‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు.
ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం.
వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది.
నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి.
ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు.
వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!!
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment