
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు...
‘‘ ఈవియుదియ్యని మాటయు
భావంబున జేయతగిన పనితెలియుటయున్
ఠీవియగు ధైర్యభావము
రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’...
ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి.
అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది.
తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది.
నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి.
భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment