నవ్వొద్దు... బతకద్దు
అసహనం చిక్కగా ఆవరించుకుంటోంది. మనిషి మీద మనిషికి అసహనం, ద్వేషం. ఒకప్పుడు లేవని కాదు. ఇప్పుడది ముదిరింది. అప్పుడు తెల్లవాళ్ళు ఆఫ్రికా, ఆసియాల కొచ్చి మనం నల్లగా ఉన్నందుకు అసహ్యం, అసహనం ఫీలయ్యారు. మనల్ని బానిసలని చేసి హింసించి వ్యాపారం చేశారు. పేరాశ, ఆధిపత్యం పేరిట రెండు ప్రపంచ యుద్ధాలూ జరిగాయి. కోట్ల మంది నెత్తురోడారు. అసహనం అలాగే మిగిలింది. మతం పేరిట మరింత కరడు కడుతోంది. కాశ్మీర్ మీదా, రామ జన్మభూమి మీదా ఎవరైనా డాక్యుమెంటరీలు తీస్తే ప్రదర్శన మూసే వరకూ నిరసనలూ హింసా ఆగవు.
పీకే అనే సినిమా వస్తే చూడకుండానే నిరసనలు. నెహ్రూ ప్రభుత్వకాలంలో ‘శంకర్స్ వీక్లీ’’ కార్టూన్ పత్రికలో ఆయన మీద విమర్శల కార్టూన్‌లు వస్తే నవ్వుతూ రిసీవ్ చేసుకునే వాడు నెహ్రూ. పైగా ‘డోంట్ స్పేర్ మీ... శంకర్’’ అని చెప్పేవాడు. ఇప్పుడలాలేదు. సరదాలూ వెటకారాలకు రోజులు కాదు. నవ్వినా నవ్వించినా బతకడానికి సందు లేదని హిందు ముస్లిం ఫండమెంటలిస్టులు కలిసి లెవెన్త్ కమాండ్ రాసి పెట్టారు.
ఇది మనుషుల మధ్య ప్రేమకీ, ఆనందానికీ, గుండె నిండా నవ్వుకోవడానికీ డేంజర్ సిగ్నల్. భూతాపంతో పోటీ పడి పెరుగుతోంది అసహనం. మనమిక నవ్వొద్దు మనమిక బతకొద్దు.
- మోహన్, కార్టూనిస్ట్