నవ్వుతూనే వుండు! | Love, Humor and Laughter | Sakshi
Sakshi News home page

నవ్వుతూనే వుండు!

Published Sat, Apr 30 2016 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

నవ్వుతూనే వుండు!

నవ్వుతూనే వుండు!

హ్యూమర్
దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపు తుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగు తుందే తప్ప పకపక నవ్వ లేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వస్తాం. అక్కడ మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకొచ్చు. ఇక్కడ చాయిస్సుంది.
 
కానీ చాలామంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ వుంటారు. వీళ్లు కచ్చితంగా నరకానికే పోతారు. నవ్వేవాళ్లు స్వర్గానికి పోతారో లేదో నాకు తెలియదు కానీ, నవ్వుతూ వుంటే దానికి మించిన స్వర్గం ఏముంటుంది? దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు.

ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపుతుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగుతుందే తప్ప పకపక నవ్వలేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. అన్నిటిని కల్తీ చేసినట్టే మనం నవ్వుని కూడా కల్తీ చేశాం. పసిపాపలు, పరమయోగుల పెదాలపై మెరిసే నవ్వు నిజమైన నవ్వు. మిగతా అంతా ఎంతో కొంత కల్తీనే. తమాషా ఏమంటే అందరూ ఒకేలా ఏడుస్తారు కానీ ఒకేలా నవ్వలేరు.
 
కొందరు పకపక నవ్వితే, మరికొందరు పగలబడి నవ్వుతారు. కొందరు సోడా కొట్టినట్టు ‘స్‌స్‌స్’మని నవ్వితే, మరికొందరికి సౌండే రాదు.
 బాస్ జోక్‌లకి మనకి తెగ నవ్వొస్తుంది. తుపాన్‌లో చెట్లు వూగినట్టు వూగిపోతూ నవ్వుతాం. ఒక్కోసారి జోక్ మొదలు పెట్టకముందే నవ్వుతాం. ‘ఇప్పుడేమైందంటే’ అనగానే ఓహ్హోహ్హో అని నవ్వేస్తాం. జోక్ బిగినింగే ఇంత హాస్యంగా వుంటే, పూర్తిగా వింటే పొట్ట చెక్కలైపోతుందేమో!
 
మా పెద్దమ్మ ఒకావిడ కేవలం నవ్వుతోనే మా పెద్దనాయన్ని కంట్రోల్ చేసింది. ఆమె ప్రతి నవ్వు వెనక ఒక ఆదేశముండేది. ఆ ఆర్డర్ మా పెద్దనాయనకే అర్థమయ్యేది. లాఫింగ్‌తోనే లా అండ్ ఆర్డర్. విలన్ల నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాతాళభైరవిలో ఎస్వీఆర్ నవ్వుని ఎన్నాళ్లైనా మర్చిపోలేం. రాజనాల, సత్యనారాయణ నవ్వారంటే ఎవరి కొంపకో ఎసరు పెట్టారని అర్థం.
 
ఇక మన రాజకీయ నాయకుల సంగతి. వాళ్లు ఓట్లు వేసే వరకూ మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. గెలిచిన తరువాత మనల్ని అంతకంత ఏడిపిస్తారు. హాస్యనటులు అదృష్టవంతులు. కోట్లాది మందిని నవ్వించడం నిజంగా వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం.  చిన్నప్పుడు జానపద సినిమాల్లో ఒక సీన్ తప్పకుండా వుండేది. ఎలుగుబంటి హాస్యనటుణ్ని తరుముతూ ఉండే సీన్. దాన్ని చూసి నేను పడీ పడీ నవ్వేవాణ్ని.
 
జీవితమే ఒక ఎలుగుబంటని, అది మనల్ని తరుముతూ వుంటుందని అప్పుడు, ఆ వయసులో నాకు ఏమాత్రం తెలియదు. తెలిసి వచ్చాక నిజం బోధపడింది. ఎప్పుడైనా కానీ మనం పారిపోతుంటే ఇతరులకి హాస్యం. ఇతరులు పారిపోతుంటే మనకి చెప్పలేనంత హాస్యం. మనం జాగ్రత్తగా గమనించాలే కానీ, జీవితంలో అడుగడుగునా హాస్యం కనిపిస్తుంది. సెలూన్ షాప్‌లో, సిటీ బస్సులో, ఆఫీసుల్లో, అసెంబ్లీలో, సీరియస్ సీరియల్స్‌లో, తెలుగు సినిమాల్లో... అన్ని చోట్లా హాస్యం ఉంటుంది. పండుతుంది.
 
ఈ మధ్య సెలూన్‌కెళితే ఒక పెద్దమనిషి గడ్డానికి తెల్లటి నురుగు రాశారు. తీరా చూస్తే బ్లేడ్ లేదు. దానికోసం ఒక కుర్రాడెళ్లాడు, తిరిగి రాలేదు. హిమాలయాల్లో సాధువులా ఈయన వెయిటింగ్.  ఆయనలో కోపం, నాకు నవ్వు. నవ్వు మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే మాత్రం కురుక్షేత్రమే. ఒక చోటికి వెళ్లబోయి, ఇంకో బస్సు ఎక్కేస్తారు. సిటీ బస్సులో వీళ్ల హడావుడి చాలా కామన్. పని రానివాళ్లు చాలా సీరియస్‌గా పనిచేస్తుంటారు. ఇది ఆఫీస్ కామెడీ.
 
అలాగే ఏడిపిస్తూ నవ్వించేవాళ్లు, నవ్విస్తూ ఏడిపించేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు. వీళ్లు జీవితం తప్ప ఇంకేమీ చదువుకోరు. వీళ్లలో చాప్లిన్ ఒకడు. వానలో నడవడం ఇష్టమంటాడు. వానలో తన కన్నీళ్లు ఇతరులకి కనిపించవట. మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే. నవ్వనివాడికి ఇలాంటి నవ్వుల దినోత్సవాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్లే. కానీ నవ్వుతూ బతికినోళ్లు ఎప్పటికీ బతికే వుంటారు. ఏడుస్తూ బతికేవాళ్లు, వుండగనే పోయుంటారు.
- జి.ఆర్.మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement