యముడికి మామిడి..
యముడికి ఇష్టమైన వంటకాలలో మొదటిది ‘ఆవకాయే’ అని తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఎవరికైనా సందేహం ఉంటే... చూ. యమగోల. డైనింగ్‌టేబుల్ మీద ఆవకాయను చూసి అపార్థం చేసుకుంటారు యముడైన సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లురామలింగయ్య. పైగా ‘ఛీ ఛీ ... ఏమిటీ రక్తమాంసాలూ? మేం శుద్ధ శాకాహారులం’ అంటూ అల్లురామలింగయ్య ఆవకాయను ఆవలకు తోస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగి... ‘సార్... అది తెలుగువాళ్లంతా ఇష్టంగా తినే ప్రశస్తమైన ఆవకాయ. అది మాంసం ముక్క కాదు. మామిడిచెక్క. ఇది రక్తం కాదు.. నూనె, కారం మిక్స్’ అంటూ ఆవకాయ గొప్పదనాన్ని వివరిస్తాడు. దాంతో అల్లు రామలింగయ్య (మా)మిడిమిడి జ్ఞానంతో పచ్చడి తినేసి, నోరు మంటపుట్టి గగ్గోలు పెడతాడు. అప్పుడు యముడికి కాస్త కోపం కూడా వస్తుంది.
‘తినడం కూడా ఒక ఆర్ట్ సార్. ఆవకాయను ఎలా తినాలంటే’... అంటూ ఎన్టీయార్ జయప్రదవైపు ఒక చూపు చూడగానే ఆమె అర్థం చేసుకుని... ‘ఇలా కాస్త నెయ్యి వేసుకుని, అందులో ఆవకాయ కలుపుకుని ఇలా తినాలన్నమాట’ అంటూ కలిపి ముద్దలు పెడుతుంది. దాంతో యముడు ‘ఆహా... అమృతం’ అంటూ తన్మయంగా తినేస్తాడు. ఆవకాయ తాలూకు టేబుల్ మ్యానర్స్ తెలిశాక... అల్లు సైతం తొక్క కూడా మిగలకుండా తొక్కు తినేసి ‘అమృతం ఏమిటీ... దీనిముందు అది దిగదుడుపు’ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. యమగోలలో ఎన్టీఆర్, జయప్రదల లవ్ సక్సెస్ చేయడానికీ, యముడి దగ్గర కోడలు పిల్ల మార్కులు కొట్టేయడానికి ఆవకాయ ఇతోధికంగా తోడ్పడిందన్న మాటలో ఎలాంటి డౌటూ లేదు. యముడంతటి వాడికి ఆవకాయ చేవగల కాయగా అనిపించినప్పుడు... మనమనగా ఎంత? యముడి టేస్టు ఆవకాయంత... మన టేస్టు ఆవగింజంత!
- యాసీన్