సౌత్‌ ఇండియాలో క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలు ఇవే | Telugu directors approaching Other Film Industry heroes | Sakshi
Sakshi News home page

సౌత్‌ ఇండియాలో క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలు ఇవే

Published Tue, Sep 5 2023 1:09 AM | Last Updated on Tue, Sep 5 2023 7:19 AM

Telugu directors approaching Other Film Industry heroes - Sakshi

తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్‌... తమిళ్‌ అంటే సాంబార్‌... మలయాళంకి కూడా సాంబార్‌ టచ్‌ ఉంది. ఇప్పుడు ఆవకాయ్‌ డైరెక్షన్‌కి  సాంబార్‌ సై అనడంతో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్‌లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం.

శేఖర్‌ కమ్ముల, ధనుష్‌... డీ 51
వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్‌ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది.

ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్‌. సోనాలీ నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్  రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా  ధనుష్‌ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్‌ మూవీ ‘సార్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ చేస్తున్నది సెకండ్‌ స్ట్రయిట్‌ తెలుగు మూవీ అవుతుంది.

 చందు, సూర్య కాంబో కుదిరిందా?
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అందుకున్నారు డైరెక్టర్‌ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్‌సీ 23’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు.

వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్‌ దాదాపు కుదిరిందని టాక్‌. సరైన కథ కుదిరితే డైరెక్ట్‌ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్‌ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్‌లో ఈ చిత్రకథ
ఉంటుందని టాక్‌.

పరశురామ్‌తో కార్తీ?
‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్‌ పరశురామ్‌. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ–డైరెక్టర్‌ పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై  వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన.

‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్‌ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్‌. ఈ సినిమాకు ‘రెంచ్‌ రాజు’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్‌. అటు కార్తీ, ఇటు పరశురామ్‌ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకీతో దుల్కర్‌ లక్కీ భాస్కర్‌
తమిళ హీరో ధనుష్‌తో ‘సార్‌’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్‌ హిట్‌ అందుకున్నారు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌తో ఈ చిత్రం  రూపొందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్‌’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్‌’ నిర్మిస్తున్నారు.

‘సార్‌’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్‌’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న మరో స్ట్రయిట్‌ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్‌’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement