నిర్మాతల్నీ నవ్విస్తారా | Telugu comedians are heroes and laughs at the audience | Sakshi
Sakshi News home page

నిర్మాతల్నీ నవ్విస్తారా

Published Tue, May 21 2019 12:13 AM | Last Updated on Tue, May 21 2019 12:13 AM

Telugu  comedians are heroes and laughs at the audience - Sakshi

సినిమా హిట్‌ అయినా నిర్మాత నవ్వని సందర్భాలు ఉంటాయి.కలెక్షన్లు కళకళలాడకపోతే ఏం నవ్వు? ఇంగ్లిష్‌లో ఒక వాడుక ఉంది. ‘లాఫింగ్‌ ఆల్‌ ది వే టు ద బ్యాంక్‌’ అని.అంటే ప్రయత్నం ఏం చేసినా చివరకు డబ్బు సాధించారు అని అర్థం.కమెడియన్లు హీరోలుగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.హీరోలుగానూ ప్రేక్షకులతో పాటు నిర్మాతల్నీ నవ్విస్తే బాగుంటుంది.  నవ్విస్తారని ఆశిద్దాం.

విలన్‌ ఫేస్‌ మీద పంచ్‌ కొట్టే హీరో మాత్రమే హీరో కాదు. పొట్ట చెక్కలయ్యేలా పంచ్‌లేసే కమెడియన్‌  కూడా హీరోయే. ఎంత మెయిన్‌ రోడ్‌ అయినా ఫుట్‌పాత్‌ ఉన్నట్టే ఎన్ని పెద్ద హీరోల కథలు ఉన్నా కమెడియన్లకు సరిపడే కథలు ఉండనే ఉంటాయి. అందుకే గతంలో రేలంగి, నగేశ్, రాజబాబు, పద్మనాభం, చలం వంటివారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా కూడా రాణించారు. ఆ తర్వాతి తరంలో బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్, పృథ్వీలాంటి వారికి అవకాశం వచ్చింది. కృష్ణ భగవాన్‌ అయితే ఏకంగా సిమ్రాన్‌ పక్కనే హీరోగా నటించారు. కమెడియన్‌ వేషాలు ఎన్ని వేసినా హీరోగా మారితే వచ్చే క్యాషు, క్రేజు వేరని సునీల్‌ లాంటి నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్క్రీన్‌ మీద కాసేపుంటేనే ఇంత నవ్వొచ్చిందే సినిమా అంతా ఉంటే ఇంకెంత నవ్వు వస్తుందో అని కమెడియన్‌ హీరోగా చేస్తే జనం వచ్చే అవకాశం ఉంది కానీ సినిమా అంతా నవ్వించడం, కథను పండించడం అంత సులువేమీ కాదని కొన్ని పరాజయాల వల్ల, కొందరు కమెడియన్ల బ్యాక్‌ టు పెవిలియన్‌ వల్ల అర్థమవుతుంది. అయినప్పటికీ కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు జనాన్ని సంతోషపెట్టడానికి కెమెరా ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం.

బ్రహ్మీ ఈజ్‌ బ్యాక్‌
బ్రహ్మానందం క్రేజ్‌ ఉధృతంగా ఉన్న రోజుల్లో జంధ్యాల ఆయనను హీరోగా పెట్టి ‘బాబాయ్‌ హోటల్‌’(1992) సినిమా తీశారు. అయితే విడుదలకు ముందు దానికి వస్తున్న క్రేజ్‌ చూసి ‘ఇది కామెడీ సినిమా కాదు’ అని ట్యాగ్‌ లైన్‌ పెట్టాల్సి వచ్చింది. కామెడీ లేకపోతే బ్రహ్మానందం సినిమాకు వెళ్లడం ఎందుకు అని జనం ఆ సినిమా చూళ్లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా ఆయనకు మంచి వేషాలు దొరికిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మనీ’ వంటి సినిమాలతోనే ఎక్కువ పేరొచ్చింది.  2013లో హీరోగా మళ్లీ  ‘జఫ్పా’ అనే చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో ‘బ్రహ్మీ ఈజ్‌ బ్యాక్‌’ అనే సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చింది. శ్రీధర్‌ శ్రీపాన దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇందులో రా (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా  బ్రహ్మానందం నటించనున్నారట.

అలీ.. అలాగే..
అలీ హీరోగా నటించిన ‘యమలీల’కు (1994) ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘పిట్టల దొర’(1994), ‘ఘటోత్కచుడు’ (1995), ‘సర్కస్‌ సత్తిపండు’ (1997) ‘గుండమ్మ గారి మనవడు’ (2007), ‘అలీబాబా ఒక్కడే దొంగ’ (2013) వంటి సినిమాలు చేశారు. తాజాగా అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమా రూపొందింది. ‘వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది’ అనేది ఉపశీర్షిక. దిలీప్‌ రాజా దర్శకత్వం. రిషిత హీరోయిన్‌. నాగదేవత శాపం వల్ల 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో హీరోగా అలీ నటించారు. శాపం ఉన్న హీరో ప్రేమలో పడితే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రకథ. షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో విడుదల.

సప్తగిరి నం.3
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో సప్తగిరి కెరీర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగాన్ని అందుకుంది. ‘పరుగు’ (2008), ‘ప్రేమకథా చిత్రమ్‌’ (2013) వంటి సినిమాలు అందుకు ఫౌండేషన్‌ వేశాయి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న సప్తగిరి 2016లో ట్రాక్‌ మార్చారు. హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేశారు. అది రిలీజైన ఏడాదికే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు ‘వజ్ర కవచధర గోవింద’ తో మూడోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వం. ఓ వజ్రానికి సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డారన్నదే కథ. యాక్షన్, ఫైట్లు కూడా చేస్తున్న సప్తగిరిని ఈ సినిమాలో చూడవచ్చు.

షకలక లకలక
టీవీ నుంచి సినిమాకి సినిమా నుంచి హీరో కుర్చీకి ఎదగడానికి ఒళ్లొంచి కష్టం చేస్తున్న నటుడు శంకర్‌. ‘రాజుగారి గది 2’, ‘ఆనందోబ్రహ్మ’ (2017) సినిమాలు శంకర్‌కు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో గత ఏడాది ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా ‘డ్రైవర్‌ రాముడు’ సినిమా చేశారు. రాజ్‌ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే హీరోగా తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు శంకర్‌. ‘నాలుగో సింహం’ టైటిల్‌తో జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు ‘షకలక’ శంకర్‌. ముంబై బ్యూటీ అక్షయ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు తగ్గడం వల్లనే తాను హీరోగా మారాల్సి వచ్చిందని ఓ సందర్భంలో శంకర్‌ పేర్కొనడం విశేషం.

ప్రియ మల్లేశం
‘నా సావు నేను సస్తా... నీ కెందుకు’ బుక్‌ రైటర్‌ గుర్తున్నాడుగా!  ‘పెళ్ళిచూపులు’ (2016)సినిమాలో ఫుల్‌గా నవ్వించిన కమెడియన్‌ ప్రియదర్శి ఆ  తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. ఇప్పుడు ‘మల్లేశం’ అనే బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు.  నేతకు పనికి వచ్చే ఆసు మిషన్‌ను కనుగొని పద్మశ్రీ పురస్కారం పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణ యాస ప్రియదర్శికి కొట్టిన పిండి. కనుక ఈ సినిమాలో ఆయన ఆకట్టుకుంటారని ఆశించవచ్చు.

చేదు మిఠాయి
‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్నేహితుడిగా నటించి ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు రాహుల్‌ రామకృష్ణ. ఈ క్యారెక్టర్‌లో అటు కామెడీ చేస్తూనే సీరియస్‌ డైలాగ్స్‌ కూడా చెప్పారు. మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాలో మరో ముఖ్యపాత్ర దక్కింది. ఆ నెక్ట్స్‌ ‘సమ్మోహనం’(2018), ‘గీత గోవిందం’(2018) సినిమాల్లో మార్కులు పడ్డాయి. దాంతో డార్క్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిఠాయి’లో హీరోగా నటించారు రాహుల్‌ రామకృష్ణ. ఇందులో కమెడియన్‌ ప్రియదర్శి మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు. కానీ ఈ ‘మిఠాయి’ ప్రేక్షకులకు రుచించలేదు. అయితే రాహుల్‌ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషించిన ‘హుషారు’ ప్రేక్షకులకు నచ్చింది. హాలీవుడ్‌ సినిమా ‘సిల్క్‌రోడ్‌’లో రాహుల్‌ ఒక కీలక పాత్రకు సెలక్ట్‌ కావడం కూడా ఒక మంచి వార్తే.
ఇన్‌పుట్స్‌:  ముసిమి శివాంజనేయులు


మళ్లీ హీరోగా...!
సునీల్‌ ‘అందాలరాముడు’ (2006) సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్‌. రాజమౌళి దర్శకత్వంలో  నటించిన ‘మర్యాదరామన్న’ సూపర్‌హిట్‌ సాధించింది. ఆ తర్వాత  ‘పూలరంగడు’ (2012)   కమర్షియల్‌గా  సక్సెస్‌ కొట్టింది. నాగచైతన్యతో కలిసి ‘తడాఖా’లో లీడ్‌ రోల్‌ చేశారు.  కమెడియన్‌గా ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన సునీల్‌ హీరో అయ్యాక ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సునీల్‌ హీరోగా జర్నీకి కామా పెట్టినట్లున్నారు.  ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్‌ బిజీ అయ్యారు. కానీ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి.

హీరోనే టార్గెట్‌నా?
‘వెంకీ’,‘ పోకిరి’, ‘ఢీ’, ‘బిందాస్‌’ వంటి సినిమాల్లో బాల హాస్యనటుడిగా భరత్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆడియన్స్‌ మాస్టర్‌ భరత్‌ అని పిలుచుకున్నారు. సునీల్‌ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్‌ ఎహే’ (2017)సినిమాలో హాస్యనటుడిగా కనిపించిన భరత్‌ రీసెంట్‌గా ‘ఏబీసీడీ’ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైల్డ్‌ కమెడియన్‌గా సక్సెస్‌ అయిన భరత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా  సక్సెస్‌ అవుతాడా? లేక భవిష్యత్‌లో హీరోగా కూడా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement