సహజ పండిత సంపర సాంబయ్య!
ప్రముఖుల హాస్యం
పానుగంటి నరసింహారావు గారిది కాబోలు ఒక కథ ఉంది. ఆయన దర్శనానికి ఒకరు వచ్చి ఒక కాగితం ముక్క మీద తన పేరు వ్రాసి లోపలికి పంపారు. దాని మీద నాలుగు పొడి అక్షరాలు ఉన్నాయి... స.ప.స.సా. అని! లోపలకు రమ్మన్నారు ఆ పెద్దమనిషిని. వచ్చిన ఆసామిని చూడగానే, ‘‘నువ్వటోయ్ సాంబయ్యా’’ అన్నారు ఆయన. ‘‘చిత్తం’’ అన్నాడు.
‘‘ఈ పొడి అక్షరాల అర్థం ఏమిటోయ్’’ అని ప్రశ్నించారు పానుగంటి వారు. అతడు వినయంతో తల వంచుకొని, సిగ్గు పడుతున్నట్లు- ‘‘సహజ పండిత సంపర సాంబయ్య’’ అని మనవి చేశాడు.
‘‘ఈ బిరుదెవరిచ్చారోయ్’’ అని పానుగంటి వారు అడిగితే,‘‘నేను స్వయంగా తొడుక్కున్నది’’ అన్నాడు సాంబయ్య.
‘‘అయితే సాంబయ్యా! ఇప్పుడు వైద్యం మానేశావా? ఏంజేస్తున్నావ్?’’ అనగానే, ‘‘ఏదో కొంచెం కవిత్వం చెప్తున్నానండీ!!’’ అన్నాడు సాంబయ్య. ‘‘భేష్, కవిత్వమైతేనైం? వైద్యమైతేనేం? ఏదైతేనేం, నలుగురిని చంపడానికి’’ అని పానుగంటి వారన్నట్లు వినికిడి. ‘సహజ పండిత’ అనేది సాంబయ్య స్వయంగా తనకు తాను ఇచ్చుకున్న అమూల్యాభిప్రాయం. ‘‘ఏదైతేనేం, నలుగురినీ చంపడానికి’’ అన్నది పానుగంటి గారు సాంబయ్య వంటి వారిపై కలకాలం ఉండేటట్టు ఇచ్చిన అమూల్యాభిప్రాయం.
- కృష్ణశాస్త్రి వ్యాసావళి ‘అమూల్యాభిప్రాయాలు’ నుంచి