పంచమహా యజ్ఞం అని ఐదు యజ్ఞాలు నిరంతరం జరిగే ప్రదేశం గహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినవారు ఈ ఐదింటిమీద శ్రద్ధపెట్టి ఉండాలి. అందుకే దీనిని యజ్ఞం అని వదిలేయకుండా మహాయజ్ఞం అని అన్నారు. సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిముఖంగా హవిస్సును ఇవ్వడం ఉంటుంది. స్వాహాకారంతో అగ్నిహోత్రుడిని పిలిచి ఇచ్చిన హవిష్యాన్నం దేవతలకు అందచేయడానికి ..అని యజమాని సంకల్పం చేస్తాడు. కానీ అగ్ని ఆరాధనం పంచ యజ్ఞాలలో అంతర్భాగం అయినప్పటికీ ... మిగిలిన నాలుగింటినీ కూడా యజ్ఞాలనే పిలిచారు. వీటినే మహాయజ్ఞాలని అన్నారు. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది. దీనికి ప్రత్యేకంగా హోమశాలకానీ, ప్రత్యేకంగా మంత్రభాగం కానీ అవసరం లేకుండా ప్రతివారు కూడా శ్రద్ధతో అనుసరించాల్సిన విషయాలు ఈ ఐదింటిలో అంతర్లీనంగా ఉంటాయి. ‘‘నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు దీనిని ధన్యం చేసుకుని తరించడానికి ఈ ఐదు ఆలంబనాలు. వీటిని ఊతంగా చేసుకుని తరించాలి’’ అని గృహస్థు భావిస్తాడు. అందుకే ఇవి గృహస్థాశ్రమంలోనే నడుస్తాయి.
వీటిలో మొదటిది – అధ్యాపనం బ్రహ్మయజ్ఞః–అంటారు. అధ్యాపనం అంటే బోధ చేయడం. బోధ చేయడాన్నే బ్రహ్మ విద్య.. అంటారు. బోధ దేనికి! మనిషి తరించడానికి ఇది మార్గాన్ని చెబుతుంది. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే.. అది ఏది పట్టుకోవాలో చెబుతుంది, ఏది పట్టుకోకూడదో చెబుతుంది. పట్టుకోకూడదన్నంత మాత్రం చేత అదంత సులభసాధ్యం కాదు కాబట్టి పట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి మనస్తత్వాన్ని సాధించుకోవాలో ఇది బోధ చేస్తుంది. అది మన రుషుల ప్రత్యేకత.
మనకు సంవత్సరం ఆరంభంలో అంటే సంవత్సరాదినాడు చేదుపచ్చడి తినిపిస్తారు. సంవత్సరం పూర్తి ఎప్పుడు.. అంటే చాంద్రమానంలో కాదు, ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య కాదు, సౌరమానంలో వచ్చే భోగి పండగను ప్రమాణం చేస్తారు. భీష్మ ఏకాదశి, కష్ణాష్టమి, మహాశివరాత్రి, శ్రీరామనవమిల లాగా తిథులతో కూడుకుని రాదు. భోగికి తిథి ఉండదు. దక్షిణాయనానికి చిట్టచివర వచ్చేది.. భోగిపండగ అవుతుంది. దక్షిణాయనం ఉ΄ాసనా కాలం. ఉపాసన కష్టంగా ఉంటుంది. పరిశ్రమ చేయడానికి, ఉపాసన చేయడానికి సిద్ధపడితే అది చేదు తినడం.. కష్టపడాలి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రారంభంలో తినిపిస్తారు. కష్టపడడం దేనికి! తరించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఈశ్వరుడు పెట్టుబడిగా ఇచ్చిన శరీరాన్ని సాధన ద్వారా సిద్ధపరచాల్సి ఉంటుంది.
ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఉగాదినాడు చేదు పచ్చడి తిన్నారో, వారు భోగినాడు పొంగల్.. మధుర పదార్థం తింటారు. అంటే భోగం అనుభవించే అర్హత పొందుతారు. ఏ ఉపాసన చేయకుండా, ఏ శాస్త్రాన్నీ పాటించకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని ధన్యం చేసుకోకుండా భాగ్యం కావాలంటే సాధ్యం కాదు. ఇవన్నీ బోధించి గహస్థాశ్రమ ప్రవేశం చేయించి, అక్కడ విధివిధానాలు సక్రమంగా నిర్వర్తించేటట్లు బోధించడమే ..అధ్యాపన యజ్ఞం. అంటే ఒకరికి చెప్పడం.. అదెప్పుడు సాధ్యం. ముందుగా మన చదివి ఉంటేనే కదా.. దేనికోసం చదవాలి....అంటే ఇది మన కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది.
Comments
Please login to add a commentAdd a comment