humility
-
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: సంస్కార వైభవం
రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు. రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు. వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు. బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు. కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు. ‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు. వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి. (సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మద్యం... మక్కువ
రాక్షసుల గురువు శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలు. మొదటిది సురాపానం కాగా, రెండవది కూతురిమీద వల్లమాలిన ప్రేమ. శుక్రాచార్యునికి మృతసంజీవనీ విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలాగైనా సరే, రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారికోసం అన్వేషిస్తున్నాడు బృహస్పతి. దేవతలందరూ వెనకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చాడు ఆయన కుమారుడు కచుడు. కుమారుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. ‘‘కుమారా! ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు. తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే, శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు’’ అంటూ మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. తాను ఎవరూ లేని అనాథనని, విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని ఎంతో వినయంతో పరిచయం చేసుకున్నాడు. అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి, తన వద్దనే ఉంచుకుని ప్రేమతో విద్య బోధించసాగాడు శుక్రుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేసి, తర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. అదంతా దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఇలా రెండుమూడుసార్లు జరిగింది. ఇలా లాభం లేదనుకున్న రాక్షసులు, ఈసారి కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. ‘పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది,’ అని ఆలోచించిన శుక్రుడు, జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపథం చేశాడు. – డి.వి.ఆర్ -
రజనీకాంత్ ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ నటుడు
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ నిరాడంబరత, వినమ్రత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన అణకువ గురించి మరో అగ్ర కథానాయకుడు వెల్లడించమే విశేషం. రజనీకాంత్ నిరాడంబరత తనను ఎంతోగానో ఆకట్టుకుందని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ పేర్కొన్నాడు. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో రజనీకాంత్ చూపిన వినమ్రత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అమెరికా ఎయిర్ పోర్టులో తనిఖీ సందర్భంగా 'కబాలి' స్టార్ చాలా నమ్రతగా వ్యవహరించారని వెల్లడించారు. అంతేకాదు అమెరికా ఎయిర్ పోర్టులో రజనీకాంత్ ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. రజనీకాంత్ వినమ్రతను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి 1986లో 'దోస్తానీ దుష్మాణి' సినిమాలో నటించారు. Simplicity of a huge superstar.Checking in at at an airport in the US for India.Respect for your humility- Rajnikant pic.twitter.com/yBn6sjGqbK — Rishi Kapoor (@chintskap) 26 July 2016 -
సహజ పండిత సంపర సాంబయ్య!
ప్రముఖుల హాస్యం పానుగంటి నరసింహారావు గారిది కాబోలు ఒక కథ ఉంది. ఆయన దర్శనానికి ఒకరు వచ్చి ఒక కాగితం ముక్క మీద తన పేరు వ్రాసి లోపలికి పంపారు. దాని మీద నాలుగు పొడి అక్షరాలు ఉన్నాయి... స.ప.స.సా. అని! లోపలకు రమ్మన్నారు ఆ పెద్దమనిషిని. వచ్చిన ఆసామిని చూడగానే, ‘‘నువ్వటోయ్ సాంబయ్యా’’ అన్నారు ఆయన. ‘‘చిత్తం’’ అన్నాడు. ‘‘ఈ పొడి అక్షరాల అర్థం ఏమిటోయ్’’ అని ప్రశ్నించారు పానుగంటి వారు. అతడు వినయంతో తల వంచుకొని, సిగ్గు పడుతున్నట్లు- ‘‘సహజ పండిత సంపర సాంబయ్య’’ అని మనవి చేశాడు. ‘‘ఈ బిరుదెవరిచ్చారోయ్’’ అని పానుగంటి వారు అడిగితే,‘‘నేను స్వయంగా తొడుక్కున్నది’’ అన్నాడు సాంబయ్య. ‘‘అయితే సాంబయ్యా! ఇప్పుడు వైద్యం మానేశావా? ఏంజేస్తున్నావ్?’’ అనగానే, ‘‘ఏదో కొంచెం కవిత్వం చెప్తున్నానండీ!!’’ అన్నాడు సాంబయ్య. ‘‘భేష్, కవిత్వమైతేనైం? వైద్యమైతేనేం? ఏదైతేనేం, నలుగురిని చంపడానికి’’ అని పానుగంటి వారన్నట్లు వినికిడి. ‘సహజ పండిత’ అనేది సాంబయ్య స్వయంగా తనకు తాను ఇచ్చుకున్న అమూల్యాభిప్రాయం. ‘‘ఏదైతేనేం, నలుగురినీ చంపడానికి’’ అన్నది పానుగంటి గారు సాంబయ్య వంటి వారిపై కలకాలం ఉండేటట్టు ఇచ్చిన అమూల్యాభిప్రాయం. - కృష్ణశాస్త్రి వ్యాసావళి ‘అమూల్యాభిప్రాయాలు’ నుంచి -
నేనూ రజనీ అభిమానినే!
-
నేనూ రజనీ అభిమానినే!
న్యూఢిల్లీ: ‘ఇన్నేళ్ల పాటు రజనీ సార్‌ను కలవలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎప్పుడూ ఆ అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు మా భేటీ గొప్పగా జరిగింది. ఆయన క్రికెట్ చూస్తారని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. మేమిద్దరం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల గురించి చర్చించుకున్నాం’...ఈ మాటలు చెప్పింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మొదటిసారి కలి సిన సచిన్ ఆయనపై తన అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. దక్షిణాది నుంచి వచ్చిన అనేక మంది క్రికెటర్లతో తాను కలిసి ఆడానని, వారిలాగే తాను కూడా రజనీ అభిమానినని సచిన్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైరైన సచిన్ ఇప్పటికీ ఆ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు. అయితే తన కొడుకు అర్జున్‌తో ఆడుతుంటే ఆటకు దూరమైనట్లు అనిపించడం లేదు అని సచిన్ వ్యాఖ్యానించాడు.