తరువాత ఏడ్చి  ఉపయోగమేమిటి! | Chaganti Koteswara rao Pravachanam In Sakshi Family | Sakshi
Sakshi News home page

తరువాత ఏడ్చి  ఉపయోగమేమిటి!

Published Sun, Feb 9 2020 7:16 AM | Last Updated on Sun, Feb 9 2020 8:03 AM

Chaganti Koteswara rao Pravachanam In Sakshi Family

55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో. అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ  సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ?

రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే... విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు...‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి.

ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’ అని వేదనా భరితుడయినాడు. 

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి... బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు.

‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు.

ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు పదిమంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement