ఈ రోజు... ఆ ఇద్దరిదే కాదు! | Valentine's Day Special | Sakshi
Sakshi News home page

ఈ రోజు... ఆ ఇద్దరిదే కాదు!

Published Sat, Feb 13 2016 10:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

ఈ రోజు... ఆ ఇద్దరిదే కాదు!

ఈ రోజు... ఆ ఇద్దరిదే కాదు!

ప్రేమ సందేశం
 
కుటుంబం అంటే... జీవితం ప్రారంభమయ్యే బంధం.
 ‘ప్రేమ’ అంటే... ఎప్పటికీ దూరం కాని బంధం.


తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అంటారు. తనకు తాను దైవంగా భావించుకునే రోమన్ చక్రవర్తి క్లాడియస్ ఒకటి తలిచాడు. ప్రేమ గొంతుపై ఖడ్గం పెట్టాడు. ప్రేమ, పెళ్లి అనేవి యువత శక్తిసామర్థ్యాలకు ప్రతిబంధకంగా, సంకెళ్లుగా  మారుతాయని, ఒంటరి జీవితంతోనే బహుముఖమైన శక్తి  ఉదయిస్తుందని బలంగా నమ్మాడు. సంకల్పబలంలో ‘బలం’ మాత్రమే కాదు... న్యాయం కూడా ఉండాలి.

అందుకే ‘ఇది అన్యాయం’ అంటూ వాలెంటైన్ తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. రోమన్ చక్రవర్తి అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లి అమరుడయ్యాడు. ప్రేమ విలువను ప్రపంచానికి చాటి చెప్పాడు.
 
ప్రేమంటే... ఒక ప్రియుడు తన ప్రియురాలికి గులాబీపువ్వును ఇవ్వడమా?
 ప్రేమంటే... ఒక ప్రియురాలు తన ప్రియుడికి హృదయాన్ని కానుకగా ఇవ్వడమా?
 అది మాత్రమే ప్రేమా?
 అది ప్రేమే. కాకపోతే అది మాత్రమే ప్రేమ కాదు. ప్రేయసీ ప్రియులదే ప్రేమ అని వాలెంటైన్  కూడా చెప్పలేదు. ఆయన అమర్వతం ప్రేమకు ఉన్న విశాలత్వాన్ని, లోతును ప్రపంచానికి తెలియజేసింది. ఆ విశాలత్వం నుంచి చూస్తే... వాలెంటైన్స్ డే అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై తనకు ఉన్న ప్రేమను చాటుకునేది అవుతుంది.
 
ఆప్యాయతతో అక్కున చేర్చుకునే అమ్మదీ ప్రేమే. అన్నింటా అండగా నిలబడే నాన్నదీ ప్రేమే. మనతో కలిసి ఆడే చెల్లిదీ ప్రేమ. మన చేయి పట్టి దారి చూపించే అన్నదీ ప్రేమే.
 ఫిన్‌లాండ్‌లో ‘వాలెంటైన్స్ డే’ను ‘ఫ్రెండ్స్ డే’గా జరుపుకుంటారు. ఆత్మీ యులు, రక్త సంబంధీకులకు మనసులోని కృతజ్ఞతను ప్రేమగా వ్యక్తీకరించడానికి వాలెంటైన్స్ డే మంచి అవకాశం.

ఈ  రోజు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కానుకలో, కార్డులో  ఇచ్చి ప్రేమను వ్యక్తీకరించడం  అనేది చాలా దేశాల్లో ఉంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఇచ్చే గ్రీటింగ్ కార్డుల మీద కనిపించే విలువైన వాక్యం...  f.a.m.i.l.y
 ఫాదర్ (f) అండ్ (a)  మదర్ m)...ఐ( i) లవ్ (l) యూ (y)!
 
నాన్నకు ప్రేమతో ఇచ్చే కార్డులో...
 ‘ద బెస్ట్ డ్యాడ్స్ ఆల్వేస్ హ్యావ్ ద బెస్ట్ కిడ్స్. యస్, దట్ మీన్స్ మీ! హ్యాపీ వాలెంటైన్స్ డే టు ద బెస్ట్ డాడ్!’ లాంటి వాక్యాలు...
 
అమ్మకు ప్రేమతో ఇచ్చే కార్డులో...
 ‘మై మదర్... యువర్ లవ్ ఈజ్ జస్ట్ ఇనఫ్ ఫర్ మీ! హ్యాపీ వాలైంటెన్స్‌డే’ లాంటి వాక్యాలు కనిపిస్తుంటాయి.
 కుటుంబం అంటే... జీవితం ప్రారంభమయ్యే బంధం. ‘ప్రేమ’ అంటే... ఎప్పటికీ దూరం కాని బంధం.
  అల్లరి చిట్టి చెల్లికి తీయటి చాక్లెట్లు, గంభీరమైన పెద్దన్నకు ఇష్టమైన పెన్ను, బామ్మకు భగవద్గీత ఇవ్వడం వరకు అన్నీ  వాలెంటైన్స్ డే బహుమతులే. వారిలో ఎవరికి పంచినా, ఎవరితో పంచుకున్నా అది ప్రేమే.
 ‘స్పిరిట్ ఆఫ్ వాలెంటైన్స్ డే’కు పరిపూర్ణత తీసుకురావాలంటే అది ప్రేయసీ ప్రియుల దగ్గర మాత్రమే  ఆగిపోకూడదు. కుటుంబ బంధాలు, స్నేహాలు... ఇలా నూరు అనుబంధాలు వేనవేల ప్రేమలై వికసించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement