ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం.
ఆవకాయ
కావలసినవి:
►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు
►నూనె– 2 కప్పులు
►ఆవపిండి– కప్పు
►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది)
►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది)
►మెంతిపిండి – అర కప్పు
►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి)
►ఆవాలు – పావు కప్పు.
తయారీ:
►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి.
►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి.
►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి.
►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు.
►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి.
►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి.
►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి.
►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి.
►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి.
►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి.
►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి.
►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి.
గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి.
Comments
Please login to add a commentAdd a comment