కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. కామము అంటే కోర్కె. కామం ధర్మంతో ముడిపడింది. అందువల్ల ధర్మపత్ని అయింది. ఆమె వల్ల గొప్ప అర్థం వచ్చింది. సుఖాలకు సాధనాలని ‘అర్థము’ అంటారు. అంటే ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేసాడు. పది తరాలు ముందు, పది తరాల వెనుక, తనది కూడా అయిన ఒక తరం కలిపి... మొత్తం 21 తరాలు తరించాయి.
లోకంలో ఏ దానం చేసినా దాని మీద యాజమాన్య హక్కు దాతకు ఉండదు. తానిచ్చానన్న భావన ఆ తరువాత రాకూడదు. కానీ ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు ఇది వేరుగా ఉంటుంది. ఆడపిల్లమీద ధార్మిక హక్కు, ఆ కుటుంబంలో సభ్యత్వం.. పుట్టింటిలో ఆడపిల్లకు ఎప్పుడూ ఉంటాయి. ‘‘నాకు చూడాలని ఉందయ్యా, నా కుమార్తెను ఓ పది రోజులు తీసికెడతాను’’ అని అడిగే హక్కు కన్నతండ్రికి ఉన్నది. ‘వద్దు’ అనే అధికారం భర్తకు కానీ, అత్తమామలకు కానీ, మరెవ్వరికి కానీ లేదు. తండ్రికీ, తల్లికీ, తోబుట్టువులకూ ఆ అధికారం ఉంటుంది.
ఇంకా చెప్పవలసి వస్తే... కూతురి పుట్టింట మంగళప్రదమైన ఒక కార్యక్రమం జరుగుతున్నది. అల్లుడిగారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆహ్వానిస్తారు తప్ప పిలుపు లేకపోయినా సరే... కూతురు, అల్లుడు వెళ్ళవలసిందే. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రం చెబుతున్నది. దక్షయజ్ఞం విషయంలో పార్వతీ దేవి శివుడితో అంటుంది...‘‘శంకరా ! నీకు తెలియని విషయమా! మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలకా...పిలవక పోయినా ఆడపిల్ల, అల్లుడు వెళ్ళాలి కదా! నీకు తెలియని ధర్మమా!!!’’ అంటూ కొన్ని సూక్ష్మాలు గుర్తు చేస్తుంది.
కొందరి ఇళ్ళకు పిలవకపోయినా వెళ్ళాలి. జనకుడు(తండ్రి), జన నాయకుడు(రాజు), గురువు, మనసెరిగిన స్నేహితుడు. రాజుగారి ఇంట్లో శుభ కార్యం జరిగితే పిలుపు అక్కర్లేదు. వెళ్ళాలి. గురువుగారి ఇంట ఉత్సవం జరుగుతున్నది. పిలవకపోయినా వెళ్ళాలి. మంచి స్నేహితుడు, మనసెరిగిన వాడు... వారి ఇంట జరిగే శుభ కార్యానికి వెళ్ళాలి. పిలుపుతో పని లేదు... అని వివరిస్తూ ఈ విషయాలు నీకు తెలియనివి కాదు కదా శంకరా’’ అంటుంది. ఆడపిల్లను కన్యాదానం చేసినా ఆమె ఉత్తమమైన నడవడి చేత ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. రెండు వంశాలు తరిస్తున్నాయి. అటువంటి వైభవం నిజానికి పురుషుడికి కట్టబెట్టలేదు.
ఇంత పుణ్యాన్ని మూటకట్టిపెట్టి ఇవ్వగలిగినది, ఆప్యాయతకు రాశీభూతమైనది ఆడపిల్ల మాత్రమే. ఆమెను వివాహం చేసుకుని ఆమెయందు తన కామాన్ని ధర్మంతో ముడివేసి వర్తింపచేసాడు కనుక అర్ధాన్ని పొందుతున్నాడు. అంటే సమస్త సుఖాలకు కావలసిన సాధనాలను పొందుతున్నాడు. కూతురు పుట్టింది కన్యాదానం చేసాడు, 21 తరాలు తరించాయి. అలా తరించడానికి కారణం కేవలం ఆడపిల్ల పుట్టినందువల్లేనా ? ఆ ఆడపిల్ల ధర్మపత్ని అయి కొడుకుని కని ఇచ్చింది. అప్పుడు మనసుకు ఒక భరోసా. ఆ భరోసా మూడు రకాలుగా ఉంటుందంటున్నది శాస్త్రం.బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment