
ఛత్రపతి మమకారం
పని పంచుకోవడంలో ఆడామగా తేడా లేదని ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి నాగార్జున, నందమూరి బాలకృష్ణ దాకా వెండితెర సాక్షిగా నిరూపించారు. ‘గుండమ్మ కథ’లో ఎన్టీఆర్ పిండి రుబ్బితే, ‘నేనున్నాను’లో నాగార్జున ముగ్గు వేశారు. ‘గొప్పింటల్లుడు’, ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ గరిటె తిప్పారు. ‘తీన్‌మార్’లో పవన్‌కల్యాణ్ షెఫ్ అవతారమెత్తారు. గమ్మత్తేమిటంటే అమ్మ కోసం ఆవకాయ పెట్టిన సీన్ కూడా తెలుగుతెర ప్రత్యేకం. కావాలంటే, ప్రభాస్ ‘ఛత్రపతి’ చూడండి.
‘ఛత్రపతి’లో శివాజీ(ప్రభాస్) చిన్నప్పుడు తల్లికి దూరమైపోతాడు. పెద్దయ్యాక కూడా ఆమెకు దూరంగా ఉంటూ అభిమానించడమే తప్ప చేరువ కాలేని పరిస్థితి. అప్పటికే ఆమె కటిక పేదరికంలో ఉంటుంది. రెండో కొడుకు సరిగ్గా ఇంటిని పట్టించుకోకపోవడంతో పచ్చళ్లు అమ్ముతూ ఉంటుంది. కానీ ఒంట్లో బాగోలేని కారణంగా ఓ రోజు పచ్చళ్లు తయారుచేయకపోవడంతో కస్టమర్ ఆమెను తిట్టుకుంటూ వెళతాడు.
అది గమనించిన ప్రభాస్ తనే స్వయంగా కాయల్ని ముక్కలు కొడతాడు. ఎండు మిరపకాయలు దంచి, కారం పడతాడు. ఒంటి చేత్తో ఆవకాయ పచ్చడి పెడతాడు. తల్లి మంచం మీద నుంచి లేచి చూసేసరికి, జాడీలకు గుడ్డలతో మూత కడుతూ, హీరోయిన్ శ్రీయ కనిపిస్తుంది. తానే ఆవకాయ పెట్టానంటూ తల్లి కోసం హీరో మమకారంగా పచ్చడి పెట్టిన సంగతి బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. సినిమాలోని ఈ సన్నివేశం చూస్తున్న ప్రతి మనసునూ కదిలిస్తుంది.