సత్సాంగత్యం | Friendship with good people is called Satsangatya | Sakshi
Sakshi News home page

సత్సాంగత్యం

Sep 25 2023 12:31 AM | Updated on Sep 25 2023 12:31 AM

Friendship with good people is called Satsangatya - Sakshi

ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం.

ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా.

పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది.

    అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది.  
    
ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా!

ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు.   
   
ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్‌’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్‌’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్‌ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని?          
 
‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు.


ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో  లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. 

– డా. ఎన్‌.అనంతలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement