నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా... | International Jokes day 1st July! | Sakshi
Sakshi News home page

నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా...

Published Fri, Jul 1 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా...

నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా...

International JOKES DAY 1st July
నవ్వితే హ్యాపీ...నవ్వకపోతే బీపీ...నవ్వనివాడు పాపి..!...నవ్వడం తేలికే కానీ.. నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి  నైపుణ్యం ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండి ఉండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు.  విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే మన విశాఖలో కమెడియన్స్ ఎందరో ఉన్నారు.  నవ్వునే వృత్తి, ప్రవృత్తిగా తీసుకొని
 హాస్యగుళికల్ని అందిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటులు  వెండితెరపై నవ్వులు కురిపిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కొందరు మనమధ్యలేకపోయినా వారి పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి.  
             
 
అయితే..ఓకే..  - కొండవలస
ఉత్తరాంధ్ర మాండలికంతో తనదైన యాసతో సినీ లోకాన్ని నవ్వించారు హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు. మనలో లేకపోయినా ఆయన కామెడీ డైలాగులు నేటికి కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వెయ్యి నాటకాల్లో నటించి, రెండు రంగస్థల నందీ అవార్డులను తీసుకున్న కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’చిత్రంతో పొట్రాజు పాత్రలో కొండవలస నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
 నేనొప్పుకోను..ఐతే ఒకే..అనే ఊత పదంతో తెరంగేట్రం చేసి నవ్వుల్ని పంచుతూ స్టార్ కామెడియన్‌గా మారిపోయాడు.

‘ఇండియన్ గ్యాస్’ అనే నాటకంలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలికారు. ఆ విధానం అప్పట్లో అందరికీ నచ్చింది. అదే తీరును ఆయన సినిమాలో తన పాత్రలకు అన్వయించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. భౌతికంగా ఆయన లేకపోయినా, కొండవలస చేసిన పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి.
 
ప్రేక్షకుల ‘వేలు’ విడవని నటుడు
ఒక పాత్ర ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహరావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెండంత లేవు? ఏమిటీ అల్లరి? అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్లు పేలవడంతో‘వేలు’అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన.

ఆకారానికి అంగికాభినయ ప్రతిభతోడై, దర్శక రచయిత జంధ్యాల విశాఖలో రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’చిత్రంలోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’వీరభద్రరావుతో కలసి సుత్తి జంటగా 1980-90లలో సినీసీమను కొన్నేళ్ల ఏలారు. కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో పుట్టిన సుత్తివేలు ఉద్యోగ రీత్యా విశాఖలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు.  

చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిచినా ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో స్టోర్‌కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా తొలినాళ్లలో విశాఖలో చిత్రీకరించిన ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్తంభాలాట’నాటి ‘సుత్తివేలు’ జోరందుకుంది.

నాలుగు స్తంభాలాట,ప్రతిఘటన, వందేమాతరం, ఈ పిల్లకు పెళ్లవుతుందా? ఈ చదువులు మాకొద్దు., ఒసేయ్ రాములమ్మలో రాములమ్మ తండ్రి పాత్రగా ఇలా క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యభరితమైన పాత్రలు పొషించారు. రెండు జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, రెండురెళ్లు ఆరు, సీతారామ కల్యాణం, చంటబ్బాయ్ లాంటి సినిమాలు చూస్తే తెలుగుతెరను ఆయన నవ్వులతో ముంచెత్తిన సీన్లే కనిపిస్తాయి.
 
నవ్వులరేడు...చిదంబరం...
తెరపై అతని ఆహార్యం చూస్తే చాలు పొట్ట చెక్కలవుతోంది. ఆయన స్వరం వింటే చాలు ప్రేక్షకుని ముఖం నవ్వు పులుముకుంటుంది. వెండితెరపై చేసేది చిన్నపాత్రయినా..వాస్తవాల్ని ప్రతిబింబించే సంఘటనలు. అందుకే ఆయన హాస్యగుళికలు తెలుగు తెరపై ఓలలాడించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు కళ్లు (కల్లూరి)చిదంబరం నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల,సినీ హాస్యనటుడు కావడం విశేషం.

300 చిత్రాల్లో నటించారు. ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, కళ్లు, అమ్మోరు, మనీ, గోవిందా గోవిందా, పవిత్ర బంధం, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు కొల్లూరు చిదంబరం. మొట్టమొదట ప్రసిద్ధి దర్శకుడు సత్యానంద్, మిశ్రో తదితరుల బృందాలతో నాటకాలు వేసేవారు.  తనకు తెలిసిన హాస్యరసంతో సినీ ప్రేక్షకులను రంజింప చేశారు. తెరపై కనిపించగానే ఆయన్ని ఎలాంటి వారైనా గుర్తుపట్టేస్తారు. దానికి ఆయన రూపం స్వరం కారణం.
 
‘షర్టు మీద టీ పడితే?’..టీ-షర్ట్ అవుతుంది :  నాన్‌స్టాప్ కామెడీ కింగ్ రంగారావు
లిమ్కా రికార్డుల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన నగరానికి చెందిన ప్రముఖ లాఫర్స్ ఫన్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు ఒక్క నిమిషంలో 37 నవ్వులు పండించిన ప్రతిభావంతుడు. మచ్చుకు కొన్ని..‘మీ హోటల్లో వేడిగా ఏమున్నాయ్..’?/ బొగ్గులు, సబ్బులెన్నునా..?/నురుగొక్కటే,‘ నీకు ఏ పుస్తకం ఇష్టం..’/ చెక్‌పుస్తకం, ‘ఏ జూలోను కనబడని జంతువు’/అడ్డగాడిద...ఇలా నాన్‌స్టాప్ జోక్స్‌తో ప్రేక్షకుల్ని కడుబ్బా నవ్విస్తూ అత్యధిక జోకులు చెప్పి లిమ్కా రికార్డులో కొత్త రికార్డు సృష్టించారు.

పది గంటలు ఏకబిగిన సుమారు 40 వైవిధ్యమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తూ రంగారావు చేసిన నవరసావిష్కారం కట్టిపడేస్తోంది. ఏవర్గాన్నీ నొప్పించని, క్లుప్తమైన కొంటె ప్రశ్న, చిలిపి సమాధానం తరహాలో బుల్లెట్ ట్రైన్ వేగంతో ఒక నిమిషం జోకుల పర్వం దూసుకెళ్లే సామర్థ్యం గల రంగారావు జోకులతో నవ్వులు కురిపిస్తారు. ‘0’ పెడితే ఎంత? అనే ప్రశ్నకు గణిత పరిజ్ఞానంలో 100 అనే బదులు తెలుగు భాషా చమత్కారంతో ‘పంది’ అని చెప్పగానే ఆడిటోరియంలో నవ్వులు విరివక తప్పదు.

ఆతర్వాత వరుసగా వంకాయలు ఎలా ఇచ్చావ్? తూచి/ రావణాసురుడు సింగరైతే? కోరస్ అవసరం లేదు/ వాడేంట్రా నవ్వట్లేదు? వాడికి పెళ్లయిందిలే/ నా నవల్లో నీకు నచ్చింది? శుభం/ షర్టుమీద టీ పడితే? టీ-షర్ట్ అవుతుంది వంటి జోకులు డజన్లకొద్దీ నవ్విస్తాయి. కొద్ది సేపు అతిథుల స్పందనల తర్వాత హాస్యమే కాదు నవరసావిష్కారంలోనూ రంగారావు నైపుణ్యాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.
    తికమకపెట్టే క్లయింట్‌తో లాయర్ పడే తిప్పలు ఏకపాత్రాభినయంతో నవరసావిష్కారాలతో శ్రోతులను మంత్రముగ్దుల్ని చేసే శైలి రంగారావుది.
 
హాస్యనిధి-నవ్వుల వారధి
2012లో ప్రముఖ హాస్యరచయిత, నటుడు కాశీ విశ్వనాథ్, కళ్లు చిదంబరంతో ఫ్రెండ్స్ కామెడీ క్లమ్ ప్రారంభించాం. ప్రతినెల మొదటి ఆదివారం హరివిల్లు, వినోదాల విందు పేరిట విశాఖ పౌరగ్రంథాలయంలో ప్రదర్శనలు ఇస్తుంటాం. ప్రతినెల ఒక హాస్య కళాకారుని సన్మానిస్తాం. ఇప్పటి వరకు రెండు వందలకుపైగా ప్రదర్శినిలిచ్చాం.  మా క్లబ్ ద్వారా ఏ కళాకారుడికైనా ప్లాట్‌ఫార్‌‌మ ఇస్తుంది.

ఔత్సాహిక కళాకారులకు వేదిక కావాలనే మా ఉద్దేశ్యం. క్లబ్‌లో ఇప్పటి వరకు మూడువందల వరకు సభ్యులుగా చేరారు. మా ఆశయం ప్రేక్షకులు వచ్చి జోక్సు చెప్పి మమ్మల్ని నవ్వించాలన్నదే. హైజాక్, చినుకు, మేస్త్రి, శ్రీశైలం, శుభప్రదం వంటి చిత్రాల్లో నటించాను.  హాయిగా ఉన్నప్పుడు నవ్వేవాడు సామాన్యుడు, హాయిగా లేనిప్పుడు నవ్వేవాడు అసామాన్యుడు, హాయిగా లేని వారిని నవ్వించేవాడు మాన్యుడు. ఇది మా క్లబ్ స్లోగన్. ఇప్పటి వరకు హాస్యబ్రహ్మ, నవ్వుల రాజు, ఆణిముత్యం, స్నేహబంధు వంటి అవార్డులు పొందాను.
- ఎం.వి.సుబ్రహ్మణ్యం, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు.
 
మంచి ఆటగాడు
‘మంచి ఆటగాడు అని చెపితే ఏ పెద్ద ప్లేయరో అనుకుని పెళ్లి చేసుకున్నా..
 తీరా చేసుకున్న తరువాత తెలిసింది’’ విచారంగా అంది సుమలత.
 ‘ఏమైంది? మరి ??
 ఆటగాడు కాదా అతడు’ అడిగింది శ్రీదేవి.
 ‘ఆటగాడే..తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడట పల్లెటూర్లలో...’ -ఏడ్చింది సుమలత.
 
హల్లో ...ఎఫ్....ఎం... రేడియో అండీ...
అవునండీ.. ఎంవీపీలో పర్సు,
పర్సులో రూ.15వేలు దొరికాయి.
 అప్పలరాజు, వాల్తేర్ అని అడ్రస్‌రాసి ఉంది..
 మీ నిజాయతీకి సంతోషం...ఇప్పుడు మమ్మల్ని
 ఏమి చేయమంటారు?
 అప్పలరాజు కోసం ఓ విషాద గీతం వేస్తారేమోనని...  ఆ..ఆ..
 
ఒక భర్త తన భార్యకు ఇలా ఎస్‌ఎంఎస్ చేశాడు
నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వే నా దేవతవి.
 నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. నువ్వు చాలా మంచిదానివి.
 భర్త పంపిన ఎస్‌ఎంఎస్ చదివి భార్య ఇలా రిప్లై ఇచ్చింది
 తాగడం అయిందా, ఇంక ఎస్‌ఎంఎస్‌లు ఆపు, ఇంటికి రా..భయపడకు..నిన్నేమీ అనను.
 ఇది చదివిన భర్త : థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్నా. దయచేసి తలుపు తియ్.!
 
 
హెదరాబాద్- విశాఖపట్నం.. బస్ ఎక్కిన బామ్మ డ్రైవర్‌తో ఇలా అంది.. బాబు విజయవాడ రాగానే చెప్పు... నేను మర్చి పోతాను అని. డ్రైవర్ సరేనంటాడు..
 కాని డ్రైవర్ మర్చిపోయి విజయవాడ దాటేసి వంద కిలో మీటర్లు వెళ్లిపోతాడు మధ్యలో నిద్ర లేచిన బామ్మ...పక్కనున్న వ్యక్తిని అడుగుతుంది.. విజయవాడ దాటిందనగానే లబోదిబోమని ఏడుపందుకుంటుంది... దీనితో ప్రయాణికులంతా గొడవ చేయడంతో మళ్లీ వెనక్కు వెళ్లి విజయవాడలో దింపేస్తాడు... బస్ దిగిన బామ్మ మాత్ర వేసుకుని నీళ్లు తాగి మళ్లీ బస్ ఎక్కుతుంది.... ఇప్పుడు పోనీ బాబు అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు.... ఏం లేదండీ నేనూ వైజాగ్ వెళ్లాలి..అయితే నా కొడుకు విజయవాడలో మాత్ర వేసుకోమని చెప్పాడు అందుకని...
 -అక్కయ్యపాలెం, పెదగంట్యాడ
 
నవ్వు ఒక టానిక్....
సీతంపేట: ప్రముఖ హాస్య నటుడు , రచయిత,దర్శకుడు రావి కొండలరావు ఆలోచన నుంచి పుట్టింది  విశాఖహ్యూమర్ క్లబ్. 2000 సంవత్సరంలో సంస్థను ప్రారంభించారు. మనిషి తన దైనందిన జీవితంలో అనేక ఒడి దుడుకులు తట్టుకొని నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో  హాస్యం ఉపశమనాన్ని కల్గిస్తుందన్న ఆశతో  సంస్థను స్థాపించాం.

మూడేళ్లు దిగ్విజయంగా నడిపిన తర్వాత , 2003లో తన అన్నకొడుకు రావి గోపి కృష్ణను  అధ్యక్షుడిగా నియమించి క్లబ్ బాధ్యతలు అప్పగించి కొండలరావు హైదరాబాదు వెళ్లిపోయారు.  ఆనాటి నుంచి  విశాఖ హ్యూమర్ క్లబ్  1292 కార్యక్రమాలు దేశ విదేశాలు, వివిధ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి నెలా రెండవ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో  కామెడీషో నిర్వహిస్తున్నాము.  

మా క్లబ్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష ఆదరణతో విశాఖలో నేటికి తొమ్మిది కామెడీ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. హ్యూమర్ క్లబ్‌కు వస్తున్న ఎనలేని ఆదరణకు జీవితాంతం రుణపడి ఉంటాను. - రావి గోపీ కృష్ణ, అధ్యక్షుడు , విశాఖ హ్యూమర్ క్లబ్
 
పేర్లెందుకు లేవు మమ్మీ!
కోడి పిల్లలు : మమ్మీ..! మనుషులంతా పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు. మరి మనమెందుకు పెట్టుకోం?
 కోడి : మనకు చనిపోయాక పెడ్తారమ్మా..చికెన్ 65, చికెన్ పకోడి, చిల్లీ చికెన్..అని
 
తొక్కతో లక్కు...
ఎన్‌ఏడీ జంక్షన్ : అన్న కూతురింటికి బాబాయి అప్పారావు వచ్చాడు... కొత్తగా కట్టిన ఇళ్లు...బాగుందే అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు... గుమ్మంలోనే చూసి బాబాయ్ బాగున్నారా...అంటూ ఆప్యాయంగా పలకరించింది కనకమహాలక్ష్మి. కుశల ప్రశ్నల తరువాత ఉత్సాహంగా ఇల్లాంతా చూపిస్తోంది. ఇది బెడ్‌రూములు...డ్రాయింగ్ రూము...కిచెన్ అన్నీ ఒక్కొక్కటి వర్ణిస్తూ చూపించింది. చివరిగా దేవుని గది చూపించింది. దేవుళ్ల ఫొటోలు చక్కగా అలంకరించింది.

మధ్యలో అరటి పండు తొక్క ఫొటోకు ఫ్రేమ్ కట్టి పూజలు చేసి ఉంది. దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పారావు. ఇదేంటమ్మ అరటిపండు తొక్క ఫొటోకు దేవుళ్ల దగ్గరపెట్టి పూజలు చేశావు అంటూ సందేహంగా అడిగాడు. నాకు ఈ తొక్కతోనే కదా బాబాయ్ లక్కొచ్చింది. ఉబ్బితబ్బిబవుతూ చెప్పింది. అప్పారావు ముఖంలో మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చిపడింది...? ఇక ఈ ముఖాన్ని చూడలేక అసలు విషయాన్ని బయటపెట్టింది. రెండేళ్ల క్రితం మా అత్త ఈ తొక్కమీదే అడుగేసి పడిపోయి బకేట్ తన్నేసింది. ఆ తరువాత బీరువా తాళాలు నాచేతికి వచ్చాయి బాబాయ్ అని చెప్పింది. ఇదీ తొక్కతో వచ్చిన లక్కు...
 
హాస్యప్రియ కామెడీ క్లబ్...
ఇలాంటి పంచ్‌లు ఎన్నో ఈ క్లబ్‌లో కడుపుబ్బా నవ్విస్తాయి. బుచ్చిరాజుపాలెంలో 2012లో ఏర్పాటు చేసిన హాస్యప్రియ కామెడీ క్లబ్ నిర్వహిస్తున్న హాస్యామృతం కార్యక్రమంలో నవ్వుల విందునందిస్తోంది. నేటికి మూడున్నరేళ్ల పూర్తి చేసుకుంది. నెలలో నాల్గవ వారంలో అమర్ పాఠశాలలో సాయంత్రం 6గంటలనుంచి స్కిట్స్ ప్రారంభమవుతాయి. వీరితో పసాటు ఇంతవరకు 223 మంది నూతన కళాకారులకు ఈ వేదిక ద్వారా పరిచయం చేశారు. ఈ క్లబ్ వ్యావస్థాపక కార్యదర్శి ఇమంది ఈశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పికె దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షడు బుగతా సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. అధ్యక్షుడు నక్కాలక్ష్మణరావు మాత్రం కాంట్రాక్టర్. ఇప్పటి వరకు ఎక్కువమంది హాస్యప్రియులను సంపాదించిన అతి పెద్ద క్లబ్ ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement