రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు.
రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు.
వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు.
బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు.
కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు.
తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment