R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం! | R Rajeshwari: Pickle Story of a Women entrepreneurs Success Story | Sakshi
Sakshi News home page

R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం!

Published Tue, May 23 2023 1:29 AM | Last Updated on Tue, May 23 2023 5:59 AM

R Rajeshwari: Pickle Story of a Women entrepreneurs Success Story - Sakshi

గృహిణిగా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎలాగూ తప్పదు. ఇక ఆదాయ మార్గం గురించి ఆలోచించడం, వాటిని అమలులో పెట్టడం అంటే తగిన వనరులే కాదు ఇంటిల్లిపాదీ అందుకు సహకరించాలి. హైదరాబాద్‌ బండ్లగూడ నాగోల్‌లో ఉంటున్న ఆర్‌.రాజేశ్వరి ని కలిసినప్పుడు ‘పదేళ్లుగా చేస్తున్న పచ్చళ్లు, పొడుల వ్యాపారం... ఆదాయంతో పాటు బిజినెస్‌ ఉమన్‌గానూ గుర్తింపును తెచ్చిపెట్టింది’ అని వివరించింది.   

‘మన ఇళ్లల్లో అన్ని కాలాల్లోనూ ఏవో ఒక పచ్చళ్లు పెట్టడం అనేది గృహిణులకు అలవాటైన పనే. ఇంట్లో నేనూ అలాగే చేస్తుండేదాన్ని. నా చేతి పచ్చళ్లు రుచికరంగా ఉంటాయని ఇంట్లోనూ, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్లు బాగా మెచ్చుకునేవారు. అడిగి మరీ చేయించుకునేవారు. దీనికితోడు నాకు తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన పచ్చడి, పొడులు తయారు చేసిమ్మని అడిగేవారు.

పదేళ్ల క్రితం...
నోటి మాటతోనే ఒకరొకరుగా పచ్చళ్లు చేసిమ్మని అడిగేవారి సంఖ్య పెరగడం మొదలయ్యింది. దీనినే చిన్న వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. మా ఊరు గుంటూరుకు వెళ్లినప్పుడల్లా అక్కడ రైతుల దగ్గరకు వెళ్లి, కావల్సిన సరుకులను నేరుగా పొలాల నుంచే సేకరించేదాన్ని. ఒకటే నియమం పెట్టుకున్నాను. కేవలం వెజ్‌ పచ్చళ్లును మాత్రమే పెట్టాలి. అలాగే, రసాయనిక ఎరువు వాడకుండా పండించిన ఆర్గానిక్‌ పంటల నుంచే సేకరించాలనుకున్నాను. నేరుగా రైతులను కలిసి, వారి ద్వారా పంటలను కొనుగోలు చేయడం, వాటిని బాగుచేయించి, తీసుకురావడమూ పెరిగింది. మిర్చి, పసుపు, మసాలా దినుసులు వంటివి ఏయే ప్రాంతాల్లో ఏయే ఏవి అధికంగా పండుతాయో తెలుసుకుని, ఆ దినుసులను సేకరిస్తూ ఉంటాను.

ఒక్కరిగానే...
మొదట్లో ఒక్కదాన్నే పచ్చళ్లకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని. అందుకు తగిన పనుల ప్లానింగ్‌ కూడా చేసుకున్నాను. మెల్లగా మార్కెట్‌ పెరుగుతుండటంతో సాయానికి మరొకరిని నియమించుకుని, పనులు చేస్తూ వచ్చాను. కామాక్షి ఫుడ్స్‌ పేరుతో పదేళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని రిజస్టర్‌ చేయించుకొని, ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. మొదట్లో అంతగా తెలియకపోయినా మార్కెట్‌ గురించి నాకు నేనుగానే ఓ అంచనా వేసుకుంటూ షాప్స్, ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఆర్డర్ల ద్వారానూ పచ్చళ్లు సిద్ధం చేస్తుంటాను. టొమాటో, గోంగూర, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ.. వంటి పచ్చళ్లు, పొడుల తయారీ రోజూ ఉంటుంది.

రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యే నా దినచర్య తిరిగి, రాత్రి పదిగంటలకే పూర్తవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు ఉద్యోగి. ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. ఏడాదికి ఇరవై లక్షల ఆదాయంతో ఈ మార్గం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా చేత్తో నలుగురికి రుచికరమైన పచ్చళ్లను అందివ్వడమే కాదు, నాతో పాటు ఇంకొందరికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది. ఆర్డర్లను బట్టి తయారీ విధానాన్ని ఎంచుకుంటాను కాబట్టి నష్టం అనే సమస్య ఎప్పుడూ రాలేదు. చేసే పనిలో ముందుగానే అంచనా ఉంటే అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇంటితోపాటు సమర్థవంతంగా నిర్వర్తించే సత్తా మహిళలకెలాగూ ఉంటుంది’ అని వివరిస్తుంది రాజేశ్వరి.

– నిర్మలారెడ్డి
ఫొటోలు: మోహనాచారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement