Good Conduct
-
సత్సాంగత్యం
ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం. ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా. పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా! ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు. ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని? ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జైలు నుంచి 70మంది ఖైదీల విడుదల
వరంగల్ జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన సుమారు 70 మంది ఖైదీలు విడుదల అయ్యారు. ఖైదీల విడుదల విషయం తెలియడంతో ఖైదీల బంధువులు జైళ్ల వద్దకు చేరుకున్నారు. విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.