్బినట్టు అవుతుంది. దాంతో ఒకటి రెండు కంటే ఎక్కువగా ఎవ్వడూ తినలేడు. ఇక బోండాలంటావా? అంతగా నైపుణ్యం లేకపోతే పైన ఒక లేయర్ వేగి ఉంటుంది. లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. గారెలనుకో... బల్లపరుపుగా ఉంటాయ్ కాబట్టి అన్నివైపులా సమానంగా కాల్తాయి. అందుకే మిర్చి బజ్జీల బండి మీద ఉన్న అన్నిటికంటే గారెలే బెస్టు. బజ్జీల బండి అని పేరు మాత్రమే వాటిది. రాజ్యమంతా గారెలదే. పైగా మహాభారతంతో పోలిక మరి దేనికైనా ఉందా? బజ్జీలకుందా? బొండాలకుందా? అందుకే ఎవరెన్ని కుట్ర చేసినా సరే... గారెల మనుగడ ఖాయం. పొద్దు కుంగడానికి ఆకాశం... పిండిలో చిల్లు పొడవడానికి మనిషికి వేలు... ఈ రెండూ ఉన్నంత కాలం ఈ సమాజంలో గారెలు ఇలా విలసిల్లుతుంటాయని నా నమ్మకంరా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘చిల్లుగారెలో పొడవడానికి వేలు ఉన్నంత కాలం గారెలు ఉంటాయన్నావు. అది ఓకే. కానీ పొద్దు పొడవడానికీ... గారెలకూ సంబంధం ఏముంది?’’ అడిగాను. ‘‘పొద్దు కుంగగానే... అనగా సాయంత్రం కాగానే ఎంత పెద్దవాడినైనా అలా బజ్జీల బండి వద్దకు నడిపిస్తుంటాయి గారెలు. పొద్దుపొడుస్తూ ఉండగా కోడికి కూయాలనిపించినట్టుగానే, రోజూ సాయంత్రం అవుతూ ఉండగా... అంటే పొద్దు గుంకుతూ ఉండగానే గారెలు తినాలపిస్తుందిరా. కాళ్లు ఆటోమేటిగ్గా మిర్చిబజ్జీల బండి వైపుకు తిరుగుతున్నాయి. దీంతో నాకు ఒక విషయం అర్థమైంది’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటి?’’ ‘‘ఏం లేదురా... కోడికి కూత... నాకు మేత... ఒక నేచురల్ ఇన్స్టింక్ట్రా. కోళ్లు కూస్తున్నంత కాలం ఇలా నేను గారెలూ మేస్తూనే ఉంటా. అలా గారెలు తింటూనే కన్నుమూస్తా’’ అన్నాడు వాడు. - యాసీన్ -
యురేకా - కాకీక...!
హ్యూమర్ నేను జుట్టుకు రంగేసుకుంటూ ఉండగా కొత్త ఐడియా చెబుతానంటూ ఠక్కున ఎంట్రీ ఇచ్చాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వన్నీ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటావ్రా. ఒరేయ్... మొన్నట్లా మాట్లాడకు’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘మొన్న అన్న మాటలు కూడా కరక్టే కదా’’ అన్నాడు వాడు. రాంబాబుగాడు ఆరోజు చెప్పినవి ఒకసారి తలచుకున్నా. ఇంతకూ వాడన్న మాట ఏమిటో చెబుతా వినండి. ‘ఆవు... పులి’ కథ తెలుసు కదా. అందులో పులికి తాను ఆహారంగా దొరికిపోయాక ఒకసారి తన బిడ్డను కలిసి వస్తానంటుంది కదా. చివరిసారిగా దూడకు పాలు పట్టించి బుద్ధులు చెబుతుంది కదా. అలా మాటమీద నిలబడ్డ కారణం వల్ల ఆవుకు ఆ ప్రఖ్యాతి రాలేదట. ఆవుకు ప్రశస్తి కలిగిన కారణం వేరట. ‘‘ఏంట్రా ఆ కారణం?’’ ఆసక్తిని చంపుకోలేక అడిగా. నిజానికి ఆ కథ రాసిన వ్యక్తి ఒక డాక్టర్ అట. అందునా క్యాన్సర్ స్పెషలిస్టు అట. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ కథ రాశాట్ట. ఆవు వెళ్లి తన బిడ్డకు పాలు పట్టించి వచ్చింది. కాబట్టి పులి-గిలీ లాంటివి ఏమీ చేయలేకపోయాయని చెప్పాడు. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పులి రూపంలో ప్రత్యక్షమైందని కూడా వాడు వాక్రుచ్చాడు. ఆవు కాస్తా బిడ్డకు రొమ్ముపాలు పట్టించడంతో క్యాన్సర్ అనే ఆ పులి కాస్తా పిల్లిగా మారిపోయిందనీ, అది కాలుగాలినట్టుగా ఆవుచుట్టూ కాసేపు పచార్లు చేయడం తప్ప మరేమీ చేయలేకపోయిందని వాడి రహస్య పరిశోధనల్లో తేలిందట. వాడి ఆ పరిశోధన గాథను నాకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ కథ రాసిన వాడు అలనాటి ఆంకాలజిస్టు అనే గుట్టు కూడా విప్పాడు. కాకపోతే పరిశోధన ఫలితంలా చెబితే అందరూ అంతగా పట్టించుకోరట. అందుకే ‘డావిన్సీ కోడ్’లా ఆ రహస్య సమాచారాన్నంతా బయటకు ఒక నీతి కథలా కనిపించేలా రాశాట్ట. అదీ వాడు చెప్పిన మాట. ‘‘మొన్నటి నా పరిశోధనల్లో కొత్త సంగతి మనం కనిపెట్టడం తప్ప మనకు డెరైక్టుగా ఉపయోగ పడేది ఏమీ లేదు. కాకపోతే ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు’’ అన్నాడు. కోటీశ్వరులం కావచ్చనే మాటతో నేను కాస్త టెంప్ట్ అయ్యాను. ‘‘ఏంట్రా?...’’ అడిగాను నేను రంగేసుకోవడం ఆపకుండానే. ‘‘ఇలా వారానికి ఒకసారి కష్టపడి రంగేసుకునే బదులు... కాకి ఈకలకు ఆ రంగు ఎలా వస్తుందో తెలుసుకొమ్మని మనం రహస్యంగా సైంటిస్టులకు చెప్పాల్రా. సేమ్ టు సేమ్ రంగు వెంట్రుకలకూ వచ్చేలా చూస్తే చాలు. ఇలా మాటిమాటికీ రంగేసుకోనక్కర్లేదు. ఒకసారి ఆ పదార్థం జుట్టులోకి వెళ్లేలా చేస్తే చాలు... కాకి రంగు ఎప్పటికీ మారనట్టే... జుట్టుకూ రంగు మారదు. మొన్న మన వేప చెట్టు మీద కాకి వాలగానే నా బుర్రలోకి ఈ ఐడియా వాలిందిరా. వెంటనే యురేకా-కాకీక అనుకున్నా’’ అన్నాడు వాడు. ‘‘పక్షి ఈకలు వేరు... మనుషుల జుట్టు వేరు’’ అన్నాను నేను. ‘‘ఏం కాదు... మనుషుల్లో జుట్టు, గోళ్లూ... పక్షుల్లో ఈకలూ ఒకే పదార్థంతో తయారవుతాయట. దాని పేరు కెరటిన్ అట’’ అన్నాడు వాడు. ‘‘అయితే...?’’ ‘‘ఏముందిరా... అన్నీ ఒకే రకం పదార్థంతో తయారవుతున్నప్పుడు కొంగకు మాత్రం తెల్లరంగు ఉండి కాకి ఈకల్లోకి ఆ నల్లరంగు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే రంగు నీ జుట్టుకూ వచ్చేలా చేసేయాలి. కాకి ఈక ఫార్ములా తెలుసుకొని ఆ పేటెంట్‌ను మన పేరు మీద రాయించుకుంటే చాలురా... ఇక మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. వాడిచ్చిన ఐడియాను కాస్త సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాను. మనకు నమ్మకమైన సైంటిస్టుకు ఎవరికైనా చెప్పి కాస్త పరిశోధన చేయించాలనీ... సక్సెస్ అయ్యాక ఫార్ములా అమ్ముకుని ఆ సైంటిస్టూ, మేమిద్దరమూ వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా కాస్త డబ్బు చేసుకుందామనుకున్నాం. భార్య దగ్గర రహస్యాలేవీ దాచకూడదన్న ప్రిన్సిపుల్ కొద్దీ నేను ఈ ఆలోచన చెప్పగానే సదరు ఐడియా మీద చన్నీళ్లు చల్లేసిందామె. ‘‘బట్టతలల వాళ్లెవ్వరూ మీ ఐడియాను కొనరు. కాకి మీద ఇంత పరిశోధన చేసే బదులు... రాబందు బట్టతల మీద జుట్టు మొలిచే మార్గం కనిపెడితే బెటరు కదా. దాంతో మరింత డబ్బే డబ్బు కదా’’ అంది మా ఆవిడ. - యాసీన్ -
సీటే బంగారమాయెనా...
హ్యూమర్ కాస్త డబ్బుంటే కష్టపడి ఎలాగోలా కిందా మీదా పడి ఏదో పార్టీలో ఓ ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు గానీ మన హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో సీటు సంపాదించుకోవడం మాత్రం అంతకన్నా కష్టం. అది బస్సెక్కి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప చెబితే అతిశయోక్తే అంటారు. రోజూ రెండు పూటలా సిటీ బస్సెక్కితే ’బతుకు జట్కా బండి కాదనీ, గుట్కా పొడి అనీ, కిలోమీటర్ చొప్పున మనల్ని తొలిచేస్తుందనీ’ తెల్సుకుంటాం. నా పేరు ముఖేష్, నేను ఒక్కసారే బస్సెక్కాను, మళ్లీ నగరంలో బస్సు ప్రయాణం చేస్తానని నమ్మకం లేదు అంటూ థియేటర్లో స్లైడులు వేసుకోవాల్సిందే. రామదాసు గనుక సిటీ బస్సు ఎక్కితే ’సీటే బంగార మాయెనా కోదండపాణి’ అని ప్రార్థించక మానడు. ఎక్కాల్సిన బస్సువైపు చూస్తే.. దాంట్లో ’దండయాత్ర ఇది దయా గాడి దండయాత్రా’ అంటూ చాలా మంది ఎన్టీఆర్ లు టెంపర్ మీదుంటారు. ‘ఈ బస్సు మనందరిదీ’ అనే స్లోగన్ బాగా నచ్చిన కాలేజీ కుర్రాళ్లు ఫుట్ బోర్డుపై గబ్బిలాల్లా వేలాడుతుంటారు. ’సెన్సిటివ్’ జీవులం గనుక ఆ ఫీట్లు చేయలేక.. జనాల్ని తోసుకుంటూ, జీవితంలో అసలు సిసలు సంఘర్షణ అంటే ఏంటో తెల్సుకుంటూ, బస్సు మధ్యలోకి చేరిపోతాం. అలా వెళ్లే క్రమంలో తోటివాళ్లు మన కాళ్లు ఇంట్లో చపాతీ పిండిలా మెత్తగా తొక్కే ప్రక్రియ పాక్షికంగా పూర్తవుతుంది. (మళ్లీ దిగేప్పుడు సంపూర్ణమవుతుందనుకోండి). ఆశతో ఒక సీటు పక్కన నిల్చుంటాం..అతను వచ్చే స్టాప్ లోనే లేచి వెళ్లిపోతాడని మన ప్రిడిక్షన్. అయితే ఎన్టీఆర్ గార్డెన్ బయట చిలక జ్యోతిష్కులు చెప్పేవాటిలాగే ఇదీ జరగదు. అతనిది బస్సుతో విడిపోనిబంధమైనట్లు చివరి స్జేజీ వరకు దిగడు. ఈలోపు మీ తల ’సాధ్యమైనంత’ తిప్పితే కనబడే సీట్లలో కొందరు బిలబిలమంటూ దిగిపోతుంటారు. కొందరు నిరాశావాదులకు ఆ ఉచితాసనం దక్కుతుంది. ఇక వాళ్ల దర్జా మాటల్లో చెప్పలేం. అదృష్టాన్ని టిఫిన్ లో పెట్టుకుని బస్సెక్కిన ఆ ’సీటు రాజాలు’ వెంటనే ెహ డ్ ఫోన్స్ తీసి, పాటలు వింటూ, లయబద్దంగా తలూపుతుంటారు. ఆ ఊపుడుకి ’నో వేకెన్సీ’ వాళ్లందరికీ కడుపు మండుతుంటుంది. మా ఆఫీసులో ‘సార్’లా ఓరీ దురహంకారీ అనాలనిపిస్తుంది. మన పక్కసీట్లో కూర్చున్న పుణ్యపురుషుడు మాత్రం ఇంచు కదలడే. ఇక వీడు దిగడు అని విసిగిపోయి మన ఆశను వెనుక సీటు పక్కకి మార్చుకున్నామనుకో, ఇంతసేపూ మనం ఆశలు పెట్టుకున్న వాడు ఆకాశవాణి పిలిచినట్లు సడెన్ గా దిగిపోతాడు. ఈ అవకాశంతో అప్పటిదాకా ఆ సీట్లో సర్దుకుని కూర్చున్న మరో ఇద్దరు కులాసాగా కూర్చోవడమో, మరో కొత్త అతిథి వాళ్ల గూటికి చేరడమో జరుగుతుంటుంది. ఈ ’కిరణజన్య సంయోగ క్రియ’ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఆశ- నిరాశ తెలుగు పాఠం లీలగా గుర్తుకొస్తుంది. మన రెండో ఆప్షన్ లేడీస్ రిజర్వేషన్ సీట్లపైకి వెళ్లినా.. అదృష్టదేవత మన వెంట ఉంటే తప్ప కూర్చోలేం. ఈ లోపు ఏ ఇంజినీరింగ్ సైన్స్ దేవ తనో వచ్చి ఇది లేడీస్ సీటుఅందనుకో.. సీటు వేటుతో పాటు అవమాన పోటూ తప్పదు. మనం వదిలేసిన మహిళా రిజర్వేషన్ సీట్లలో ఎవడో సభ్యత మరిచి ‘సిగ్గు’ లేకుండా కూర్చుంటాడు. ’మహిళలను గౌరవించడం మన విధి... వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం’ అన్న సుభాషితాలు తలపైనే రాసి ఉన్నా వాడికి పేనుకుట్టినట్లయినా ఉండదు. అలాంటి అసభ్యుడు కూర్చున్నప్పుడు మాత్రం ఏ దేవకన్యా ఆ సీటు వైపు కన్నెత్తి చూడదు. బహుశా ఆఫీసులో పొద్దంతా కూర్చున్నాం కదా కాసేపు నిల్చుందాం అని డిఫరెంట్ గా ఆలోచిస్తుందేమో. మన కా కనికరం దక్కదెందుకో. పోనీ, సిగ్గూ బిడియం విడిచిపెట్టి, స్వార్థం బుసలు కొట్టి .. ఆ సీట్లలో మనం కూర్చున్నామనుకో... ఏదో అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేస్తున్నామని లోపలి మనిషి అరుస్తూనే ఉంటాడు. లేవరా.. అంటూ పెదరాయుడులో రజినీకాంత్ లా గద్దిస్తుంటాడు. ఈ లోపలి సంఘర్షణ తో పాటు, ఎవరైనా లేడీస్ వస్తారేమో అని క్షణక్షణం భయం భయంగా హార్రర్ సినిమా చూస్తున్నట్లు కూర్చోవాల్సి వస్తుంది. ఇంత హెడ్ పెయిన్ తో కూర్చోడం కంటే... లెగ్ పెయిన్ తో నిల్చోవడం బెటరనిపిస్తుంది. అతి అరుదుగా ఎవరైనా బ్యూటిఫుల్ గర్ల్ కాస్త జరుగుతారా కూర్చుంటా.. అందనుకో, ఇక నువ్వు కూర్చునేది సీటుకి ఐదించుల పైనే గానీ సీట్లో కాదు. ఇదే కాదు.. బస్సు ఎక్కాలన్నా ఆశనిరాశే.. (మన ఫేట్ తిరగబడినట్లే) 9 నెంబరు కోసం కోసం చూస్తే 6 వెళ్లిపోతుంటుంది. మనవి కాని బస్సులు కదులుతూ, అమూల్యమైన సాయం సమయం కరుగుతూ, ఎన్నో ’హోప్స్’ పెట్టుకున్న ఇంటినుంచి ‘ఎక్కడ లక్కీ’ అంటూ ఫోన్ లో మెసేజ్ లు ఫ్లాష్ అవుతూంటే, ’కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం’ అంటూ మహాప్రస్థానంలో శ్రీ శ్రీ నా కోసమే పాట రాశాడా అనిపిస్తుంది. - రమేష్ గోపిశెట్టి -
ఇడ్లీ - దోశ ఒక తులనాత్మక పరిశీలన - అవగాహన!
హ్యూమర్ ‘‘ఇడ్లీ, దోశలలో ఏది ఉత్తమమైంది స్వామీ’’ అని అడిగా మా గురువు గారిని. ‘‘నాయనా తుచ్ఛులైన వారు ఏది ఉత్తమమైనదీ అని అడుగుతారు. నువ్వు వెలిబుచ్చే ఇలాంటి పనికిమాలిన సందేహాలతో పొద్దుపుచ్చుతారు. కానీ తెలివైన వాళ్లు ఏది దొరికితే అది తినేస్తారు. అంతే తప్ప ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడగరు నాయనా’’ అని సెలవిచ్చారు స్వామీజీ. అయినా నేను పట్టు వీడలేదు. ‘‘ఒకసారి ప్రశ్న కోసం పట్టుపట్టాక వదలకూడదని మీరే అన్నారు కదా స్వామీ. నా ప్రశ్న తర్క, మీమాంస శాస్త్రానికి సంబంధించిందని మీరెందుకు అనుకోకూడదు?’’ నేను మళ్లీ రెట్టించాను. ‘‘సరే విను. చిన్న గిన్నెతో పిండిని పెనం మీద వేశాక దోశ కావడానికి ఆ చిన్న గిన్నెతోనే దానిపై ఒత్తిడి పెడతారు. అది పెనం మీద పరుచుకునేలా విస్తరించడానికి దాని తలమీద రుద్దేస్తారు. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్లను రుబ్బుతుండటం సరికాదని నువ్వు నీ స్పీచుల్లో చెబుతుంటావు చూడు. వాళ్ల లాగే దోశ మీద కూడా అలా రుద్దడం సరికాదు నాయనా. అలా రుద్దినప్పుడు ఏమవుతుందో తెల్సా?’’ అడిగారు స్వామీజీ ‘‘ఏమవుతుంది స్వామీ...?’’ అడిగాను నేను. ‘‘దోశల్లా కార్పొరేట్ పిల్లల్లా ఎదగకుండా ఉండిపోతారు. కానీ ఇడ్లీ అలా కాదు. మెదడు వికాసం జరిగినట్లే ఇడ్లీ కూడా పొంగుతుంది. పిండి రేణువుకూ, పిండి రేణువుకూ మధ్య ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దోశ ముక్కలను ఎప్పుడైనా సాంబారులో వేశావా? ఏదో దోశతో పాటు స్పూనుతో తాగడానికి సాంబారు సరిపోతుంది గానీ... దోశముక్కలు సాంబారు అంత తేలిగ్గా పీల్చవు. అచ్చం నీ ఉపన్యాసాల్లో మన కార్పొరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లాగే. వారూ అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాలను గానీ... లోకజ్ఞానాన్నిగానీ అబ్జార్బ్ చేసుకోలేరు...’’ అంటుండగానే నేను మధ్యలోనే అడ్డుపడ్డాను. ‘‘అంటే... ఇడ్లీ పీల్చుకుంటుందా స్వామీ’’ ‘‘తప్పకుండా నాయనా... మంచి నిపుణులైన వంట చేసేవాళ్లు పిండి కలిపారనుకో. ఆ రవ్వా... ఆ మినప్పప్పు సమపాళ్లలో కలిశాయనుకో. ఇడ్లీలోని పిండికి మధ్య ఎంతెంతో పఫ్పీ స్పేస్ ఉంటుంది. ఆ మధ్యనున్న స్థలంలో సాంబారు దూరిపోతుంది. సాంబారులో నానిన ఆ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నాయనా’’ చెబుతున్నారు స్వామీజీ. ‘‘నిజమే కదా స్వామీ’’ బదులిచ్చాను నేను. ‘‘అంతేకాదు నాయనా... జనం పెరిగారు. జనాభా పెరిగింది. వాళ్లకు తగ్గట్లుగా ఇళ్లు కూడా కావాలి కదా’’ అన్నారు స్వామీజీ. ‘‘అవును కదా. మరి దానికీ ఇడ్లీకీ సంబంధమేమిటి స్వామీ?’’ అడిగాను. ‘‘అదే నాయనా నాలాంటి జ్ఞానులకూ, నీకూ తేడా. ఇడ్లీ పాత్రలో గతంలో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. పాత్రపెద్దదవుతూ ఉండేదీ... దానిలోని పిండి పోసే చిప్పలు పెరిగేవి. కానీ... డూప్లెక్సు భవనంలా ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండేవి. కానీ ఇప్పుడు మాడ్రన్ ఇడ్లీ పాత్రను ఎప్పుడైనా హోటల్లో చూడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ర్యాకులనూ, డెస్కులనూ బయటకు లాగినట్లుగా వాటిని లాగుతుంటారు’’ అని జవాబిచ్చారు స్వామీ. ‘‘అవును స్వామీ... ఇడ్లీ పాత్రకూ, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లకూ అంత దగ్గరి సంబంధం ఉంటుందనుకోలేదు’’ అన్నాన్నేను. ‘‘అంతేకాదు... దోశ కంటే ఇడ్లీ ఎన్ని రకాలుగా ఉత్తమమో చెబుతాను ఆగు. ఉదాహరణకు మసాలా దోశ తిన్నావనుకో. అందులో మసాలా పేరిట ఉండే పదార్థం నీకు సరిపడకపోవచ్చు. కడుపులో మంట పుట్టించవచ్చు. దోశకు అది తెచ్చిపెట్టుకున్న టేస్టు. కానీ ఇడ్లీలో అలా కాదు నాయనా... మసాలాలూ, గిసాలాలూ ఏవీ లేకుండా... కేవలం ఇడ్లీ వల్లనే ఇడ్లీకి రుచి వస్తుంది. ఏదీ తెచ్చిపెట్టుకోనిదో, ఏది స్వాభావికమైనదో ఆ టేస్టు గొప్పది నాయనా’’ అన్నారు స్వామీజీ. ‘‘అయినా అరిషడ్వర్గాలనూ జయించిన మీలాంటి స్వామీజీలు రుచుల గురించి ఇంత విపులమైన వర్ణనలేమిటి స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘పిచ్చివాడా... ఇడ్లీ అంటే ఏమిటి? సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం నాయనా. సాంబారు ఇడ్లీలోకి ఎలా ఇంకిపోతుందో తెలుసా? అచ్చం జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లే! మాలాంటి జ్ఞానులకు ఇవన్నీ తెలుసు. కానీ తిండిబోతులైన నీలాంటి తుచ్ఛులకు అర్థమయ్యేలా చెప్పడమెలా? అయినా నువ్వే చెప్పావు కదా. తర్క మీమాంస శాస్త్రాలు నీబోటి సామాన్యులకు కూడా అర్థం కావడం కోసమే నాయనా ఈ ఉదాహరణలు’’ అని సెలవిచ్చారు స్వామీజీ. నాకు జ్ఞానోదయమైంది. అనంతాకాశం అనే సాంబారు ప్లేటులో అర్ధచంద్రుడు ఇడ్లీలా దర్శనమిచ్చాడు! - యాసీన్ -
నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా...
International JOKES DAY 1st July నవ్వితే హ్యాపీ...నవ్వకపోతే బీపీ...నవ్వనివాడు పాపి..!...నవ్వడం తేలికే కానీ.. నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి నైపుణ్యం ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండి ఉండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే మన విశాఖలో కమెడియన్స్ ఎందరో ఉన్నారు. నవ్వునే వృత్తి, ప్రవృత్తిగా తీసుకొని హాస్యగుళికల్ని అందిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటులు వెండితెరపై నవ్వులు కురిపిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కొందరు మనమధ్యలేకపోయినా వారి పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి. అయితే..ఓకే.. - కొండవలస ఉత్తరాంధ్ర మాండలికంతో తనదైన యాసతో సినీ లోకాన్ని నవ్వించారు హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు. మనలో లేకపోయినా ఆయన కామెడీ డైలాగులు నేటికి కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వెయ్యి నాటకాల్లో నటించి, రెండు రంగస్థల నందీ అవార్డులను తీసుకున్న కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’చిత్రంతో పొట్రాజు పాత్రలో కొండవలస నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నేనొప్పుకోను..ఐతే ఒకే..అనే ఊత పదంతో తెరంగేట్రం చేసి నవ్వుల్ని పంచుతూ స్టార్ కామెడియన్‌గా మారిపోయాడు. ‘ఇండియన్ గ్యాస్’ అనే నాటకంలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలికారు. ఆ విధానం అప్పట్లో అందరికీ నచ్చింది. అదే తీరును ఆయన సినిమాలో తన పాత్రలకు అన్వయించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. భౌతికంగా ఆయన లేకపోయినా, కొండవలస చేసిన పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి. ప్రేక్షకుల ‘వేలు’ విడవని నటుడు ఒక పాత్ర ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహరావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెండంత లేవు? ఏమిటీ అల్లరి? అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్లు పేలవడంతో‘వేలు’అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన. ఆకారానికి అంగికాభినయ ప్రతిభతోడై, దర్శక రచయిత జంధ్యాల విశాఖలో రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’చిత్రంలోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’వీరభద్రరావుతో కలసి సుత్తి జంటగా 1980-90లలో సినీసీమను కొన్నేళ్ల ఏలారు. కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో పుట్టిన సుత్తివేలు ఉద్యోగ రీత్యా విశాఖలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిచినా ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో స్టోర్‌కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా తొలినాళ్లలో విశాఖలో చిత్రీకరించిన ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్తంభాలాట’నాటి ‘సుత్తివేలు’ జోరందుకుంది. నాలుగు స్తంభాలాట,ప్రతిఘటన, వందేమాతరం, ఈ పిల్లకు పెళ్లవుతుందా? ఈ చదువులు మాకొద్దు., ఒసేయ్ రాములమ్మలో రాములమ్మ తండ్రి పాత్రగా ఇలా క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యభరితమైన పాత్రలు పొషించారు. రెండు జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, రెండురెళ్లు ఆరు, సీతారామ కల్యాణం, చంటబ్బాయ్ లాంటి సినిమాలు చూస్తే తెలుగుతెరను ఆయన నవ్వులతో ముంచెత్తిన సీన్లే కనిపిస్తాయి. నవ్వులరేడు...చిదంబరం... తెరపై అతని ఆహార్యం చూస్తే చాలు పొట్ట చెక్కలవుతోంది. ఆయన స్వరం వింటే చాలు ప్రేక్షకుని ముఖం నవ్వు పులుముకుంటుంది. వెండితెరపై చేసేది చిన్నపాత్రయినా..వాస్తవాల్ని ప్రతిబింబించే సంఘటనలు. అందుకే ఆయన హాస్యగుళికలు తెలుగు తెరపై ఓలలాడించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు కళ్లు (కల్లూరి)చిదంబరం నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల,సినీ హాస్యనటుడు కావడం విశేషం. 300 చిత్రాల్లో నటించారు. ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, కళ్లు, అమ్మోరు, మనీ, గోవిందా గోవిందా, పవిత్ర బంధం, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు కొల్లూరు చిదంబరం. మొట్టమొదట ప్రసిద్ధి దర్శకుడు సత్యానంద్, మిశ్రో తదితరుల బృందాలతో నాటకాలు వేసేవారు. తనకు తెలిసిన హాస్యరసంతో సినీ ప్రేక్షకులను రంజింప చేశారు. తెరపై కనిపించగానే ఆయన్ని ఎలాంటి వారైనా గుర్తుపట్టేస్తారు. దానికి ఆయన రూపం స్వరం కారణం. ‘షర్టు మీద టీ పడితే?’..టీ-షర్ట్ అవుతుంది : నాన్‌స్టాప్ కామెడీ కింగ్ రంగారావు లిమ్కా రికార్డుల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన నగరానికి చెందిన ప్రముఖ లాఫర్స్ ఫన్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు ఒక్క నిమిషంలో 37 నవ్వులు పండించిన ప్రతిభావంతుడు. మచ్చుకు కొన్ని..‘మీ హోటల్లో వేడిగా ఏమున్నాయ్..’?/ బొగ్గులు, సబ్బులెన్నునా..?/నురుగొక్కటే,‘ నీకు ఏ పుస్తకం ఇష్టం..’/ చెక్పుస్తకం, ‘ఏ జూలోను కనబడని జంతువు’/అడ్డగాడిద...ఇలా నాన్‌స్టాప్ జోక్స్‌తో ప్రేక్షకుల్ని కడుబ్బా నవ్విస్తూ అత్యధిక జోకులు చెప్పి లిమ్కా రికార్డులో కొత్త రికార్డు సృష్టించారు. పది గంటలు ఏకబిగిన సుమారు 40 వైవిధ్యమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తూ రంగారావు చేసిన నవరసావిష్కారం కట్టిపడేస్తోంది. ఏవర్గాన్నీ నొప్పించని, క్లుప్తమైన కొంటె ప్రశ్న, చిలిపి సమాధానం తరహాలో బుల్లెట్ ట్రైన్ వేగంతో ఒక నిమిషం జోకుల పర్వం దూసుకెళ్లే సామర్థ్యం గల రంగారావు జోకులతో నవ్వులు కురిపిస్తారు. ‘0’ పెడితే ఎంత? అనే ప్రశ్నకు గణిత పరిజ్ఞానంలో 100 అనే బదులు తెలుగు భాషా చమత్కారంతో ‘పంది’ అని చెప్పగానే ఆడిటోరియంలో నవ్వులు విరివక తప్పదు. ఆతర్వాత వరుసగా వంకాయలు ఎలా ఇచ్చావ్? తూచి/ రావణాసురుడు సింగరైతే? కోరస్ అవసరం లేదు/ వాడేంట్రా నవ్వట్లేదు? వాడికి పెళ్లయిందిలే/ నా నవల్లో నీకు నచ్చింది? శుభం/ షర్టుమీద టీ పడితే? టీ-షర్ట్ అవుతుంది వంటి జోకులు డజన్లకొద్దీ నవ్విస్తాయి. కొద్ది సేపు అతిథుల స్పందనల తర్వాత హాస్యమే కాదు నవరసావిష్కారంలోనూ రంగారావు నైపుణ్యాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తికమకపెట్టే క్లయింట్‌తో లాయర్ పడే తిప్పలు ఏకపాత్రాభినయంతో నవరసావిష్కారాలతో శ్రోతులను మంత్రముగ్దుల్ని చేసే శైలి రంగారావుది. హాస్యనిధి-నవ్వుల వారధి 2012లో ప్రముఖ హాస్యరచయిత, నటుడు కాశీ విశ్వనాథ్, కళ్లు చిదంబరంతో ఫ్రెండ్స్ కామెడీ క్లమ్ ప్రారంభించాం. ప్రతినెల మొదటి ఆదివారం హరివిల్లు, వినోదాల విందు పేరిట విశాఖ పౌరగ్రంథాలయంలో ప్రదర్శనలు ఇస్తుంటాం. ప్రతినెల ఒక హాస్య కళాకారుని సన్మానిస్తాం. ఇప్పటి వరకు రెండు వందలకుపైగా ప్రదర్శినిలిచ్చాం. మా క్లబ్ ద్వారా ఏ కళాకారుడికైనా ప్లాట్ఫార్మ ఇస్తుంది. ఔత్సాహిక కళాకారులకు వేదిక కావాలనే మా ఉద్దేశ్యం. క్లబ్లో ఇప్పటి వరకు మూడువందల వరకు సభ్యులుగా చేరారు. మా ఆశయం ప్రేక్షకులు వచ్చి జోక్సు చెప్పి మమ్మల్ని నవ్వించాలన్నదే. హైజాక్, చినుకు, మేస్త్రి, శ్రీశైలం, శుభప్రదం వంటి చిత్రాల్లో నటించాను. హాయిగా ఉన్నప్పుడు నవ్వేవాడు సామాన్యుడు, హాయిగా లేనిప్పుడు నవ్వేవాడు అసామాన్యుడు, హాయిగా లేని వారిని నవ్వించేవాడు మాన్యుడు. ఇది మా క్లబ్ స్లోగన్. ఇప్పటి వరకు హాస్యబ్రహ్మ, నవ్వుల రాజు, ఆణిముత్యం, స్నేహబంధు వంటి అవార్డులు పొందాను. - ఎం.వి.సుబ్రహ్మణ్యం, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు. మంచి ఆటగాడు ‘మంచి ఆటగాడు అని చెపితే ఏ పెద్ద ప్లేయరో అనుకుని పెళ్లి చేసుకున్నా.. తీరా చేసుకున్న తరువాత తెలిసింది’’ విచారంగా అంది సుమలత. ‘ఏమైంది? మరి ?? ఆటగాడు కాదా అతడు’ అడిగింది శ్రీదేవి. ‘ఆటగాడే..తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడట పల్లెటూర్లలో...’ -ఏడ్చింది సుమలత. హల్లో ...ఎఫ్....ఎం... రేడియో అండీ... అవునండీ.. ఎంవీపీలో పర్సు, పర్సులో రూ.15వేలు దొరికాయి. అప్పలరాజు, వాల్తేర్ అని అడ్రస్రాసి ఉంది.. మీ నిజాయతీకి సంతోషం...ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు? అప్పలరాజు కోసం ఓ విషాద గీతం వేస్తారేమోనని... ఆ..ఆ.. ఒక భర్త తన భార్యకు ఇలా ఎస్ఎంఎస్ చేశాడు నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వే నా దేవతవి. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. నువ్వు చాలా మంచిదానివి. భర్త పంపిన ఎస్ఎంఎస్ చదివి భార్య ఇలా రిప్లై ఇచ్చింది తాగడం అయిందా, ఇంక ఎస్ఎంఎస్లు ఆపు, ఇంటికి రా..భయపడకు..నిన్నేమీ అనను. ఇది చదివిన భర్త : థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్నా. దయచేసి తలుపు తియ్.! హెదరాబాద్- విశాఖపట్నం.. బస్ ఎక్కిన బామ్మ డ్రైవర్‌తో ఇలా అంది.. బాబు విజయవాడ రాగానే చెప్పు... నేను మర్చి పోతాను అని. డ్రైవర్ సరేనంటాడు.. కాని డ్రైవర్ మర్చిపోయి విజయవాడ దాటేసి వంద కిలో మీటర్లు వెళ్లిపోతాడు మధ్యలో నిద్ర లేచిన బామ్మ...పక్కనున్న వ్యక్తిని అడుగుతుంది.. విజయవాడ దాటిందనగానే లబోదిబోమని ఏడుపందుకుంటుంది... దీనితో ప్రయాణికులంతా గొడవ చేయడంతో మళ్లీ వెనక్కు వెళ్లి విజయవాడలో దింపేస్తాడు... బస్ దిగిన బామ్మ మాత్ర వేసుకుని నీళ్లు తాగి మళ్లీ బస్ ఎక్కుతుంది.... ఇప్పుడు పోనీ బాబు అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు.... ఏం లేదండీ నేనూ వైజాగ్ వెళ్లాలి..అయితే నా కొడుకు విజయవాడలో మాత్ర వేసుకోమని చెప్పాడు అందుకని... -అక్కయ్యపాలెం, పెదగంట్యాడ నవ్వు ఒక టానిక్.... సీతంపేట: ప్రముఖ హాస్య నటుడు , రచయిత,దర్శకుడు రావి కొండలరావు ఆలోచన నుంచి పుట్టింది విశాఖహ్యూమర్ క్లబ్. 2000 సంవత్సరంలో సంస్థను ప్రారంభించారు. మనిషి తన దైనందిన జీవితంలో అనేక ఒడి దుడుకులు తట్టుకొని నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో హాస్యం ఉపశమనాన్ని కల్గిస్తుందన్న ఆశతో సంస్థను స్థాపించాం. మూడేళ్లు దిగ్విజయంగా నడిపిన తర్వాత , 2003లో తన అన్నకొడుకు రావి గోపి కృష్ణను అధ్యక్షుడిగా నియమించి క్లబ్ బాధ్యతలు అప్పగించి కొండలరావు హైదరాబాదు వెళ్లిపోయారు. ఆనాటి నుంచి విశాఖ హ్యూమర్ క్లబ్ 1292 కార్యక్రమాలు దేశ విదేశాలు, వివిధ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి నెలా రెండవ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో కామెడీషో నిర్వహిస్తున్నాము. మా క్లబ్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష ఆదరణతో విశాఖలో నేటికి తొమ్మిది కామెడీ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. హ్యూమర్ క్లబ్‌కు వస్తున్న ఎనలేని ఆదరణకు జీవితాంతం రుణపడి ఉంటాను. - రావి గోపీ కృష్ణ, అధ్యక్షుడు , విశాఖ హ్యూమర్ క్లబ్ పేర్లెందుకు లేవు మమ్మీ! కోడి పిల్లలు : మమ్మీ..! మనుషులంతా పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు. మరి మనమెందుకు పెట్టుకోం? కోడి : మనకు చనిపోయాక పెడ్తారమ్మా..చికెన్ 65, చికెన్ పకోడి, చిల్లీ చికెన్..అని తొక్కతో లక్కు... ఎన్ఏడీ జంక్షన్ : అన్న కూతురింటికి బాబాయి అప్పారావు వచ్చాడు... కొత్తగా కట్టిన ఇళ్లు...బాగుందే అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు... గుమ్మంలోనే చూసి బాబాయ్ బాగున్నారా...అంటూ ఆప్యాయంగా పలకరించింది కనకమహాలక్ష్మి. కుశల ప్రశ్నల తరువాత ఉత్సాహంగా ఇల్లాంతా చూపిస్తోంది. ఇది బెడ్రూములు...డ్రాయింగ్ రూము...కిచెన్ అన్నీ ఒక్కొక్కటి వర్ణిస్తూ చూపించింది. చివరిగా దేవుని గది చూపించింది. దేవుళ్ల ఫొటోలు చక్కగా అలంకరించింది. మధ్యలో అరటి పండు తొక్క ఫొటోకు ఫ్రేమ్ కట్టి పూజలు చేసి ఉంది. దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పారావు. ఇదేంటమ్మ అరటిపండు తొక్క ఫొటోకు దేవుళ్ల దగ్గరపెట్టి పూజలు చేశావు అంటూ సందేహంగా అడిగాడు. నాకు ఈ తొక్కతోనే కదా బాబాయ్ లక్కొచ్చింది. ఉబ్బితబ్బిబవుతూ చెప్పింది. అప్పారావు ముఖంలో మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చిపడింది...? ఇక ఈ ముఖాన్ని చూడలేక అసలు విషయాన్ని బయటపెట్టింది. రెండేళ్ల క్రితం మా అత్త ఈ తొక్కమీదే అడుగేసి పడిపోయి బకేట్ తన్నేసింది. ఆ తరువాత బీరువా తాళాలు నాచేతికి వచ్చాయి బాబాయ్ అని చెప్పింది. ఇదీ తొక్కతో వచ్చిన లక్కు... హాస్యప్రియ కామెడీ క్లబ్... ఇలాంటి పంచ్‌లు ఎన్నో ఈ క్లబ్లో కడుపుబ్బా నవ్విస్తాయి. బుచ్చిరాజుపాలెంలో 2012లో ఏర్పాటు చేసిన హాస్యప్రియ కామెడీ క్లబ్ నిర్వహిస్తున్న హాస్యామృతం కార్యక్రమంలో నవ్వుల విందునందిస్తోంది. నేటికి మూడున్నరేళ్ల పూర్తి చేసుకుంది. నెలలో నాల్గవ వారంలో అమర్ పాఠశాలలో సాయంత్రం 6గంటలనుంచి స్కిట్స్ ప్రారంభమవుతాయి. వీరితో పసాటు ఇంతవరకు 223 మంది నూతన కళాకారులకు ఈ వేదిక ద్వారా పరిచయం చేశారు. ఈ క్లబ్ వ్యావస్థాపక కార్యదర్శి ఇమంది ఈశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పికె దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షడు బుగతా సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. అధ్యక్షుడు నక్కాలక్ష్మణరావు మాత్రం కాంట్రాక్టర్. ఇప్పటి వరకు ఎక్కువమంది హాస్యప్రియులను సంపాదించిన అతి పెద్ద క్లబ్ ఇదే. -
సాసరో రక్షతి రక్షితః!
హ్యూమర్ ‘‘పాపం... సాసర్లు! వాటి వాడకం రోజురోజుకూ తగ్గిపోతోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు. నేను వాడికి టీ సర్వ్ చేస్తున్నప్పుడు వాడు అన్న మాట ఇది. ‘‘సాసర్ల మీద నువ్వంత జాలిపడాల్సిన అవసరం లేదురా! వేరే ఇంకెవరికైనా మరీ ఫార్మల్గా ఇవ్వాల్సి వస్తే సాసర్ కూడా ఇచ్చే వాణ్ణేమో. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్‌వి కాబట్టి కప్పు మాత్రమే ఇచ్చా. దీంట్లో అంత బాధపడాల్సిందేముంది రా’’ అన్నాను. ‘‘అదేం కాదులే. మొత్తం మానవాళి అంతా సాసర్ పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నాళ్లుగానో చాయ్ కప్పుకు తోడుగా వాడుకొని ఇప్పుడు దానికి ఆ తోడు కూడా లేకుండా చేస్తున్నారు ఈ మానవులు’’ ‘‘మానవులు అంటున్నావ్. సాసర్ను మనుషులు గాక జంతువులేమైనా యూజ్ చేస్తాయట్రా’’ అన్నాను. ‘‘అవును... జంతువులు యూజ్ చేస్తుంటాయి. ఎండ్రకాయ చూడు ఎంచక్కా వీపు మీద సాసర్ను బోర్లించుకున్నట్లూ... ఆ బోర్లించిన దాని కింది నుంచి నాలుగు జతల కాళ్లు బయటకు వచ్చినట్లు, అవి సాసర్ను అటూ ఇటూ లాగుతున్నట్లు ఉంటుంది. ఇక మన తాబేలును చూస్తే మాత్రం అది బోర్లించిన సాసర్ కిందికి తన ముఖాన్ని, కాళ్లూ, చేతుల్ని లోపలకు లాక్కునట్లుగా ఉంటుంది. సాసర్ గౌరవార్థం దాన్ని తమపై బోర్లించినట్లుగా బతికే జీవాలు ఎన్నెన్నో! ఈ లోకంలోని అనేక జీవులు సాసర్ను ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నాయి కదా... మరి భూమ్మీది మనుషులకేం పోయేకాలం వచ్చిందో సాసర్‌కు దక్కాల్సిన గౌరవం ఎందుకీయడం లేదో’’ అన్నాడు వాడు. ‘‘భూమ్మీద మనషులివ్వకపోతే ఆకాశం నుంచి ఎవడో ఊడిపడి వాటికి గౌరవం ఇస్తున్నాడా?’’ అన్నాను నేను. ‘‘అవును ఆకాశం నుంచి ఊడిపడేవారే ఇస్తున్నారు’’ అన్నాడు వాడు. ‘‘ఏదో మాట వరసకు ఆకాశం నుంచి ఊడిపడేవారు ఇస్తున్నారా అంటే నిజమే అంటున్నావు. అదెలారా?’’ అడిగా. ‘‘మనం దిక్కుమొక్కు లేక విమానాలూ, ఎయిర్ బస్సులూ లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం గానీ... ఏలియన్స్ అనే గ్రహాంతర వాసులూ చక్కగా చక్కర్లు కొట్టడానికి విశాలంగా ఉండే సాసర్లను యూజ్ చేస్తుంటారు. విమానాలు చూడు... ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అదే సాసర్ అనుకో. ఎంత విశాలంగా ఉంటుందో చూడు. ఈసారి ఎవరైనా ఏలియన్ గనక నాకు కనిపిస్తే... మన సైంటిస్టులకు ఫ్లైయింగ్ సాసర్ టెక్నాలజీ ఇవ్వమని అడుగుతా. దాంతో ఇకపై మనం కూడా పక్షి షేప్‌లో ఉండే ఓల్డ్ ఫ్యాషన్ విమానాలను వదిలేసి... హ్యాపీగా ఇకపై విశాలమైన సాసర్ ఏరోప్లేన్స్ వాడొచ్చు’’ అంటూ కాస్త గ్యాప్ ఇచ్చి ‘‘నీలాంటి వాడికి ఇలా సాసర్ ఘనతల గురించి హితబోధలు చేస్తూ డైనోసార్లకు పట్టిన గతి సాసర్లకూ పట్టకుండా చూసుకోవాలి’’ అన్నాడు వాడు. ‘‘ప్రాస కుదురుతుంది కదా అని డైనోసార్లనూ, సాసర్లనూ కలిపేస్తున్నావ్. అసలు వాటి మధ్య పోలికేమిట్రా?’’ అడిగాను నేను. ‘‘పాపం... మన డైనోసార్లు అంతరించిపోయినట్లుగానే సాసర్లూ క్రమంగా కనుమరుగైపోతున్నట్లుగా ఉందిరా’’ ‘‘అదేమిట్రా?’’ ‘‘ఇప్పుడు నువ్వు టీ ఇస్తూ కప్పు మాత్రమే ఇచ్చావు. గతంలో అందరూ టీ సర్వ్ చేసే సమయంలో దానితో పాటు సాసర్ను తప్పక ఇచ్చేవారు కదా. అప్పట్లో లోకంలో డైనోసార్లలాగే ఇప్పుడు ట్రేలలో సాసర్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయని వాటిని క్రమంగా అంతరించిపోయేలా చేస్తున్నార్రా నీలా టీ ఇచ్చే వాళ్లంతా. ‘‘అవి అంతరించి పోకుండా ఏం చేయాలని నీ ఆలోచన’’ ‘‘టీవీ ఉన్న ప్రతివాడూ సాసర్నే డిష్ ఏంటెన్నాలా తయారు చేసుకునేందుకు అవకాశం ఏదైనా ఉందేమోనని పరిశోధిస్తా. ఆ ఆవిష్కారానికి నేనేమీ పేటెంటు తీసుకోకుండా ఆ టెక్నాలజీని యథేచ్ఛగా అందరూ వాడుకునేందుకు ‘సాసరో రక్షతి రక్షితః’ అని జాతిప్రజలందరికీ ఒక పిలుపునిస్తా. డిష్ ఏంటెన్నాగా ఎవరు సాసర్ను రూపొందించు కుంటాడో... వాడికి సాసర్ అనేక ఛానెళ్లను వీక్షించే అవకాశం ఇస్తుంది. ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ జేఏసీ సాయంతో సాసర్‌కు దక్కాల్సిన తగిన గౌరవం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందిరా’’ అన్నాడు వాడు ఆవేశంగా. ‘‘వద్దులేరా... నీకంత శ్రమ అవసరం లేదు. సాసర్‌కు ప్రత్యేకంగా ఒకడు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదు. దాని పేరులోనే మహత్యం ఉందిరా. దాన్ని పిలవాలంటే ‘సా’ అన్న అక్షరం తర్వాత ‘సర్’ అని ప్రతివాడూ దాన్ని గౌరవిస్తాడు. కాబట్టి ఇప్పటికి నువ్వు సెలైంట్‌గా ఉండు చాలు’’ అన్నాను నేను. ‘‘నాకు తెలియని విషయం చెప్పావు. నువ్వు కూడా మెల్లగా నా దార్లోకి వస్తున్నావ్’’ అంటూ ప్రశంసించాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ!
హ్యూమర్ ‘‘ఉపమాలంకారం అంటే ఉప్మా అనే టిఫిన్‌తో మన డైనింగ్ టేబుల్ అందాలను మరింత ఇనుమడింపజేయడం అన్నమాట. అందుకే దాన్ని ఉపమాలంకారం అన్నారు’’ అంటూ ఏదో లెక్చర్ ఇస్తున్నాడు మా రాంబాబు గాడు. ‘‘నీ ముఖం ఉపమాలంకారం అనేది ఒక వ్యాకరణ ప్రక్రియ అనుకుంటా. పోలికలు అందంగా చెప్పే అనేక తరహా రకాల్లో అదీ ఒకటి అనుకుంటా. నీకు తెలియకపోతే నోర్మూసుకో... కానీ ఇలా అడ్డమైన వ్యాఖ్యానాలు చెయ్యకు’’ అంటూ మరింతగా కోప్పడ్డాను నేను. నా కోపానికి అసలు కారణం వేరే ఉంది. ఉదయం టిఫిన్‌లోకి మా ఆవిడ ఉప్మా చేయడంతో కాస్త ధుమధుమలాడుతూ బయటకు వచ్చేశా. మామూలుగా అయితే ఇడ్లీ పట్ల నాది కాస్త ఫ్రెండ్లీ ధోరణి. ఉప్మా అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ టిఫిన్లలోకెల్లా కాస్త త్వరగానూ, వీజీగానూ చేసేయవచ్చని మా ఆవిడ మాటిమాటికీ ఉప్మా చేస్తుంటుంది. ‘‘ఒరేయ్... అసలే ఇష్టమైన టిఫినూ దక్కలేదు. పైగా నీ గోల ఏమిట్రా’’ అంటూ వాడిపై మరింత విరుచుకుపడ్డాను. ఆ కోపమూ, ఈ కోపమూ కలిపి రాంబాబు గాడి మీద వెళ్లదీశాన్నేను. అంతే... వాడు ఉప్మా గురించి నాకు హితబోధ మొదలుపెట్టాడు. ‘‘ఒరేయ్ నాయనా... ఎప్పుడైనా టిఫిన్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఉప్మా-పెసరట్ అద్భుతంగా ఉంటుందన్న మాట విన్నావా?’’ అడిగాడు. ‘‘విన్నాను’’ ‘‘అందుకే మరి... కేవలం ఒక్క డైనింగ్ టేబుల్‌కు మాత్రమే ఉప్మా తలమానికం కాదురా... దోసెనూ ఉప్మాతోనే అలంకరిస్తారు. అందుకే ఇలా పలహారబల్లలనూ, దోసెల్నీ... మరెన్నింటినో ఉప్మాతో అలంకరించే అవకాశం ఉంది కాబట్టే అలంకార శాస్త్రంలో ఉప్మాకు టిఫిన్లలో పెద్దపీటకు బదులు పెద్దటేబుల్ వేశార్రా. అంతేకాదు... మనం పరిశ్రమ పరిశ్రమ అంటూ అభివర్ణించుకునే సినిమా రంగం అంతా మూవీ హిట్టు కొట్టాలంటే ఉప్మా మీదే ఆధారపడి ఉంది’’ అంటూ తన జిహ్వాగ్రం మీది ఉప్మాగ్ర చర్చలతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాడు. ‘‘ఒరేయ్... నన్ను మరీ ఇంత వేధించకు రా... ఉప్మాకూ సినిమా హిట్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అడిగాన్నేను. ‘‘మొన్న బ్లాక్‌బస్టర్ అయిన మహేశ్‌బాబు పోకిరి సినిమా చూశావా? అందులో హీరోయిన్ ఎప్పుడూ బాక్స్‌లో ఉప్మా పెట్టుకు తిరుగుతుంటుంది. హీరోయిన్ తమ్ముడు కూడా ఉప్మానే బాక్స్ కట్టించుకుంటాడట. దాంతో హీరో ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తున్నార్రా’’ అని సరసమాడతాడు’’ అన్నాడు రాంబాబు గాడు. ‘‘కరెక్టే రా’’ అన్నాన్నేను. ‘‘నిన్నా మొన్నా మాత్రమే కాదురా బాబూ... దాదాపు 40 ఏళ్లకు ముందు అడవి రాముడు అన్న సినిమాలో రాజబాబు అనే మహనీయ కమేడియన్ ఉప్మా తయారు చేస్తే అడవిలో పెద్దపులి తనకు నోరూరించే దుప్పులూ, జింకలూ వంటి వాటిని వేటాడటం మానేసి ఉప్మా గిన్నెను శుబ్బరంగా ఊది పారేసింది. అంటే పులికి సైతం ఇష్టమైన వంటకం ఉప్మాయే అన్నమాట. అంతెందుకు... సదరు ఉప్మా వండిన రాజబాబు సైతం ‘పులి ఉప్మా తిందేమిటి చెప్మా’ అంటూ ఆశ్చర్యపడిపోతాడు. మొన్నటి బజ్‌వర్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తున్నార్రా అయితే ... నలభై ఏళ్లకిందట ఫేమస్ డైలాగ్ ’పులి ఉప్మా తిందేమిటి చెప్మా’. నీకో సీక్రెట్ చెప్పనా? ఏదైనా సినిమాలో ఉప్మాకు సంబంధించిన డైలాగ్ బజ్‌వర్డ్ అయ్యిందంటే ఆ సినిమా అప్పటి అడవిరాముడు లాగో, మొన్నటి పోకిరీ లాగో సూపర్, డూపర్, బంపర్ హిట్టన్నమాట’’ అంటూ వాక్రుచ్చాడు వాడు. అంతకు ముందు నేనెప్పుడూ ఎరగని సెంటిమెంట్ ఇది. ఫలానా అక్షరంతో సినిమా మొదలవ్వాలనీ, ఫలానా నటుడే తప్పనిసరిగా ఉండాలనీ... ఇలా సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువే అన్న విషయం నాకు తెలుసు. కానీ... ఇలాంటి సెంటిమెంట్ అంటూ ఒకటి ముందుకొస్తే... ఉప్మాకు ప్రాధాన్యం పెరిగి, అది ఉప్మా పెసరట్ టిఫిన్‌లో కేవలం మెగాపవర్ పెసరట్టు సరసన మాత్రమే హీరోయిన్గా కాకుండా... అనేక టిఫిన్ల సరసన ఉప్మాయే హీరోయిన్ అయి జతకడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది నాకు. ‘‘ఒరేయ్... అలా అడ్డదిడ్డంగా మాట్లాడి నీ మాటలు సినిమా వాళ్లు వినకుండా చూసుకో’’ ‘‘నోనో... ఐయాం సారీ. కొన్ని సిన్మాలలో ఉప్మాకు తగినంత ప్రాధాన్యం దొరికినా... దాని పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. నిజానికి కుట్టుపిండి, రవ్వ ఉప్మా, మసాలా ఉప్మా, టమాటా బాత్ అంటూ వివిధ రకాలుగా చిన్నా చితకా వేషాలు వేస్తున్నప్పటికీ ఉప్మాకు తగినంత బ్రేక్‌థ్రూ రాలేదు రా. అందుకే నాకు గనక అవకాశం దొరికితే సినిమా ఇండస్ట్రీ వారికి ఉప్మాతో హిట్ కొట్టడం ఎలా అన్నది వివరంగా తెలియజెబుతాను. ప్రస్తుతం నా జీవితలక్ష్యం ఒకటే రా?’’ ‘‘ఏమిటది?’’ అడిగాను నేను బితుకు బితుకుమంటూ. ‘‘అన్నట్టు ఇవ్వాళ్ల టిఫిన్‌లో మీ ఆవిడ ఉప్మా చేసిందన్నావు కదా. మీ ఇంటికెళ్లి అలా కాస్త టిఫిన్ తినేసి వస్తా. నీ ఫ్యామిలీ ఏమిటీ... నా ఫ్యామిలీ ఏమిటి. వసుధైక కుటుంబం అంటారే... ఆ స్టైల్లో మనదంతా ఉపమైక కుటుంబం? అన్నట్టు నీకో మాట చెబుతా విను. ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ అని ఆర్యోక్తి. కాబట్టి ఉప్మా వండినందుకు నిరసనగా భార్య మీద అలిగి బయటకు రాకూడదన్నది మంత్రాల అంతరార్థం రా బాబూ ’’ అంటూ మా ఇంటి వైపునకు కదిలాడు రాంబాబుగాడు. - యాసీన్ -
నవ్వుతూనే వుండు!
హ్యూమర్ దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపు తుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగు తుందే తప్ప పకపక నవ్వ లేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వస్తాం. అక్కడ మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకొచ్చు. ఇక్కడ చాయిస్సుంది. కానీ చాలామంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ వుంటారు. వీళ్లు కచ్చితంగా నరకానికే పోతారు. నవ్వేవాళ్లు స్వర్గానికి పోతారో లేదో నాకు తెలియదు కానీ, నవ్వుతూ వుంటే దానికి మించిన స్వర్గం ఏముంటుంది? దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపుతుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగుతుందే తప్ప పకపక నవ్వలేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. అన్నిటిని కల్తీ చేసినట్టే మనం నవ్వుని కూడా కల్తీ చేశాం. పసిపాపలు, పరమయోగుల పెదాలపై మెరిసే నవ్వు నిజమైన నవ్వు. మిగతా అంతా ఎంతో కొంత కల్తీనే. తమాషా ఏమంటే అందరూ ఒకేలా ఏడుస్తారు కానీ ఒకేలా నవ్వలేరు. కొందరు పకపక నవ్వితే, మరికొందరు పగలబడి నవ్వుతారు. కొందరు సోడా కొట్టినట్టు ‘స్స్స్’మని నవ్వితే, మరికొందరికి సౌండే రాదు. బాస్ జోక్‌లకి మనకి తెగ నవ్వొస్తుంది. తుపాన్లో చెట్లు వూగినట్టు వూగిపోతూ నవ్వుతాం. ఒక్కోసారి జోక్ మొదలు పెట్టకముందే నవ్వుతాం. ‘ఇప్పుడేమైందంటే’ అనగానే ఓహ్హోహ్హో అని నవ్వేస్తాం. జోక్ బిగినింగే ఇంత హాస్యంగా వుంటే, పూర్తిగా వింటే పొట్ట చెక్కలైపోతుందేమో! మా పెద్దమ్మ ఒకావిడ కేవలం నవ్వుతోనే మా పెద్దనాయన్ని కంట్రోల్ చేసింది. ఆమె ప్రతి నవ్వు వెనక ఒక ఆదేశముండేది. ఆ ఆర్డర్ మా పెద్దనాయనకే అర్థమయ్యేది. లాఫింగ్తోనే లా అండ్ ఆర్డర్. విలన్ల నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాతాళభైరవిలో ఎస్వీఆర్ నవ్వుని ఎన్నాళ్లైనా మర్చిపోలేం. రాజనాల, సత్యనారాయణ నవ్వారంటే ఎవరి కొంపకో ఎసరు పెట్టారని అర్థం. ఇక మన రాజకీయ నాయకుల సంగతి. వాళ్లు ఓట్లు వేసే వరకూ మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. గెలిచిన తరువాత మనల్ని అంతకంత ఏడిపిస్తారు. హాస్యనటులు అదృష్టవంతులు. కోట్లాది మందిని నవ్వించడం నిజంగా వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పుడు జానపద సినిమాల్లో ఒక సీన్ తప్పకుండా వుండేది. ఎలుగుబంటి హాస్యనటుణ్ని తరుముతూ ఉండే సీన్. దాన్ని చూసి నేను పడీ పడీ నవ్వేవాణ్ని. జీవితమే ఒక ఎలుగుబంటని, అది మనల్ని తరుముతూ వుంటుందని అప్పుడు, ఆ వయసులో నాకు ఏమాత్రం తెలియదు. తెలిసి వచ్చాక నిజం బోధపడింది. ఎప్పుడైనా కానీ మనం పారిపోతుంటే ఇతరులకి హాస్యం. ఇతరులు పారిపోతుంటే మనకి చెప్పలేనంత హాస్యం. మనం జాగ్రత్తగా గమనించాలే కానీ, జీవితంలో అడుగడుగునా హాస్యం కనిపిస్తుంది. సెలూన్ షాప్‌లో, సిటీ బస్సులో, ఆఫీసుల్లో, అసెంబ్లీలో, సీరియస్ సీరియల్స్‌లో, తెలుగు సినిమాల్లో... అన్ని చోట్లా హాస్యం ఉంటుంది. పండుతుంది. ఈ మధ్య సెలూన్కెళితే ఒక పెద్దమనిషి గడ్డానికి తెల్లటి నురుగు రాశారు. తీరా చూస్తే బ్లేడ్ లేదు. దానికోసం ఒక కుర్రాడెళ్లాడు, తిరిగి రాలేదు. హిమాలయాల్లో సాధువులా ఈయన వెయిటింగ్. ఆయనలో కోపం, నాకు నవ్వు. నవ్వు మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే మాత్రం కురుక్షేత్రమే. ఒక చోటికి వెళ్లబోయి, ఇంకో బస్సు ఎక్కేస్తారు. సిటీ బస్సులో వీళ్ల హడావుడి చాలా కామన్. పని రానివాళ్లు చాలా సీరియస్‌గా పనిచేస్తుంటారు. ఇది ఆఫీస్ కామెడీ. అలాగే ఏడిపిస్తూ నవ్వించేవాళ్లు, నవ్విస్తూ ఏడిపించేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు. వీళ్లు జీవితం తప్ప ఇంకేమీ చదువుకోరు. వీళ్లలో చాప్లిన్ ఒకడు. వానలో నడవడం ఇష్టమంటాడు. వానలో తన కన్నీళ్లు ఇతరులకి కనిపించవట. మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే. నవ్వనివాడికి ఇలాంటి నవ్వుల దినోత్సవాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్లే. కానీ నవ్వుతూ బతికినోళ్లు ఎప్పటికీ బతికే వుంటారు. ఏడుస్తూ బతికేవాళ్లు, వుండగనే పోయుంటారు. - జి.ఆర్.మహర్షి -
పండగ చేస్కో
హ్యూమర్ ఫ్లస్ జీవితంలో చేదు, వగరు, పులుపే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా తీపి తగిలే టైం వస్తే అప్పుడు మనకు సుగరొస్తుంది. ఈ సత్యం తెలిసే మనకు ఉగాది పచ్చడి పెడతారు. నిజానికి మనం టెక్నాలజీ రుచి మరిగి అసలు రుచుల్ని గుర్తుపట్టే స్థితిలో లేము. ఒకాయనకి ఫేస్బుక్ చూస్తూ భోంచేయడం అలవాటు. లైక్‌లు కొట్టికొట్టి అలసిపోయి చెయ్యి కడుక్కుంటాడు. చికెన్ చాలా బావుందని భార్యకి చెబుతాడు. ఆమె వాట్సాప్ మెసేజ్‌ల్లో ఇరుక్కుపోయి థ్యాంక్సండీ అంటుంది. నిజానికి అతనేం తిన్నాడో అతనికి తెలియదు. ఏం వండిందో ఆమెకి గుర్తులేదు. ఇంకొకాయన సన్నాసుల్లో కలిసిపోయాడు. ఈయన దగ్గర సెల్‌ఫోన్ వున్నందువల్ల తమలో కలుపుకోవడానికి సన్నాసులు నిరాకరించారు. భార్య తనతో ఫేస్బుక్లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడ్డం లేదని అలిగి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏరోజుకారోజు భర్త తన ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేస్తే తప్ప అతన్ని ఆమె గుర్తుపట్టలేదు. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా కనిపిస్తే ఆమెను అస్సలు అతను గుర్తుపట్టలేడు. అతనికోసం ఆమె వెతక్కుండా ఫేస్బుక్ పోస్టింగ్ పెట్టింది. చూసి చూడనట్టున్నాడు. ఒకరోజు జుత్తు విరబోసుకున్న ఫోటోని అప్డేట్ చేసేసరికి శ్మశాన వైరాగ్యం ఆవరించి సెల్‌ని చితకబాది కాశీలోని హరిశ్చంద్ర ఘాట్‌లో సెటిలైపోయాడు. ‘ఇల్లు ఇల్లనేవు, సెల్లు సెల్లనేవు చిలకా’ అని పాడుతూ ఎవరికో కనిపించాడట. భర్త ఈరకంగా కాశీమజిలీ యాత్ర చేశాడని ఆమె పోస్టింగ్ పెడితే రెండొందలమంది లైక్ కొట్టారు. మొగుడ్ని సన్యాసుల్లో కలిపే చిట్కా వివరించమని కోరుతూ ఐదొందలమంది వాట్సప్ మెసేజ్‌లు పెట్టారు.పల్లెటూళ్లలో కూడా సోషల్ మీడియా వచ్చేసింది. ఫలానా సుబ్బమ్మకి చాలా టెక్కులు అని పోస్టింగ్ పెడితే అన్నివర్గాల వారు లైక్‌లు నూరి కామెంట్లు అతికిస్తున్నారు. కుళాయిల దగ్గర కొట్టుకోవడం మానేసి వాట్సప్ గ్రూపుల్లో యుద్ధం చేస్తున్నారు. ఎండల దెబ్బకి ఈసారి కవుల గొంతు కూడా మూగబోయేలా ఉంది. గొంతు సవరించుకునేలోగా దాహమేసి నీళ్లు తాగేస్తున్నారు. గతంలో కవిత్వం చదివి శ్రోతల చేత మూడు చెరువుల నీళ్లు తాగించేవాళ్లు కూడా ఈసారి సేఫ్‌సైడ్‌గా వాయిస్‌మెయిల్‌ని ఆశ్రయిస్తున్నారు.కవిత్వాన్ని మెయిల్ చేస్తే అవతలివాళ్లు దాన్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసి సమ్మేళనాల్లో వినిపిస్తున్నారు. శ్రోతలు వహ్వా అనకపోయినా, నిర్వాహకులే ముందస్తుగా వహ్వాలు రికార్డు చేసి, అవతలిపక్షానికి డౌన్లోడ్ చేయిస్తున్నారు. నిజానికి కవుల గొంతు లోడ్ చేసిన తుపాకీ లాంటిది. ట్రిగ్గర్ నొక్కితే పశుపక్ష్యాదులు కూడా కకావికలే. ఈ పొల్యూషన్‌కి కోయిలలకి కూడా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. పాడ్డం మానేశాయి. కనపడుతున్నట్టు కూడా లేదు. లేదంటే ఫేస్‌బుక్స్ వాళ్లు విజృంభించి ఫోటోలు పెట్టేవాళ్లు. ఉగాదినాడు ఎవరి పంచాంగాలు వాళ్లు చదువుకుంటారు. అందరికీ అన్నీ శుభాలే జరుగుతాయంటారు. పులికి, మేకకి ఏకకాలంలో శుభం జరగడం అసాధ్యం. దేవుడు ఎప్పుడూ ఒకరిపక్షానే ఉంటాడు. ఎక్కువసార్లు పులిపక్షంలో ఉంటాడు. కనపడని పులితో జూదమాడ్డమే పులిజూదం. మాటలన్నీ మాయమై మెసేజ్లుగా మారిపోతున్నాయి. అన్నిటినీ గూగుల్ సెర్చ్‌లో వెతుక్కునే మనం, ఏదో ఒకనాడు మనల్ని మనమే వెతుక్కుంటాం. వెతుక్కున్నా దొరకం. మనల్ని మనం గుర్తుపట్టలేకపోవడమే మాడ్రన్ లైఫ్. ఎప్పుడో ఒకరోజు పండగ రావడం కాదు. ఎప్పుడూ పండగలా జీవించడమే నిజమైన ఉగాది. - జి.ఆర్. మహర్షి -
పిడకల వేట
హ్యూమర్ ఫ్లస్ సుబ్బలక్ష్మి, సుబ్బారావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తర్వాత సీక్వెల్ యుద్ధమే. గాల్లోకి అనేక వస్తువులు లేవడం వల్ల సుబ్బారావు మూతి పచ్చడై మేకప్ అవసరం లేని హనుమంతుడిలా మారాడు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న టీవీ వాళ్లపరుగులు తీశారు. తొక్కిసలాటలో కొందరు కెమెరావాళ్లు గాయపడ్డారు. ‘మేడమ్.. మీ మధ్య గొడవెలా ప్రారంభమైంది?’ అడిగారు. ‘కొబ్బరి చెట్నీ చేయమని చెప్పాను. కుదరదు పచ్చడైతే చేస్తానన్నాడు’. ‘అంటే వంట మీరు చేయరా?’. ‘అది మా ఇంటావంట లేదు. అందుకే ఆయనకి ఒంట పట్టించా’. ‘చెట్నీ, పచ్చడి రెండూ ఒకటే కదా’. ‘అది ఇంగ్లిష్. ఇది తెలుగు. నాది ఇంగ్లిష్ స్టయిల్’. ‘సుబ్బారావు గారూ.. మీరేమైనా చెబుతారా?’ మూతికి, ముక్కుకి మధ్యనున్న బ్యాండేజ్లోంచి ‘కీ కిక్ కిర్’మని ఆయన ఏదో సౌండ్ చేశాడు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్ భాషలో ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు మేడమ్. మీరు కొంచెం ట్రాన్స్‌లేట్ చేస్తారా?’. ‘రిలేషన్స్‌లో ట్రాన్స్‌లేషన్స్ తప్పవు. చింత చచ్చినా పులుపు చావలేదని సౌండిచ్చాడు’. ‘మీరు ఇంతలా చావబాదారంటే, మీ మధ్య పాతకక్షలేమైనా ఉన్నాయా?’ ‘చావడం వేరు. బాదడం వేరు. రెంటిని సంధి చేయకండి. భార్యా భర్తల మధ్య సంధి ఉండదు. ఒకవేళ ఉన్నా అది దుష్టసంధి. ఒకసారి పెళ్లంటూ జరిగితే పాతకక్షలు ఎలాగూ తప్పవు. జ్యూరీ కంటే ఇంజ్యూరీ పవర్ఫుల్’. టీవీ వాళ్లు వచ్చారని పోలీసులొచ్చారు. ‘ఇంతకాలం హింస వీధుల్లోనే ఉందని అనుకున్నాం ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చింది. దీనికి పోలీసుల సమాధానమేంటో విందాం’. ‘శాంతిని భద్రంగా కాపాడడమే మా డ్యూటీ’. ‘శాంతా? ఆవిడెవరు?’ ఈ కేసుని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు’. ఇన్స్పెక్టర్ని చూసి సుబ్బారావు ‘కకాకికీకై’ అని మూలిగాడు. ‘చిన్నప్పుడు నేర్చుకున్న క గుణింతం గుర్తుకు తెచ్చుకున్నాడంటే ఇతను కరుడు గట్టిన వ్యక్తని మా అనుమానం’. ‘పరుషములు సరళములైనా, సరళములు పరుషములైనా లా అండ్ ఆర్డర్‌ని కాపాడ్డమే మా విధి’’ - ఇన్స్పెక్టర్. ‘బాధ్యత గల అధికారిగా ఉండి కూడా విధి రాతని తప్పించలేమని వేదాంతం చెబుతున్నాడంటే ఈ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు తెలుస్తోంది’. ఇంతలో ఆ ఏరియా రాజకీయ నాయకుడొచ్చి.. ‘ఈ ఏరియా నాది, ఇక్కడేం జరిగినా నేను చెప్పినట్టే ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కొట్టుకోవడం భార్యాభర్తల డ్యూటీ, కవరేజీ మీ డ్యూటీ, అందరూ ఎవరి డ్యూటీలు వాళ్లు చేస్తూ ఉంటే ఇక మాకేం డ్యూటీ మిగిలిందో చెప్పండి’ అన్నాడు. మహిళా సంఘాల వాళ్లూ కూడా వచ్చారు. ‘స్త్రీకి పురుషుడు కనపడని హింస. పురుషుడికి స్త్రీ కనపడే హింస. హింసకి హింస సమాధానమంటే ఒప్పుకోం. హింస హింసో రక్షితః అన్నారు. అందువల్ల ఈ సుబ్బారావు తనని తానే గాయపరుచుకుని, బ్యాండేజీతో డామేజీ చేయాలని చూస్తున్నాడు’. సుబ్బారావు ఈసారి ‘కౌ కృ, కొ కో’ అని శబ్దం చేశాడు. ‘గాయపడి కూడా క్రూరమైన శబ్దాలు చేస్తున్నాడంటే ఇతను భార్యద్వేషి అని అర్థమౌతోంది’. ఇదే సమయానికి టీవీ స్టూడియోల్లో వివాహ వ్యవస్థ-ఒక అవస్థ అని చర్చావేదిక ప్రారంభమైంది. వాదం తీవ్రవాదమై నలుగురు వక్తలు, ఇద్దరు యాంకర్లు గాయపడ్డారు. మూడు రోజుల తర్వాత సుబ్బలక్ష్మి, సుబ్బారావు చెట్టాపట్టాలేసుకుని ట్యాంక్‌బండ్ పైన ముక్కు మూసుకుని నడుస్తూ కనిపించారు. ‘యూత్ డామేజ్డ్ బై లవ్ మ్యారేజి ప్రోగ్రాం టీవీల్లో ఇంకా వస్తూనే ఉంది. - జి.ఆర్.మహర్షి -
అంతా ‘రాత’ మహత్యం!
హ్యూమర్ విధిని ఇంగ్లిష్‌లో ఫేట్ అంటుంటారు. ఫేట్ అనేదానికి ఫేస్ ఉండదు. కానీ వెక్కిరించడం దీని హాబీ. కండరాలు ఉండవు. కానీ బలమైనది. ‘విధి బలీయమైనది’ అని అందరూ అంటుంటారు. బలమైనది అనడానికి బదులు... బలీయం అనే మాటను విధికి విధిగా ఎందుకు వాడతారో పండితులకు మాత్రమే తెలుసేమో. అయితే విచిత్రం ఏమిటంటే పామరులూ అదే మాట వాడుతుంటారు. కొందరు మహనీయులుంటారు. విధిరాతతో సహా దేనినైనా వాళ్లు మార్చగలమంటారు. ఇడ్లీ రౌండ్‌గానే ఎందుకు ఉండాలని వాళ్లు ప్రశ్నిస్తారు. సంప్రదాయానికి తాము ఎదురు నిలవగల ధీరులమంటారు. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మూసను నలు చదరాకారంగానో, త్రిభుజాకారంలోనో రూపొందిస్తారు. సమోసా షేప్‌లో ఇడ్లీని తయారు చేస్తారు. తాము దేన్నైనా మార్చగలమని ఈ కారణ జన్ములు ఇలా సెలవివ్వగానే... అలా నమ్మేస్తారు కొందరు. కానీ ఇడ్లీపాత్రను అడ్డుపెట్టి ఇడ్లీల షేపు మార్చగలరేమోగానీ దాని టేస్టు మార్చగలరా? విధీ అంతే... ఇంచుమించు ఇడ్లీతో సమానం. విధిరాత బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ చెల్లని నాణేనికి లాగానే దాని గీతలూ గజిబిజిగా ఉంటాయట. ముఖానికి రింకిల్స్ వచ్చినట్లుగానే సాధారణంగా విధిరాత అనే సదరు హ్యాండ్ రైటింగ్ ఎప్పుడూ కాస్త అర్థం కాకుండా ఉంటుందని దాని గురించి ఆందోళన పడేవాళ్లు అనే మాట. అందుకే విధిరాతనూ, బ్రహ్మరాతనూ ఒకేలా పరిగణిస్తుంటారు. అందుకేనేమో ఆ బ్రహ్మరాతను రాసే రైటర్‌ను విధాత అని కూడా అంటుంటారు. డాక్టర్ విధాతగారు సాధారణంగా మనిషి నుదురును తన ప్రిస్క్రిప్షన్ పేపర్‌లాగా ఉపయోగి స్తుంటారని బాగా చదువుకున్నవాళ్లు అంటుంటారు. అసలు విధి, బ్రహ్మ ఒకటేనని శాస్త్రాలన్నీ తెలిసినవాళ్లు అంటుంటారు. కానీ వాక్యనిర్మాణంలో విధి గురించి చెప్పేటప్పుడు ఫిమేల్గానూ, బ్రహ్మను మేల్గానూ చెబుతూ జెండర్ డిఫరెన్స్ చూపిస్తారు. విధికి ‘గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ బాగా తెలుసని చాలామంది అంగీకరించే సత్యం. ఆటల్లో దానికి మక్కువ ఎక్కువట. అందుకే అది తమతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుందని వాళ్ల అభిప్రాయం. అయితే సదరు క్రీడలో విధికి నైపుణ్యం చాలా ఎక్కువ. అందుకే విధి ఆడే ఆటలో అది మాత్రమే ఎప్పుడూ గెలుస్తుంది. అందుకే సదరు స్పోర్ట్‌లో ఎప్పుడూ దానికి తలవంచాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అన్నట్టు... ఫైన్ ఆర్ట్స్ విభాగంలో విధికి డ్రామాలు చాలా ఇష్టమట. అయితే అది ఎప్పుడూ వింత వింత నాటకాలు ఆడుతుంటుందనేది జీవితాన్ని కాచి వడబోసిన వారి ఉవాచ. అందుకే వారు ‘విధి ఆడే వింత నాటకం’లో... అంటూ ఒక స్టాక్ డైలాగ్ చెబుతుంటారు. విధి విషయంలో వారి వారి వ్యక్తిగత అనుభవాలు అందరికీ ఉంటాయి. విధి దేవత అనే మాట లేదు గానీ... శనిదేవుడి కంటే విధికే ఎక్కువ భయపడుతుంటారు. దాని పట్ల ఇంతగా భయం ఉన్నందు వల్లనే తాము చేసే పనులకూ, బాధ్యతలనూ ‘విధులు’ అనే బహువచన రూపంలో చెబుతుంటారు. విధికి దయా దాక్షిణ్యాలు కరువు అని కాస్త భయం భయంగా చెబుతుంటారు. మనం ప్రయాణం చేయడానికి అవసరమైన రోడ్లను ఆర్ అండ్ బీ విభాగం వేసినా వేయకపోయినా విధి మాత్రం తప్పక నిర్మిస్తుందట. సదరు రహదారులలో ఎత్తుపల్లాలు చాలా ఎక్కువట. అందుకే సదరు రోడ్లపై బాగా ప్రయాణం చేసిన వారి గురించి అనుభవజ్ఞులు మాట్లాడుతూ ‘వారు ఎక్కని ఎత్తుల్లేవూ, వారు చూడని పల్లాలు లేవు’ అని అంటుంటారు. ‘తమరు ఏం ఆదేశిస్తే అదే చేస్తాను’ అనే సారాన్ని ఒకే మాటలో చెప్పడానికి ‘విధే’యుడు అనే పదాన్ని వాడతారు. పాలసీ మ్యాటర్ అనగా అది తప్పక పాటించాల్సిన రూల్ కాబట్టీ, అంత పవర్ఫుల్ కాబట్టే దాన్ని ‘విధానం’ అంటారు. విధివిధానాలు అనే మాటను ద్వంద్వసమాసంగా వాడుతుంటారు. దైవ లీలలలాగానే విధిలీలలూ ఒక పట్టాన అర్థం కావట. విధికి లక్ అనే పర్యాయపదం ఉందని చెబుతూ ఉన్నప్పటికీ... దాన్ని దురదృష్టంతోనే ఎక్కువగా ముడివేస్తుంటారు. అందుకేనేమో... శిక్షనూ, జరిమానాను వేసినప్పుడు దాన్ని పనిష్మెంట్లాగా చూపుతూ ‘విధిం’చారు అనే మాటను వాడుతుంటారు. ఇది చివరివరకూ చదివినవారు ఒక్క మాటను ఇష్టమున్నా లేకున్నా అంగీకరించి తీరాలి. సాధారణంగా విధికి మరో మాటగా వాడుతుండే ఒక మాటను స్మరించాలి. అదే ఖర్మ. తమ ఖర్మ కొద్దీ ఇలా జరిగిందనీ, ఇందుకు ఈ వ్యాసకర్త ఎంతమాత్రమూ బాధ్యడు కాదనీ విజ్ఞులైన పాఠకులు గ్రహించాలి. - యాసీన్ -
టవల్స్టార్!
హ్యూమర్ టవలు, తువాలు, తువ్వాల, తుండు గుడ్డ... పేరైదైనా గానీ దానికి మనం అన్నకున్న దానికంటే ఎక్కువ సీన్ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ విస్తృతి ఉంది. కాకపోతే చాలామంది దాన్ని గుర్తించరంతే! గుర్తించినవాడు సమర్థంగా వాడుకుంటాడు. ‘ఆ... ఎవరికి తెలియదులే, ఎవరు వాడుకుంటార్లే పెద్ద చెప్పొచ్చారూ’ అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఖచ్చి తంగా తెలియదు. తెలిస్తే... రజనీకాంత్‌కు ముందుగా మీరే దాన్ని గిరగిరా అనేకమైన మెలికలు తిప్పేసి భుజం మీద కప్పేసేవారు. పెదరాయుడు సినిమాకంటే ముందర దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసినా, ఆ సినిమా తర్వాతే దాంతో అన్ని గిరికీలు కొట్టించవచ్చని తెలిసింది. అసలు హీరోయిజమ్‌ను భుజం మీది కండువాతో సాధించవచ్చని తెలిశాక... దాన్ని రజనీకాంత్ కంటే సమర్థంగా ఉప యోగించిన వాళ్లు లేరు. మన సూపర్‌స్టార్ రజనీని కుర్చీ మీద కూర్చోబెట్టకుండా, నిలబెట్టి అవమానిద్దామంటే... అక్కడెక్కడో ఆకాశంలో వేలాడదీసి ఉన్న తూగుటుయ్యాలకు కండువాతో మెలికేసి, సయ్మంటూ లాగేసి, హుందాగా దాని మీద కూర్చొని... మళ్లీ రయ్‌మంటూ కాళ్లమీద కాళ్లేసుకుని తన హీరోచిత దర్జా చూపించడానికి ఉపయోగపడేది భుజం మీద టవలే. తదాదిగా ధీరోచిత ప్రద ర్శనకు టవల్‌ను ఒక టూల్లాగా సినిమా రంగాన విశేషంగా వాడుకున్నారు. అంటే భుజం మీడి కండువా తీసుకో వడం, కుర్చీ కోడుకు మెలికేసి దగ్గరికి లాక్కో వడం, కాలు మీద కాలేసుకొని కూర్చో వడం వంటి ప్రదర్శనలకు దాని సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. ఒక్క సినీరంగంలోనే కాదు... రాజకీయ రంగంలోనూ దాని సేవలు అందుతున్న విషయం సమకాలీనులకు తెలియనిదేమీ కాదు. ఒకప్పుడు పార్టీ మారడాన్ని చాలా ఇండికేటివ్గా మరింత సున్నితంగా చెప్పేందుకు ‘పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ లాంటి నర్మగర్భమైన మాటలు వాడేవారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ సింపుల్ మాటలు ఉపయోగించడం పరిపాటి అయ్యింది కాబట్టి పార్టీ మునుపటి తీర్థం స్వీకరించడం వంటి వాటి కంటే ‘కండువా కప్పుకున్నారు’ లాంటి మాటలే ఎక్కువగా వాడుతున్నారు. భాషాపరంగా వచ్చిన ఈ మార్పు కూడా జనాన్ని తమకు చేరువ చేస్తుందనీ నేతల విశ్వాసం. ఎంత ఆ నమ్మకం లేకపోతే ఒక బలమైన మాట స్థానంలో కండువా చేరుతుంది చెప్పండి! ఇప్పుడంటే రాజకీయ నేతలూ, దానికి కాస్త ముందు సినిమావాళ్లు తువ్వాలును, తుండుగుడ్డను తమ స్వప్ర యోజనాలకు వాడుతున్నారు గానీ... అనాది కాలంగా దాని ఉపయోగాలన్నీ మనందరికీ తెలియనివేమీ కాదు. అందుకే తుండుగుడ్డ పేరిట ఎన్నో జాతీయాలూ, సామెతలూ వెలిశాయి. ‘నడుం బిగించారు’ అనే మాటలో తువ్వాల అనే మాటే లేకపోయినా... ఏదైనా పనికి ఒడిగడుతున్నామంటే తువ్వాలనే నడుముకి బిగించామన్నది సమస్త తెలుగువాడకందారులందరికీ సుపరిచితమైన మాట. ఇక తలకు గుడ్డ కట్టుకోవడం అన్నది చాలా శ్రమతో కూడిన పనికి ముందర ఆరంభసూచికగా చేసే పని. ఇక ఊళ్లో పెద్దమనిషి డ్రెస్‌కోడ్‌లో భుజం మీద తువ్వాలు తప్పకుండా ఉంటుంది. పైగా దాని క్వాలిటీ మీదనే ఆయన ఎంత పెద్దవాడనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద నేతలైతే ఖద్దరు కండువాలూ, రాజకీయ వాసనలేమీ లేకుండా జస్ట్... మామూలు పెద్దవాళ్లు (అనగా పెద్దరికం మైనస్ రాజకీయాలు అన్నమాట) అయితే ఖరీదైన టర్కీటవళ్లు, ఓన్లీ పెద్దమనుషులైతే మంచి క్వాలిటీ కండువాలు, అదే శ్రామిక వర్గం అయితే ముతక తుండుగుడ్డలు భుజాల మీద ఉంటాయి. అనగా... మతం, కులం, ఇతర సూచికలతో పాటు... సామాజిక వర్గీకరణకు సైతం తుండుగుడ్డలు బాగా ఉపయోగపడతాయని సోషియాలజిస్టులు ఇంకా కనుగొనాల్సిన వాస్తవం. ఇక ఆధ్యాత్మికతకూ తుండుగుడ్డ ఒక సూచన. కావి రంగు తువ్వాల దీనికి ఒక తిరుగులేని చిహ్నం. ఆడంబరాలకూ, ఐశ్వర్యాలకూ, ఐహిక భవబంధాలకూ దూరంగా ఉన్నారని తెలపడానికీ ముతక కావిరంగు భుజంగుడ్డ ఒక తార్కాణం. సర్వసంగ పరిత్యాగ గుణంతో, ఒక రకమైన నిర్లిప్తతతో గడిపే గుణం తెలిపేందుకు ఈ భుజం గుడ్డ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తన శంకరశాస్త్రి గారి భుజాన ఇది వేసి చూపెడతాడు. పవర్‌లెస్ అని చూపించడానికి అదెంత పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందో నిరూపిస్తాడు. చిత్రమేమిటంటే... టవల్ అనే ఒకే ఒక అంశం... అటు ఆడంబరతకూ, ఇటు నిరాడంబరానికీ... ఈ రెండు గుణాలకూ ప్రతీక కావడం దాని గొప్పదనం. దండెం మీద వేలాడుతూ సామాన్యంగా కనిపిస్తుందని దానివైపు అసలు దృష్టే పోవడం లేదని అనుకోకండి. అటు సూపర్‌స్టార్ రజనీని అయినా, ఇటు కామన్స్టార్ శంకరశాస్త్రి గారినైనా సమదృష్టితో ఆదరించే గుణం తువ్వాలకు ఉంది. ఆ వస్త్రవిశేష నేత విజ్ఞతలో భగవంతుడికి ఉన్నంత స్థితప్రజ్ఞత ఉంది. - యాసీన్ -
మిర్రర్ అండ్ ఎర్రర్!
హ్యూమర్ మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ అండ్ కో అనే అద్దాల కంపెనీలోని ఉద్యోగులంతా కొత్త బిజినెస్ ఐడియా కోసం మేధోమథనం చేస్తున్నారు. అద్దాలన్నీ రొటీన్‌గా ఉంటు న్నాయి. కొత్తరకం అద్దం ఏదైనా తయారు చేద్దామన్నది ఆ మీటింగ్ ఉద్దేశం. అంతలో ఓనర్‌కు తటాలున ఒక ఐడియా తట్టింది. దాన్ని ప్రకటించగానే మిగతా భాగస్వాములంతా సంతోషంగా ఆమోదించారు. ‘‘నువ్వు వెంటనే ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకొని ఆ తరహా అద్దాలు తయారు చెయ్. ఇక పిచ్చి సేల్స్. బ్లాకులో అమ్మినా అమ్ముతారు’’ అని ఆదేశించాడు కంపెనీ ఓనర్. వెంటనే రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ వాళ్లను పిలిపించారు. అందులో ఒక చీఫ్ సైంటిస్టుకూ ఆ ఐడియా విపరీతంగా నచ్చింది. ‘‘భలే వచ్చింది సార్ మీకు ఐడియా. ఈ ఐడియాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా?’’ అడిగాడు సైంటిస్ట్. ‘‘ఏమీ లేదయ్యా. రాత్రి మాయా బజార్ సినిమా చూశా. అందులోని పాత్ర ధారులంతా ఒక అద్దంలోకి చూస్తుంటారు కదా. మన టీవీలాంటిదే కదా ఆ అద్దం అనిపించింది మొదట్లో. కానీ తర్వాత గబుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న తరహా మిర్రర్స్ చేసి అమ్మాం అనుకో.. సావిత్రికి ఏఎన్నార్ కనిపించినట్టు... దానిలోకి చూసిన వాళ్లందరికీ వాళ్ల లవర్స కనిపిస్తారని చెప్పామనుకో... ఇక అందరూ దాని కోసం ఎగబడతారు. ఓల్డేజి వాళ్లూ తమ లవర్స్ ఎవరో చూసుకోడానికి ఉవ్వి ళ్లూరుతారు. ‘వాలెంటైన్స్ డే’ నాడు ఈ ‘లవర్స్ మిర్రర్స్’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే సందర్భానికి తగినట్లుగా కూడా ఉంటుంది’’ అన్నాడు మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ యజమాని సంతోషంగా. ‘‘చాలా బాగుంటుంది సార్. అసలు ఐడియా వినడానికే ఎక్సైటింగ్‌గా ఉంది. అంతెందుకు, నా లవర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది సార్’’ అన్నాడు అప్పుడే చేరిన యంగ్ అప్రెంటిస్ ఒకడు. ‘‘ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉంది సార్. మారేజ్ బ్యూరోలూ, మ్యాట్రి మోనియల్ కంపెనీలకూ అమ్మవచ్చు. నిజానికి మనం అమ్మాల్సిన అవసరం లేదు సార్. తమ దగ్గర ఇలాంటి సదు పాయం ఉందనీ, సంబంధాలు వెతకడం అంతా షార్ట్‌కట్‌లో అయిపోతుందని వాళ్లంతా మనకు బోలెడు ఆర్డర్స్ ఇస్తారు’’ అన్నాడు బిజినెస్ డెవెలప్మెంట్ వింగ్ అధికారి. ‘‘అవున్సార్. మన టీవీ యాడ్స్‌లో ఈ క్లిప్పింగ్నూ చూపిద్దాం. ‘శశిరేఖకు అభిమన్యుడు, మరి మీకు ఎవరు...?’ అనేది మన టీవీ యాడ్ క్యాంపెయినింగ్ క్యాప్షన్. యూత్‌ను ఆక ర్షించే పవర్ఫుల్ స్లోగన్స్ కూడా తయారు చేద్దాం’’ అన్నాడు క్రియేటివ్ డెరైక్టర్. ‘‘నిజమే సార్. బ్రాండ్ అబాసిడర్స్గా స్టార్సని తీసుకోవాలి. మీరు చెప్పిన మాయాబజార్లోని శ్రీకృష్ణుడినే తీసుకుంటే దిగులే లేదు. పైగా ఆయన తనను లవ్ చేసిన రుక్మిణిని చేసుకున్నాడు. సొంత చెల్లెలు సుభద్ర అర్జునుడిని లవ్ చేస్తే వాళ్లకి పెళ్లి చేశాడు. అన్న కూతురు శశిరేఖ, చెల్లెలి కొడుకు అభిమన్యుడిని లవ్ చేస్తే అదీ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా చూసే కద్సార్ మీకు ఈ ఐడియా వచ్చింది’’ అన్నాడు మరో సబార్డినేట్. ‘‘వాట్ యాన్ ఐడియా సర్జీ’’ అన్నాడు మరో ఉద్యోగి. ‘‘ఇదంత వర్కవుట్ కాదనుకుంటా సర్’’ ఆ సంతోషపు మూడ్స్ చెడగొడుతూ మూల నుంచి ఒక గొంతు వినిపించింది. ‘‘ఏం మాట్లాడుతున్నారండీ...’’ అంటూ ఒక్కసారే అరిచారంతా. బాస్ ఐడియాను మెచ్చుకోని వాళ్లంతా మూకుమ్మడిగా ఆ గొంతు తాలూకు ఓనర్ ఎవరా అని ఆ వైపునకు తిరిగారు. అందరూ అవుననే దాన్ని ఎవడైతే కాదంటాడో వాడే రాంబాబు. ‘‘అయినా ఎంత ధైర్యం... ఇంత సేలబుల్ ఐడియాను బాస్ చెబితే కాదం టారా? పైగా అంత క్రియేటివ్ ఫ్యాంటసీ అద్దాన్ని రియల్‌గా తయారు చేయ బోతుంటే... తయారు కాకముందే ఆ అద్దాన్ని బద్దలు కొడు తున్నారా? హౌ శాడ్’’ అంటూ నిట్టూర్చారు ఒకరిద్దరు. ‘‘అవున్సార్. ఇది ఫ్యాంటసీ రియాలిటీ అయినా... అది అందు బాటులోకి రాకముందే ప్రొడక్ట్ చచ్చి పోతుంది సార్. ఇందులో పెద్ద ఆలో చించాల్సిందేమీ లేదు, చిన్న లాజిక్.’’ ‘‘మీకు మాత్రమే తెలిసిన ఆ లాజిక్ ఏమిటో?’’ వ్యంగ్యంగా అడిగాడు ఓనర్. ‘‘ఏమీ లేదు సార్. మీరు మీ లవర్ ఎవరో అందులో చూస్తారు. మీ ఆవిడ అదే మిర్రర్‌లోకి చూసినప్పుడు... ఇంకెవడో గానీ కనపడితే ఏముంద్సార్. కాపురం కొలాప్స్. అదే ఈ మిర్రర్‌లోని ఎర్రర్’’ అన్నాడు రాంబాబు. - యాసీన్ -
అన్ని చెట్లూ ఉన్నా ఆముదం చెట్టే గ్రేట్!
హ్యూమర్ ‘‘ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమనీ...’’ అంటే అనుకున్న పని పూర్తి చేయని ఒకరిని నేను ఫోన్లో కోప్పడు తుండగా వచ్చాడు మా బుజ్జిగాడు. ‘‘నేను ఒప్పుకోను నాన్నా’’ అన్నాడు. ‘‘ఏమిట్రా నువ్వు ఒప్పుకోనిది?’’ అడిగా. ‘‘ఏమీ లేని చోట ఆముదం చెట్టు గొప్ప అంటే నేను అస్సలు ఒప్పుకోను’’ అన్నాడు వాడు. ‘‘ఇది నేనన్నమాట కాదురా. ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటున్న మాట’’ అన్నాన్నేను. ‘‘ఎర్త్ రౌండుగా లేదని ఏళ్ల తరబడి చెప్పుకున్నారట. అన్నంత మాత్రాన అది నిజమైపోయిందా?’’ ‘‘ఇంతకీ నువ్వేమంటావ్?’’ అడిగాను. ‘‘దీనికి ఆన్సర్ చెప్పాలంటే నీతో చాలా చెప్పాలి’’ అన్నాడు వాడు. ‘‘మరి చెప్పు’’ అన్నాను ఏం చెప్తాడో చూద్దామని. ‘‘లాస్ట్ ఇయర్ సెలవుల్లో నాకు ఈత నేర్పాలని నువ్వనుకున్నావ్. అందుకోసం సద్దల చెరువుకు తీసుకెళ్లావ్. అక్కడ ఆముదపు లొట్టలన్నీ ఒక చోట చేర్చి కట్టిన కట్టను నా వీపుకు కట్టి... చెరువులో నేను తేలేలా చేశావ్. ఆముదపు లొట్టలు కాకుండా... ఇంకేవైనా సన్నటి కొమ్మల కట్టతో నాకు ఈత నేర్ప గలిగేవాడివా?’’ ‘‘అలా ఎలా కుదుర్తుంది? తరతరాలుగా ఎంతోమంది ఆముదపు లొట్టలే కట్టి ఈత నేర్చుకున్నారు’’ ‘‘ఓకే... కొత్తగా పుట్టే ఆముదపు ఆకు అందాన్నీ, ఆ ఆకు డిజైన్‌నీ, ప్యాట్రన్నీ ఎప్పుడైనా దగ్గరిగా చూశావా? దానంత అందమైన ఆకులు నువ్వనుకునే పెద్ద పెద్ద చెట్లయిన మర్రి, వేప లాంటి వాటికి ఉన్నాయా?’’ ‘‘లేవు. అయితే...’’ ‘‘ఉండుండు. నన్ను పూర్తి చేయనీ... అప్పుడు నేను బోల్డంత చిన్నగా ఉన్నప్పుడు బుడగలూదేవాడి దగ్గర పైపు ఇప్పించమని కోరుతుండగానే వాడు మనకు అందకుండా సైకిల్‌మీద వెళ్లిపోయాడు. అప్పుడు నువ్వు ఆముదపు ఆకుకు ఉన్న కాడను కోశావ్. సబ్బునీళ్ల సీసాలో దాన్ని ముంచి ఊదితే... బుడగలు బుడగలన్నీ దొంతర్లుగా వచ్చేట్లు చేసిన సీన్ నీకు గుర్తుందా?’’ ‘‘ఉంది.’’ ‘‘ఇక ఆముదం చెట్టు కాయలు కాసే సమయంలో దానిపై మొదట్లో మెత్తగా ఉన్న ఈనెల్లాంటి ఆకృతులు, కాయ ఎండాక ముళ్లలా తయారవుతాయి. ఆ సమయంలో కాయను పగలగొడితే... ఆముదపు గింజ వీపు మీద ఉన్నంత క్రియేటివ్ డిజైన్ ప్యాట్రన్ ఆలివ్‌రిడ్లే తాబేళ్ల వీపు మీద కాకుండా మరెక్కడైనా ఉంటుందా?’’ ‘‘లేదు... అయితే’’ అంటూ నేనేదో చెప్పబోతుండగా మధ్యలోనే అందు కున్నాడు. ‘‘నన్ను పూర్తి చేయనీ... నీ తలకాయ సదరు ఆయిల్‌ను హ్యాపీగా రాసుకుని... ‘ఆముదం రాయండీ... ఈలేయండి’ అంటూ నువ్వు జోక్ చేసే విలువైన ఆయిల్ ఏది?’’ ‘‘ఆముదమే.’’ ‘‘కదా... మరి అలాంటి ఆముదం నీలాంటి మంచివాడి తలమీదకెక్కడంతో పాటూ ఇటు దొరక్కుండా ఉండేందుకు దొంగలకూ ఉపయోగపడుతుందట. ఇక ఆరోగ్యం బాగుండాలంటూ అప్పట్లో పిల్లలకు ప్రతివారం ఆముదం పట్టించేవారని నువ్వే చెప్పావు. అది తాగిన మోము వల్లనే ‘ఆముదం తాగినట్లుగా ముఖం పెట్టారనే వాడుక పుట్టిందని కూడా అన్నావు. పిల్లలను అమ్మదొంగా అని పిలుస్తుంటారు కదా. ఇలా పిల్లలనూ, దొంగలనూ ఒకే గాట కట్టించిన ఆముదం అన్నా... ఇంతటి సోషలిజం పాటించేందుకు దోహదం చేసిన ఆ చెట్టన్నా నాకెంతో గౌరవం’’ అన్నాడు మా బుజ్జిగాడు. ‘‘మరి ఇప్పుడు నన్నేం చేయ మంటావురా’’ విసుగ్గా అడిగాన్నేను. ‘‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టు గొప్ప అనకు. అన్ని చెట్లూ ఉన్నచోటైనా ఆముదం చెట్టే గ్రేటు అను. అప్పుడే నాకు బ్లిస్సు’’ అన్నాడు సీరియస్‌గా. నా మాట తుస్సు మనడంతో ఇప్పుడు నేను ఆముదం తాగినట్టు ముఖం పెట్టి, ఎప్ప ట్నుంచో నా నోట్లో ఆడు తున్న సామెతను మార్చుకోక తప్పలేదు. - యాసీన్ -
మిఠాయి కొట్టున పకోడి పొట్లం!
హ్యూమర్ వస్తూ వస్తూ రైల్వేస్టేషన్లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను. ‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను. ‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు. దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను. ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా. మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు. అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా. ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా. ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ. ‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు. అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా. అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను. ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా? ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను. - యాసీన్ -
సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!
హ్యూమర్ సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. మా రాంబాబుగాడు సందు చివర నుంచి వస్తూ కనిపించడం చూసి తప్పించుకు పోదామనే ప్రయత్నంలోనే వాడికి పట్టుబడిపోయాను. ‘‘ఏంట్రా చూసి కూడా చూడనట్లు వెళ్లిపోతున్నావు’’ అడిగాడు నిష్టూరంగా. ‘‘మొన్నంతా ఇడ్లీ గురించి మాట్లా డావు కదా. మళ్లీ ఇప్పుడు సాంబార్ గురించి సీక్వెల్ స్టోరీ ఏదైనా చెబుతావని భయమేసి...’’ అంటూ ఏదో నసుగు తుండగానే మధ్యలో తుంచేశాడు. ‘‘సాంబార్ గొప్ప గురించి వేరే చెప్పే దేముందిరా. సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. నాకు మొన్న చేతి ఎముక విరిగితే ప్లేట్లు వేస్తా నన్నారు కదా డాక్టర్లు! ఇడ్లీ, అన్నం తినే టైమ్‌లో దాంట్లోనూ ఎక్స్ట్రా సాంబార్ పోయించుకోవచ్చుకదా అని ఆశపడ్డాను. కానీ ఆ ప్లేట్స్ ఒంటి లోపల ఉంటాయట. సాంబార్ పోసుకోడానికి వీలు కాదని డాక్టర్ చెప్తే కాస్త డిజప్పాయింటయ్యా.’’ ‘‘నువ్వు మరీ టూమచ్రా’’ అన్నాను నవ్వాలో ఏడవాలో అర్థం కాక. ‘‘ఇందులో టూమచ్ ఏముంది! మొదట్లో దాన్ని అందరూ ‘చాంపార్’ అని పిలిచేవారట. వంటింట్లోంచి చాంపార్ వాసన వస్తుంటే, అప్పటి వరకూ పరుషంగా ఉన్నవాళ్లు కూడా సరళంగా మారిపోయేవారట. దీన్ని గుర్తించిన తమిళ సోదరులు సాంబార్ అని పిలవడం మొదలు పెట్టారట.’’ ‘‘నువ్వు కనిపించగానే అనుకున్నా నేను సూప్‌లో పడిపోయానని’’ అన్నాను బిక్కమొగమేసి. ‘‘నువ్వు చెప్పే ‘సూప్’ కూడా మన సంస్కృత పదమైన సూపమ్ నుంచి వచ్చింది. ‘భోజనం దేహి రాజేంద్రా... ఘృత సూప సమన్వితం’ అంటూ భోజ రాజు దగ్గర భోజనంతో పాటు పప్పును అడిగి తీసుకునేవారట పండితులు. మన సూప మహత్యాన్ని కనిపెట్టిన మ్లేచ్ఛులు మన పప్పుచారు ఫార్ములాను దొంగి లించి, దాన్ని కాస్త మార్చి సూప్ అని పేరు పెట్టుకున్నారు తెలుసా? అన్నట్టు సాంబార్ కుతకుత ఉడికినట్లుగానే పౌరు లందరిలోనూ నెత్తురు మండించి, శక్తులు నిండేలా చేయాలనే సోషలిస్టు భావనతోనే పప్పుచారు తయారు చేశారు.’’ ‘‘పప్పుచారుకూ సోషలిస్టు భావాలకూ సంబంధమేముందిరా?’’ ‘‘ఇప్పుడున్న ప్రభుత్వాల అసమర్థత వల్ల పప్పుల ధర భవిష్యత్తులో బాగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారు. దాంతో పప్పును అందరికీ అందుబాటులోకి తేవా లనే సోషలిస్టు భావనతో పప్పుచారును కనిపెట్టారు మనవాళ్లు. అలా పప్పుకు అడ్వాన్స్డ్ రూపమైన మన సాంబారు ఆవిర్భవించింది.’’ ‘‘పప్పుకు అడ్వాన్స్డ్ రూపమా సాంబారు!?’’ అయోమయంగా అడిగా. ‘‘కాదా మరి. కర్రీ పాయింట్లలో కాస్త ఆలస్యంగా పప్పు కోసం అడిగావనుకో. దొరకదు. కానీ సాంబారు మాత్రం లేటైనా దొరుకుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో పప్పుకంటే సాంబారు ఎక్కువ ఫిట్టెస్టు అని తెలిసిపోయింది కదా? పరిణామ క్రమంలో పప్పు తర్వాత వచ్చినా సాంబారు సర్వైవల్ విషయంలో మరింత సమర్థమైనదని తేలిపోయింది. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సూక్తిని గుర్తుం చుకున్నారు డార్విన్. అందుకే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టు అన్న విషయాన్ని తన కిచెన్లోనే ముందుగా కనిపెట్టినా... ఆరిజిన్ ఆఫ్ పప్పూస్ అండ్ పల్సెస్ నుంచే ‘ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్’ అన్న విషయాన్ని ఆ తర్వాత విశ్వవ్యాప్తం చేశాడట’’ అన్నాడు. ‘‘కొయ్... కొయ్’’ అన్నాను. ‘‘పప్పును కొయ్యడం కుదరదు. పప్పు గింజను ఎంతసేపు చప్పరించినా దాని చవి తెలియదు. అదే పంటి కింద నలగ్గొట్టావనుకో, దాని టేస్టు పెరుగుతుంది. రుచి తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న మన పూర్వీ కులు పప్పును నలగ్గొట్టడానికి పప్పుగుత్తిని కనిపెట్టారు. అలా పప్పు నుంచి పప్పుచారును ఆవిర్భవింప జేశారు. ఆ తర్వాత డార్విను, ఇతర పాశ్చాత్యులు ఆ పరిజ్ఞానాన్ని పరిగ్రహించి మరింత పరిపక్వం చేశారంతే’’ అన్నాడు పక్వం అనే మాటను ఒత్తిపలుకుతూ. ‘‘నా పప్పులు ఉడికాయ్. ఇక నన్ను విడిచిపెట్టు’’ అంటూ ఇల్లు చేరీ చేరగానే తలుపులు బార్లా తెరచి, సాంబార్లా జారిపోయాను. - యాసీన్ -
టెంకాయ మీది పీచు... తలకాయ మీది కుచ్చు!
హ్యూమర్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ -
మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !
హ్యూమర్ మా బుజ్జిగాడిని తీసుకొని హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్తుంటే ఎదురొచ్చాడు మా బ్రహ్మంగాడు. ‘‘ఏంట్రా వాడి జుట్టు అలా పెంచేశావ్. ఈ వయసులో వెంట్రుకలు చిన్నగా ఉండాలి. స్మార్ట్‌గా కనిపిస్తూనే చిన్నగా ఉండేలా కట్ చేయమని బార్బర్‌తో చెప్పు’’ అని సలహా ఇచ్చాడు వాడు. ‘‘అబ్బే లేదురా. మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది మా ఆవిడ. అందుకోసమే ఇంత పెరిగేదాకా ఆగి, ఇప్పుడా కటింగ్ చేయించబోతున్నా’’ అన్నాన్నేను. ‘‘ఐన్‌స్టీన్ కటింగా? అదెందుకూ’’ ఆశ్చర్యపోయాడు వాడు. ఇక ఒక శ్రోత దొరికిన ఆనందంలో కారణాలు వివరించా. మా బుజ్జిగాడికి సైన్స్ బాగా రావాలని ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టా. ఏదైనా వస్తువుకు వేడి తగిలితే అది కరుగుతుందనీ, ఘన పదార్థమైతే ద్రవంగా మారుతుందనీ వివరించా. పేరిన నెయ్యిని కరిగించడానికి వేడి చేస్తామనీ, చలికాలంలో కొబ్బరినూనె పేరుకుంటే దాన్ని రాసుకోడానికి వీలుగా మార్చడానికి ఎండలో పెడతామనీ సోదాహరణంగా చెప్పా. వాడూ ఇంటరెస్టింగ్‌గానే విన్నాడు. ఓరోజు రాత్రి వాడు అకస్మాత్తుగా ‘‘నాన్నా... వేడిచేస్తే ఘనపదార్థాలు ద్రవంగా మారతాయని నువ్వు చెప్పిన ఫిజిక్స్ సిద్ధాంతం తప్పు’’ అంటూ ఓ బాంబు పేల్చాడు. ‘‘అదెలారా? కొబ్బరినూనెనూ,పేరిన నెయ్యినీ ఎగ్జాంపుల్స్‌గా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఇలా ఎర్రర్స్ మాట్లాడితే ఎలారా?’’ అని అడిగా. అప్పుడు వాడు వివరించిన విషయాలు ఇవి. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం. కోడిగుడ్డు కొన్నప్పుడు దాని లోపలి సొనలు ద్రవరూపంలో ఉంటాయి. కానీ అమ్మ నీకోసం బాయిల్డ్ ఎగ్ చేయడానికి వాటిని ఉడక బెడుతుంది. అంటే కొన్ని నీళ్లు పోసి వేడి చేస్తుంది. నీ లెక్క ప్రకారం ద్రవరూపంలో ఉన్నవి, వేడి చేశాక వాయు రూపంలోకి రావాలి. కానీ ఇక్కడంతా రివర్సు. వేడిచేశాక గుడ్డులో ఉన్న ద్రవం కాస్తా ఘన రూపంలోకి మారుతుంది కదా’’ అన్నాడు వాడు. ‘‘నువ్వు మొండిగా వాదిస్తున్నావ్. గుడ్డు ఉడకబెట్టడం వేరు. ఈ ఒక్క అంశాన్నీ పట్టుకొని ఫిజిక్స్ సూత్రాలు తప్పు అనడం తప్పురా’’ అంటూ నేనేదో సర్దిచెప్పబోయా. కానీ వాడు ఒప్పుకోలేదు. ‘‘ఇదొక్కటే కాదు నాన్నా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతెందుకు... ఇడ్లీలు వండే సమయంలో ఇడ్లీ పాత్రలో దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండిని అమ్మ ఇడ్లీ పళ్లేలలో పోస్తుంది. వాటిని ఇడ్లీపాత్రలో ఉంచి, కింద నీరుపోసి వేడిచేస్తుంది. నిజానికి నేరుగా తగిలే మంట కంటే... ఆవిరిలోనే వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే నీ లెక్క ప్రకారం ఆవిరికి మరింత వేడి ఎక్కువ కాబట్టి దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండి, ఈ వేడికి వాయురూపంలోకి మారాలి. కానీ మళ్లీ ఇక్కడ పిండి కాస్తా రుచికరమైన ఇడ్లీలా... అంటే ఓ ఘనపదార్థంగా, ఘనమైన వంటకంగా మారిపోతుంది. అంతేకాదు, పాలు కాచి వేడి పాలలో తోడేసి, వెంటనే ఫ్రిజ్‌లో పెడితే అది పెరుగులా అంటే ఘన పదార్థంగా మారదు. బయట ఉంచితేనే గట్టిగా పేరుకుపోయి పెరుగవుతుంది. అలా అయ్యాకే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పే ఫిజిక్స్ సూత్రాలు నెయ్యికీ, కొబ్బరి నూనెకీ ఒక రకంగానూ, ఇడ్లీకీ, కోడిగుడ్డుకూ మరోరకంగానూ వర్తిస్తాయని నా మెదడు ల్యాబ్‌లో చేసిన ఆలోచనల ఎక్స్‌పెరిమెంట్స్‌లో తేలింది. పైగా అది మన కిచెన్ల్యాబ్లో ప్రూవ్ కూడా అయింది కదా నాన్నా. అలాంటప్పుడు వేడి తగిలితే ఘనపదార్థాలు కరుగుతాయనీ, ద్రవాలు వాయురూపంలోకి మారతాయని, చల్లబరిస్తే ద్రవపదార్థాలు ఘనరూపంలోకి మారతాయని నువ్వు చెప్పింది తప్పు కదా?’’ అని అడిగాడు వాడు. ‘‘మరి మీవాడి ఎక్స్పెరిమెంట్స్కూ, ఐన్‌స్టీన్ కటింగ్కీ సంబంధమేమిట్రా’’ అడిగాడు బ్రహ్మం. ‘‘ఈ సంభాషణ మొత్తం మా ఆవిడ విన్నది. ఐన్‌స్టీన్ తెలివితేటలన్నీ ఆయన విలక్షణమైన జుట్టులోనే ఉన్నాయని ఎవరో అన్నారట. అందుకే ఆమె మావాడి తెలివి తేటలకు అబ్బురపడిపోయి... వెంటనే వాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది. ఇక మావాడు అన్నీ సైంటిఫిగ్గా ప్రూవ్ చేశాడు కాబట్టి, పైగా నేను మా ఆవిడ మాట కాదనను కాబట్టి మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించడానికే ఫిక్సయిపోయా’’ అంటూ కారణాన్ని వివరించా. ‘‘అవున్రా... నువ్వు చెప్పింది కరెక్టే. పైగా జుట్టు పొడవుగా ఉన్నందువల్ల దాన్ని సర్దుకోవడానికి తల ఎగరేసినప్పుడల్లా మెదడు కూడా కదలి మరింత చురుగ్గా మారవచ్చు. దాంతో మీవాడికి మరిన్ని ఐడియాలు రావచ్చు’’ అంటూ వాడు మరింత సైంటిఫిగ్గా వివరించేసరికి మా ఆవిడ నిర్ణయం సరైనదే అన్న భావన నాలో మరింత బలపడింది. - యాసీన్ -
సహజ పండిత సంపర సాంబయ్య!
ప్రముఖుల హాస్యం పానుగంటి నరసింహారావు గారిది కాబోలు ఒక కథ ఉంది. ఆయన దర్శనానికి ఒకరు వచ్చి ఒక కాగితం ముక్క మీద తన పేరు వ్రాసి లోపలికి పంపారు. దాని మీద నాలుగు పొడి అక్షరాలు ఉన్నాయి... స.ప.స.సా. అని! లోపలకు రమ్మన్నారు ఆ పెద్దమనిషిని. వచ్చిన ఆసామిని చూడగానే, ‘‘నువ్వటోయ్ సాంబయ్యా’’ అన్నారు ఆయన. ‘‘చిత్తం’’ అన్నాడు. ‘‘ఈ పొడి అక్షరాల అర్థం ఏమిటోయ్’’ అని ప్రశ్నించారు పానుగంటి వారు. అతడు వినయంతో తల వంచుకొని, సిగ్గు పడుతున్నట్లు- ‘‘సహజ పండిత సంపర సాంబయ్య’’ అని మనవి చేశాడు. ‘‘ఈ బిరుదెవరిచ్చారోయ్’’ అని పానుగంటి వారు అడిగితే,‘‘నేను స్వయంగా తొడుక్కున్నది’’ అన్నాడు సాంబయ్య. ‘‘అయితే సాంబయ్యా! ఇప్పుడు వైద్యం మానేశావా? ఏంజేస్తున్నావ్?’’ అనగానే, ‘‘ఏదో కొంచెం కవిత్వం చెప్తున్నానండీ!!’’ అన్నాడు సాంబయ్య. ‘‘భేష్, కవిత్వమైతేనైం? వైద్యమైతేనేం? ఏదైతేనేం, నలుగురిని చంపడానికి’’ అని పానుగంటి వారన్నట్లు వినికిడి. ‘సహజ పండిత’ అనేది సాంబయ్య స్వయంగా తనకు తాను ఇచ్చుకున్న అమూల్యాభిప్రాయం. ‘‘ఏదైతేనేం, నలుగురినీ చంపడానికి’’ అన్నది పానుగంటి గారు సాంబయ్య వంటి వారిపై కలకాలం ఉండేటట్టు ఇచ్చిన అమూల్యాభిప్రాయం. - కృష్ణశాస్త్రి వ్యాసావళి ‘అమూల్యాభిప్రాయాలు’ నుంచి