ఉత్తర కన్నడ జిల్లా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతారామ ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారు. ఇంటికి వెళ్తుండగానే కమ్మని ఊరగాయ ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇంట్లో ఊరగాయ తయారీలో తీరిక లేకుండా శశికళ కనిపిస్తారు. ఒక సాధారణ మహిళ స్వశక్తిని నమ్ముకుని పదిమందికి ఉపాధినిచ్చేలా ఎదిగారు.
సాక్షి, బళ్లారి: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అని టీవీల్లో,సినిమాల్లో,లేదా అక్కడక్కడ ఏవరో మాట్లాడటం చూస్తుంటాం. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధితో ఎదగవచ్చని చాటుతోంది శశికళ శాంతరామ అనే వనితామణి. ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతరామ తయారీ చేస్తున్న ఊరగాయలు చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో ఖ్యాతి చెందాయి.
నిమ్మతొక్కను పడేయాలా?
పేద కుటుంబం,ఉన్నది ఒక ఎకరా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదా జీవనం సాగిస్తున్న ఆమెకు ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇంట్లో వంటకు నిత్యం ఉపయోగించే నిమ్మకాయ తొక్కును తొక్కే కదా అని పారవేస్తాం. ఆమె తొక్కును ఎందుకు పారవేయాలి? అని ఆలోచించి ఆమె ప్రతి రోజు తీసిన తొక్కులను ఆరవేసి ఎండిన తర్వాత రుచికరమైన చాట్ మసాలాను ఇంట్లో తయారీ చేసి నిమ్మకాయ తొక్కుకు అంటించి ఇంట్లో కుటుంబసభ్యులకు అందజేసింది. అదే ఆమె జీవితంలో మార్పునకు తొలి అడుగు. అలా తయారు చేసిన నిమ్మకాయ తొక్కుతో లెమన్ చాట్ తయారీ చేసి,కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి, బంధువులకు రుచి చూపించింది. ఇంకేముంది ప్రతి ఒక్కరు పొగడ్తలే పొగడ్తలు. అప్పటినుంచి చాట్ మసాలను తయారు చేసి ప్యాకెట్లుగా అమ్మకాలు ప్రారంభించింది.
ఊరగాయల మీద దృష్టి
ఆ తరువాత నిమ్మకాయ ఊరగాయల మీద దృష్టి పడింది. నాణ్యమైన దినుసులు ఉపయోగించిన చేసిన ఊరగాయ కొద్దికాలానికి అందరి నోళ్లలో నానింది. ఇక మామిడి, ఉసిరి ఇలా అన్ని రకాలు ఊరగాయలు తయారీ చేస్తోంది శశికళ. జిలకరతో తయారీ చేసిన ఊరగాయలకు మరింత డిమాండ్ ఏర్పడిందంటోంది ఆమె. ఆరోగ్యానికి మేలు చేసే విధంగా పలు రకాలు పదార్థాలను ఉపయోగించడంతో తట్టక్కన ఉప్పిన కాయకు (ఊరగాయకు) భలే డిమాండ్ ఏర్పడింది. ఉత్తర కన్నడ జిల్లాలో కాకుండా ప్రస్తుతం ధార్వాడ, బెంగళూరు, బాగల్‌కోట ఇలా పలు జిల్లాల్లో కూడా ఆమె తయారీ చేసిన ఊరగాయలకు గిరాకీ ఉంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ అదే తినాలనిపించే విధంగా, వట్టి ఊరగాయతోనే కడుపునిండా భోజనం చేసే విధంగా రుచి ఉంటుందని చెబుతారు.
ఆదాయం, సంతృప్తి: శశికళ
ఆమె సాక్షితో మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, తాను ఇంటి వద్దనే కూర్చొని వంట పని,ఉన్న ఒక ఎకరం పొలంపనులు చేసుకుని ఉన్నప్పుడు నిమ్మతొక్కుతో చాట్‌మసాలా ఆలోచన వచ్చిందన్నారు. అదే కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. తాను ఉపాధి పొందడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తూన్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా ఇంటి పట్టునే కుటీర పరిశ్రమను నెలకొల్పానని, ఆదాయంతో పాటు ఎంతో తృప్తి కలుగుతోందన్నారు. పొలంలోనే నిమ్మకాయ, మామిడి తదిరాలను పండించి ఊరగాయలకు ఉపయోగిస్తున్నా, పెట్టుబడులు పోను ఐటీ ఇంజినీర్లు, డాక్టర్లతో సమానంగా ఆదాయం పొందుతున్నా, ఇంతకంటే ఆనందం ఏముంది? అని అన్నారు.
సిరులిచ్చిన ఊరగాయ
Published Mon, Dec 23 2019 8:58 AM | Last Updated on Mon, Dec 23 2019 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment