అభిషేకిద్దాం... ఆచరిద్దాం...
ఆత్మీయం
ఆయనకు నైవేద్యంగా చక్రపొంగలి అవసరం లేదు. పులిహోర ప్రసక్తేలేదు. పాయసాన్నాలు తినిపించనక్కరలేదు. నెత్తిమీద నాలుగు చెంబుల నీళ్లు గుమ్మరిస్తే చాలు. లింగడు కాస్తా ఉబ్బులింగడయిపోతాడు. నాలుగు మారేడు దళాలు తెంపి ముఖాన పారేస్తే సరి, పట్టరానంత సంతోషపడిపోతాడు. చిటికెడంత విభూది తీసుకుని ఆయన ముఖాన మూడు రేఖలు దిద్ది, మన నుదుటన కాసింత పులుముకుంటే చాలు... మనకు వెన్నుదన్నవుతాడు. చేతిలో ఏమీ లేనినాడు భక్తితో చెంబెడు నీళ్లు సమర్పిస్తే చాలు... పంచభక్ష్యపరమాన్నాలూ పెట్టినంతగా పొంగిపోతాడు. అందుకే ఆయన పేదల పెన్నిధయ్యాడు, పేదదేవుడయ్యాడు. అయితే, ఇంతటి బోళావాడిలోనూ మానవుడికి మల్లే కోపం ఉంటుంది. కరుణ తొణికిసలాడుతుంటుంది. హాస్యం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. అనుగ్రహం ఉంటుంది. సత్యం ఉంటుంది. నృత్యం ఉంటుంది.
ప్రణయం ఉంటుంది. భార్యకు తనలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఆది దేవుడాయన. అందుకే మహాకవి కాళిదాసు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే.. అంటూ అమ్మవారిని, అయ్యవారిని కీర్తించడానికి కారణమిదే. పార్వతీ పరమేశ్వరులు వాక్కు– అర్థంలా విడదీయరాని బంధమై ఒకే శరీరంలో ఒకే ఆత్మగా కొలువున్నారని తన్మయభావనతో కొలుస్తాడు. ఈ సందర్భంగా ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే... కార్తీక సోమవారాలేవిధంగా శివప్రీతికరమైనవో, అదేవిధంగా శ్రావణమాసంలోని ప్రతి సోమవారం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఆ ముక్కంటిని మనసారా అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, ఆయనలోని మంచి లక్షణాలను అలవరచుకునేందుకు ప్రయత్నిద్దాం... ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.