సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్! | Sambar scaryala sequel! | Sakshi
Sakshi News home page

సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!

Published Sun, Nov 15 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!

సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!

హ్యూమర్
 సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది.
  మా రాంబాబుగాడు సందు చివర నుంచి వస్తూ కనిపించడం చూసి తప్పించుకు పోదామనే ప్రయత్నంలోనే వాడికి పట్టుబడిపోయాను.
 ‘‘ఏంట్రా చూసి కూడా చూడనట్లు వెళ్లిపోతున్నావు’’ అడిగాడు నిష్టూరంగా.

 
 ‘‘మొన్నంతా ఇడ్లీ గురించి మాట్లా డావు కదా. మళ్లీ ఇప్పుడు సాంబార్ గురించి సీక్వెల్ స్టోరీ ఏదైనా చెబుతావని భయమేసి...’’ అంటూ ఏదో నసుగు తుండగానే మధ్యలో తుంచేశాడు.
 ‘‘సాంబార్ గొప్ప గురించి వేరే చెప్పే దేముందిరా. సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట.

అలా సాంబారనే పేరు వచ్చింది. నాకు మొన్న చేతి ఎముక విరిగితే ప్లేట్లు వేస్తా నన్నారు కదా డాక్టర్లు! ఇడ్లీ, అన్నం తినే టైమ్‌లో దాంట్లోనూ ఎక్స్‌ట్రా సాంబార్ పోయించుకోవచ్చుకదా అని ఆశపడ్డాను. కానీ ఆ ప్లేట్స్ ఒంటి లోపల ఉంటాయట. సాంబార్ పోసుకోడానికి వీలు కాదని డాక్టర్ చెప్తే కాస్త డిజప్పాయింటయ్యా.’’

 ‘‘నువ్వు మరీ టూమచ్‌రా’’ అన్నాను నవ్వాలో ఏడవాలో అర్థం కాక.
 ‘‘ఇందులో టూమచ్ ఏముంది! మొదట్లో దాన్ని అందరూ ‘చాంపార్’ అని పిలిచేవారట. వంటింట్లోంచి చాంపార్ వాసన వస్తుంటే, అప్పటి వరకూ పరుషంగా ఉన్నవాళ్లు కూడా సరళంగా మారిపోయేవారట. దీన్ని గుర్తించిన తమిళ సోదరులు సాంబార్ అని పిలవడం మొదలు పెట్టారట.’’
 ‘‘నువ్వు కనిపించగానే అనుకున్నా నేను సూప్‌లో పడిపోయానని’’ అన్నాను బిక్కమొగమేసి.
 ‘‘నువ్వు చెప్పే ‘సూప్’ కూడా మన సంస్కృత పదమైన సూపమ్ నుంచి వచ్చింది.

‘భోజనం దేహి రాజేంద్రా... ఘృత సూప సమన్వితం’ అంటూ భోజ రాజు దగ్గర భోజనంతో పాటు పప్పును అడిగి తీసుకునేవారట పండితులు. మన సూప మహత్యాన్ని కనిపెట్టిన మ్లేచ్ఛులు మన పప్పుచారు ఫార్ములాను దొంగి లించి, దాన్ని కాస్త మార్చి సూప్ అని పేరు పెట్టుకున్నారు తెలుసా? అన్నట్టు సాంబార్ కుతకుత ఉడికినట్లుగానే పౌరు లందరిలోనూ నెత్తురు మండించి, శక్తులు నిండేలా చేయాలనే సోషలిస్టు భావనతోనే పప్పుచారు తయారు చేశారు.’’

 ‘‘పప్పుచారుకూ సోషలిస్టు భావాలకూ సంబంధమేముందిరా?’’
 ‘‘ఇప్పుడున్న ప్రభుత్వాల అసమర్థత వల్ల పప్పుల ధర భవిష్యత్తులో బాగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారు. దాంతో పప్పును అందరికీ అందుబాటులోకి తేవా లనే సోషలిస్టు భావనతో పప్పుచారును కనిపెట్టారు మనవాళ్లు. అలా పప్పుకు అడ్వాన్స్‌డ్ రూపమైన మన సాంబారు ఆవిర్భవించింది.’’

 ‘‘పప్పుకు అడ్వాన్స్‌డ్ రూపమా సాంబారు!?’’ అయోమయంగా అడిగా.
 ‘‘కాదా మరి. కర్రీ పాయింట్లలో కాస్త ఆలస్యంగా పప్పు కోసం అడిగావనుకో. దొరకదు. కానీ సాంబారు మాత్రం లేటైనా దొరుకుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో పప్పుకంటే సాంబారు ఎక్కువ ఫిట్టెస్టు అని తెలిసిపోయింది కదా? పరిణామ క్రమంలో పప్పు తర్వాత వచ్చినా సాంబారు సర్వైవల్ విషయంలో మరింత సమర్థమైనదని తేలిపోయింది. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సూక్తిని గుర్తుం చుకున్నారు డార్విన్. అందుకే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టు అన్న విషయాన్ని తన కిచెన్‌లోనే ముందుగా కనిపెట్టినా... ఆరిజిన్ ఆఫ్ పప్పూస్ అండ్ పల్సెస్ నుంచే ‘ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్’ అన్న విషయాన్ని ఆ తర్వాత విశ్వవ్యాప్తం చేశాడట’’ అన్నాడు.  

 ‘‘కొయ్... కొయ్’’ అన్నాను. ‘‘పప్పును కొయ్యడం కుదరదు. పప్పు గింజను ఎంతసేపు చప్పరించినా దాని చవి తెలియదు. అదే పంటి కింద నలగ్గొట్టావనుకో, దాని టేస్టు పెరుగుతుంది. రుచి తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న మన పూర్వీ కులు పప్పును నలగ్గొట్టడానికి పప్పుగుత్తిని కనిపెట్టారు. అలా పప్పు నుంచి పప్పుచారును ఆవిర్భవింప జేశారు. ఆ తర్వాత డార్విను, ఇతర పాశ్చాత్యులు ఆ పరిజ్ఞానాన్ని  పరిగ్రహించి మరింత పరిపక్వం చేశారంతే’’ అన్నాడు పక్వం అనే మాటను ఒత్తిపలుకుతూ.

 ‘‘నా పప్పులు ఉడికాయ్. ఇక నన్ను విడిచిపెట్టు’’ అంటూ ఇల్లు చేరీ చేరగానే  తలుపులు బార్లా తెరచి, సాంబార్లా జారిపోయాను.
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement