avakaya
-
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం. ఆవకాయ కావలసినవి: ►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు ►నూనె– 2 కప్పులు ►ఆవపిండి– కప్పు ►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది) ►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది) ►మెంతిపిండి – అర కప్పు ►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి) ►ఆవాలు – పావు కప్పు. తయారీ: ►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి. ►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి. ►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు. ►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి. ►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. ►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి. గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి. -
పేదోడి ఇంట పచ్చడి మెతుకులూ కష్టమే
ఖమ్మం (మధిర) : గ్యాస్, నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండగా... పచ్చడితోనైనా కడుపు నింపుకుందామని భావించే పేదలకు అది కూడా భారంగా మారుతోంది. దిగుబడి తగ్గడంతో పెరిగిన మామిడి కాయల ధరలకు తోడు, పచ్చడి తయారీకి ఉపయోగించే ఇతర దినుసుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణాన ఈ ఏడాది పలువురు పచ్చడిపైనే ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏటా పెట్టే మామిడికాయ పచ్చడి సువాసన ఈసారి అక్కడక్కడే వస్తోంది. వేసవి వచ్చిందంటే... వేసవికాలం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు మొదటగా మామిడికాయ పచ్చడిపైనే దృష్టి సారి స్తారు. ఇందుకోసం మేలు రకాల కాయలను ఎంచుకుని పచ్చడి పెట్టడం ఆనవాయితీ. ఇళ్లలో ఉపయోగానికే కాకుండా దూరప్రాంతాల్లో ఉంటున్న బంధువులు, కుటుంబీకులకు పంపించేందుకు గాను అవసరమైన పచ్చడి కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మామిడి పూత పెద్దగా రాకపోగా, వచ్చిన పూత కూడా తెగుళ్ల బెడదతో నిలవలేదు. దీంతో మామిడికాయల ధరలు అమాంతకం పైకి వెళ్లాయి. ఫలితంగా పచ్చడి కోసం కాయల కొనుగోలుకు వస్తున్న వారు ధరలు చూసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. మటన్ ముక్కలే... చాలా మంది ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు. దీనికి తోడు ఉదయం ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారి క్యారేజీల్లో పచ్చడి తప్పక కనిపిస్తుంది. కానీ ఈసారి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోగా, కొందరు పెడుతున్నా యాభై కాయలకు బదులు పది, ఇరవై కాయలతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో బంధువులకు పంపించడం మాటేమో కానీ ఇంట్లో పెట్టిన పచ్చడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తినాల్సిందేనని చెబుతున్నారు. ఏపీ నుంచి దిగుమతి సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసాలు, పెద్దరసాలు, జలాలు, తెల్లగులాబీ, నాటు తదితర రకాలను వినియోగిస్తారు. అయితే, జిల్లాలో 2018 – 19లో 1.20లక్షల ఎకరాలు, 2019 – 20లో 70వేలు, 2020 – 21లో 31,994, 2021 – 22లో 33,861 ఎకరాల్లో మామిడిసాగు విస్తీర్ణం ఉంది. చీడపీడలు ఆశించడం, అధిక వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు తోటలను తొలగించారు. అలాగే, ఉన్న తోటల్లోనూ ఈసారి పెద్దగా దిగుబడి లేదు. దీంతో ఆంధ్రా సరిహద్దులో ఉన్న తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, ఎ కొండూరు, చింతలపూడి తదితర ప్రాంతాలనుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా మామిడికాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు. ఆ జోలికే వెళ్లలేదు... ప్రతిరోజూ పనులకు వెళ్తుంటాం. ఉదయం వంట చేసుకోలేనందున ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి ఏడాదంతా వాడుకుంటాం. కానీ ఈసారి మామిడికాయలే కాదు నూనె ధర కూడా పెరిగింది. దీంతో ఈ ఏడాది పచ్చడి జోలికే వెళ్లలేదు. యాభై కాయలకు బదులు పది కాయలతో పచ్చడి పెట్టాలన్నా ధైర్యం చేయలేకపోయాం. – ఆదిలక్ష్మి, లడకబజార్, మధిర ఖర్చు ఇలా... మామిడి పచ్చడికి ఎక్కువగా ఉపయోగించే జలాల రకం కాయ ఒక్కొక్కటి రూ.40, చిన్నరసం రూ.30చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి తోడు మిర్చి రకానికి అనుగుణంగా కేజీకి 250కు పైగా పలుకుతుండగా నూనె కేజీ ధర రూ.190 వరకు ఉంది. అలాగే, మామిడికాయ ముక్కలు కొట్టించడం, కారం పట్టించే ఖర్చు... ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు ఇలా దినుసుల ధరలు కూడా పెరి గాయి. ఫలితంగా ఈసారి పచ్చడి పెట్టడం భారంగా మారిందని సామాన్యులు వాపోతున్నారు. -
నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు. చదవండి: Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి.. పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి. ఆవకాయకు బహుబాగు కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
నోరూరించే ఆవకాయలు.. ఆకాశానికి ధరలు!
సాక్షి, నల్గొండ : వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడికాయ పచ్చడి వైపే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా తయారు చేసిన పచ్చళ్లు కొనుక్కునే వాళ్లంతా ప్రస్తుతం లాక్డౌన్ కలిసి రావడంతో సొంతంగా తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంటి పట్టున ఉన్న మహిళలంతా మామిడికాయ పచ్చడి తయారు గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇంట్లో పెద్ద వారి సూచనలతో ఇంటిళ్లి పాది ఆవకాయ తయారీలో ఓ చేయి వేస్తున్నారు. చెక్క పచ్చడి, తరుగుడు పచ్చడి, అల్లం వెల్లిపాయ ఆవ, ఉప్పు ఆవ, బెల్లం ఆవ, నువ్వుల పచ్చడి తదితర ఎన్ని పేర్లున్నా అనిర్వనీయమైన రుచి ఆవకాయ సొంతం. అయితే ఇటీవల ఈదురు గాలులకు మామిడి కాయలు దెబ్బతిని కొంత కొరత ఏర్పడటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పచ్చడి మామిడి కాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.15 వరకు పలుకుతుంది. పెరిగిన సామగ్రి ధరలు.. పచ్చడి తయారీలో ప్రధానమైన వంట సామగ్రి అయిన నూనె, అల్లం, వెల్లుల్లి, కారం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. పచ్చడి తయారీకి వినియోగించే నువ్వుల నూనె బ్రాండ్‌ను బట్టి కేజీ రూ.400 వరకు విక్రయిస్తున్నారు. పల్లీ నూనె అయితే కేజీకి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లం కిలో రూ.50, వెల్లుల్లి రూ.80లకు విక్రయించగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అల్లం రూ.90, వెల్లుల్లి రూ.120 వరకు పెరిగింది. మామిడికాయ పచ్చళ్లలో ఉపయోగించే మిరప బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.400 నుంచి రూ.500 వరకు ఉన్నవి. కిలో పచ్చడికి సుమారు రూ.500 వ్యయం.. కిలో పచ్చడి తయారీకి సాధారణంగా పావుకిలో నూనె, పావుకిలో ఉప్పు, 125 గ్రాముల కారం పొడి, అర కిలో అల్లం వెల్లుల్లితో పాటు మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వినియోగిస్తారు. ఆయా సరుకులతో పాటు మామిడి కాయలు.. అన్నింటి వ్యయం కలిపి కిలోకు రూ.500 ఖర్చవుతోంది. గతంలో ఒక్కో కుటుంబం 100 నుంచి 150 కాయల వరకు పెట్టే వారు. ప్రస్తుతం ఎక్కువగా బీపీ, షుగర్ జబ్బులు వస్తుండడంతో ఉప్పు ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి లేదు. దీంతో 20 నుంచి 50 కాయల వరకే పెడుతున్నామని మహిళలు చెబుతున్నారు. ధరలు బాగా పెరిగాయి గతంలో మామిడికాయలకు అల్లం వెల్లుల్లి, కారం, ఇతర వస్తువులకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు అధికంగా పెరగడంతో ఆర్థిక భారం అవుతోంది. అయినా ప్రతి వేసవిలో మారిగానే.. ఈ సారి కూడా పచ్చడి పెడుతున్నాం. – జి.హేమలత, గృహిణి, తిరుమలగిరి -
మెగా డాటర్ ఆవకాయ పచ్చడి.. నోరు ఊరిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. కొంత మంది అయితేపుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు కొత్త కొత్త వంటకాలు చేస్తూ కుటుంబ సభ్యులమొత్తానికి వడ్డిస్తున్నారు. (చదవండి : మరో తమిళ సినిమాకి ఓకే చెప్పిన నిహారిక) ఇక ‘మెగా’ ఫ్యామిలి మాత్రం ఆవకాయ పచ్చడి పెట్టే పనిలో నిమగ్నమైపోయింది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆవకాయ పచ్చడి చేసే విధానాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను తన ట్వీటర్లో పోస్ట్ చేయగా, తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంట్లో స్పెషల్‌గా ఆవకాయ పచ్చడి పెడుతూ.. బిజీ అయిపోయింది. మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిహారిక చేసిన ఆవకాయ పచ్చడి మెగా ఫ్యాన్స్ నోళ్లలో నీళ్లురూరించేలా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్‌కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
ఒక్క ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది!
ఉత్తర కన్నడ జిల్లా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతారామ ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారు. ఇంటికి వెళ్తుండగానే కమ్మని ఊరగాయ ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇంట్లో ఊరగాయ తయారీలో తీరిక లేకుండా శశికళ కనిపిస్తారు. ఒక సాధారణ మహిళ స్వశక్తిని నమ్ముకుని పదిమందికి ఉపాధినిచ్చేలా ఎదిగారు. సాక్షి, బళ్లారి: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అని టీవీల్లో,సినిమాల్లో,లేదా అక్కడక్కడ ఏవరో మాట్లాడటం చూస్తుంటాం. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధితో ఎదగవచ్చని చాటుతోంది శశికళ శాంతరామ అనే వనితామణి. ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతరామ తయారీ చేస్తున్న ఊరగాయలు చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో ఖ్యాతి చెందాయి. నిమ్మతొక్కను పడేయాలా? పేద కుటుంబం,ఉన్నది ఒక ఎకరా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదా జీవనం సాగిస్తున్న ఆమెకు ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇంట్లో వంటకు నిత్యం ఉపయోగించే నిమ్మకాయ తొక్కును తొక్కే కదా అని పారవేస్తాం. ఆమె తొక్కును ఎందుకు పారవేయాలి? అని ఆలోచించి ఆమె ప్రతి రోజు తీసిన తొక్కులను ఆరవేసి ఎండిన తర్వాత రుచికరమైన చాట్ మసాలాను ఇంట్లో తయారీ చేసి నిమ్మకాయ తొక్కుకు అంటించి ఇంట్లో కుటుంబసభ్యులకు అందజేసింది. అదే ఆమె జీవితంలో మార్పునకు తొలి అడుగు. అలా తయారు చేసిన నిమ్మకాయ తొక్కుతో లెమన్ చాట్ తయారీ చేసి,కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి, బంధువులకు రుచి చూపించింది. ఇంకేముంది ప్రతి ఒక్కరు పొగడ్తలే పొగడ్తలు. అప్పటినుంచి చాట్ మసాలను తయారు చేసి ప్యాకెట్లుగా అమ్మకాలు ప్రారంభించింది. ఊరగాయల మీద దృష్టి ఆ తరువాత నిమ్మకాయ ఊరగాయల మీద దృష్టి పడింది. నాణ్యమైన దినుసులు ఉపయోగించిన చేసిన ఊరగాయ కొద్దికాలానికి అందరి నోళ్లలో నానింది. ఇక మామిడి, ఉసిరి ఇలా అన్ని రకాలు ఊరగాయలు తయారీ చేస్తోంది శశికళ. జిలకరతో తయారీ చేసిన ఊరగాయలకు మరింత డిమాండ్ ఏర్పడిందంటోంది ఆమె. ఆరోగ్యానికి మేలు చేసే విధంగా పలు రకాలు పదార్థాలను ఉపయోగించడంతో తట్టక్కన ఉప్పిన కాయకు (ఊరగాయకు) భలే డిమాండ్ ఏర్పడింది. ఉత్తర కన్నడ జిల్లాలో కాకుండా ప్రస్తుతం ధార్వాడ, బెంగళూరు, బాగల్‌కోట ఇలా పలు జిల్లాల్లో కూడా ఆమె తయారీ చేసిన ఊరగాయలకు గిరాకీ ఉంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ అదే తినాలనిపించే విధంగా, వట్టి ఊరగాయతోనే కడుపునిండా భోజనం చేసే విధంగా రుచి ఉంటుందని చెబుతారు. ఆదాయం, సంతృప్తి: శశికళ ఆమె సాక్షితో మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, తాను ఇంటి వద్దనే కూర్చొని వంట పని,ఉన్న ఒక ఎకరం పొలంపనులు చేసుకుని ఉన్నప్పుడు నిమ్మతొక్కుతో చాట్‌మసాలా ఆలోచన వచ్చిందన్నారు. అదే కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. తాను ఉపాధి పొందడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తూన్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా ఇంటి పట్టునే కుటీర పరిశ్రమను నెలకొల్పానని, ఆదాయంతో పాటు ఎంతో తృప్తి కలుగుతోందన్నారు. పొలంలోనే నిమ్మకాయ, మామిడి తదిరాలను పండించి ఊరగాయలకు ఉపయోగిస్తున్నా, పెట్టుబడులు పోను ఐటీ ఇంజినీర్లు, డాక్టర్లతో సమానంగా ఆదాయం పొందుతున్నా, ఇంతకంటే ఆనందం ఏముంది? అని అన్నారు. -
ఆవకాయ స్వీట్...అమెరికాలో హాట్
మామిడికాయ బద్దకు కాస్త ఉప్పూ కారం, ఆవాల పొడి అద్ది.. ఆపై నూనెలో ఈత కొట్టించి.. నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది. అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం. 70 ఏళ్లుగా తీపి ఆవకాయ తయారు చేస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, అండమాన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం తయారీయే ప్రత్యేకం కల్వటేరు రకానికి చెందిన మామిడి కాయలను మాత్రమే పచ్చడి తయారీకి వినియోగిస్తారు. మే, జూన్ నెలల్లో తూర్పు గోదావరి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి మామిడి కాయల్ని దిగుమతి చేసుకుంటారు. రసాయనాలు వినియోగించకుండా తయారు చేసిన బెల్లాన్ని సేకరిస్తారు. మామిడి కాయ ముక్కల్ని నానబెడతారు. బాగా ఎండబెడతారు. కారం, ఆవ పిండి, బెల్లం దట్టిస్తారు. చివరగా నూనె కలిపి డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. రెండు నెలల పాటు బాగా మగ్గిన తరువాత అమ్మకాలు ప్రారంభిస్తారు. గ్రామంలో హోల్‌సేల్‌గా, ఇతర గ్రామాలకు మోటార్ సైకిళ్లపై వెళ్లి రిటైల్‌గా అమ్మకాలు సాగిస్తారు. 70 ఏళ్లుగా ఇదే వృత్తి హరిపాలెం వాసులు 70 ఏళ్ల క్రితం తీపి ఆవకాయ తయారీనే వృత్తిగా స్వీకరించారు. ఒక్కొక్క కుటుంబం 10 డ్రమ్ముల పచ్చడి తయారు చేస్తుంది. ఏడాది పొడవునా రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు జరుపుతారు. ముఖ్యంగా గ్రామంలో ‘పెంటకోట’, ‘కాండ్రేగుల’ ఇంటిపేరిట గల కుటుంబాలు పచ్చడి తయారీలో సిద్ధహస్తులు. వీళ్లు తయారు చేసే విధానం వల్ల ఏడాది వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. మార్కెట్లో వివిధ బ్రాండ్లలో లభిస్తున్న ఆవకాయ పచ్చడి తయారీకి యంత్రాలను వినియోగిస్తారు. నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతారు. హరిపాలెంలో తయారు చేసే ఆవకాయలో ఎలాంటి రసాయనాలు వినియోగించరు. విదేశాల్లోనూ ఖ్యాతి ఉద్యోగ, వ్యాపార రీత్యా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో స్థిరపడిన చాలామంది హరిపాలెం ఆవకాయ కోసం పరితపిస్తుంటారు. స్వదేశానికి వచి్చ.. తిరిగి వెళ్లే సమయంలో ఇక్కడి నుంచి ఆవకాయ కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇంకొందరికి ఇక్కడి వారు పార్శిళ్ల రూపంలో పంపుతున్నారు. మరోవైపు ఒడిశా, విశాఖ ఏజెన్సీ, పశి్చమ బెంగాల్‌కు చెందిన రిటైల్ వ్యాపారులు ఇక్కడి ఆవకాయ కొనుక్కెళ్లి అక్కడ విక్రయిస్తుంటారు. అండమాన్‌లో స్థిరపడిన హరిపాలెం వాసులు ఏదైనా పనిమీద స్వగ్రామానికి వచి్చనప్పుడు వంద నుంచి రెండొందల కిలోల పచ్చడిని అక్కడ విక్రయించేందుకు తీసుకెళుతుంటారు. ప్రభుత్వ సాయం అందితే.. ప్రతి కుటుంబానికి ఏటా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. నగలు, ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నాం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి రూ.50 వేల చొప్పున బ్యాంకు రుణం ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. – కాండ్రేగుల శ్రీను, తయారీదారు పార్శిళ్లు పంపుతున్నాం హరిపాలెం ఆవకాయకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాకి కూడా ప్రత్యేక పార్శిళ్లు పంపిస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేవారు తమవెంట కచ్చితంగా పచ్చడి తీసుకెళతారు. వారిని చూసేందుకు వెళ్లేవారు కూడా హరిపాలెం ఆవకాయను తీసుకెళుతున్నారు. – బుద్ధ వెంకట సత్యరాము, తయారీదారు -
అయ్యో.. ఆవకాయ!
సాక్షి, ద్వారకాతిరుమల: వేసవి వచ్చిందంటేచాలు పల్లెల్లో ఆవకాయ పచ్చళ్లు ఘుమఘుమలాడేవి. కానీ ఈ ఏడాది గ్రామాల్లో ఆ హడావుడి అంతగా లేదు. పెరిగిన ఆవకాయ ధరలే దీనికి కారణం. గతేడాదే తక్కువగా ఉన్న కాపు ఈ ఏడాది మరీ తగ్గిపోయింది. దీంతో ఆవకాయ ధర అమాంతంగా ఆకాశానికెగసి సామాన్యుడికి అందకుండా ఉంది. దిగుబడి ఢమాల్ రాష్ట్రవ్యాప్తంగా 3,36,956 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. దీని ద్వారా ఏటా 40,43,472 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తోంది. అయితే ఈ ఏడాది కురిసిన విపరీతమైన మంచు, ప్రస్తుతం మండిపోతున్న ఎండలు.. వీటికి తోడు ఇటీవల ఈదురు గాలులు, అడపాదడపా కురుస్తున్న వడగండ్ల వానలతో దిగుబడులు సగానికి సగంపైగా çపడిపోయాయి. దీంతో 15 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రావడం కూడా కష్టమేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంటకూడా ప్రస్తుత తీవ్ర ఎండలకు ఉడికిపోయి రంగు మారుతోంది. దీంతో రైతు తన పంటను అమ్ముకునేందుకు తొందరపడుతున్నాడు. గతంలో ఇక్కడ పండిన పంట బరోడా, అహ్మదాబాద్, నాగపూర్, ఇండోర్, భోపాల్, జోద్పూర్, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతయ్యేది. అలాగే మామిడి ముక్కలు గుజరాత్‌లోని నడియాద్ వంటి ప్రాంతాలకు వెళ్లేవి. అయితే ఈసారి దిగుబడుల్లేక ఎగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో సాధారణంగా పచ్చళ్లకు దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి, చిన్నరసాలు, తెల్ల గులాబీ, సువర్ణరేఖ వంటి కాయలను వినియోగిస్తారు. అయితే ఈసారి అవి దొరకని పరిస్థితులు నెలకొనడంతో.. ఏం చేయాలో పాలుపోక పచ్చడి ప్రియులు సతమతమవుతున్నారు. ఒక వేళ మార్కెట్లో ఇవి దొరికినా ఒక్కో కాయ ధర పరిమాణాన్నిబట్టి రూ.15 నుంచి రూ.40 వరకు పలుకుతుండటంతో మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది కంటే మామిడి కాపు గణనీయంగా తగ్గింది. ఈదురు గాలులు, వడగాడ్పుల కారణంగా పంట బాగా దెబ్బతింది. అంతకు ముందు పూతను నిలుపుకొనేందుకు అధిక పెట్టుబడులు పెట్టి, చెట్లను కన్నబిడ్డల్లా కాశాం. అయినా దిగుబడి సరిగ్గా రాలేదు. పొలాల్లో అమ్మితేనే మాకు ఒక రూపాయి మిగులుతోంది. అలాకాక మార్కెట్‌కు తీసుకెళ్తే దళారుల వల్ల పెట్టుబడులను నష్టపోవాల్సి వస్తోంది. దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి వంటి కాయలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక్కో కాయ సైజును బట్టి రూ.40 వరకు పలుకుతోంది. – ఘంటా వెంకట నరసింహరావు, రైతు, రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం మామిడి కాయ ధరా.. అమ్మో! మామిడికాయ ధర వింటే దడపుడుతోంది. మార్కెట్లో చిన్న మామిడి కాయ ధర రూ.15 పైచిలుకే పలుకుతోంది. ఇలాగైతే పచ్చళ్లు పెట్టుకోలేం. కొత్తపల్లి కొబ్బరి, దేశివాళీ కాయలు కొందామంటే రూ.30 నుంచి రూ.40 పలుకుతున్నాయి. – అడపా సత్యన్నారాయణ, వినియోగదారుడు, ఈస్ట్ యడవల్లి, కామవరపుకోట మండలం సందడి కనబడటం లేదు ఏటా ఈ సమయానికి నిల్వ పచ్చళ్లు పెట్టేసేవాళ్లం. ఈ సారి మామిడికాయ దొరక్క ఇంకా పచ్చళ్లు పెట్టలేదు. ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మామిడి కాయల ధరతో పాటు.. పచ్చళ్ల తయారీకి వినియోగించే మిగతా సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. – కావేటి దేవి, గృహిణి, కొత్తపేట, జంగారెడ్డిగూడెం మండలం -
నవకాయ పచ్చళ్లు
ఒక దారిన మామిడికాయలు డేగిశాలో కొలువుదీరతాయి. మరో మార్గాన ఆవాలు పిండిగా మారి గిన్నెలోకి చేరతాయి. ఇంకో దారిలో పల్లీలో, నువ్వులో నూనె రూపంలో జాడీలోకి జారిపోతాయి. మిరపకాయలూ కారంలా మారి ఆ డేగిశాలోకే వచ్చి తీరతాయి. సముద్రం నుంచి పండిన ఉప్పు పంట కూడా అదే డేగిశాలోకి వచ్చి చేరాక... ఆ ఫ్రెండ్షిప్పుతో ఏర్పడిన కలయికతన ఎర్రదనపు అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఆ సాన్నిహిత్య పరిమళాలను ముక్కుకు అందజేస్తుంది. వాటన్నింటి స్నేహపు రుచి మన నాలుకకూ విందు చేస్తుంది. పసందైన ఆ రుచిని మీరూ అనేక రకాలుగా ఆస్వాదించడం కోసమే నీళ్లూ, బెల్లం, చిట్టి, ఎండు ఆవకాయలూ, గుజ్జు మెంతీ, నూనె, తీపి మాగాయలూ ఇలాంటి దివ్య నవ్య నవ ఆవకాయల స్పెషల్ మీకోసం... మెంతి ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 12; మెంతి పిండి – 400 గ్రా. (వేయించి పొడి చేసుకోవాలి); కారం – అర కేజీ; ఉప్పు – 400 గ్రా.; నువ్వుల నూనె – 2 కిలోలు; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడి కాయలను గుత్తి వంకాయ మాదిరిగా (టెంక తీయకూడదు) తరగాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడికాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలలోనూ స్టఫ్ చేసి, జాడీలో పెట్టి, మూత ఉంచి మూడురోజుల పాటు కదపకుండా ఉంచాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, స్టఫ్ చేసిన మిశ్రమాన్ని వేరు చేయాలి ∙గుత్తిలా ఉన్న మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి (ఎండినందువల్ల తరగటం కొద్దిగా కష్టమే) ∙కాయలను, మిశ్రమాన్ని వేరువేరుగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙మూడో రోజు మరోమారు పైకి కిందకి కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ నూనెను మెంతి ఆవకాయ మీద పోసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది ∙ఇందులో ఆవపిండి ఉండదు కనుక శరీరానికి వేడి చేయదు. అవసరమనుకుంటే తరవాత కలుపుకోవచ్చు. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 25; ఆవపిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – అర కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; బెల్లం – అర కేజీ; చింతపండు – అర కేజీ; నూనె – 2 కేజీలు; మెంతులు – 100 గ్రా. తయారీ: ∙చింతపండును ఒక రోజు ఎండబెట్టాలి ∙బెల్లాన్ని సన్నగా తరిగి ఒక రోజు ఎండబెట్టాలి ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙కాయలలోని జీడిని, పొరలాంటి దానిని వేరు చేయాలి ∙ఒక పాత్రలో ఆవపిండి, మిరప కారం, ఉప్పు వేసి కలపాలి ∙తగినంత నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా మామిడి కాయ ముక్కలు జత చేస్తూ బాగా కలిపి, జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత మొత్తం ఊరగాయను తిరగతీసి, పై నుంచి కిందకి బాగా కలపాలి ∙బెల్లం, చింతపండు జతచేసి మరోమారు బాగా కలిపి, నూనె పోసి కలపాలి ∙జాడీలోకి తీసుకుని రెండు రోజుల తరవాత అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ∙ఈ ఆవకాయను పిల్లలు ఇష్టంగా తింటారు. గుజ్జు మెంతి కాయ కావలసినవి: మామిడి కాయలు – 6 (కొద్దిగా తియ్యటివైతే పచ్చడి రుచిగా ఉంటుంది); మెంతిపిండి – పావు కేజీ; ఉప్పు – 200.; మిరప కారం – 250 గ్రా.; నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙తొక్క తీసేయాలి ∙మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి గుజ్జులా చేసి గట్టిగా పిండి ఊట వేరు చేయాలి ∙గుజ్జును, ఊటను విడివిడిగా ఎండలో సుమారు మూడు గంటలపాటు ఎండబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి తీసి, చల్లారాక పొడి చేయాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ∙మామిడికాయ గుజ్జు, రసం జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక కొద్దిగా ఇంగువ వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక గుజ్జు మెంతికాయలో వేసి బాగా కలిపి, గాలి చొరని జాడీలో నిల్వ చేసుకోవాలి ∙రెండు రోజుల తరవాత వేడి వేడి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. నూనె మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; ఉప్పు – 400 గ్రా.; కారం – 1/2 కేజీ; మెంతి పిండి – 100 గ్రాములు (మెంతులు వేయించి పొడి చేయాలి); ఆవపిండి – 100 గ్రా. (వేయించి పొడి చేయాలి); నువ్వుల నూనె – అర కేజీ; ఇంగువ – అర టీ స్పూను తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేవరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ∙పై తొక్కు పూర్తిగా తీసేయాలి ∙సన్నగా, పల్చగా ముక్కలు తరగాలి ∙ముక్కలను ఒక వస్త్రం మీద పోసి, ఎండలో ఒకరోజు ఎండబెట్టి తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కాచాలి ∙ఒక పెద్దపాత్రలో ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవపొడి వేసి బాగా కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి బాగా కలపాలి ∙రెండు రోజుల తరవాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎండు ఆవకాయ లేదా పచ్చ ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 12; పచ్చ మిరప కాయల కారం – పావు కేజీ (వీటిని గొల్లప్రోలు మిరపకాయలు అంటారు. పసుపు రంగులో, కొద్దిగా కారంగా ఉంటాయి); ఉప్పు – 150 గ్రా.; ఆవ పిండి– పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; నూనె – ఒక కిలో; మెంతులు – 50 గ్రా. తయారీ: ∙ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరబోయాలి ∙కాయలను నిలువుగా నాలుగు చెక్కలుగా తరగాలి (విడిపోకూడదు) ∙ఒక పాత్రలో మిరప కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె తయారుచేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడి కాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలు తయారుచేసుకుని, మూడు రోజుల పాటు గాలి చొరని జాడీలో ఉంచి మూత పెట్టేయాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, కాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని వేరు చేసి, కాయలను, ఆవ పిండిని విడివిడిగా రెండు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు మామిడికాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని కలిపేయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, నూనె పోయాలి ∙పైకి కిందకి బాగా కలిపి గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ∙వేడి వేడి ఆవకాయ అన్నంలో మామిడి పండు నంచుకుని తింటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మెంతి మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; మిరప కారం – 250 గ్రా.; మెంతి పిండి – 150 గ్రా.; ఉప్పు – 200 గ్రా.పోపు కోసం... నువ్వుల నూనె – అర కేజీ; ఆవాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3 (ముక్కలు చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – తగినంత. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి ∙మామిడి కాయల తొక్కు తీసేయాలి ∙మామిడి కాయలను సన్నగా తురమాలి ∙సుమారు రెండు గంటలపాటు ఎండబెట్టాలి ∙ఒక పాత్రలో మామిడికాయ తురుము, మిరప కారం, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి గంట సేపు వదిలేయాలి ∙మూత తీసి అన్నీ బాగా కలిసేలా మరోమారు కలిపి, కచ్చపచ్చాగా వచ్చేలా మిక్సీలో తిప్పాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగా ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙ఆవాలు చిటపటలాడుతుండగా ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి ∙మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙చల్లారాక గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి. తీపి మాగాయ కావలసినవి: మామిడి కాయలు – 6; బెల్లం – పావు కిలో; ఉప్పు – 150 గ్రా.; నూనె – పావు కిలో; కారం – 50 గ్రా. (రుచికి అనుగుణంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు); ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడవాలి ∙పైతొక్క తీసేసి, మామిడికాయలను పలుచని రేకుల్లా ముక్కలు తరగాలి ∙టెంకలతో సహా కలిసి ముక్కలను ఒక పెద్ద వెడల్పాటి బేసిన్లో వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచేయాలి ∙మరుసటి రోజు ఉదయం మళ్లీ ఒకసారి బాగా కలిపి మళ్లీ మూత ఉంచేయాలి ∙మూడు రోజులయ్యాక బాగా ఊరి ఊట వస్తుంది ∙ఊట అంతా పిండేసి, ముక్కలు ఊటను వేరు వేరు పాత్రలలో ఉంచి మంచి ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు ముక్కలను ఊటలో వేసి మరో రోజు ఎండబెట్టాలి ∙ఇది ప్రతి మాగాయికి బేసిక్‌గా చేయవలసిన పని ∙బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి పోపు పెట్టి మాగాయలో వేయాలి ∙మిగిలిన నూనె వేసి బాగా వేడెక్కిన తరవాత స్టౌ కట్టేయాలి ∙నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక కారం, మెంతులు వేయించి చేసిన పొడి వేసి ఆ మిశ్రమం అంతా మాగాయలో వేసేయాలి ∙మందపాటి గిన్నెను స్టౌ మీద ఉంచి వేడయ్యాక, బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి కరిగిన తరవాత దింపేసి, సిద్ధం చేసి ఉంచుకున్న మాగాయలతో వేసేయాలి ∙ఘుమఘుమలాగే తీపి మాగాయ సిద్ధమైయనట్లే. చిట్టి ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 6; ఉప్పు – 100 గ్రా.; మిరప కారం – 150 గ్రా.; ఆవ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె – పావు కేజీ; వెల్లుల్లి రెబ్బలు – 100 గ్రా. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙చిన్న చిన్న ముక్కలు తరగాలి ∙ఒక పాత్రలో ఉప్పు, మిరప కారం, ఆవ పొడి వేసి కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేయాలి ∙మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలపాలి ∙మిగిలిన నూనె జత చేసి కలియబెట్టి, గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది. నీళ్ల ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 25; ఆవ పిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – ముప్పావు కేజీ; నూనె – 2 కేజీలు. పోపు కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – రెండు టీ స్పూన్లు; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించి దింపేయాలి ’∙ఆవ పొడి వేసి బాగా కలపాలి ∙నీళ్లు పూర్తిగా పీలుచకున్నాక ఆవ పొడిని ఒకరోజు ఎండబెట్టాలి ∙రెండో రోజు మామిడి కాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙ఒక పెద్ద పాత్రలో ఆవ పొడి, ఉప్పు, కారం వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరోమారు కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపి చల్లారాక, ఆవకాయలో వేసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత మరోమారు కలపాలి. పచ్చడి – పదనిసలు ►పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ► పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ►స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ►ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడిలేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ► పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ►పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ►వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. -
మా ఇంటి ఆవకాయ... చెప్పుకుంది ముచ్చట్లెన్నో!
ఎండలు మండుతున్నాయి. పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి రావడం ఇప్పటికే మొదౖలñ పోయింది. రెండున్నర నెలల క్రితం గృహప్రవేశానికని మాతోబాటు చిన్నక్కా వాళ్ల ఇంటికి వచ్చి, నేను మళ్లీ ఇంత తొందరగా ప్రయాణం చేయలేనంటూ అక్కడే దిగబడిపోయింది అమ్మ. ఎప్పుడొస్తున్నావమ్మా అనడిగితే ‘ఇక్కడే ఉండి పచ్చళ్లు పెట్టుకొని వస్తాలే, అయినా, నేను వచ్చి మాత్రం చేసేదేముంది ఇప్పుడక్కడ?’ అంటూ అక్కడే ఉండిపోయింది. పచ్చళ్లు అంటే ఆవకాయ, మాగాయే. అదీ మహా అయితే ఓ పాతిక కాయలతో మాగాయ, ఓ డజనో, డజనున్నర కాయలతో ఆవకాయ పెట్టుకొస్తుందేమో! ఈలోగా నేను ఊరుకోలేక పప్పులోకని కొనుక్కొచ్చిన కాయల్లో కాస్త పెద్దవి చూసి వాటితో ఆవకాయ, కొంచెం పీచుపట్టిన కాయలతోనేమో మాగాయ మా శ్రీమతితో పెట్టిస్తూ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నాన నుకోండి... ఆవకాయ, మాగాయ ... కాదు కాదు.. ఎండాకాలం అంటే నాకు గుర్తొచ్చేది మా చిన్నప్పుడు మా తాతయ్య చేసిన హడావుడి... దాదాపు రెండు వందల చిన్నరసాల కాయలతో మాగాయ, నూటయాభైకి తక్కువ కాకుండా పెద్దరసాలు లేదా జలాలతో ఆవకాయ పెట్టించేవాడు. ముందుగా తోటనుంచి బస్తాలతో కాయలు దిగేవి. అమ్మ, పిన్నులు వాటికి ముచికలు తీసి నీళ్ల తొట్లు, బకెట్లలో పడేసేవాళ్లు. మధ్యాన్నం అన్నాలు తిన్నాక వాటిని తీసి శుభ్రంగా తుడిచి పాత చీర మీద గుట్టలుగా పోసేవాళ్లు. రెండు మూడు కత్తిపీటలు తీసుకుని ఇంట్లో ఆడవాళ్లందరూ తరిగేవాళ్లు వాటిని. మధ్యలో కాయలు కాస్త రంగు మారినట్టు అనుమానం వస్తే రుచి చూడమని నాకిచ్చేవాళ్లు. నేనేదో మేధావిలా పోజు కొడుతూ ‘ఈ ముక్క అంత పుల్లగా ఉన్నట్టు లేదు మామ్మా’ అని చెప్పేవాణ్ణి ఒక పక్క పులుపుతో కన్ను మూసుకుపోతున్నా కూడా! వెంటనే ఆ ముక్కకి కాస్త ఉప్పూ కారం అద్ది ప్లేటులో పెట్టి ఇచ్చేసేవాళ్లు. అట్లాంటి బేరాలు ఇంకొన్ని తగిలాయంటే ఇంక నాకు పండగే పండగ. కొన్నింటిని తరగబోతుండగానే తీసేయించేవాణ్ణి. వాటిని మెల్లగా తీసుకెళ్లి వడ్లపురిలోనో, బియ్యం రమ్ములోనో (డ్రమ్మునే మా మామ్మ, ఇంకా పెద్దవాళ్లు అలా అనేవాళ్లు) దాచేవాణ్ణి. రెండు రోజుల తర్వాత సగం పండిన మామిడికాయను బయటికి తీసి రుచి చూస్తూ పుల్లగా ఉన్నట్టు ట్ట ట్ట ట్ట అంటూ లొట్టలు వేస్తూ ఊరించుకుంటూ తినేవాణ్ణి. ఇంట్లో ఆడవాళ్లెంత మంది ఉన్నా, మాగాయ కలిపేది మాత్రం మా మామ్మే. బేసిన్‌లోకి తీసి పైనుంచి కిందికి బాగా కలిపి జాడీలో పెట్టేసేది మా మామ్మ. ఇక మాగాయ తిరగమోత వేసేటప్పుడు ఇంగువ వాసనతో ఇల్లంతా ఘుమ ఘుమలాడిపోయేది. అందుకోసం బెజవాడలోని నంబూరు సాంబశివరావు కొట్టునుంచి తాతయ్య ప్రత్యేకమైన పచ్చళ్ల ఇంగువ తెప్పిస్తే ఘుమఘుమలాడక ఏం చేస్తుంది మరి! మాగాయ కలిపిన బేసిన్లో అన్నం కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. తినేటప్పుడు తాతయ్య అందరికేసీ చూసి కళ్లెగరేసేవాడు... ఎట్లా ఉంది అన్నట్టు. అందరూ ఆహా అనే అనేవాళ్లు. మా మామ్మ పెట్టిన మాగాయ రుచికి వంక పెట్టగలరా ఎవరైనా... అయిపోయిన తర్వాత ఆవకాయ పని పట్టేవాళ్లు. ఆవకాయకి మాత్రం మా నాన్న, బాబాయిలు, పెద్దమ్మమ్మతో సహా అందరూ రంగంలోకి దిగిపోయేవాళ్లు. మా నాన్న చేతికి దెబ్బ తగలకుండా ముందుగానే ఒక చిన్న టవల్‌ను కట్టుకునేవాడు. కడిగి తుడిచి పెట్టిన కాయలను తీసుకుని కత్తిపీటతో టకాటకా కొట్టేసేవాడు. ‘‘జాగర్త రా కిష్టీ... ముక్కలు పెద్దవవుతున్నాయనో, నీ హడావుడి చూస్తుంటే వేళ్లు కూడా తరుక్కునేట్టున్నావురా...’’ అంటుండేవాడు తాతయ్య. ఈ లోగానే నాన్న చిన్నగా అరిచి వేలును ఉఫ్ఫూ ఉఫ్పూ అని విదిలించడం, అట్లా విదిలించిన వేలినుంచి రక్తం ధారలుగా కారడం... ‘‘అదిగో చూశావా, వేలు కూడా తరుక్కున్నావురా, ముందు కట్టుకట్టుకో ఆ వేలికి, ఇంక నువ్వు తప్పుకోరా కిష్టీ... అందుకే నిన్ను సాంబక్కాయి కాళిదాసూ అనేది’’ అంటూ కంగారుగానే అరిచేవాడు తాతయ్య. నాగన్నాయి బాబాయి ముందే అరిచేవాడు. శేషాద్రి బాబాయి తర్వాత ఆదిత్య బాబాయి కొన్ని కాయలు ముక్కలు కొట్టేవాడు. గోపీ బాబాయి, శీను బాబాయి ముందుగా తోటకెళ్లి కాయలు, వాటికి కావలసిన ఉప్పులూ, కారాలూ, ఆవాలూ, మిరపకాయలూ నూనె డబ్బాలూ మోసుకొచ్చి పడేసేది వాళ్లే కాబట్టి, ముక్కలు కొట్టడంలో పెద్ద పనుండేది కాదు వాళ్లకి. కొట్టిన ముక్కలమీద ఉండే పై పొరను పెద్దమ్మమ్మ, అమ్మ, పిన్నులు చెంచాలతో జీడిని వేరు చేసి, ముక్క మీద ఉండే పొరను గీరి తీసేసేవాళ్లు. మామ్మ వాటిని మరోసారి శుభ్రంగా తుడిచి నూనెలో ముంచి ఆవ పిండి, ఉప్పు కలిపిన పెద్ద బేసిన్లకు ఎత్తేది. ఒక జాడీడు పచ్చడిలో వెల్లుల్లి గర్భాలు కలిపితే, ఇంకో చిన్నజాడీలో మెంతిపిండి, మరో జాడీలో పెసరపిండి కలిపి మెంతికాయ, పెసరావకాయ కూడా పెట్టేసేది పనిలో పనిగా. షరామామూలుగా ఆవకాయ కలిపిన బేసిన్లను అలాగే ఉంచి అన్నం కలిపి, అందరికీ తలా ఓ ముద్ద పెట్టి ఉప్పుకారాలు సరిపోయాయో లేదో చూడమనేది మామ్మ. ఒకళ్లు ఉప్పు తక్కువైందంటే, ఇంకోళ్లు కారంఎక్కువైందంటే.. మరొకళ్లేమో ఆవఘాటు ఎక్కువైందనో, తక్కువైందనో... ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవాళ్లు. ఇంక నాలుగైదు రోజులు గడిచాక ఎన్ని కూరలు చేసినా సరే, ఇంటిల్లిపాదీ ఆవకాయ మాగాయ, పెసరావకాయ, మెంతికాయలతోనే లాగించేవాళ్లు. మా నాన్న, తాతయ్య, బాబాయిలు అయితే వేడి వేడి అన్నంలో ఎర్రటి ఆవకాయ కలిపేవాళ్లు. నాన్నేమో వెన్నపూస ఉందామ్మా అని అడిగేవాడు. తాతయ్య, బాబాయిలు నూనె వేయించుకునేవాళ్లు. పిల్ల బ్యాచి మాత్రం లైటు లైటుగా ఆవకాయ కలుపుకుని అందులోకి రెండు మూడు మిల్లు గరిటల వేడి వేడి నెయ్యి వేయించుకుని తినేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులు రమ్మన్నా రావు... కిరాణా షాపులకో బిగ్ బజార్ల వంటి మాల్స్కో వెళ్లి ప్యాకెట్లలో తెచ్చిన ఆవపిండి, మెంతిపిండి, టాటా సాల్టు, ఇదయం నువ్వుల నూనె తెచ్చి పెట్టుకుని, డజను మామిడికాయలు ముక్కలు కొట్టించుకుని తెచ్చి, మరో పదిహేను కాయలు మాగాయకని తెచ్చుకుని, దానితోపాటు ఎవరెస్టో, ఎల్జీనో, జీడీనో, పతంజలి ఇంగువ డబ్బానో తెచ్చుకుని మేమూ ఆవకాయ మాగాయ పెట్టుకున్నామనిపించుకుంటున్నాం. కష్టపడి పెట్టుకున్న వాటిని కడుపునిండా తినాలన్నా భయమే. ఒక్కొక్కళ్లకీ మూడున్నర పదులకే బీపీలూ, షుగర్లూ, కొలెస్ట్రాళ్లూ... అయినా సరే, పచ్చడి పెట్టుకున్న కొత్తల్లో నాలుగురోజులపాటు వరసగా వేసుకుని, తర్వాత అప్పుడప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తింటున్నారందరూ. ఏం చేస్తాం... కాల మహిమ! – బాచి -
తీపి పచ్చళ్లు
బెల్లం చుట్టూ చీమలు చేరడం పాత ముచ్చట.కారం చుట్టూ తిరగడం మామూలు ఇచ్చట.తీపి పచ్చళ్లంటే అందరికీ మమకారమే.కారంలో తీపి కలపడం రుచికి గుణకారమే.ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇల్లాళ్ల చేతులు వేగం పుంజుకుంటాయి. జాడీలు ప్రాణం పోసుకుంటాయి. నాలుకలు కొత్త ఆవకాయ ఘాటు కోసం చెవులు కోసుకుంటాయి. మరి కారపు పచ్చళ్లలో వెరైటీగా కొంచెం తీపిని కూడా మిళాయిస్తే ఆ ఘుమఘుమే వేరు, ఆ మధురిమే కొత్త తీరు.మామిడికాయ, ఖర్జూరం, టొమాటో, జామకాయ, నిమ్మకాయ, బీట్రూట్, పచ్చిమిరప, అల్లం, క్యారెట్, కీరదోస, కాలీఫ్లవర్ లాంటి పచ్చళ్లను ఈసారి కొత్తగా ప్రయత్నించండి. ఇల్లంతా తియ్యటి వేడుక చేసుకోండి. నిమ్మకాయ ఊరగాయ కావలసినవి: నిమ్మకాయలు – 12, ఉప్పు – 3 టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆపైన వాటిని ముక్కలుగా చేసి, గింజలను తొలగించాలి. ఇప్పుడు ఓ జాడీ తీసుకొని, అందులో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు కలపాలి. ఆ జాడీ పదిహేను రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను రోజుల తర్వాత ఆ నిమ్మ ముక్కలను ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి అర కప్పు నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడుతుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో నిమ్మ ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరకయ్యాక జాడీలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి (ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉన్నవి) తరుగు – 1 కప్పు, నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు – 2 టీ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు (నానబెట్టిన తర్వాత వచ్చే గుజ్జు) – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నువ్వులు, ఆవాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆపైన స్టవ్‌పై మూకుడు పెట్టి నూనె పోయాలి. అందులో పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి కలపాలి. నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మూకుడు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరో పాన్ పెట్టి చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేయాలి. మిశ్రమం వేడయ్యాక, నువ్వులు–ఆవాల పొడి, బెల్లం తరుగు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసుకోవాలి. ఆపైన అందులో పచ్చి మిర్చి, అల్లం మిశ్రమం వేసి మరో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తర్వాత మిశ్రమం పూర్తిగా చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. ఖర్జూరం ఊరగాయ కావలసినవి: పచ్చి ఖర్జూరాలు – 2 కప్పులు, అల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ ఇంగువ – అర టీ స్పూన్, వెనిగర్ – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టేబుల్ స్పూన్, బెల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మ – 1, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా పాన్‌లో నూనె పోయాలి. అందులో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. ఆ పైన ఖర్జూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, మెంతుల పొడి, కారం, ఆవాల పొడి, ఉప్పు వేయాలి. చివరగా బెల్లం తరుగు, వెనిగర్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక స్టవ్‌ను ఆఫ్ చేసుకోవాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 3, ఆవాలు – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – రెండున్నర టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – 1 కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా మామిడి కాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఓ బౌల్లో వాటిని తీసుకొని, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని ఓ రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. తెల్లవారాక దాంట్లోని నీటినంతా పారబోసి, ముక్కలను మూడురోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. నాలుగోరోజు, రెండు కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండిన ముక్కలను వేసి ఓ గంటపాటు పక్కన పెట్టాలి. మరోవైపు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి (పాకం ముదురు కాకుండా చూసుకోవాలి). మామిడి ముక్కలను మరో బౌల్లోకి తీసుకొని, కారం, మెంతుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఆపైన అందులో బెల్లం పాకం వేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో ఆవాలు, ఇంగువ వేసి, ఆ పైన మామిడి మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా ఆవకాయను జాడీలోకి తీసుకోవాలి. టొమాటో ఊరగాయ కావలసినవి: టొమాటో ముక్కలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం పొడి – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం తరుగు – 3 టీ స్పూన్లు, ఆవాల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఉంచాలి. ఆపైన అందులో ఇంగువ, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, బెల్లం వేసి కలపాలి. పాన్‌పై మూత పెట్టి మిశ్రమం దగ్గరకయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆపైన దాన్ని దింపేసి, జాడీలోకి తీసుకోవాలి. కీరదోస పచ్చడి కావలసినవి: కీరదోస – 6 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా, లవంగాల పొడి – పావు టీ స్పూన్, నూనె – సరిపడా తయారీ: ముందుగా స్టవ్ వెలిగించుకుని, ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కీర ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని వేయించు కోవాలి. తర్వాత అందులో చక్కెర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చడి కావలసినవి: అల్లం ముక్కలు – 1 కప్పు, పసుపు– పావు టీ స్పూన్, చింతపండు గుజ్జు – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, మెంతుల పొడి – ముప్పావు టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఎండు మిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఇంగువ – చిటికెడు తయారీ: ముందుగా అల్లం ముక్కలను కొద్దిగా వేయించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. అందులో మెంతుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి కలపాలి. ఆపైన దాంట్లో అల్లం మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం తర్వాత దింపేసుకోవాలి. చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. జామకాయ పచ్చడి కావలసినవి: జామకాయ గుజ్జు (దోర కాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి)– ఒకటిన్నర కప్పులు, నూనె – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో బెల్లం తరుగు, ఇంగువ వేయాలి. అర నిమిషం తర్వాత మిరియాల పొడి, కారం, మెంతుల పొడి వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేవరకు స్టవ్‌ను మీడియం మంట పైనే ఉంచాలి. ఆ పైన సిమ్‌లో పెట్టి జామకాయ గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసి, చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. వెల్లుల్లి ఊరగాయ కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు – 1 కప్పు, నువ్వుల నూనె – పావు కప్పు, ఆవాలు – 1 టీ స్పూన్, ఇంగువ –పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – రుచికి తగ్గట్టు, పసుపు – చిటికెడు, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – రెండున్నర టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి, అవి వేగగానే కరివేపాకు, ఇంగువ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి. ఇప్పుడు బెల్లం తరుగు, మెంతుల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గరయ్యే వరకు ఉడికించి దింపేయాలి. చల్లారాక ఒక జాడీలోకి తీసుకోవాలి. క్యారెట్ ఊరగాయ కావలసినవి: క్యారెట్ తురుము – 3 కప్పులు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి – 1 టీ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, బెల్లం తరుగు – పావు కప్పు, నిమ్మ కాయలు – 2 లేదా 3(మీడియం సైజ్), కారం – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి –పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, నూనె – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ జత చేసుకుని గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బెల్లం వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అన్ని పొడులను మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని జాడీలోకి తీసుకోవాలి. బీట్రూట్ ఊరగాయ కావలసినవి: బీట్రూట్ – 3 (మీడియం సైజ్), చక్కెర – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, వెనిగర్ – పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బీట్రూట్ను బాగా కడిగి, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో బీట్ రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. తర్వాత వెనిగర్‌తో పాటు చక్కెర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకుని నిల్వ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఊరగాయ కావలసినవి: కాలీఫ్లవర్ – 1 (మీడియం సైజ్), ఉల్లిపాయ గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఆవాలు – 1 టీ స్పూన్, నిమ్మరసం – పావు కప్పు, వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – 2 టేబుల్ స్పూన్స్, నూనె – పావు కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, వెల్లుల్లి గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నాన్‌స్టిక్ పాత్రలో నూనె వేసుకుని కాస్త వేడిగా అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను చెంచాతో తిప్పుతూ వెల్లుల్లి మిశ్రమం, కారం, చక్కెరను అందులో వేసుకుని బాగా కలుపుకుని ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఇంకాసేపు ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని జాడీలోకి తీసుకోవాలి. -
కొత్త కొత్త ఆవకాయ్
ఆవకాయ అంటే తెలుగువాళ్లకు ఎంత ప్రీతి ఉన్నా, ఆవకాయను తెలుగువాళ్ల జాతిసంపద అనుకున్నా... దేశంలోని మిగిలిన ప్రాంతాల వాళ్లు కూడా వాళ్ల వాళ్ల పద్ధతుల్లో ఆవకాయలు తయారు చేసుకుంటారు. మన ఆవకాయ కాని ఆవకాయ కూడా ఆవకాయే! అయితే ఏ ప్రాంతపు పరిమళం ఆ ప్రాంతానిది. దక్షిణాది ఆవకాయలు ఘాటుఘాటుగా ఉంటాయి. నోట్లోనే కాదు, కళ్ల వెంబడి కూడా నీళ్లూరేలా చేస్తాయి. ఉత్తరాది ఆవకాయల్లో తీపి పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. ఉత్తర దక్షిణాలే కాదు, తూర్పు పడమర రాష్ట్రాల్లోనూ ఆవకాయల తయారీలో ఎక్కడి వైవిధ్యం అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దేశం నలు చెరగులా విస్తరించిన ఆవకాయ రుచుల విభిన్నతను, విలక్షణతను పాఠకులకు పరిచయం చేయడానికే ఈ ప్రయత్నం... ఆవకాయ రుచులను ఆస్వాదించండి మరి! పంజాబీ ఆమ్ కా అచార్ పంజాబీ రుచుల్లో సోంపు, ఇంగువ పరిమళాలు గుబాళిస్తుంటాయి. చివరకు వాళ్లు తయారు చేసే ఆవకాయల్లో కూడా... కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు - 3 కప్పులు, పసుపు - 1 టీ స్పూన్, సోంపుపొడి - పావుకప్పు, మెంతిపొడి - 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఇంగువ - పావు టీ స్పూన్, కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవనూనె - పావుకప్పు, ఉప్పు - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత వాటికి ఉప్పు, పసుపును బాగా పట్టించాలి. ఇప్పుడు ఆ ముక్కలను పెద్దసైజు జల్లెడలోకి తీసుకొని, వాటిపై మూతపెట్టి 4-6 గంటల పాటు ఎండలో పెట్టాలి. ఆపైన వాటిని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో సోంపుపొడి, మెంతిపొడి, నల్ల జీలకర్ర, ఇంగువ, కారంపొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మందంగా ఉన్న గాజు సీసాల్లోకి తీసుకొని నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టాలి. అలా చేస్తే ఈ ఆవకాయ ఏడాదికాలం పాటు తాజాగా, రుచిగా ఉంటుంది. కర్ణాటక మ్యాంగో పికిల్ తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక రుచులు దాదాపు తెలుగు రుచుల్లానే ఉంటాయి. అయితే, ఆవకాయలో పచ్చిమిర్చి ముద్ద కలపడం కన్నడిగుల స్పెషల్. కావలసినవి: మామిడికాయ ముక్కలు - 5 కప్పులు, ఉప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ - పావుకప్పు, ఆవపిండి - అరకప్పు , మెంతిపొడి - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 కప్పులు, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్ తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. మరోవైపు ఆవాలు, మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని మామిడికాయ ముక్కలపై వేయాలి. దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి, మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి పచ్చిమిర్చి ముద్దను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఆవాలు, ఇంగువ వేసి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. అది కొద్దిగా చల్లారాక, అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవకాయను ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని బయట పెడితే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఏడాది వరకూ ఉంటుంది. కశ్మీరీ అమెర్ అచార్ యాపిల్ పండ్ల తీయదనానికే కాదు, మిర్చిఘాటుకు కూడా కశ్మీర్ ప్రాంతం పెట్టిందిపేరు. కారం చిరుతిళ్లలో రుచికోసం వాడే నల్లజీలకర్రను తీపి ఆవకాయ తయారీలోనూ వాడటం కశ్మీరీల ప్రత్యేకత. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 8, పంచదార - 1 కిలో, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఎండు మిరపకాయల ముక్కలు (గింజలు తీసేయాలి) - 1 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్, వెనిగర్ - 1 టేబుల్ స్పూన్, నీళ్లు - కావలసినన్ని తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో 10-12 గంటలపాటు నానబెట్టాలి. మధ్యమధ్యలో నీళ్లను మారుస్తూ ఉంటే ముక్కలకున్న పులుపుదనం కాస్త తగ్గుతుంది. ఇప్పుడు ఒక కుండలో అరలీటర్ నీళ్లు, పంచదార వేయాలి. దాన్ని స్టౌ పైన పెట్టి పాకం పట్టాలి. అందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేడెక్కాక స్టౌ ఆఫ్ చేసేయాలి. ఇలాగే మరో రెండు రోజులు కాస్త వేడి చేస్తూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుంది. ఆపైన ఈ మిశ్రమంలో వెనిగర్ వేసి ఓ రెండుగంటలపాటు వేడి చేయాలి. ఆవకాయ పాడవకుండా వెనిగర్ కాపాడుతుంది. కేరళ ఇన్స్టంట్ ఆవకాయ కేరళ స్టైల్ ఇన్స్టంట్ ఆవకాయ తయారీ చాలా తేలిక. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ సేపు పట్టదు. అయితే, ఇది ఏడాది పొడవునా నిల్వ ఉండదు. కావలసినవి: పచ్చిమామిడికాయ ముక్కలు- 2 కప్పులు (తొక్కతో పాటు కట్ చేసుకోవాలి), ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు, నూనె- పావు కప్పు, ఆవాలు- రెండున్నర టీ స్పూన్లు, మెంతులు-అర టీ స్పూన్, కారం- 3 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, వెనిగర్- 2 టీ స్పూన్లు తయారీ: తరిగిన మామిడికాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని, వాటికి ఉప్పు పట్టించాలి. అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆవాలు, మెంతులు మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. స్టౌ వెలిగించి, బాణలిలో నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మెంతుల పొడి వేయాలి. వెంటనే కారం, కరివేపాకు వేసి గరిటెతో కొద్ది సెకండ్లు బాగా కలపాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను బాణలిలో వేసి, బాగా కలుపుతూ స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న జాడీలోకి లేదా సీసాలోకి ఈ ఆవకాయను తీసుకుని, గాలి చొరబడకుండా మూత వేయాలి. ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే, దాదాపు రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది. ఆమ్కా సూఖా ఆచార్ ఉత్తరాది రాష్ట్రాల్లో నూనె ఎక్కువగా వాడకుండా మామిడికాయలతో ఎండు ఆవకాయ కూడా తయారు చేస్తారు. ఉత్తరాది శైలిలో మామిడికాయ ఎండు ఆవకాయ తయారీ పద్ధతి చాలా తేలిక. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ ప్రాంతం ‘ఆమ్కా సూఖా ఆచార్’ (ఎండు ఆవకాయ) తయారీకి పెట్టింది పేరు. కావలసినవి: మామిడి కాయలు - 6 (పెద్ద సైజువి), ఉప్పు - 100 గ్రాములు, పసుపు - 2 టీ స్పూన్లు, మెంతులు - 2 టేబుల్ స్పూన్లు, సోంపు - 2 టేబుల్ స్పూన్లు, పసుపు ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు, వాము - 2 టీ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - అర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు తయారీ: మామిడి కాయలను దాదాపు పన్నెండు గంటల సేపు బకెట్ నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని బయటకు తీసి, పొడిబట్టతో శుభ్రంగా తుడిచి, ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత కావలసిన సైజులో ముక్కలు తరుక్కోవాలి. ఈ ముక్కలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి, ఉప్పు, పసుపు వేసి అవి ముక్కలకు బాగా పట్టేలా కలిపి వదిలేయాలి. ఇలా రోజుకు ఒకసారి చొప్పున వారం రోజుల పాటు ముక్కలను కలుపుతూ ఉండాలి. వారం రోజుల్లో ముక్కలు మెత్తబడతాయి. కాస్త నీరు ఊరుతుంది. ఇప్పుడు నీటిని వదిలేసి, ముక్కలను ఒక పళ్లెంలోకి తీసుకుని, ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత మామిడి ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. ఇప్పుడు మెంతులు, పసుపు ఆవాలు, సోంపు, వాము, ఇంగువ మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని, స్టౌపై వేడి చేయాలి. నూనె వేడెక్కుతుండగా ఈ పొడితో పాటు కారం వేసి బాగా కలుపుతూ, స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత మామిడి ముక్కలను బాణలిలోని మిశ్రమంపై వేసి, అంతా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఎండు ఆవకాయ తయారైనట్లే. దీనిని పొడిగా ఉన్న సీసా లేదా జాడీలో భద్రపరచుకోవాలి. మహారాష్ట్ర కైరీ చే లోంచే మహారాష్ట్రలో మరాఠీలు తయారు చేసుకునే ఆవకాయ దాదాపు తెలుగువారి ఆవకాయ మాదిరిగానే ఉంటుంది. కాకుంటే, వాళ్ల ఆవకాయలో ఇంగువ, ఇతర సుగంధద్రవ్యాల గుబాళింపు కాస్త ఎక్కువగా ఉంటుంది. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 6, ఇంగువ- 1 టేబుల్ స్పూన్, నూనె - అరకప్పు, ఉప్పు - 3 టేబుల్ స్పూన్లు, ఆవపొడి - అరకప్పు, కారం - అరకప్పు, వెల్లుల్లి - పన్నెండు రెబ్బలు, పసుపు ఆవాలు - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 3 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి - 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క -రెండు మూడు చిన్న ముక్కలు, లవంగాలు - నాలుగైదు తయారీ: మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి, అరగంట అలాగే వదిలేయాలి. తర్వాత స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో నూనె పోసి మరిగించాలి. ఇంగువ, జాజికాయ పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, కారం వేసి కలుపుతూ స్టౌ కట్టేయాలి. చల్లారిన తర్వాత ఆవపొడి, ఆవాలు, మెంతులు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి ముక్కలు వేసి, బాగా కలపాలి. దీనిని పొడిగా ఉన్న జాడీలో లేదా సీసాలో భద్రపరచాలి. ఇది దాదాపు ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఆమ్కా ఛుందా గుజరాతీలు ఎక్కువగా తీపి పులుపుల సమ్మేళనాన్ని ఇష్టపడతారు. ‘ఖట్టా... మీఠా’కు కేరాఫ్ గుజరాత్. వాళ్ల ఆవకాయలోనూ ఈ రుచులే ప్రధానంగా కనిపిస్తాయి. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 3 (పెద్దవి), ఉప్పు - 2 టీ స్పూన్లు, పసుపు - 1 టీస్పూన్, పంచదార - 1 కప్పు, కారం - 2 టీ స్పూన్లు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్ తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, తురుముకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయ తురుమును ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార కూడా వేసి కలపాలి. కొద్దిసేపయ్యాక పంచదార కరుగుతుంది. అప్పుడు ఆ మిశ్రమంలో కారం, జీలకర్రపొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ మిశ్రమాన్ని స్టౌ పైన పెట్టి మంట తగ్గించాలి. అలా 10 నిమిషాలు పెట్టి కలుపుతుండాలి. దాంతో మిశ్రమం చిక్కబడుతుంది. స్టౌ ఆఫ్ చేసి, మ్యాంగో ఛుందా ఆవకాయను దింపేయాలి. (ఈ ఆవకాయలో పంచదారకు బదులు బెల్లం కూడా ఉపయోగించొచ్చు) తమిళనాడు వడు మాంగాయ్ సాధారణంగా ఆవకాయల తయారీకి ముదురు కాయలనే ఎంచుకుంటారు. తమిళనాడులో మాత్రం కసురు పిందెలతో కూడా ఆవకాయ తయారు చేస్తారు. ‘వడు మాంగాయ్’గా తమిళులు చాలా ఇష్టంగా తినే ఈ ఆవకాయ తయారీ చాలా తేలిక. కావలసినవి: మామిడి పిందెలు - పావు కిలో, కారం - 1 టేబుల్ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడవాలి. పిందెలపై తడి పూర్తిగా ఆరాక వాటికి నువ్వులనూనె పట్టించి, ఒక గిన్నెలో వేయాలి. నూనె పట్టించిన మామిడి పిందెలపై ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. వాటినలా ఒక రోజు వదిలేయాలి. మరుసటి రోజు ఆవాలు, మెంతులు పొడిగా చేసుకుని, ఆ పొడిని కారంలో కలపాలి. ఈ కారం పొడిని మామిడి పిందెలపై వేసి, బాగా కలపాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి ఐదారు రోజులు వదిలేయాలి. ఈ ఐదారు రోజుల్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉండాలి. ఐదారు రోజుల్లో నీరు ఊరి, మామిడి పిందెలపై తొక్క కాస్త ముడుతలు తేలుతుంది. ఇప్పుడు ‘వడు మాంగాయ్’ సిద్ధమైనట్లే. రాజస్థానీ ఆమ్కా మీఠా ఆచార్ రాజస్థానీ రుచులు అక్కడి భోజన రాజసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆవకాయల తయారీలోనూ వాళ్ల రూటే సెపరేటు. తీపి ఆవకాయ తయారీలో బెల్లం, పంచదార రెండింటినీ వాడతారు. కావలసినవి: పచ్చిమామిడికాయలు - 2 లేదా మామిడికాయ ముక్కలు - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, పసుపు - పావు టీ స్పూన్, పంచదార - అరకప్పు, బెల్లం తురుము - అరకప్పు, వేయించిన ధనియాలపొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి - 2 టేబుల్ స్పూన్లు, మెంతిపొడి - 2 టేబుల్ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - 1 టీ స్పూన్, నూనె - 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా మామిడిపండ్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కలకు పసుపు, ఉప్పును పట్టించి ఓ ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టేయాలి. అప్పటికి ఆ ముక్కలు కొద్దిగా ఊరతాయి. ఆ మామిడికాయల మిశ్రమంలో పంచదార, బెల్లం తురుమును కొద్దికొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌపై బాణలి పెట్టి అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంట మీద బెల్లం చిక్కని పాకంగా మారాక దింపేసి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనెను వేడి చేయాలి. అందులో ఆవపిండి, ధనియాలపొడి, మెంతిపొడి, కారం పొడి, ఇంగువలను వేసి రెండు నిమిషాలు కలుపుకొని దింపేయాలి. అది పూర్తిగా చల్లారాక, ముందుగా తయారు చేసిన మామిడికాయల మిశ్రమంలో దీన్ని వేసి బాగా కలుపుకొని జాడీలోకి తీసుకోవాలి. ఈ ఆవకాయను ఏడాదికాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బెంగాలీ గుడొ ఆమ్ ఆచార్ మిఠాయిలను ఇష్టపడే బెంగాలీలు ఎక్కువగా తీపి ఆవకాయలు, ఊరగాయలనే ఇష్టపడతారు. పచ్చి మామిడి ముక్కలతో బెంగాలీలు చేసుకునే తీపి ఆవకాయ తయారీ చాలా సింపుల్‌గా ఉంటుంది. కావలసినవి: మామిడి కాయలు - నాలుగు (మీడియం సైజులో ఉండేవి కాస్త పండినవైతే మంచిది), బెల్లం - 1 కప్పు (తరిగి ఉంచుకోవాలి), ఉప్పు - 1 టీ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, పాంచ్ ఫొరొన్ - 2 టేబుల్ స్పూన్లు (ఐదురకాల పోపు దినుసులు: ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర), ఎండు మిరపకాయలు - 12, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, ధనియాలు - అర టేబుల్ స్పూన్, సోంపు - ఒకటిన్నర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు, సున్నం - అర టీ స్పూన్ తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వాటిని కావలసిన సైజులో తొక్క తీయకుండానే ముక్కలుగా తరగాలి. మామిడి ముక్కలు పట్టే సైజులోని ఒక పెద్దగిన్నెలో నీరు తీసుకుని, సున్నం కలపాలి. సున్నం కలిపిన నీటిలో మామిడి ముక్కలను వేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వంపేసి, మామిడి ముక్కలను పొడిగా ఉన్న పళ్లెంలోకి తీసుకోవాలి. స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో పోపు వేగడానికి తగినంత నూనె పోయాలి. నూనె కాగాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా, రెండు ఎండు మిరపకాయలను వేయాలి. తర్వాత స్టౌను మీడియం మంటలో ఉంచి, మామిడి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నెమ్మదిగా కలపాలి. మామిడి ముక్కలు మెత్తబడగానే స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, అందులో బెల్లం వేసి, పాకానికి సరిపోయేలా కొద్దిగా నీరు పోయాలి. తక్కువ మంటపై ఉడకబెడుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాకం చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. పోపు పెట్టి సిద్ధంగా ఉంచుకున్న మామిడి ముక్కలను ఈ బెల్లం పాకంలో వేసి, బాగా కలపాలి. ఇప్పుడు మరో చిన్నసైజు బాణలిలో మిగిలిన టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ధనియాలు, సోంపు, పది ఎండు మిరపకాయలు వేసి, నూనె లేకుండా పొడిగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ దినుసులను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంలో మామిడి ముక్కల మిశ్రమాన్ని వేసి ఉడికించాలి. అవి ఉడుకుతూ ఉండగా మిగిలిన నూనె పోయాలి. మామిడి ముక్కల్లోని నీరంతా ఇగిరిపోయే వరకు ఇలా ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మిక్సీలో తయారు చేసుకున్న పొడిని వేసి, బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలి. ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఆవకాయ చిట్కాలు * చాలామంది ఈపాటికే ఆవకాయ పెట్టేసి ఉంటారు. మరికొందరు దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండుంటారు. పచ్చళ్లు పెట్టే సమయం మించిపోతుందన్న కంగారులో జాగ్రత్తలు తీసుకోకుండా ఆవకాయను పెట్టేస్తుంటారు. అలాంటప్పుడే అవి వారం, రెండు వారాలకే బూజు పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి.. * నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటెలు శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి. లేదంటే ఆ పాత్రలను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. * ఇక ఆవకాయను నిల్వ చేసే గాజు సీసాలు, జాడీలను కొద్దిసేపు ఎండలో పెట్టినా మంచిదే. * ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే, వాటిని పెట్టే జాడీల పైభాగంలో వేడినూనెలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చాలు. * ఊరగాయలు జాడీలోకి తీసుకున్నాక, చాలామంది వాటిపై వస్త్రం చుడతారు. అలా చుట్టడం మంచిదే కానీ ప్రస్తుతం మూత గట్టిగా ఉండే సీసాలు విరివిగా దొరుకుతున్నాయి. * స్టీలు, రాగి పాత్రల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆవకాయను నిల్వ ఉంచకూడదు. * నూనె, ఉప్పు, కారం వంటి పదార్థాలు కలపడానికి చెక్క గరిటెను ఉపయోగించడం మేలు. వడ్డించుకునేటప్పుడు మాత్రం ఆవకాయను చిన్న సీసాలోకి తీసుకొని స్టీలు చెంచాను వాడొచ్చు. * ఆవకాయకు వాడే మామిడికాయలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పగిలిన కాయలు, మెత్తబడిన కాయలను ఆవకాయకు వాడకూడదు. * నూనె విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు నువ్వుల నూనె వాడితే మరికొందరు వేరుశనగనూనె వాడుతుంటారు. ఏ నూనె వాడినా, అది స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. -
మితంగా వాడితే హితమే
ఆవకాయ - ఆయుర్వేదం ప్రకృతిలో నేరుగా లభించే ఆహార పదార్థాల పోషక విలువల గురించి, ఇతర గుణధర్మాల గురించి కూలంకషంగా వివరించింది ఆయుర్వేదం. వివిధ ద్రవ్యాల సమ్మేళనంతో మనం వండుకు తినే ఆహార పదార్థాలను ‘కృతాన్నములు’గా విశదీకరించింది. కాని, ఎక్కడా ఆవకాయ (ఊరగాయ) గురించిన ప్రస్తావన కనబడదు. కాబట్టి ఆవకాయలో ఉండే వివిధ ద్రవ్యాల గుణధర్మాలను గుర్తెరిగి మనం అన్వయించుకుని, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవకాయలోని పదార్థాలు ముదిరిన పుల్లటి మామిడికాయ, ఆవపొడి (ఆవాలు), ఉప్పు, కారంపొడి (ఎండు మిరప), నువ్వులనూనె. కొంత తక్కువ పరిమాణంలో ఇంగువ, పసుపు, మెంతులు, కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి కూడా కలుపుతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బెల్లం కూడా కలుపుతారు. ఉత్తరాది వారు ఆవకాయలో సోంపు కూడా వాడుతారు. స్థూలంగా పరిశీలిస్తే ఆవకాయలో షడ్రసాలు (మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ) కనిపిస్తాయి. మామిడికాయ: అమ్లరస ప్రధానం (పులుపు). కాబట్టి రుచి, ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. లఘువు (సులువుగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరుస్తుంది). ఉష్ణవీర్యం (వేడి చేస్తుంది). మేదస్సు (కొవ్వు) కరిగిస్తుంది. ధాతు పోషకం. కఫ, పిత్త, రక్త వర్ధకం. ఆవాలు: ఇవి పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో మూడు రకాలుగా ఉంటాయి. రుచికి చేదుగా, కారంగా కూడా ఉంటాయి. తీక్ష్ణ, ఉష్ణ గుణాలు ఉంటాయి. కృమిహరము (కడుపులో క్రిములను నాశనం చేస్తాయి). అగ్నిదీప్తికరం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి). కారం (కటురసం): సనాతన ఆయుర్వేద గ్రంథాల్లో కారానికి సంబంధించి మిరియాలు మాత్రమే కనిపిస్తాయి. మిరపకాయ క్రీస్తుశకం 17వ శతాబ్దంలో విదేశాల నుంచి మనకు సంక్రమించిన పదార్థం. కటురసం. దీపన పాచనాలు చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. తీక్ష్ణ, ఉష్ణ గుణాలను కలిగి ఉంటుంది. ఉప్పు (లవణరసం): తీక్ష్ణమై చెమటను కలిగిస్తుంది. రుచికరమై జీర్ణక్రియకు దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వు కంతులను కరిగించి, జడత్వాన్ని పోగొడుతుంది. అయితే, షడ్రసాలలో అతి తక్కువగా తినవలసింది లవణరసం. దీనిని ఎక్కువగా సేవించవద్దని చరక మహర్షి హెచ్చరించాడు. నిజానికి ఇది ‘హిత శత్రువు’ చక్కని రుచి కలిగించి, తృప్తినిచ్చే మిత్రునిలా ఉంటూనే వెనుక ఎన్నో రోగాలను కలిగించే శత్రువన్న మాట. ఎక్కువగా వాడితే బట్టతల, శిరోజాలు రాలిపోవడం, తలనెరపు, శరీరంపై ముడుతలు వంటి లక్షణాలు యుక్తవయస్సులోనే కలుగుతాయి. ఎముకలు, కీళ్లు బలహీనమవుతాయి. కంటిచూపు మందగిస్తుంది. నువ్వులనూనె: త్రిదోషహరం. మేధావర్ధకం, దీపనం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది), శూలహరం (నొప్పులను తగ్గిస్తుంది). ఇంగువ, పసుపు, మెంతులు, వెల్లుల్లి: ఇవన్నీ కోష్ఠశుద్ధికి (కడుపును శుభ్రపరచడానికి) పనికొస్తాయి. తీక్ష్ణ, ఉష్ణగుణాలు కలిగి ఉంటాయి. క్రిములను నాశనం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. విడివిడిగా ఇలాంటి గుణధర్మాలను కలిగిన ద్రవ్యాలన్నింటినీ సమ్మేళనం చేసి, నిల్వ ఉంచితే తయారయ్యే ఊరగాయే ‘ఆవకాయ’. ఆవకాయ ప్రభావం ఇందులోని ఏ ద్రవ్యమైనా అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలేనని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆవకాయను తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదు. మితంగా తింటే అలసత్వం పోయి చురుకుదనం కలుగుతుంది. నోటికి రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎలా తినాలి? ⇒ కొందరు నెయ్యి కలిపిన పప్పన్నంతో తప్ప ఆవకాయను తినరు. ఇది చాలా మంచి పద్ధతి. ఇలా తింటే, జీర్ణకోశానికి రక్షణ కలిగి, అల్సర్లు రాకుండా ఉంటాయి. ⇒ కొందరు వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని, పైన వెన్నపూస వేసి తింటారు. వెన్నపూసలోని స్నిగ్ధత్వం ఆవకాయలోని తీక్ష్ణత్వాన్ని అణచివేస్తుంది. ఫలితంగా మనలో పుట్టే వేడి తగ్గుతుంది. ⇒ కొన్ని ప్రాంతాల్లో ఆవకాయ అన్నంలో నెయ్యి కలుపుకుంటారు. కొందరు నువ్వులనూనె లేదా వేరుశనగ నూనె కలుపుకుంటారు. ఇది కూడా ఆవకాయ అహం‘కారాన్ని’ అణచివేయడానికే. ⇒ కొందరికి పెరుగు లేదా మజ్జిగ సేవించే అలవాటు ఉండదు. అలాంటప్పుడు ఆవకాయ మన శరీరంపై తప్పక విపరీత ప్రభావం చూపుతుంది. కళ్లు మంట, మూత్రంలో మంట, మలవిసర్జన సమయంలో మంట, మలబద్ధకం, కాళ్లుపీకటం, జ్వరం, నీరసం, కడుపులో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యావహారిక భాషలో దీనినే ‘వేడిచేసింది’ అంటాం. ⇒ పెరుగు, మజ్జిగతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగితే ఆవకాయ ఘాటు శరీరంపై తక్కువగా ప్రభావం చూపుతుంది. ⇒ శరీరానికి షడ్రసాలను అలవాటు చేయడం వల్ల బలం కలుగుతుందని, ఏకరస ప్రధానంగా ఆహారం తీసుకుంటే తగిన పోషకాలు లభించవని చరకాచార్యులు చెప్పారు. కనుక ఆవకాయను అప్పుడప్పుడు మితంగా తింటే మంచిదే. ⇒ కాని, ఈ హితశత్రువు పట్ల అప్రమత్తంగా లేకుంటే మాత్రం హైబీపీ, కీళ్లవ్యాధులు, స్థూలకాయం, కిడ్నీ సమస్యలు, మధుమేహం, పక్షవాతం, గుండెపోటు వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆవకాయలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఉప్పే అసలు ముప్పు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమయూన్‌నగర్, హైదరాబాద్ -
కాయల్లోన ఆవకాయ వేరయా!
చిల్లీ సిల్లీగా... ‘‘ఆవకాయ అనే మాటనో, పచ్చడినో సినిమాలో ఎక్కడైనా పెట్టేశామనుకో... అది సూపర్‌హిట్టు అవుతుందిరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎందుకురా అనవసరంగా ఇలా రెండు వేర్వేరు అంశాలను ముడేస్తావు’’ అన్నాను. ‘‘నీకు విషయం తెలియదు. నేను సోదాహరణంగా చెబితే గానీ అర్థం కాదు. ఇప్పుడు మనం వెళ్లొస్తున్న మూవీ ఏమిటి? సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు. అందులోని పాట ఇప్పుడే విన్నావు కదా... ఏమని పాడతాడు మహేశ్ బాబు... ‘ఇటురాయే ఇటు రాయే / నీ మీదే మనసాయే / గొడవ గొడవాయే / హే ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి / ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశా’ అని పాడాడా లేదా. అది చాలు. సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఇందులో పచ్చడి అంటే ఏమిటనుకుంటున్నావు? మన ఆవకాయేరా. ఆవకాయ సినిమాలో ఉందంటేఅది సూపర్ హిట్టే’’ అంటూ మళ్లీ అదే పల్లవి అందుకున్నాడు. ‘‘నవ్వు ఎన్ని చెప్పినా నమ్మను రా’’ అన్నాన్నేను. ‘‘యమగోల సినిమా చూశావా? అసలు ఆ సినిమా సక్సెస్ అంతా ఆవకాయ మీదే ఆధారపడి ఉంటుంది. అందులో ఆవకాయను చూసి రక్తమాంసాలనుకుంటారు యముడు సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య. అప్పుడు సాక్షాత్తూ ఎన్టీఆర్ ఆవకాయ ప్రాశస్త్యం గురించి అద్భుతంగా వివరిస్తాడు. అంతే యముడు ఆవకాయ తిని, దాంతో లవ్వులో పడిపోతాడు. అలా పడిపోవడం వల్లనే జయప్రదను ‘కళ్యాణమస్తు అనీ, దీర్ఘసుమంగళీభవ’ అని దీవించి, మరోసారి బోల్తా పడిపోతాడు. ఇద్దిగ్గో... ఈ పాయింట్ మీదే సినిమా సక్సెస్ అంతా ఆధారపడి ఉంది. అలా దీవించడానికి కారణం ఆవకాయే. అలా దీవించబట్టే ఎన్టీఆర్‌ను తనతో తీసుకెళ్లలేకపోయాడు యముడు. అంతేకాదు దగ్గరుండి పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆయకాయ సినిమాకు టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంతెందుకు ‘ఆహ నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు ఇంటికి పెళ్లికొడుకు శుభలేఖ సుధాకర్‌తో పాటు ఇద్దరు బకాసురులు వస్తారు. ఇంట్లో తినడానికి ఏవీ లేవని కోట శ్రీనివాసరావు అంటే మామిడికాయ పచ్చడి ఉంటే చాలు అని ఆవకాయ బద్దల్ని కడుక్కుతినేస్తారు. దీన్ని బట్టి నీకు తెలిసేదేమిటీ... ఇప్పుడు పాటలో పచ్చడి పచ్చడి అని ఉన్నా... సన్నివేశంలో ఆవకాయ ఉన్నా సినిమా సూపర్‌హిట్టే’’ అని వివరించాడు. ‘‘నువ్వు చెప్పిన రెండూ కరెక్టే గానీ నాకెందుకో నువ్వు మోకాలికీ, బోడిగుండుకూ ముడేస్తున్నట్టు అనిపిస్తోంది రా’’ అన్నాను. ‘‘నో... నో... యూ ఆర్ మిస్టేకెన్. నేను చెట్టు మీది కాయకూ, సముద్రంలోని ఉప్పుకూ ముడేస్తున్నాను. అలా వేస్తే అది ఆవకాయ అవుతుంది. సదరు కాంబినేషన్ సూపర్ హిట్టవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా విను. సినీకమెడియన్ల తాలూకు అనేకానేక ఊతపదాలు ఆవకాయలోంచే పుట్టాయన్నది అబద్ధం కాదు. ‘తొక్క... టెంకె... పీచు...’ అవన్నీ పచ్చడి మామిడి నుంచి వచ్చాయన్నది మిడిమిడి జ్ఞానం కాదు. పరిశీలన మీద తెలిసే వాస్తవం. కేవలం కామెడీ మాత్రమే కాదురా... ఆవకాయలో సినిమాలకు సంబంధించిన ఎంతో ఫిలాసఫీ ఉంది’’ అన్నాడు రాంబాబు. ‘‘ఆవకాయలో సినిమా ఫిలాసఫీ ఏమిట్రా బాబు?’’ అంటూ అడిగా. ‘‘ఎందుకు లేదూ... విను. కొన్నిసార్లు పెద్ద హీరోను పెట్టుకొని భారీ బడ్జెట్ మూవీ తీస్తాం. అనుకున్నట్టే అది బ్లాక్‌బస్టర్ అవుతుంది. కానీ ఆ సినిమాతో అసలు హీరోకు బదులు ఎవడో చిన్నా చితకా ఆర్టిస్టుకు పెద్ద పేరొస్తుంది. సేమ్ టు సేమ్... ఆవకాయలోనూ అంతే. ఇక్కడ అసలు హీరో మామిడి. ఆవాలు అనేవి పచ్చడి కోసం వాడే అనేకానేక పదార్థాల్లో ఒకటి. అయితేనేం... మామిడికాయ పచ్చడి అనే మహా బ్లాక్‌బస్టర్‌లో మామిడి అనే హీరో మటుమాయమైపోయి ‘కాయ’ మాత్రం మిగిలి... ఆవాలలోని ‘ఆవ‘ అనే మాటే మొదట నిలుస్తుందనే విషయంలో ఆవగింజంతైనా అబద్ధం లేదు’’ అన్నాడు వాడు. ‘‘ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి దాన్ని సమస్త సినిమా ఫిలాసఫీ అంటే ఎలా’’ అన్నాను. ‘‘చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అసలు... అసలు హీరో మనం అయితే వాడెవడికో పేరు రావడం అన్నది మనకు కారం రాసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ పొడి కారం అనుకోకూడదు. అది నూనె, కారం మిక్స్. పచ్చడి చేసే ప్రక్రియలో కారం కలిపినప్పుడు నూనె కలిసిన కారం మాత్రమే చేతికి అంటి, మంట ఫీలింగ్ చాలా సేపు ఉంటుంది. కారం రాసినట్లు ఉండటం అనే వాడుక ఇలాగే వచ్చింది. ఇది సినిమా ఫీల్డులో చాలా కామన్. అంతేకాదు... రాంగ్ కాంబినేషన్స్ పెడితే సినిమా పెద్దగా ఆడే అవకాశం ఉండదని కూడా ఆవకాయ చెబుతుందిరా’’ అన్నాడు. ‘‘ఆవకాయ ఈ మాట ఎప్పుడు చెప్పింది?’’ అడిగా. ‘‘ఆవకాయ బిర్యానీ అన్నది పరమ రాంగ్ కాంబినేషన్ అని సినిమా టైటిల్ పెట్టిన్నాడే తెలిసిపోయింది. అన్నప్రాశన రోజే ఆవకాయ కూడదని ఆ సినిమా ద్వారా సమస్త మూవీ లోకానికి ఒక సందేశం అందింది ’’ అన్నాడు వాడు. ‘‘అవున్రోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అనిపిస్తోంది... పెళ్లికాకుండానే హీరోయిన్ మామిడికాయ కొరుకుతుండటం చూసి గుమ్మడిలాంటి వారికి గుండెపోటు చాలాసార్లు వస్తుంది’’ అన్నాన్నేను కాస్త కోపంగా. ‘‘వారేవా... ఇప్పుడు కదరా నీకు కాయోదయం అయ్యింది’’ అన్నాడు వాడు మిర్చికోలుగా నన్ను చూస్తూ. - యాసీన్ -
ఆవాల అచ్చటా ముచ్చటా...
తిండి గోల ఆవాలు లేకుండా ఆంధ్రుల మనుగడను ఊహించడం కష్టం. ఎందుకంటే, ఆంధ్రుల అభిమాన ఆవకాయ పెట్టాలంటే అవే కీలకం మరి. పాశ్చాత్య ప్రపంచంలో రోమన్లు ప్రాచీన కాలంలోనే ఆవాల వాడుకను ప్రారంభించినట్లు ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో ఆవాల వాడుక క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నాటికే ఉండేదనేందుకు బుద్ధుని చరిత్రే నిదర్శనం. యూదు పురాణాల్లోను, బైబిల్‌లోను కూడా ఆవాల ప్రస్తావన ఉంది. ఆవాల ఉత్పాదనలో కెనడా అగ్రస్థానంలో ఉండగా, మన పొరుగు దేశాలైన నేపాల్, మయన్మార్లు రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మనం ఎక్కువగా నల్లని ఆవాలనే వాడుతుంటాము. అయితే, పసుపు రంగులో ఉండే ఆవాలు కూడా చాలా ప్రాంతాల్లో వాడతారు. మన దేశంలో బెంగాలీలు ఎక్కువగా ఆవనూనెను వాడతారు. -
ఆవకాయ బిర్యాని 17th December 2015
-
యముడికి మామిడి..
యముడికి ఇష్టమైన వంటకాలలో మొదటిది ‘ఆవకాయే’ అని తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఎవరికైనా సందేహం ఉంటే... చూ. యమగోల. డైనింగ్టేబుల్ మీద ఆవకాయను చూసి అపార్థం చేసుకుంటారు యముడైన సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లురామలింగయ్య. పైగా ‘ఛీ ఛీ ... ఏమిటీ రక్తమాంసాలూ? మేం శుద్ధ శాకాహారులం’ అంటూ అల్లురామలింగయ్య ఆవకాయను ఆవలకు తోస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగి... ‘సార్... అది తెలుగువాళ్లంతా ఇష్టంగా తినే ప్రశస్తమైన ఆవకాయ. అది మాంసం ముక్క కాదు. మామిడిచెక్క. ఇది రక్తం కాదు.. నూనె, కారం మిక్స్’ అంటూ ఆవకాయ గొప్పదనాన్ని వివరిస్తాడు. దాంతో అల్లు రామలింగయ్య (మా)మిడిమిడి జ్ఞానంతో పచ్చడి తినేసి, నోరు మంటపుట్టి గగ్గోలు పెడతాడు. అప్పుడు యముడికి కాస్త కోపం కూడా వస్తుంది. ‘తినడం కూడా ఒక ఆర్ట్ సార్. ఆవకాయను ఎలా తినాలంటే’... అంటూ ఎన్టీయార్ జయప్రదవైపు ఒక చూపు చూడగానే ఆమె అర్థం చేసుకుని... ‘ఇలా కాస్త నెయ్యి వేసుకుని, అందులో ఆవకాయ కలుపుకుని ఇలా తినాలన్నమాట’ అంటూ కలిపి ముద్దలు పెడుతుంది. దాంతో యముడు ‘ఆహా... అమృతం’ అంటూ తన్మయంగా తినేస్తాడు. ఆవకాయ తాలూకు టేబుల్ మ్యానర్స్ తెలిశాక... అల్లు సైతం తొక్క కూడా మిగలకుండా తొక్కు తినేసి ‘అమృతం ఏమిటీ... దీనిముందు అది దిగదుడుపు’ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. యమగోలలో ఎన్టీఆర్, జయప్రదల లవ్ సక్సెస్ చేయడానికీ, యముడి దగ్గర కోడలు పిల్ల మార్కులు కొట్టేయడానికి ఆవకాయ ఇతోధికంగా తోడ్పడిందన్న మాటలో ఎలాంటి డౌటూ లేదు. యముడంతటి వాడికి ఆవకాయ చేవగల కాయగా అనిపించినప్పుడు... మనమనగా ఎంత? యముడి టేస్టు ఆవకాయంత... మన టేస్టు ఆవగింజంత! - యాసీన్ -
ఛత్రపతి మమకారం
పని పంచుకోవడంలో ఆడామగా తేడా లేదని ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి నాగార్జున, నందమూరి బాలకృష్ణ దాకా వెండితెర సాక్షిగా నిరూపించారు. ‘గుండమ్మ కథ’లో ఎన్టీఆర్ పిండి రుబ్బితే, ‘నేనున్నాను’లో నాగార్జున ముగ్గు వేశారు. ‘గొప్పింటల్లుడు’, ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ గరిటె తిప్పారు. ‘తీన్మార్’లో పవన్‌కల్యాణ్ షెఫ్ అవతారమెత్తారు. గమ్మత్తేమిటంటే అమ్మ కోసం ఆవకాయ పెట్టిన సీన్ కూడా తెలుగుతెర ప్రత్యేకం. కావాలంటే, ప్రభాస్ ‘ఛత్రపతి’ చూడండి. ‘ఛత్రపతి’లో శివాజీ(ప్రభాస్) చిన్నప్పుడు తల్లికి దూరమైపోతాడు. పెద్దయ్యాక కూడా ఆమెకు దూరంగా ఉంటూ అభిమానించడమే తప్ప చేరువ కాలేని పరిస్థితి. అప్పటికే ఆమె కటిక పేదరికంలో ఉంటుంది. రెండో కొడుకు సరిగ్గా ఇంటిని పట్టించుకోకపోవడంతో పచ్చళ్లు అమ్ముతూ ఉంటుంది. కానీ ఒంట్లో బాగోలేని కారణంగా ఓ రోజు పచ్చళ్లు తయారుచేయకపోవడంతో కస్టమర్ ఆమెను తిట్టుకుంటూ వెళతాడు. అది గమనించిన ప్రభాస్ తనే స్వయంగా కాయల్ని ముక్కలు కొడతాడు. ఎండు మిరపకాయలు దంచి, కారం పడతాడు. ఒంటి చేత్తో ఆవకాయ పచ్చడి పెడతాడు. తల్లి మంచం మీద నుంచి లేచి చూసేసరికి, జాడీలకు గుడ్డలతో మూత కడుతూ, హీరోయిన్ శ్రీయ కనిపిస్తుంది. తానే ఆవకాయ పెట్టానంటూ తల్లి కోసం హీరో మమకారంగా పచ్చడి పెట్టిన సంగతి బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. సినిమాలోని ఈ సన్నివేశం చూస్తున్న ప్రతి మనసునూ కదిలిస్తుంది. -
ఆవకాయ్ బిర్యానీ 9th March 2015