
నేనూ రజనీ అభిమానినే!
న్యూఢిల్లీ: ‘ఇన్నేళ్ల పాటు రజనీ సార్‌ను కలవలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎప్పుడూ ఆ అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు మా భేటీ గొప్పగా జరిగింది. ఆయన క్రికెట్ చూస్తారని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. మేమిద్దరం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల గురించి చర్చించుకున్నాం’...ఈ మాటలు చెప్పింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మొదటిసారి కలి సిన సచిన్ ఆయనపై తన అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. దక్షిణాది నుంచి వచ్చిన అనేక మంది క్రికెటర్లతో తాను కలిసి ఆడానని, వారిలాగే తాను కూడా రజనీ అభిమానినని సచిన్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైరైన సచిన్ ఇప్పటికీ ఆ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు. అయితే తన కొడుకు అర్జున్‌తో ఆడుతుంటే ఆటకు దూరమైనట్లు అనిపించడం లేదు అని సచిన్ వ్యాఖ్యానించాడు.