‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు.
‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు.
తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం.
నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు.
‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు.
సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు.
– డా‘‘ ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment