Laughter
-
'నవ్వడం' కోసం ఏకంగా చట్టం..!
ఒక దేశంలోని స్థానిక ప్రభుత్వం నవ్వడం కోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా రోజులో కనీసం ఒక్కసారైన నవ్వేలా వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రకాల విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ఈ చట్టాన్ని కేవలం ప్రజల మానసిక ఆరోగ్యం కోసమే తప్ప బలవంతంగా నవ్వేలా చేయడం కాదని చెప్పి మరీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..జపాన్‌లో యమగటా ఫ్రిఫెక్చర్లోని స్థానిక ప్రభుత్వం నవ్వు కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. గతవారం నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది. స్థానిక విశ్వవిద్యాయల పరిశోధనల్లో 'నవ్వు' మంచి ఆరోగ్యాన్ని అందించగలదని తేలడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవ్వడం వల్ల ఎన్నో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందేలా స్థానిక ప్రజలను.. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వేలా ప్రోత్సహించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అందుకోసం నవ్వులతో నిండిన కార్యాలయ వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా వ్యాపార నిర్వాహకులను కోరుతోంది స్థానికి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ప్రతి నెల ఎమనిమిదొవ తేదీని నివాసితులు నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దినంగా నిర్ణయించింది. యమగటా విశ్వవిద్యాలయంలోని మెడిసిన్ ఫ్యాకల్టీ నవ్వులపై జరిపిన పరిశోధనల్లో నవ్వుతో మంచి ఆరోగ్యం తోపాటు దీర్ఘాయువు పెరుగుతుందని తేలింది. అలాగు రకరకాల కారణాలతో దారితీస్తున్న మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఈ నవ్వు ద్వారా తగ్గుతాయని పరిశోధన వెల్లడించింది. అంతేగాదు అధ్యయనం 'నవ్వు' సానుకూల వైఖరితో ప్రవర్తించేలా సమర్థత, విశ్వాసం, నిష్కాపట్యతతో ఉండేలా చేస్తుందని పేర్కొంది . అయితే ఈ నియమాన్ని జపాన్‌లోని చాలామంది రాజకీయనాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది వారి రాజ్యంగ హక్కులను ఉల్లంఘించడం కిందకు వస్తుందని, నవ్వలేని వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. అంతేగాదు నవ్వడం లేదా నవ్వకుండా ఉండటం అనేది వారి అంతర్గత ఆలోచన, స్వేచ్ఛకు సంబంధించింది. పైగా ఇది రాజ్యంగం ద్వారా ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి కూడా అని జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(జేసీపీ)నేత టోరు సెకి అన్నారు. అలాగే అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల నవ్వడానికి ఇబ్బంది పడే వారి మానవ హక్కులను మనం అణగదొక్కకూడదు అని కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీజేపీ) సభ్యుడు సటోరు ఇషిగురో అన్నారు.కానీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నేత కౌరీ ఇటో ఆ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రజలను నవ్వమని బలవంతం చేయదు. ఇది ఒక వ్యక్తి, అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తుందని కూడా నొక్కి చెప్పారు కౌరీ ఇటో. అలాగే ఈ కొత్త నిబంధన ప్రకారం రోజుకు ఒక్కసారైనా నవ్వలేని వారికి జరిమానా విధించే నిబంధన కూడా లేదని స్థానికి అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: బియ్యం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
అసలే ఇది ఎన్నికల సీజన్. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! అధిర్.. అయ్యో రామా! బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ దిగ్గజం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్లో అ«ధిర్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.లాలు కూతుర్ని ఓడించండి! సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు బిహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సరన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు.కంగనా... కన్ఫ్యూజన్! గురి తప్పిన ‘నాన్ వెజ్’ విసుర్లు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ అయిన ఆమె బిహార్ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. శివపాల్.. శివ శివా! బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్ నగర్లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! అందిపుచ్చుకున్న మోదీ...ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. శివపాల్ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!లోగుట్టు ‘బోరా’కే ఎరుక... స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!అసోంలోని నగావ్ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
నవ్వు చేటా? లక్ష్మణదేవర నవ్వు
నవ్వు ఎంత గొప్ప మందైనా.. కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తూంటారు. వాటిల్లో ముఖ్యమైనవి.. ద్రౌపది నవ్వు. మయసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు.. అతడి అహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయద్యూతానికి, చివరకు కురుపాండవ యుద్ధానికి దారితీసిందని చెబుతారు. లక్ష్మణుడి నవ్వు.. శ్రీరాముడి కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. ఆ కథ తెలియాలంటే ‘లక్ష్మణదేవర నవ్వు’ అనే పురాణగాథ తెలుసుకోవాల్సిందే. రావణవధ తర్వాత.. శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరుబయట బ్రహ్మాండమైన సభా వేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుదీరున్న ఆ సభకు వేలాది వీరులు, సూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు. సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికివారు తమకు తోచిన అర్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు. ‘జాలరివాళ్ల పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తల దించుకున్నాడు శివుడు. ‘శివుడి పెళ్లిలో కిందపడి నా నడము విరిగింది కదా.. ఆ గూనితో ఇక్కడికి వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అవమానంగా తల దించుకున్నాడు జాంబవంతుడు. ‘నా అన్న వాలిని రామునిచే చంపించి, అన్న భార్యను నా భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నానని నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తల దించుకున్నాడు సుగ్రీవుడు. ‘నా అన్న రావణాసురుడి ఆయువుపట్లను రహస్యంగా రాముడికి చెప్పి.. రావణవధకు ఓ రకంగా నేనే కారణం అయ్యాను.. ఇప్పుడు లంకారాజ్యానికి రాజునయ్యాను.. నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు’ అని మథనపడుతూ తల దించుకుంటాడు విభీషణుడు. ‘ఇంత బలవంతుడినైన నేను చిన్న వాడైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసే నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అల్లాడుతూ తల దించుకుంటాడు హనుమంతుడు. ‘కారడవిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడమీద కూర్చోబెట్టుకున్నందుకు.. ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను.. ఆరు నెలలు రాముడు లేకుండా రావణలంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని సీతాదేవి తల దించుకుంటుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు.. చిన్నబోతాడు. మొత్తానికీ ఆ సభలోని ఒక్కొక్కరూ ఒక్కోలా.. తమ లోపాలను.. తప్పులను.. అసమతుల్యాలను.. అస్పష్టతలను తలచుకుని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు.. ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుడ్ని ‘ఎందుకు నవ్వావ్?’ అంటూ నిలదీస్తాడు అందరి ముందే. దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెబుతాడు. ‘మనం అరణ్యాలకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో నేను మీకు, వదినమ్మకు సేవ చేస్తూండగా, ఓ రాత్రి రెండు ఝాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆమెను ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని అడిగాను. అప్పుడు ఆమె.. ‘నేను నిద్రాదేవిని.. నన్ను మనుషులెవ్వరూ గెలవలేరు. కానీ నువ్వు నన్ను దరి చేరనివ్వడం లేదు’ అంది. దాంతో ఆమెకు నేను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి.. ‘నేను మా అన్న, వదినలకు ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కర్తే నాకోసం తపిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్లు లేవకుండా ఆవహించు. మళ్లా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దువుగానీ’ అని చెప్పాను. ఆ మాట ప్రకారం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది’’ అని సమాధానం ఇస్తాడు లక్ష్మణుడు నిద్ర మత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు... లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట. ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం. కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు.. మహా సభ సమక్షంలో అతడు నవ్వడంతో.. ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ.. అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భోచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెబుతుంటారు. -
Funday Cover Story: నవ్వు.. నవ్వు.. నవ్వు..
పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు.. జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే.. ‘ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం’ అంటుంటారు. ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వును ఆరు రకాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు. అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. అందుకే చాలామంది ‘మర్యాద మరువకుండా, దూషణ లక్ష్యంగా పెట్టుకోకుండా, శ్రుతి మించనీయకుండా చేసే హాస్యమే నిజమైన హాస్యం’ అని చెబుతుంటారు. నవ్వేటప్పుడు కేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదుళ్లు, పక్కవాళ్లను గిచ్చుళ్లు ఇవన్నీ సహజం. ఎగరడాలు, మెలికలు తిరగడాలు, కళ్లనీళ్లు తుడుచుకోవడాలు ఇవన్నీ నవ్వులో తారస్థాయికి చిహ్నాలు. అయితే ‘మనసారా నవ్వే నవ్వుకు ఆయువు ఎక్కువ’ అంటున్నారు వైద్యులు. ‘స్నానం.. దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం.. బుద్ధిని సరి చేస్తుంది.ఉపవాసం.. ఆరోగ్యాన్ని అందిస్తుంది.హాస్యం.. మనిషినే ఉబ్బితబ్బిబ్బు చేస్తుంది, మనసును ఉర్రూతలూగిస్తుంది. అంతకుమించి.. ఆలోచనల్ని ఉత్తేజపరుస్తుంది’ అంటుంటారు ప్రవచనకర్తలు. అందుకే, వాసన లేని పువ్వులా.. పరిహాసం లేని ప్రసంగం వ్యర్థమని చెబుతుంటారు. నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులవోలె ప్రేమరసముం గురిపించు విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ ‘ఈ లోకంలో మనిషి తప్ప ఏ జీవీ నవ్వలేదు. నవ్వులు మనిషి మనోవికాసానికి దివ్వెలు. అయితే కొన్ని విషపునవ్వులు ఉంటాయి. అలాంటివి కాకుండా.. పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు లోకంలోని సమస్త దుఃఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి’ అని మహాకవి జాషువా ఎప్పుడో చెప్పారు. నవ్వితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే.. నవ్వుతో గుండె లయ పెరిగి.. శ్వాసలో వేగం పుంజుకుంటుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత హాట్ బీట్ నెమ్మదించి.. బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం. తరచూ ఒత్తిడిలో ఉండేవారికి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించే న్యూరోపెపై్టడ్స్ అనే చిన్న మాలిక్యూల్స్ విడుదల కావాలంటే.. ఎక్కువగా నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారు యాక్టివ్‌గా కనిపిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు. దాంతో స్నేహితులు కూడా పెరుగుతారు. స్మైలీ ఫేస్ ఉండేవారితో స్నేహం చేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ నవ్వుల్లో మర్మం తెలుసుకుని మెలగడం ఉత్తమం. నిత్యం మూడీగా ఉండేవాళ్లు.. ఎప్పటికప్పుడు బ్రెయిన్‌కి స్మైలీ సంకేతాలు ఇస్తూ ఉండాలి. లేదంటే ఆ దిగులు మరింత పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు.. అహ్లాదకరమైన వాతావరణాల్లో తిరగడం.. స్నేహితుల మధ్య ఉండటం చాలా అవసరం. అప్పుడే మూడ్ మారుతుంది. నవ్వితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి.. రోగనిరోధకశక్తికి ఎంతో అవసరమైన యాంటీ బాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిరునవ్వు ఎందరిలో ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గానే నిలుస్తుంది. నవ్వుతో చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవ్వేవారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది. నవ్వు జీవితంపై సానుకూలప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో భవిష్యత్ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని, ఆయుష్షుని కూడా పెంచుతుందని సైంటిఫిక్‌గా నిరూపితమైంది. నవ్వు బాడీలో ఆక్సిజన్ స్థాయిని పెంచి.. శ్వాస వ్యాయామానికి ఒక మార్గంగా నిలుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరస్తుంది. కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు ఆ రోజంతా తెలియని ఎనర్జీని అందుకోవచ్చు. లాఫింగ్ థెరపీతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ నవ్వు.. శరీరం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. నవ్వు.. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు.. ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. దాంతో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. మోబియస్ సిండ్రోమ్ మోబియస్ సిండ్రోమ్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అరుదైన లోపం. ఈ జబ్బున్నవాళ్ల ముఖంలో ఎలాంటి కవళికలు పలికించలేరు. వీళ్లు నవ్వలేరు, ఆవులించలేరు, కనుబొమలను పైకెత్తలేరు. ఇది ఒకరకమైన నాడీ సమస్య. ఫేక్ స్మైల్స్ సర్వేలు కాల్ సెంటర్స్ వంటి పబ్లిక్ సర్వీస్‌లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి. కానీ అది వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు తేల్చేశారు. ఇలా నకిలీ నవ్వు నవ్వే వాళ్లు తమ వ్యక్తిగత ఫీలింగ్స్‌ను మనసులోనే దాచి వేస్తారని.. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ పరిశోధనలో తేలింది. దీని ప్రకారం.. ఇష్టంలేని వారి ముందు.. తప్పని పరిస్థితుల్లో నవ్వే నకిలీ నవ్వులు ఏమాత్రం మంచివి కావని తేలింది. పైగా ఇలాంటి నవ్వుల వల్ల.. ఫీలింగ్స్‌లో మిశ్రమమైన స్పందనకు మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. అది మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. నవ్వుకు కాస్త సమయం వీలు చిక్కినప్పుడల్లా కామెడీ సినిమాలు, కామెడీ ప్రోగ్రామ్స్ (హెల్దీ జోక్స్) చూస్తూండాలి · నలుగురిలో ఉన్నప్పుడు అహ్లాదకరమైన గత హాస్య స్మృతులను వివరిస్తూ.. నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుండాలి. కామెడీని పండించగల స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూండాలి. గ్రూప్ ఎంటర్టైనింగ్ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటే.. తప్పకుండా అందులో భాగస్వాములు కావాలి. కుటుంబ సభ్యులతో చిన్ననాటి చిలిపి సంగతులను చర్చించడం.. అప్పటికే మీకు ఎదురుపడిన కామెడీ సన్నివేశాల గురించి వారితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి · కొన్నిసార్లు ఎదుటివారిపైన పంచులు వేసినా.. మరి కొన్నిసార్లు ఎదుటివారు మన మీద వేసే పంచులకు ఫీల్ అవ్వకుండా ఉండగలగాలి. -
కడపుబ్బా నవ్వించే డాక్టర్! ఇలా కూడా ఆరోగ్య సూచనలు ఇవ్వొచ్చా?
నవ్వు ఆరోగ్యానికి మంచిది అని అంటుంటారు. మనస్పూర్తిగా నవ్వేవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది తప్పని, చాలా రోగాలకు చిరునవ్వు చక్కటి ఔషధం అని విన్నాం. అయితే అది ఎలాగే ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు ఓ వైద్యుడు. ఏ డాక్టర్ చేయని రీతీలో రోగులకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తూనే కామెడీ షో నిర్వహిస్తున్నాడు. వారందర్నీ కడుపుబ్బా నవ్వేలా చేసి ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు. అంతేగాదు ఆయన కామెడీ షో వీడియోలను యోట్యూబ్లో ఉన్న క్రేజ్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ వైద్యుడు వైద్యలందరికంటే విభిన్నంగా ఈ జర్నీని ఎలా ఎంచుకున్నాడో తెలుసుకుందామా! కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్గా పిలిచే పళనియప్పన్ మాణిక్కమ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ కోసం ఆరోగ్యానికి సంబంధించిన కామెడీ వీడియోలను చేశారు. అ తర్వాత అదే తన ప్రోఫెషన్గా మార్చుకున్నాడు. అందుకు ప్రధాన కారణం 2020లో వచిన కరోనా మహమ్మారి. ఆ టైంలో లాక్డౌన్లతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్య చెప్పేలా యూట్యూబ్‌లో ఈ కామెడీ వీడియోలు చేయడం నుంచి మొదలైంది ఆయన జర్నీ. అలా ఆయన తన వీడియోల్లో హాస్యాన్ని జోడిస్తు బరువు తగ్గడం, ఉపవాసం చేయడం తదితర చక్కటి ఆరోగ్య విషయాలను వివరించేవారు. దీంతో అతని వీడియోలకు భారీ ఫాలోయింగ్ రావడం మొదలైంది. ఆయన తొలి వీడియో క్లిప్ ఏకంగా ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రాంలో అయితే మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'మెడ్‌కామ్' అనే యూట్యూబ్ ఛానెల్లో తన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అందులో వైద్య సమాచారంతో కూడిన కామెడీ షో ఉంటుంది. అందులో హేమోరాయిడ్స్, అనోరెక్టల్ సమస్యలు, పెద్దప్రేగు పెద్దప్రేగు క్యాన్సర్ గురించి వైద్యుడు పాల్ మాట్లాడతారు. ఆ అనారోగ్య సమస్యలను తదదైన శైలిలో సామాన్య రోగికి కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక్కడ రోగి భయపడడు కాదుగదా! ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. అందువల్లే అతని వీడియోలకు ఇంత క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్ పాల్ యూఎస్‌లో వైద్యుడిగా చేస్తున్న టైంలో ఏకంగా 110 కిలోల బరువు ఉండేవాడు. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయోమోనని భయపడేవాడు. అసలు వైద్యుడిగా నేనే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించి తాను చికిత్స అందించే రోగులకు చెబితేనే దాని ప్రభావం ఉంటుందని గ్రహించాడు. చాలామంది రోగులకు బరువుతగ్గాలని, వ్యాయామాలు చేయాలని సూచిస్తామే గానీ వైద్యులే ముందుగా ఇవేమీ చేయరని అన్నారు. ఇలా పాల్ ముందుగా తనాఉ చక్కటి జీవనశైలిని అవలంభించి ఆ తర్వాత తన వీడియోలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు. గుండెకు స్టంట్ వేయించుకుంటే సరిపోదు, బరువు పెరగకుండా చూసుకోవడమూ చాల ముఖ్యం అని అంటున్నారు వైద్యుడు పాల్. ఆయన తన వీడియోల్లో చాల వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకు శాశ్వత నివారణ లేదని చెబుతారు. ఇక్కడ కేవలం వైద్యుడి మీద రోగికి గల నమ్మకం, అతడి మానసిక స్థితి తదితరాలే వ్యాధిని నయం చేయగలవని అన్నారు. అందుకే తాను నమ్మకంగా చెప్పగలను పెదాలపై ఉండే చిరునవ్వు రోగి ఆయుర్ధాయాన్ని పెంచగలదని. అందుకే తాను ఇలా హాస్య భరితంగా ఆరోగ్య సలహలు ఇస్తున్నాని అన్నారు డాక్టర్ పాల్. దీని గురించే చాలామంది రోగులు ఆయన స్టాండప్ కామెడీ షోకి వస్తారు. అక్కడ ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాల తోపాటు హాస్య భరితంగా సాగే ఆరోగ్య సలహాలను మనసారా ఆశ్వాదిస్తారు. తన కామెడీలో శర్వణ కుమార్ అనే కాల్పనిక పాత్రతో హాస్యం పండిస్తారు. ఆ పాత్ర అతిగా అల్పాహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినే వ్యక్తి. ఇలా శరవణ్ కుమార్ 'తినడం' అనే వీక్నెస్ అతని ఆరోగ్యానికి ఎలా చేటు తెస్తుందో హాస్యంతో వివరించడం విశేషం. ఇలాంటి శరవన్ కుమార్‌లు మనలో ఎందరో ఉన్నారని చెబుతుంటారు పాల్. తినాలనే కోరిక మిమ్మల్ని ఎలాంటి వాటిని తినేలా ప్రోత్సహిస్తుందో గమనించాలి అంటారు. అంతేగాదు డైటింగ్, ఉపవాసాల పేరుతో నోరు కుట్టేసుకోకుండా ప్రతి ఫంక్షన్‌కి హాజరయ్యి ఎలా తక్కువుగా తినాలో వివరిస్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క పదార్థంతో అరటి ఆకు ప్లేట్‌ని నింపేలా కొద్ది కొద్దిగా వడ్డించుకోండి. ఇక్కడ మీ లోపల ఉన్న అంతరంగిక వ్యక్తి కోరిక తీరుతుంది. అన్ని రుచులు ఆశ్వాదిస్తూ తక్కువగా కడుపు ఫుల్ అయ్యేలా తినగలుగుతారని అంటారు డాక్టర్ పాల్ . మీరు కూడా అతని వీడియోలు చూసి మనసారా నవ్వుకుని హాయిగా జీవించండి. (చదవండి: న్యూమోనియాతో పోరాడుతుండగానే కరోనా బారినపడ్డ నటుడు విజయ్‌కాంత్!అలా కాకుండా ఉండాలంటే..) -
గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం. నవ్వవు జంతువుల్...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు. హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు. పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది. ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి. నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సభలో యోగితో నవ్వులు పూయించిన అఖిలేష్.. అంతలోనే..!
లక్నో: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సభలో నవ్వులు పూయించారు. సీఎం యోగి సైతం విరగబడి నవ్వుకున్నారు. 25 కోట్ల జనాభా కలిగిన పెద్ద రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత వెనుకబాటుకు గురైందో చెప్తూ యోగి ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన సోమవారం నాటి శాసనసభ సమావేశాల్లో గుర్తు చేసుకున్నారు. ‘విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు పాఠశాలలను సందర్శించేవాడిని. ఆ క్రమంలోనే ఓ ప్రాథమిక పాఠశాలకు తనిఖీలకు వెళ్లాను. ఓ పిల్లవాడిని నేను ఎవరిని అని అడిగాను. ఒక్క క్షణం ఆలోచించి అతను చెప్పిన సమాధానం నాకు మతిపోయేలా చేసింది. మీరు రాహుల్ గాంధీ అని ఆ విద్యార్థి చెప్పడంతో మన విద్యా వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందోనని బాధపడ్డా’ అని అఖిలేష్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంగుబాటుకు అందరూ కారకులే’ అని అఖిలేష్ పేర్కొన్నారు. చదవండి👉 మహానాడు వేదికపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం పాఠశాల విద్యాభివృద్ధిలో యూపీ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉండటం కలవర పరచే విషయమని అన్నారు. దేశానికి ఎందరో ప్రధానులను అందించిన రాష్ట్రం యూపీ. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. అయినా తీరు మారలేదని అఖిలేష్ చురకలు అంటించారు. 2012 నుంచి 2017 వరకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. చదవండి👇 ఇప్పుడే షో మొదలైంది.. వారంలో ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా! రాజ్యసభ సీటు కోసం అలకబూనిన ‘సీఎం చంద్రూ’.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై! -
‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యం’
సాక్షి, పిట్టలవానిపాలెం(గుంటూరు): ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు మండే వారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో యువకులు అందరూ కలిసి ప్రత్యేక దృశ్య రూపకం వద్ద ఉన్నారు. గ్రామానికి చెందిన జాలాది శివ (20) యువకుడు సమీపంలో మరో వ్యక్తితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారికి ఎదురుగా ఉన్న దోనెపాటి శోభన్ నన్ను చూసి నవ్వుతావంట్రా నీకు ఎంత ధైర్యం అంటూ అతనిపై కలబడ్డాడు. సమీపంలో ఉన్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. అయితే శివాజీ ఇంటికి వెళ్లిపోయాడు. అతనితో పాటే శోభన్ కూడా ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని శివాజీని కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్నవారు అతన్ని పక్కకు లాగడంతో చేతిపై కత్తిగాయం అయింది. (చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య) సమీపంలోని వారు గాయం అయిన చోట పసుపు రాస్తుండగా మరోసారి కత్తితో వచ్చి ఒక్కసారిగా గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తస్రావం అధికం కావడంతో స్థానిక యువకులు శివాజీని చందోలు పోలీసు సేష్టన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాలాది శివాజీ 10 ఏళ్ల వయస్సులో తండ్రిని, 15 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి గ్రామస్తులు, బం«ధువులతో సన్నిహితంగా ఉంటూ ఆటోను అద్దెకు తీసుకుని బాడుగలు లేని సమయంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. దిక్కూ మొక్కూలేని వాడని ఈ విధంగా చేస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. -
గంపెడు పండుగ
2019లో తొలి పండగ ఇది. తొలి సంక్రాంతి.గంపెడు ఆశలు, గంపెడు ఆకాంక్షలు, గంపెడు సంతోషాలు, గంపెడు సంబరాలు తీసుకొచ్చే పండగ. గంపెడు మంది బంధువులు వస్తారు. గంపెడు మంది అయినవాళ్లు తోడవుతారు. గంపెడు కబుర్లు సాగుతాయి. గంపెడు నవ్వులు వెల్లివిరుస్తాయి.సంతోషం ఎక్కువైతే ఆకలి కూడా కరకరలాడుతుంది. ఏం చేయాలి? గంపెడు వంటకాలు వండాలి. తలా ఒక చేయి వేసి వంటగదిలో సందడి రేపాలి. ఆ తర్వాత ఏముంది? తిన్నంత... తబ్బిబ్బయ్యేంత. మామిడికాయ బొబ్బట్లు కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2 ; బొంబాయి రవ్వ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు+ పావు కప్పు; మైదా పిండి – ఒక కప్పు; ఉప్పు – చిటికెడు; నూనె – అర కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి, సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, వేడెక్కిన తరవాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక, ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి మామిడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙ఐదు నిమిషాల తరవాత రెండు కప్పుల నీళ్లు, పంచదార జత చేసి, పంచదార కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక, వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙నెయ్యి జత చేసి బాగా కలియబెట్టి ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలిపి దింపి చల్లారిన తరవాత ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, కొద్దిగా నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ, చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె బాగా జత చేసి కలిపి, తడి వస్త్రంలో గంటసేపు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, చేతితో చిన్న పూరీలా ఒత్తి, ఒక ఉండను ఉంచి, అంచులు మూసేయాలి ∙ అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్ పేపర్ మీద కాని కొద్దిగా నెయ్యి పూసి ఈ ఉండను దాని మీద ఉంచి చేతితో మృదువుగా బొబ్బట్లు మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్లును వేసి రెండువైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి తీసి వేడివేడిగా అందించాలి. రవ్వ గారెలు కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – 12 (పొడి చేయాలి); కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక టేబుల్ స్పూను (సన్నగా తరగాలి); పుల్లటి పెరుగు – అర కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ఒక పాత్రలో బొంబాయి రవ్వ, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి కలపాలి ∙జీలకర్ర, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పుల్లటి పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా జత చేసి గారెల పిండిలా కలుపుకోవాలి ∙మూత పెట్టి అర గంట సేపు నాననివ్వాలి ∙పిండి ఎండినట్లుగా అనిపిస్తే మరి కాస్త పెరుగు కాని నీళ్లు కాని జత చేసి మరో పావు గంట సేపు ఉంచేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న పిండిని నిమ్మకాయ పరిమాణం లో చేతిలోకి తీసుకుని, నూనె పూసిన అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్ కవర్ మీద కాని గారె ఆకారంలో మృదువుగా ఒత్తి, కాగిన నూనెలో వేయాలి ∙రెండు వైపులా దోరగా వేగిన తరవాత కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకుని ఇష్టమైన చట్నీతో అందించాలి. చెరకు రసం పొంగలి కావలసినవి: పెసర పప్పు – పావు కప్పు; బియ్యం – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పచ్చకర్పూరం – కొద్దిగా; జీడిపప్పులు – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; చెరకు రసం – 3 కప్పులు తయారీ: ∙బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక పెసర పప్పు వేసి రంగు మారేవరకు వేయించి తీసేయాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ∙కుకర్‌లో పెసర పప్పు, బియ్యం వేసి కలపాలి ∙చెరకు రసం జత చేసి బాగా కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙మూత తీశాక గరిటెతో మెత్తగా మెదపాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, కిస్మిస్ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙సిద్ధంగా ఉన్న చక్కెరపొంగలిలో వేసి కలపాలి ∙ఏలకుల పొడి, పచ్చ కర్పూరం జత చేసి మరోమారు కలిపి, నైవేద్యం పెట్టి, వేడివేడిగా అందించాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పల్చగా ఉన్నా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె/నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి రెండూ కలిపి, కొద్దిగా గట్టి పడేవరకు ఉడికించాలి ∙చల్లారాక ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి (మరీ పల్చగాను, మరీ గట్టిగాను కాకుండా చూసుకోవాలి) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి/నువ్వుల నూనె వేసి కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి ఉండలను, మైదా పిండి మిశ్రమంలో ముంచి తీసి కాగిన నెయ్యి/నూనెలో వేసి దోరగా వేయించి కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙తినే ముందర బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి. మద్దూర్ వడ కావలసినవి: బియ్యప్పిండి – అర కప్పు; మైదా పిండి – పావు కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; కరివేపాకు – 6 రెమ్మలు (సన్నగా తరగాలి); కొత్తిమీర – 4 టీ స్పూన్లు (సన్నగా తరగాలి); ధనియాల పొడి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఇంగువ – చిటికెడు; గోరు వెచ్చని నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి వేసి కలపాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ∙ఉప్పు, ఇంగువ జత చేయాలి ∙గోరు వెచ్చని నూనె జత చేసి మరోమారు కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోసి గారెల పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేయాలి ∙రెండువైపులా దోరగా వేగిన తరవాత కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. పోలి పూర్ణం బూరెలు కావలసినవి: మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా; నువ్వుల నూనె/నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పలచబడినా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙పెసర పప్పును రెండు గంటలపాటు నానబెట్టి, మిక్సీలో వేసి పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని ఇడ్లీ రేకులలో ఇడ్లీలా వేసి కుకర్‌లో ఉంచి, విజిల్ పెట్టకుండా ఆవిరి మీద ఉడికించి దింపేయాలి ∙చల్లారాక పిండిని చేతితో పొడిపొడిలా అయ్యేలా మెదపాలి ∙పంచదార, కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి కలిపాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌమీద బాణలిలో నెయ్యి/నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న ఉండలను మైదా పిండి మిశ్రమంలో ముంచి బూరెల మాదిరిగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙వేడి వేడి బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి. ఖర్జూరం– పల్లీ/బాదం బొబ్బట్లు కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మైదా పిండి – ఒక కప్పు; ఖర్జూరాల ముద్ద – ఒక కప్పు; వేయించిన పల్లీలు/బాదం పప్పులు – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – తగినంత; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి∙తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె జత చేసి బాగా మెత్తగా కలిపి, పైన తడి వస్త్రం ఉంచి, గంట సేపు పక్కన ఉంచాలి ∙మిక్సీలో పల్లీలు/బాదం వేసి మెత్తగా పొడి చేయాలి ∙ఖర్జూరాల ముద్ద జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙గోధుమపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙అరటి ఆకు మీద కాని, నూనె పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద కాని ఈ ఉండను ఉంచి చిన్న సైజు పూరీలా ఒత్తాలి ∙ఖర్జూరం మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ∙ప్లాస్టిక్ కవర్ మీద బొబ్బట్టు మాదిరిగా పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, ఈ బొబ్బట్టును వేసి రెండువైపులా నెయ్యి వేస్తూ దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙తినే ముందు బొబ్బట్లు మీద కొద్దిగా నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది. సూరన్ వడలు కావలసినవి: కంద – పావు కేజీ; నిమ్మ రసం – అర టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు + ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత. పొడి కోసం... మిరియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; మెంతులు – 4 గింజలు; లవంగాలు – 2. తయారీ: ∙కందను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి ∙విజిల్స్ వచ్చాక నీళ్లు వేరు చేసి, ముక్కలను చల్లారబెట్టాలి ∙మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, లవంగాలు వేసి రవ్వలాగ వచ్చేలా పొడి చేయాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, మిరియాల పొడి మిశ్రమం, కొద్దిగా బియ్యప్పిండి, నిమ్మ రసం, అల్లం తురుము, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పాన్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి ∙సిద్ధంగా ఉన్న కంద మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేతిలోకి తీసుకుని, వడల మాదిరిగా చేతితో మృదువుగా ఒత్తి, నూనెలో వేయాలి ∙రెండువైపులా దోరగా వేగిన తరవాత, కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కొబ్బరి బొబ్బట్లు కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – పావు కప్పు; ఉప్పు – చిటికెడు; పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; ఏలకుల పొడి – అర కప్పు. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి, నూనె, ఉప్పు వేసి కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, పైన తడి వస్త్రం మూతలా వేసి గంట సేపు నానబెట్టాలి ∙మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙మిశ్రమం దగ్గర పడగానే దింపేసి, చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చిన్న పూరీలా ఒత్తాలి ∙కొబ్బరి ఉండను మధ్యలో ఉంచి, నాలుగువైపులా మూసేయాలి ∙నూనె పూసిన అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్ కవర్ మీద కాని ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును పెనం మీద వేసి, రెండు వైపులా నెయ్యి వేసి కాల్చాలి ∙బొబ్బట్లను ప్లేట్లో ఉంచి, కరిగించిన నెయ్యి వేసి వేడివేడిగా అందించాలి. నాటుకోడి పులుసు కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; గసగసాలు – 150 గ్రాములు; ఎండుకొబ్బరి పొడి – 100 గ్రాములు; నూనె – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు ; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టొమాటో – 1 (సన్నగా తరగాలి); జీలకర్ర – టీ స్పూన్; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గరం మసాలా – అర టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; కొత్తిమీర – టేబుల్ స్పూన్. తయారీ: ∙గసగసాలు వేయించి ఎండుకొబ్బరి పొడి కలిపి ముద్ద చేసి ఉంచాలి ∙నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అర గంట పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లి తరుగు వేసి, వేయించాక, టొమాటో తరుగు నిలువుగా తరిగిన పచ్చి మిర్చి వేసి కలపాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద మిశ్రమంలో ఉంచిన నాటుకోడి ముక్కలను జత చేసి బాగా కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడికిన తరవాత కారం, ఉప్పు, గసగసాల మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి ∙ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి, మూడు నిమిషాలు ఉంచి దించాలి. నువ్వుల బూరెలు కావలసినవి: – మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; వేయించిన నువ్వులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – కొద్దిగా; నువ్వుల నూనె/నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పలచబడినా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙మిక్సీలో నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి అన్నీ కలిసే వరకు మిక్సీ పట్టాలి ∙కొద్దిగా పాలు జత చేస్తూ, ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి (మరీ పల్చగాను, మరీ గట్టిగాను కాకుండా చూసుకోవాలి) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి/నువ్వుల నూనె వేసి కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న నువ్వుల ఉండలను మైదా పిండి మిశ్రమంలో ముంచి, కాగిన నెయ్యి/నూనెలో వేసి దోరగా వేయించి కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి. -
నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' నవ్వలేకపోవడం ఒక 'రోగం'
పిల్లవాడు పుట్టాక మనం నేర్పే తొలి విద్య నవ్వడమే. పైగా ‘టీ...టీ...చీ...చీ...’ అంటూ బుగ్గలు పుణికేస్తాం. చిటికేసివేనేస్తాం. పిల్లాడిని పకపకా నవ్విస్తాం. నవ్వించి... వేళ్ల కణుపులు టకటకమనేలా మెటికలు విరిచేస్తాం. పెద్దయ్యాక కూడా ఎవరైనా తెలిసినవారు ఎదురైనప్పుడు పలకరించేదీ నవ్వుతోనే. తెలియనివారిని పరిచయం చేసుకునేదీ చిరునవ్వుతోనే. పేరుకే ‘చిరు’నవ్వుగానీ... అది అచిరకాలం అక్షయంగా కొనసాగాలని కోరుకునే నవ్వు. ఆ నవ్వులోనూ ఎన్నో రకాలు... ముసిముసినవ్వు, మురిపెపు నవ్వు, మంచినవ్వు, మందహాసం, వెకిలినవ్వు, వెటకారపునవ్వు, అట్టహాసం, వికటపు నవ్వు, వికటాట్టహాసం... ఇలా ఎన్నో ఉన్నా ప్రస్తుతం అన్ని రకాల నవ్వులూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యానికి హ్యూమర్ చేసే మేలు గురించి బైబిల్లో ఇలా ఉంది. ‘‘సంతోషం గల మనసు ఆరోగ్యకారణం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేలా చేస్తుందం’’టూ ప్రవచిస్తుంది. సాక్షాత్తూ బైబిలే అంతటి మాట చెప్పాక... మనిషి అన్నవాడు నవ్వకపోతే ఎలా... నవ్వుతూ ఉండకపోతే ఎలా? హెల్త్‌కీ, హ్యూమన్కీ అనుసంధానం... నవ్వుభక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానమైన అగర్బత్తీ లాగే... ఆరోగ్యాన్నీ , మనిషినీ అనుసంధానిస్తుంది నవ్వు. నవ్వును ఎందుకు గౌరవించాలో తెలుసా? నవ్వు ఓ డాక్టర్ కాప్. ఏడాదికి 365 రోజులూ అండర్ కవర్లో ఉంటుంది. రౌండ్ ద క్లాక్ ఆపరేషన్స్! రోజూ ఎన్నో వ్యాధుల్ని ఎన్కౌంటర్ చేస్తుంది. అది దాని ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు... ఆల్ టైమ్ రికార్డ్! అందుకోసమైనా దానికి సెల్యూట్ చేయాలి. యమగోల సినిమా చూశారా? ‘అవలోకనమాత్రవిచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర పాశాంకుశ’ అంటూ యమధర్మరాజు యమగా ఆవేశపడతాడు. అంత భారీ సంధులూ, అతిభారీ సమాసాలతో విరుచుకుపడతాడు. ఆయాసం వచ్చి చతికిలపడతాడు. అప్పుడు ఎన్టీఆర్ ఆయనకు మాత్ర ఇచ్చి, సేదదీర్చి ఇలా అంటాడు. ‘‘ఆవేశపడకండి సార్... మీరసలే బ్లడ్‌ప్రెషర్ మనుషులూ. ఆవేశపడితే ఆయాసం వస్తుందం’’టూ హితవు చెబుతాడు. అంటే... ఎక్కువగా కోపంతో ఉండేవారికీ, చీటికీ మాటికీ ఆవేశపడుతూ ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందన్నది అందరికీ తెలిసిన సంగతే. అయితే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేవారికి గుండెజబ్బులు రావడం చాలా తక్కువని ఎన్నో పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఉదాహరణకు ఒక జర్నల్‌లో ప్రచురితమైన అంశం యథాతథంగా ఇలా ఉంది. హాస్యం వల్ల పిల్లలూ, పెద్దల్లో ఏ అంశంపైనైనా దృష్టికేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. మనం నవ్వడం మొదలుపెట్టగానే ఒత్తిడి కలిగించే హార్మోన్లయిన కార్డిసోల్, ఎపినెఫ్రిన్ స్రావాలు తగ్గిపోతాయి. ‘మీసోలింబిక్ డోపోమినెర్జిక్ రివార్డ్ సిస్టమ్’ అనే ప్రక్రియ యాక్టివేట్ అవుతుంది. డోపమైన్ స్రావం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. దాంతో మనకు సంతోషమూ, ఉల్లాసమూ కలిగించే విషయాన్ని పదే పదే చేస్తుంటాం. ఈ రివార్డ్ సిస్టమ్ పాజిటివ్‌గా ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం. స్కూల్లో ఒక అబ్బాయికి లెక్కల్లో నూటికి నూరు... సైన్స్‌లో నూటికి తొంభై మార్కులు వచ్చాయనుకుందాం. టీచర్ చాలా మెచ్చుకుంటుంది. అంటే టీచర్ ఇచ్చిన రివార్డుతో అతడిలో డోపమైన్ స్రవించి హుషారు పుడుతుంది. ఈ హుషారుకు... అంటే ప్లెజర్‌కు కారణం మెదడులోని ‘న్యూక్టియస్ ఎక్యుంబెన్స్’ అనే సెంటర్. దాన్నే ప్లెజర్ సెంటర్ అని కూడా అంటారు. జీవితంలో మనకు ఏది సంతోషం కలిగిస్తుందో... దానికి బీజం పడేదిక్కడే. ఆ తర్వాత పెద్దయ్యాక కూడా మనకు సంతోషం కలిగించే అవే పనులను చేస్తుండటానికి మెదడులోని ఈ ‘ప్లెజర్ సెంటరే’ కారణం. ఒక రివార్డు కారణంగా మనకు సంతోషం కలుగుతుందని ఆ ‘సెంటర్’లో నమోదు అవుతుంది. అలా జరగగానే... ఇకపై ఆలాంటి రివార్డులను కోరుకున్న విద్యార్థి పదే పదే పాఠాలు బాగా చదివి మళ్లీ తొంభై, నూరు మార్కులు తెచ్చుకోవాలనుకుంటాడు. ఇలా విద్యార్థిలో చదువు ఆకాంక్షనూ, పెద్దయ్యాక ప్రయోజకుడు కావాలనే ఉద్దేశాన్ని కలిగిస్తుందీ మెకానిజమ్. తనపై తానే పరిశోధనలు చేసుకున్న ప్రొఫెసర్...నార్మన్ కజిన్స్ అనే ప్రొఫెసర్‌కి యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అనే డీజనరేటివ్ డిసీజ్ వచ్చింది. అప్పట్లో అది నయమయ్యే అవకాశం పెద్దగా లేదని తెలిసింది. అంతే... తానే స్వయంగా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కావడం వల్ల నవ్వుతో జీవరసాయనాల్లో వచ్చే మార్పులు, వాటి ఉపయోగాలు తెలిసిన ఆయన ఒక పని చేశాడు. తనకు ఎక్కువ మోతాదులో విటమిన్–సి ఇవ్వమని తన ఫిజీషియన్‌ను కోరాడు. ఆ తర్వాత హాస్య చిత్రాలను, హాస్యభరితమైన టీవీ షో లను చాలా ఎక్కువగా చూశాడు. అలా తన జబ్బు తీవ్రతను తానే హాస్యంతో ఎదుర్కొన్నాడు. దాంతో బాణం లాంటి జబ్బులకు హాస్యం అనే కవచం పనిచేస్తుందని నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తన ప్రయోగాలతో ఆయన నిరూపించిన అంశాలు చాలానే ఉన్నాయి. ‘‘పది నిమిషాలు హాయిగా గట్టిగా నవ్వితే... అది ఎలాంటి నొప్పులూ, బాధలూ లేని రెండు గంటల గాఢ నిద్రతో సమానం’’ అంటాడాయన. త్వరగానే చనిపోతాడనుకున్న ఆయన ఇలా తనకు తాను హాస్య చికిత్స చేసుకుంటూ జబ్బు సోకాక కూడా 25 ఏళ్లు హాయిగా బతికాడు. అంతేకాదు... తన అనుభవాలతో ‘అనాటమీ ఆఫ్ యాన్ ఇల్నెస్ యాజ్ పర్సీవ్‌డ్ బై ద పేషెంట్’ అనే పుస్తకం రాశాడు. ఇలాంటి ‘ఆరోగ్యానికి నవ్వు – దాని ఉపయోగాలు’ వంటి పరిశోధలూ, పుస్తకాలూ అసంఖ్యాకంగా ఉన్నాయి. హార్ట్‌కు రెండో అటాక్‌ను దూరం చేసే నవ్వు... మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన వారు... ఆ తర్వాత మరోటీ, ఇంకోటీ వస్తే... ఇక తమ పని ఇంతేసంగతులని ఆందోళన పడుతుంటారు. గుండెను కొట్టుకొమ్మంటూ తాము తలకొట్టుకుంటూ దాన్ని బతిమాలుతుంటారు. కానీ గుండెకు గిలిగింతలు పెట్టి స్పందింపజేసే గుణం నవ్వుకు ఉంది. మనం నవ్వగానే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు మన దేహంలోకి వెలువడుతాయి. రక్తనాళాలను దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా ఉంచేందుకు అవి దోహదపడతాయి. అంతేకాదు... ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిన వారు నిత్యం మనస్పూర్తిగా నవ్వుతూ ఉంటే రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయిని కూడా చాలా అధ్యయనాల్లో తేలింది. దీనికి కారణం ఉంది. నిత్యం నవ్వుతూ ఉండే రోగుల్లో అన్ని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని ఇచ్చే రక్తనాళాలు 50 శాతం అదనపు సామర్థ్యంతో వ్యాకోచిస్తాయి. అందుకే అన్ని అవయవాలకు సాఫీగా రక్తప్రసరణ సాగుతుంది. అందుకే ఒకసారి ఎటాక్ వచ్చిన వారికి డాక్టర్లు జీవనశైలి (లైఫ్‌స్టైల్) మార్పులు సూచిస్తూ... అనందంగా ఉండటం, హాయిగా నవ్వడం చేస్తుండాలని తమ పేషెంట్లకు చెబుతుంటారు. నవ్వు శాస్త్రమని ఒకటుంది... పేరు గెలటాలజీ! స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియమ్స్ ఎఫ్. ఫ్రై అనే సైకాలజీ ప్రొఫెసర్ ఏకంగా నవ్వూ–ఆరోగ్యానికీ, చికిత్సకూ దాని ఉపయోగాల (థెరపాటిక్ యూజెస్) కోసం ఒక ప్రత్యేక విభాగాన్నే నెలకొల్పాడు. దాని పేరే ‘గెలటాలజీ’. గెలటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లాఫ్టర్. తెలుగులో చెప్పాలంటే ‘హాస్యశాస్త్రం’ అన్నమాట. దురదృష్టం ఏమిటంటే... వియత్నామ్ యుద్ధం కారణంగా తగినన్ని నిధులు దొరక్క అతడి అధ్యయనం అటకెక్కిపోయింది. అయినా... పట్టుదలతో తన పరిశోధనలను కొనసాగించాడు. హాస్యంతో జీవక్రియలలో వచ్చే మార్పులను అధ్యయనం చేశాడు. నవ్వు వల్ల మనకు చేకూరే సత్ఫలితాలను పుస్తకాలుగా రాశాడు. ‘ద రెస్పిరేటరీ కాంపోనెంట్స్ ఆఫ్ మిర్త్ఫుల్ లాఫ్టర్’, ‘ద బయాలజీ ఆఫ్ హ్యూమర్’ వంటివి అందులో కొన్ని. ఒక పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో మూడు నిమిషాల పాటు అలాగే నవ్వుతూ ఉండటం వల్ల మన రక్తంలో పెరిగే ఆక్సిజన్ శాచ్యురేషన్ ఎంతో చూశాడు. ఆక్సిజన్ శాచురేషన్ అంతగా పెరగలేదు. కానీ నవ్వు వల్ల ఆక్సిజన్ వెంటిలేషన్ పెట్టిన ఫలితం ఉంటుందని నిరూపించాడు. కండరాలకు శక్తి సమకూరుతుందని తెలుసుకున్నాడు. ఎన్నో అనంతర పరిశోధనలకు అతడి తొలి అధ్యయనాలు మౌలికమయ్యాయి. నవ్వు – ఆరోగ్యం మీద దాని ప్రభావాలు, ప్రయోజనాల పేరిట జరిగిన వేలాది పరిశోధనల్లో ఇవి కొన్ని మాత్రమే. పిల్లలూ–పెద్దలూ నవ్వుకోండిలా... తెల్లారి లేచిన దగ్గర్నుంచి ప్రతివారికీ ఏవో సమస్యలూ, ఏవేవో బాధలు. అవి లేనిదెవరికీ? వాటిని అవాయిడ్ చేయలేం. కాబట్టి చేయాల్సిందేమిటి? ఈతిబాధల్లోనే ఈదులాడాలి. ఆ ఈతను ఆనందించాలి. సంతోషంగా నవ్వుకోవాలి. భోజనాల వేళ పెద్దలూ పిల్లలూ భోజనాల బల్ల దగ్గర కూర్చొన్నట్టు... జోకులు వడ్డించండర్రా అంటూ పనిగట్టుకు కూర్చోవాలి. పిల్లలందరితోనూ ఏదో ఒక హాస్య సన్నివేశమో, కథో చెప్పిస్తుండాలి. వాళ్లకు జోకులేయడం రాకపోవచ్చు. కేకలేయడం మాత్రమే వచ్చి ఉండొచ్చు. కానీ వారి కేకలే జోకుల్లా ఉంటాయి. మీతో ‘కేక’ అనిపిస్తాయి. ఉదాహరణకు ఓరోజు డబ్బు కోసం మీ బుజ్జిగాడిని వెంటబెట్టుకొని ఎటీఎమ్‌కు వెళ్తారు. డబ్బు తీయడానికి ప్రయత్నించారు. ఎంతకీ డబ్బు రాదు. లాభం లేదని ఇంటికొస్తారు. కరెన్సీ లేక బుజ్జిగాడి కిడ్డీ బ్యాంకులోని కాయిన్సే తీస్తారు. ‘‘నాన్నా... కాయిన్స్ పెట్‌డాగ్స్ లాంటివి’’ అంటాడు వాడు అకస్మాత్తుగా. ‘‘అవున్రా. నోటును నమ్ముకుంటే పోటు తప్పదు. నువ్వు అన్నట్టు కాయిన్స్ తోక ఊపుకుంటూ మన వెంటే నమ్మకంగా ఉంటాయి’’ అంటారు మీరు. ‘‘ఎహె అందుక్కాదు. నోటుతో నువ్వు హెడ్స్ టెయిల్స్ వేయగలవా? చూడు... కాయిన్‌కే హెడ్డూ టెయిలూ ఉంటాయి. అందుకే అవి తోక ఊపే మన టామీలా విశ్వాసంగా ఉంటాయి’’ అంటాడు మీ బుజ్జిగాడు. అంతే... గాయబ్! ఇట్స్ గాన్!! డబ్బులు రాకపోవడం వల్ల మీకు కలిగిన చికాకు అదృశ్యమవుతుంది. మైండ్‌లోని విసుగు మాటుమాయం అవుతుంది. అంతటి చిరాకూ అంతర్థానమవుతుంది. ఆ తర్వాత మీలోని జ్ఞాన–చెక్కు మీద నవ్వుల సున్నాలు కోట్ల స్థానాల్లోకి చేరుతాయి. ఆ చెక్కు చక్కగా ఆనర్ అవుతుంది. ఏకత్కాలంలో మీ మనసు బ్యాంకులో కొన్ని కోట్ల రెట్ల ఆనందాలు రెమిటవుతాయి. లాఫ్రివల్యూషన్కు నాంది కావాల్సింది మనమే... రైతులకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేసేవాళ్లు తగ్గినట్టే... ఈమధ్య హాస్యానికీ ఆదరణ తగ్గింది. హాస్యం అంతగా పండటం లేదు. దానికి దృష్టాంతాలూ ఉన్నాయి. రైతులు మాత్రమే కాదు... ఆటలో దొంగ ఎవరో నిర్ణయించడానికి పిల్లలూ ‘పంటలు’ వేసేవారు. పంట పండిన వారు దొర. చివరి వరకూ ఎంతకూ పండనివాడు దొంగ. ఈ దొరలూ... ఆ దొంగలూ కలిసి ఆడుతూ ఉంటే... అటు పిల్లల ముఖాల్లో ఇటు పెద్దల ముఖాల్లో నవ్వుల పంట పండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడాడుతున్నారు? ఇప్పుడు వాళ్ల ప్లే గ్రౌండు వైశాల్యం మహాఅయితే మొబైల్ స్క్రీన్ అంత! మరీ విశాలమైన చోట ఆడటం చూడాలంటే... సదరు అతి విశాల ఆటస్థలం దర్శనమిచ్చేది కంప్యూటర్ మానిటర్ అంతటి సైజులోనే! ఇప్పుడు సాగుభూమి విస్తీర్ణం తగ్గుతున్నట్లుగానే చేతిఫోన్ స్క్రీనూ చిక్కిపోతోంది కదా. అందుకే ఉన్న స్థలంలోనే మనవంతుగా వీలైనన్ని జోకువిత్తనాలతో నాట్లు వేసి వీలైనంత నవ్వుల పంటను విరగబూయించేలా... అభినవ స్వామినాథన్ అవతారమెత్తాలి. ఇలా స్వయంగా మనమే ‘లాఫ్ రెవల్యూషన్’కు కారణమై టన్నులకొద్దీ నవ్వుబస్తాల దిగుబడితో హాస్యస్వావలంబన సాధిస్తే ఎంత బాగుంటుంది! ఇప్పుడు పెద్దలతో పాటు పిల్లల తలలూ ఏదో తప్పు చేసినట్టుగా ఫోన్లలో కూరుకుపోయి ఉంటున్నాయి. అవి పేరుకే స్మార్ట్ గానీ... కనీసం స్మార్ట్‌గా కూడా వాటిని యూజ్ చేసుకోవడం లేదు మనం. కనీసం వాట్సాప్పుల్లో వచ్చే జోకులనైనా చూసి ఫక్కున నవ్వాలి. అలా చేస్తేనైనా ఒక్కసారిగా మెడ జెండాకర్రలా ఠక్కున నిలబడుతుంది. ముఖాన నవ్వు ఓ పతాకలా రెపరెపలాడుతుంది. కనీసం ఈ చిన్ని చిట్కా కూడా పాటించడం లేదు మనం. జీవితంలో హాస్యంలో పండాలంటే కనీసం స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్జోకుల్లోనైనా మనం ముగ్గాలి కదా. ఏదో ఐకాన్ నొక్కగానే చక్కిలిగిలి పెట్టి బలవంతంగా నవ్వించే యాప్ కొత్త యాప్ మనకు వద్దు. అది కనుగొనాల్సిన దుస్థితీ వద్దు. ఉన్న యాప్‌లతో కమ్యూనికేట్ అయ్యే జోకుల నవ్వులనే మన ఒంట్లోకి డౌన్లోడ్ చేసుకుందాం. చివరిగా... ఆనందబాష్పాలను నిర్వచించమంటే ఒకరు అన్న మాటలివి... ‘ఆనందంతో కన్నీళ్లు చిప్పిల్లితే... అక్కడ ఊరిన నీరు గుండెల్లోకి జారి, మనసు తడిబారుతుంది. ఆ చెమ్మతో బతుకు చల్లగా మారుతుంది’. మరి చిరునవ్వుతో పెదవులు విశాలమైతేనో?’ అడిగాడు ఆ మాట విన్న మరో వ్యక్తి. ‘శాస్త్రప్రకారం సేమ్ ఎఫెక్ట్ ఉండాలి కదా. పెదవులు విప్పారి, విస్తరిస్తాయి కాబట్టి మనసూ విశాలమవుతుంది’ అన్నది జవాబు. అవును... అందుకే అందరం నవ్వుదాం... మనందరి మనసులూ విశాలం చేసుకుందాం. తగ్గుతున్న మనస్ఫూర్తి నవ్వు... ఒకప్పుడు మనిషి హాయిగా నవ్వుకునే వ్యవధి చాలా ఎక్కువగానే ఉండేది. అది క్రమంగా తగ్గిపోతోంది. ఒక అధ్యయనం ప్రకారం 1950 నాటి ప్రాంతాల్లో ప్రతి మనిషీ సగటున 18–20 నిమిషాలు నవ్వుతూ ఉండేవాడు. అయితే ఇప్పటికి ఇది 4 నుంచి 5 నిమిషాలకు పడిపోయింది. అంటే గత డెబ్బౖయెదేళ్లలో మనిషి నవ్వుతూ ఉండే సగటు వ్యవధి దాదాపు నాలుగో వంతుకు పడిపోయిందన్నమాట. రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతుండటం, పని గంటలు పెరుగుతుండటం, హాయిగా నవ్వుకునేందుకు సమయం దొరకకపోవడం వంటి అంశాలన్నీ మనిషి నవ్వుతూ ఉండే వ్యవధిని దారుణంగా తగ్గించివేస్తున్నాయి. ఇదెంతో ఆందోళనకరం. హ్యూమరారోగ్యం... హ్యూజ్ నంబరాఫ్ అధ్యయనాలు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా–లాస్ ఏంజిల్స్‌లో ప్రొఫెసర్ నార్మన్ కజిన్స్ చేసిన చాలా పరిశోధనలలో... హాస్యం కారణంగా ఎన్నో వ్యాధులు తగ్గుతాయని నిరూపిత మైంది. ఉదాహరణకు... క్రానిక్ స్ట్రెస్ కారణంగా రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడతాయన్నది తెలిసిందే. బాగా హాస్యధోరణితో ఉండి, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారి రక్తనాళాల్లో వారి నిత్యసంతోష ధోరణి వల్ల బ్లడ్‌క్లాట్స్ ఏర్పడటం తగ్గుతుంది. దాంతో ఎన్నో గుండెజబ్బులు నివారితమవుతాయి. రోజూ కేవలం పదిహేను నిమిషాలు నవ్వితే చాలు... మనిషి ఆయుఃప్రమాణం రెండు రోజులు పెరుగుతుందని ఒక అధ్యయనం ముసిముసి మందహాసంతో పేర్కొంటే... ఇక మిగతావారితో పోలిస్తే హాస్యస్ఫూర్తితో బతికేవారు ఎనిమిదేళ్లు ఎక్కువగా బతుకుతారని మరో అధ్యయనం వికటాట్టహాసం చేసి మరీ చెబుతోంది. మీ కుక్క కరుస్తుందా? అతనొక జనరల్ స్టోర్ దగ్గరికెళ్లి కౌంటర్ దగ్గర ఉన్న చిన్న కుక్కను చూసి ‘‘మీ కుక్క కరుస్తుందా?’’ అనడిగాడు. షాపతను ‘‘లేదండీ! కరవదు.’’ అన్నాడు నవ్వుతూ. అతను ఆ కుక్కను దువ్వుతూ కాసేపు సంబరపడ్డాడు. అది అతణ్ని గట్టిగా కరిచింది. ‘‘అదేంటీ! మీ కుక్క కరవదు అన్నారు కదా!’’ అని అరిచాడతను. షాపతను నెమ్మదిగా చెప్పాడు – ‘‘అదేగా చెప్తున్నాను. మా కుక్క కరవదు. ఇది మా కుక్క కాదు’’. ఆహారానికి సైడ్ఎఫెక్ట్స్ ఉన్నాయిగానీ... నవ్వుకు లేవుఒక వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుడి దగ్గరికి వెళ్లాడనుకోండి. డాక్టర్ రకరకాల ప్రశ్నలు వేసి మందులిస్తారు. తిండి ఏం తింటున్నారని అడిగి... అవి వద్దని మందలిస్తారు. ‘‘ఉప్పు బాగా తగ్గించండి. అస్సలు వేసుకోకపోయినా పర్లేదు. కారం, మసాలాలూ తగ్గించాల్సిందే. కొవ్వులు డేంజర్. కాబట్టి ఆయిల్స్, నెయ్యి పెద్దగా తినకండి. గౌట్ లాంటి జబ్బులుంటే ప్రొటీన్లూ వద్దు. డయాబెటిస్ రావచ్చు కాబట్టి పిండిపదార్థాలూ ఎంత తక్కువగా తింటే అంతమంచిది... ’’ ఇలా ఉంటాయా సూచనలు. భోజనంలోని ప్రధాన అంశాలైన... కొవ్వులూ, ప్రొటీన్లు, పిండిపదార్థాలూ... ఈ మూడింటినీ పరిమితం చేయమంటారు. ఉప్పూ–కారం అయితే అసలు వద్దేవద్దంటారు. కానీ జోకులూ–నవ్వులో...?! అవి వద్దనో... కాస్త తగ్గించమనో ఎవరూ అనరు. మూడు పూటలకు బదులు రెండు పూటలే నవ్వమని ఏ డాక్టరూ నిబంధనలూ, నిబంధనాలూ, ఆంక్షలూ విధించడు. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటి? అన్నానికైనా దుష్ప్రభావాలు ఉంటాయేమోగానీ... జోకులకు ఉండవు. అధికస్య అధికం ఫలం. ఎంత ఎక్కువైతే అంత ఆరోగ్యం. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఏకైక ఔషధం... హాస్యం! – యాసీన్ -
లాఫ్టర్ పంచ్
ఆడపిల్లలు నవ్వితే ‘ఏంటా నవ్వు’ అని హద్దులు పెడుతుంది లోకం. కాని ఈ ఆడపిల్లల విషయంలో ‘ఇంకో జోకు చెప్పవా’ అని బతిమిలాడుతోంది లోకం. స్టాండప్ కామెడీలో మగవాళ్లే కనిపిస్తుంటారు ఎక్కువగా. కాని మేమూ తక్కువ కాదు అని ముందుకు వచ్చారు ఈ ఐదుగురు. సుముఖి సురేష్, కనీజ్ సుర్కా, మల్లికా దువా, అదితీ మిట్టల్, పుణ్యా అరోరాలు... పొట్ట చెక్కలు చేయడానికి మగవాళ్లే అయి ఉండక్కర్లేదు అని నిరూపిస్తున్నారు. వీళ్లను చూస్తే నవ్వు నాలుగు విధాల రైటు అనిపిస్తుంది. సుముఖి సురేష్ ‘పుష్పవల్లి’ అనే తమిళ క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన కమెడియన్ సుముఖి సురేష్. తన సృష్టించిన క్యారెక్టర్ పుష్పవల్లి లాగే సుముఖి కూడా తమిళియన్. కాని పెరిగింది నాగ్‌పూర్‌లో. చైన్నైలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే థియేటర్ పట్ల ఆసక్తి పెంచుకుంది. కాలేజ్ ఫెస్టివల్స్‌లో నాటకాల్లో నటించేది. డిగ్రీ అయిపోయాక బెంగళూరులోని ఓ ఫుడ్ ల్యాబరేటరీలో ఉద్యోగం రావడంతో బెంగుళూరు వెళ్లింది. 2013లో అక్కడే ‘ది ఇంప్రూవ్’ అనే తన తొలి కామెడీ షోను ప్రదర్శించింది. దానికి వచ్చిన రెస్పాన్స్‌తో ఆమె కెరీర్‌నే మార్చేసుకుంది. ఓ రెండేళ్లు ఇటు ఉద్యోగం, అటు కామెడీ షోలు నిర్వహిస్తూనే 2015లో ఉద్యాగానికి రాజీనామా చేసి కామెడీనే ప్రొఫెషన్‌గా ఎంచుకుంది. తన జీవితం స్ఫూర్తిగా పుష్పవల్లి అనే క్యారెక్టరును క్రియేట్ చేసి అదే పేరుతో యూట్యూబ్ షోను మొదలుపెట్టింది. ‘ఉద్యోగం మానేసి స్టాండప్ కామెడీని వృత్తిగా స్వీకరిస్తుంటే మీ పేరెంట్స్ ఏమన్నారు?’ అని ప్రశ్నిస్తే.. ‘మా అమ్మకు మంచి హాస్య చతురత ఉంది. అదే నాకూ వచ్చినట్టుంది. అందుకే నేను స్టాండప్ కమేడియన్‌గా అవతారమెత్తున్నానని తెలియగానే చిరునవ్వుతో నన్ను బ్లెస్ చేసింది. బహుశా నాలో తనను చూసుకోవాలనుకుందేమో’ అంటుంది సుముఖి నవ్వుతూ. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ‘బెటర్ లైఫ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సుముఖి. ‘మీరు మహిళ అయినందువల్ల మీ హాస్య చతురతకు ఏమైనా పరిమితులు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు ‘ఆకాశమే హద్దు. నేను జోక్ వేయని అంశమేదీ లేదు. అయితే మగవాళ్ల కన్నా మేం కచ్చితంగా డిఫరెంటే. హాస్యం పట్ల వాళ్ల అప్రోచ్ వేరు. మా అప్రోచ్ వేరు. మాది సున్నతిమైన హాస్యం. మగవాళ్లు హాస్యం పేరిట మానవసంబంధాలను, మనుషులను ఓ ఫ్రేమ్‌లో పెడ్తారు. కాని మహిళలు అలా కాదు. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో చూసి, ఆలోచించి ఎవరినీ నొప్పించకుండా ప్రెజెంట్ చేస్తారు. ఎందుకంటే బేసిక్‌గా స్త్రీలు సున్నిత మనస్కులు కాబట్టి’ అంటుంది సుముఖి. పుణ్య అరోరా పుణ్య అరోరా ఒక టీచర్, ఫొటోగ్రాఫర్, స్టాండప్ కమేడియన్. ఒక్కమాటలో ఆమె ఒక ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ పంజాబీ అమ్మాయి ఎంబీఏ కంటే ముందు తన హాబీ అయిన ఫొటోగ్రఫీలో పీజీ డిప్లమా చేసింది. ఆ తర్వాత అదే ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేసింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీతోపాటు కామెడీని ఎంజాయ్ చేసేది చిన్నప్పటి నుంచి. అమ్మతో కలిసి కామెడీషోస్కు వెళ్లడం, ఆన్లైన్లో చూడటం చేసేది. ‘సరదా కోసం కామెడీని చూసేదాన్ని కాని ఏరోజూ అనుకోలేదు తర్వాత అదే నాకు సీరియస్ కెరీర్ అవుతుందని’ అంటుందిప్పుడు పుణ్య. ‘నా వరకు నాకు హాస్యానికి సంబంధించి స్పెసిఫిక్‌గా ఈ అంశం అంటూ ఏదీ ఉండదు. ఏదీ ఫన్నీగా అనిపిస్తే దాన్నే సబ్జెక్ట్‌గా తీసుకుంటా. అవి నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియెన్సెస్ కూడా కావచ్చు’ అంటుంది. ఫీమేల్ స్టాండప్ కమేడియన్స్ పట్ల ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అడిగితే... ‘స్టాండప్ కమేడియన్స్గా ఆడవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ప్రేక్షకుల్లో ఒకరకమైన కుతూహలం ఉంటుంది. కానీ... ఆడ అయినా మగ అయినా ఒక కమేడియన్‌గా నువ్వు ఆడియెన్స్‌ను ఎంత నవ్విస్తున్నావనే అంశం మీదే వాళ్ల ఆదరణ ఆధారపడి ఉంటుంది. నవ్వించడమే కమేడియన్ క్వాలిటీ. దీనికి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదని నా ఉద్దేశం’ అని చెబుతుంది పుణ్య అరోరా. అదితి మిట్టల్ ఇండియన్ స్టాండప్ కామెడీ సీన్ మీద అదితి మిట్టల్ కూడా ఫస్ట్ ఫీమేల్ కమెడియనే. అంతేకాదు ‘ఫూల్స్ గోల్డ్ అవార్డ్’, ‘రిప్పింగ్ ది డికేడ్’లలో నటించిన టాప్ స్టాండప్ కమేడియన్స్‌లో ఆమె ఒకరు. పుణెలో పుట్టిపెరిగిన అదితి యూకేలోని రాక్స్టన్ కాలేజ్‌లో డ్రమెటిక్ లిటరేచర్ చదివింది. అక్కడే కొంతకాలం పాటు పని చేసిన ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. 2009లో ఆల్ ఇండియన్ స్టాండప్ షోలో పాలుపంచుకుంది. ఆమె షోలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. దేనిమీదైనా హాస్యం పండించగలదు. హాస్యంతో స్త్రీ సమస్యల మీద సమాజాన్ని చైతన్యం చేస్తోంది. మనుషులు, వాళ్ల ఆకారాలు, కులాలు, మతాల వంటి జోలికి పోకుండా మనుషుల నైజం, సమాజం తీరుతెన్నుల మీద వ్యంగ్యాన్ని గుప్పిస్తుంది, హాస్యాన్ని పండిస్తుంది. ‘మార్వాడీల పిసినారితనం మీద, మాయావతి లావు మీద జోకులు వేయడం హాస్యం కాదు. మనుషుల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి వాళ్లను దగ్గర చేయడమే హాస్యం ఉద్దేశం’ అంటుంది అదితి మిట్టల్. మల్లికా దువా ‘మేకప్ దీదీ’గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా ఫేమస్ మల్లికా దువా. సరోజినీ నగర్ ఎడిషన్ అనే యూ ట్యూబ్ వీడియో కూడా ఆమెకు ఎనలేని అభిమానులను సంపాదించి పెట్టింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన మల్లికా ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కూతురు. తల్లి పద్మావతి డాక్టర్. మల్లికా విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. పెన్సిల్వేనియా రాష్ట్రం, ల్యాన్కాస్టర్లోని ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజ్‌లో చదివింది. చిన్నప్పట్నుంచీ హాస్యాన్ని ఇష్టపడే మల్లిక అడ్వర్టయిజింగ్ రంగంలోకి వచ్చింది. కాని ఎంతో కాలం నిలవలేక మళ్లీ నవ్వుల మీదే మనసు పారేసుకొని ఫన్నీ డబ్స్మాషెస్, స్నాప్‌చాట్ వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇది పేరుతో పాటు ఆదాయాన్ని తీసుకురావడంతో దీన్నే కెరీర్‌గా ఖాయం చేసుకుంది మల్లికా దువా. కనీజ్ సుర్కా సీఎన్ఎన్ – ఐబిఎన్ చానెల్లో ‘ది వీక్ దట్ వజన్ట్’ షో చూస్తున్న వాళ్లెవరకైనా తెలుస్తుంది కనీజ్ సుర్కా ఎవరో. సైరస్ బ్రొవోచా, కునాల్ విజయ్కర్లతో కలిసి సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్యపూరితమైన షోలు చేస్తుంటుంది. ‘ఇంప్రొవైజేషన్’లో దిట్ట. సౌత్ ఆఫ్రికాలో పుట్టిపెరిగిన ఆమె స్కూల్, కాలేజ్ చదవులన్నీ అక్కడే పూర్తి చేసింది. వీళ్ల కుటుంబం సౌత్ ఆఫ్రికాలో ఉంటే మిగిలిన బంధువులంతా ముంబైలో ఉండేవాళ్లు. దాంతో ప్రతి యేడాది ముంబైకి వచ్చే కనీజ్ యూనివర్సిటీ చదువు తర్వాత 2005లో ముంబైకి పూర్తిగా వచ్చేసింది. ఓ యేడాది గడిపి తర్వాత మళ్లీ వెళ్లి ‘లా’లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేయాలనుకుంది. కాని తిరిగి వెళ్లనేలేదు. కామెడీకి కనెక్ట్ అయిపోయి ఇక్కడే స్థిరపడింది. మొదట థియేటర్లో పని చేసింది. రెండేళ్లు గడిచాక ఇంప్రొవైజేషన్ కళను ఇంకా బాగా నేర్చుకోవాలనిపించింది ఆమెకు. దాంతో ఇంప్రూవ్ కామెడీ చదవడం కోసం న్యూయార్క్ వెళ్లింది. ముంబై వచ్చాక ఇంప్రూవ్ కామెడీ షోలు చేయడం మొదలుపెట్టింది. 2007లో పెళ్లయింది. అప్పటికీ కామెడీని కెరీర్‌గా తీసుకోవాలనే సీరియస్‌నెస్ లేదు ఆమెకు. ఏదో చేయాలనే తపన మాత్రం ఉండేదట. కొన్ని కారణాల వల్ల 2011లో భర్తతో విడిపోయింది కనీజ్. చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆఫ్రికా వచ్చేయమని తల్లిదండ్రులు, స్నేహితులు కోరినా వెళ్లలేదు. ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి అని నిర్ణయించుకొని అప్పటి నుంచి స్టాండప్ కామెడీ మీద దృష్టి పెట్టింది కనీజ్. అలా స్టాండప్ కమేడియన్‌గా మారిపోయింది. ‘స్టాండప్ కామెడీ అంటే మగవాళ్ల రాజ్యం అంటారు చాలామంది. కాని ఓ మహిళగా ఈ రంగంలో నేను ఎలాంటి వివక్షనూ ఎదుర్కోలేదు. ఫీమేల్ కమేడియన్‌గా నేను కోల్పోయిన అవకాశాలూ లేవు. కమేడియన్ కమ్యూనిటీ అంతా చాలా ఓపెన్‌గా, ఫ్రెండ్లీగానే ఉంటుంది’ అని చెప్తుంది కనీజ్ సుర్కా. -
నవ్వడం ఒక యోగమ్
సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్య ఔషధం నవ్వు అని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి అమెరికాలో అదో చిన్న యోగా సెంటర్.అలై్జమర్స్‌తో బాధ పడే కుటుంబ సభ్యులు ఉన్న ఐదారు మంది అక్కడకు చేరుకున్నారు. అలై్జమర్స్‌తో బాధ పడే పేషెంట్స్‌ను ఇరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు చూసుకోవాలి. అలా చూసుకునేది కుటుంబ సభ్యులు అయితే గనుక వారి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎక్కువైతే ఆరోగ్యం దెబ్బ తింటుంది. మరి దానికి విరుగుడు? ఇదిగో ఈ సెంటర్లో చేసే లాఫ్టర్ యోగా. ఆ కుటుంబ సభ్యులంతా కొన్ని క్షణాల్లోనే ఒక వృత్తంలా నిలుచున్నారు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకున్నారు. అంతే. హాయిగా నవ్వడం మొదలుపెట్టారు. మెల్లగా... మెల్ల మెల్లగా... ఆ తర్వాత ఉధృతంగా. ఒకటే నవ్వు. నవ్వే కొద్దీ వారిలో కండరాలు రిలాక్స్ అయ్యాయి. శరీరం రిలాక్స్ అయ్యింది. మనసు కూడా రిలాక్స్ అయ్యింది. ఎంతో హాయిగా సంతోషంగా అనిపించింది. మళ్లీ కొన్ని రోజులు ఒత్తిడితో పని చేయదగ్గ శక్తి వచ్చింది. ఇంకా ఏం కావాలి? ఇలా వీరు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నవ్వునే ఔషధంగా స్వీకరించి జీవితాలను ఒడిదుడుకులను దాటుకుంటూ జీవిస్తున్నారు. కనిపెట్టింది మనవాడే మదన్ కటారియా. ఈ పేరు చాలామంది నవ్వుబోతులకు తెలిసే అవకాశం లేదు. కాని ఇవాళ ప్రపంచంలో చాలామంది ఇతని వల్లే నవ్వుతున్నారు. లాఫ్టర్ యోగాను సాధన చేస్తున్నారు. మదన్ కటారియా ముంబైలో డాక్టర్‌గా పని చేసేవాడు. దాంతో పాటు ఒక హెల్త్ మేగజీన్‌ను కూడా నడిపేవాడు. ముంబైలో ప్రజల క్షణం తీరిక లేని జీవితం వల్ల వాళ్ల రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతున్నారని అర్థం చేసుకున్నాడు. దీనికి విరుగుడు ‘నవ్వే’ దివ్య ఔషధం అని భావించాడు. 1995లో కేవలం 5 మందితో 1995లో కేవలం అయిదు మంది మిత్రులతో ముంబైలోని ఒక పార్క్‌లో మదన్ కటారియా ‘లాఫింగ్ క్లబ్’ను ప్రారంభించాడు. ఒక్కొక్కరు ఒక్కో జోక్ చెప్పడం... హాయిగా నవ్వడం... ఇదేదో బాగుందే అని నాలుగు రోజుల్లోనే చాలామంది జమ అయ్యారు. ఈ సంగతి నలుగురికీ పాకింది. ముఖ్యంగా రిటైరయి ఒంటరితనం భావించే వయోజనులు ఈ క్లబ్ పట్ల చాలా తొందరగా ఆకర్షితులయ్యారు. పత్రికలలో ప్రచారం వల్ల ముంబై లాఫింగ్ క్లబ్ స్ఫూర్తి ఇతర ఊర్లకు కూడా ఇది పాకింది. ఎక్కడ చూసినా నవ్వులే... వికటాట్టహాసాలే. సమస్య వచ్చింది... ముంబైలో లాఫింగ్ క్లబ్ మొదలెట్టాక మదన్ కటారియాకు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే నెల రోజుల్లోనే క్లబ్ సభ్యులకు తెలిసిన జోకులన్నీ అయిపోయాయి. కొందరు బూతు జోకులు తెచ్చి చెప్పడం మొదలుపెట్టారు. దాంతో మిగిలిన సభ్యులకు విముఖత వచ్చింది. లాఫింగ్ క్లబ్ మూతపడే పరిస్థితి వచ్చింది. మదన్ కటారియాకు ఏం చేయాలో పాలుపోలేదు. ‘నాకు ఒక రోజు టైమ్ ఇవ్వండి. దీనికి పరిష్కారం చెబుతాను’ అని అతడు ఇంటికొచ్చి పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టాడు. అప్పుడే అతడికి ఒక విషయం తెలిసి వచ్చింది. ‘మెదడుకు మనం నవ్వుతున్నామన్న సంగతే తెలుస్తుంది తప్ప అది నిజం నవ్వుకూ దొంగ నవ్వుకు తేడా తెలుసుకోలేదు. కాని నవ్విన ప్రతిసారీ ఆనందాన్ని ఇచ్చే రసాయనాలు (ఎండార్ఫిన్స్)ను అది విడుదల చేస్తుంది’ అని. దాంతో అతడు ఉత్తనే మనం నవ్వొచ్చు అని లాఫింగ్ క్లబ్ సభ్యులకు తెలియ చేశాడు. అలా అందరూ అకారణంగానే పెద్ద పెద్దగా నవ్వును ‘అభినయించడం’ మొదలుపెట్టారు. వరుస పెట్టి నవ్వడం ఎవరికైనా ఇబ్బందే కనుక మధ్య మధ్య ఉచ్చ్వాస నిశ్వాసలతో కూడిన ఎక్సర్సైజులు జత చేశారు. వీటన్నింటికి కలిపి ‘లాఫ్టర్ యోగా’ అని పేరు పెట్టాడు మదన్ కటారియా. 70 దేశాలలో 6000 క్లబ్బులు ప్రస్తుతం లాఫ్టర్ యోగా క్లబ్బులు 70 దేశాలకు విస్తరించాయి. దాదాపు 6000 క్లబ్బులు ఆరోగ్యం కోసం నవ్వును ప్రచారం చేస్తున్నాయి. బృందగానంలో ఒకరు హమ్ చేస్తే మిగిలినవాళ్లు ఎలా హమ్ చేస్తారో అలాగే ఈ క్లబ్బులో ఏ జోక్ చెప్పకపోయినా, నవ్వొచ్చే విషయం లేకపోయినా నవ్వును ఒకరు అందించడం ద్వారా మరొకరు అందుకుంటూ ఉంటారు. ‘నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం రోగం’ అని మన దర్శకుడు జంధ్యాల అన్నారు. లాఫ్టర్ యోగాను కనిపెట్టడానికి చాలా రోజుల ముందే ఆయన ఈ మాట అన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నది ఆర్యోక్తి. దీనిని నేటి బిజీ రోజులకు సరి చేసుకుని ‘హాస్యమే మహాభాగ్యం’ అనుకోవాలి. అయిన దానికి కాని దానికి హాయిగా నవ్వుకుంటూ మెడికల్ షాప్ దారిని మర్చిపోవాలి. సినిమాలో లాఫ్టర్ యోగా లాఫ్టర్ యోగా ప్రభావం సినిమాల్లో కూడా కనిపించింది. రాజ్‌కుమార్ హిరాణి తన ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’లో విలన్ బొమన్ ఇరానీకి ఈ మేనరిజమ్ పెట్టాడు. తనకు కోపం వచ్చినప్పుడల్లా బొమన్ మరింత నవ్వుతుంటాడు. తెలుగులో ఈ రోల్ చేసిన పరేష్ రావెల్ కూడా తెగ నవ్వుతూ పాత్రను రక్తి కట్టించాడు. నవ్వడానికి నామోషీ పడకండి లాఫ్టర్ యోగా గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న మదన్ కటారియా చెప్తున్న కొన్ని విషయాలు. ►చిన్న పిల్లలను గమనించండి. వాళ్లు ఆటల్లో పాటల్లో చాలా నవ్వుతారు. అందువల్లే వారు ఉత్సాహంగా ఉంటారు. పెద్దలు నవ్వకూడదని, అది సంస్కారం కాదని మనల్ని కండిషన్ చేశారు. కాని నవ్వాలి. ఎంత బాగా నవ్వితే అంత ఆరోగ్యం. ►నేను బిజీ డాక్టర్ని. కాని జనానికి నవ్వు విలువను తెలియచేయడానికి ప్రాక్టీసు మానేశాను. ఒక డాక్టర్ చేయలేని పని ఒక హాౖయెన నవ్వు చేస్తుంది. ►నేను సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జబ్బు పడేవాణ్ణి. కాని లాఫ్టర్ యోగా మొదలుపెట్టాక నా రోగ నిరోధక శక్తి పెరిగింది. నా శరీరం, మనసు శక్తిమంతమయ్యాయి. మన చుట్టూ చాలా నెగెటివిటీ ఉంది. దానికి మన శరీరం, మనసు సులభంగా లొంగుతాయి. నవ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తుంది. ►నేను చెప్పడం కాదు – గత ఇరవై ముప్పై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కూడా నవ్వు ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నాయి. డిప్రెషన్‌తో ఉన్నవాళ్లు ఈ యోగాతో సులభంగా ఆరోగ్యవంతులు అవుతారు. బి.పి ఉన్నవాళ్లకు అది కంట్రోల్లో ఉంటుంది. నీరసం దరి చేరదు. ►మన మీద ఇతరులు చేసే కామెంట్స్‌ను, వెక్కిరింతను కూడా మనం స్వీకరించి ఎప్పుడైతే హాయిగా నవ్వగలుగుతామో అప్పుడే ఆరోగ్యవంతులవుతాము. ►నా లాఫ్టర్ యోగాను చూసి మెచ్చుకున్నవారిలో దిలీప్ కుమార్ వంటి గొప్పవారు ఉన్నారు... ఓప్రా విన్ఫ్రే వంటి సెలబ్రిటీలు ఉన్నారు. ►మాస్కోలో నేనొక ప్రదర్శన ఇచ్చాను. నాకు ఒక్క ముక్క భాష రాకపోయినా ఒక్క జోక్ చెప్పకుండా అరగంట సేపు వాళ్లను నవ్వించాను. నవ్వాలంటే కారణం అక్కర్లేదు. డాక్టర్ మదన్ కటారియా -
నవ్వుతూనే వుండు!
హ్యూమర్ దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపు తుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగు తుందే తప్ప పకపక నవ్వ లేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వస్తాం. అక్కడ మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకొచ్చు. ఇక్కడ చాయిస్సుంది. కానీ చాలామంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ వుంటారు. వీళ్లు కచ్చితంగా నరకానికే పోతారు. నవ్వేవాళ్లు స్వర్గానికి పోతారో లేదో నాకు తెలియదు కానీ, నవ్వుతూ వుంటే దానికి మించిన స్వర్గం ఏముంటుంది? దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపుతుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగుతుందే తప్ప పకపక నవ్వలేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. అన్నిటిని కల్తీ చేసినట్టే మనం నవ్వుని కూడా కల్తీ చేశాం. పసిపాపలు, పరమయోగుల పెదాలపై మెరిసే నవ్వు నిజమైన నవ్వు. మిగతా అంతా ఎంతో కొంత కల్తీనే. తమాషా ఏమంటే అందరూ ఒకేలా ఏడుస్తారు కానీ ఒకేలా నవ్వలేరు. కొందరు పకపక నవ్వితే, మరికొందరు పగలబడి నవ్వుతారు. కొందరు సోడా కొట్టినట్టు ‘స్స్స్’మని నవ్వితే, మరికొందరికి సౌండే రాదు. బాస్ జోక్‌లకి మనకి తెగ నవ్వొస్తుంది. తుపాన్లో చెట్లు వూగినట్టు వూగిపోతూ నవ్వుతాం. ఒక్కోసారి జోక్ మొదలు పెట్టకముందే నవ్వుతాం. ‘ఇప్పుడేమైందంటే’ అనగానే ఓహ్హోహ్హో అని నవ్వేస్తాం. జోక్ బిగినింగే ఇంత హాస్యంగా వుంటే, పూర్తిగా వింటే పొట్ట చెక్కలైపోతుందేమో! మా పెద్దమ్మ ఒకావిడ కేవలం నవ్వుతోనే మా పెద్దనాయన్ని కంట్రోల్ చేసింది. ఆమె ప్రతి నవ్వు వెనక ఒక ఆదేశముండేది. ఆ ఆర్డర్ మా పెద్దనాయనకే అర్థమయ్యేది. లాఫింగ్తోనే లా అండ్ ఆర్డర్. విలన్ల నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాతాళభైరవిలో ఎస్వీఆర్ నవ్వుని ఎన్నాళ్లైనా మర్చిపోలేం. రాజనాల, సత్యనారాయణ నవ్వారంటే ఎవరి కొంపకో ఎసరు పెట్టారని అర్థం. ఇక మన రాజకీయ నాయకుల సంగతి. వాళ్లు ఓట్లు వేసే వరకూ మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. గెలిచిన తరువాత మనల్ని అంతకంత ఏడిపిస్తారు. హాస్యనటులు అదృష్టవంతులు. కోట్లాది మందిని నవ్వించడం నిజంగా వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పుడు జానపద సినిమాల్లో ఒక సీన్ తప్పకుండా వుండేది. ఎలుగుబంటి హాస్యనటుణ్ని తరుముతూ ఉండే సీన్. దాన్ని చూసి నేను పడీ పడీ నవ్వేవాణ్ని. జీవితమే ఒక ఎలుగుబంటని, అది మనల్ని తరుముతూ వుంటుందని అప్పుడు, ఆ వయసులో నాకు ఏమాత్రం తెలియదు. తెలిసి వచ్చాక నిజం బోధపడింది. ఎప్పుడైనా కానీ మనం పారిపోతుంటే ఇతరులకి హాస్యం. ఇతరులు పారిపోతుంటే మనకి చెప్పలేనంత హాస్యం. మనం జాగ్రత్తగా గమనించాలే కానీ, జీవితంలో అడుగడుగునా హాస్యం కనిపిస్తుంది. సెలూన్ షాప్‌లో, సిటీ బస్సులో, ఆఫీసుల్లో, అసెంబ్లీలో, సీరియస్ సీరియల్స్‌లో, తెలుగు సినిమాల్లో... అన్ని చోట్లా హాస్యం ఉంటుంది. పండుతుంది. ఈ మధ్య సెలూన్కెళితే ఒక పెద్దమనిషి గడ్డానికి తెల్లటి నురుగు రాశారు. తీరా చూస్తే బ్లేడ్ లేదు. దానికోసం ఒక కుర్రాడెళ్లాడు, తిరిగి రాలేదు. హిమాలయాల్లో సాధువులా ఈయన వెయిటింగ్. ఆయనలో కోపం, నాకు నవ్వు. నవ్వు మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే మాత్రం కురుక్షేత్రమే. ఒక చోటికి వెళ్లబోయి, ఇంకో బస్సు ఎక్కేస్తారు. సిటీ బస్సులో వీళ్ల హడావుడి చాలా కామన్. పని రానివాళ్లు చాలా సీరియస్‌గా పనిచేస్తుంటారు. ఇది ఆఫీస్ కామెడీ. అలాగే ఏడిపిస్తూ నవ్వించేవాళ్లు, నవ్విస్తూ ఏడిపించేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు. వీళ్లు జీవితం తప్ప ఇంకేమీ చదువుకోరు. వీళ్లలో చాప్లిన్ ఒకడు. వానలో నడవడం ఇష్టమంటాడు. వానలో తన కన్నీళ్లు ఇతరులకి కనిపించవట. మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే. నవ్వనివాడికి ఇలాంటి నవ్వుల దినోత్సవాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్లే. కానీ నవ్వుతూ బతికినోళ్లు ఎప్పటికీ బతికే వుంటారు. ఏడుస్తూ బతికేవాళ్లు, వుండగనే పోయుంటారు. - జి.ఆర్.మహర్షి -
నవ్వుతో నాజూకు దేహం
పరిపరి శోధన నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతకు ఏనాడో కాలం చెల్లింది. నవ్వు నలభై విధాల గ్రేటని జనాలు తెలుసుకున్నారు. నవ్వు వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని, శారీరకంగా చురుగ్గా ఉండొచ్చని కూడా పలు పరిశోధనలు తేల్చాయి. రోజులో ఎక్కువ సేపు నవ్వులు చిందిస్తూ ఉండటం వల్ల శరీరం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందని ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు తేల్చారు. పెదవులు అరవిరిసేలా చిందించే చిరునవ్వుల కంటే, పగలబడి నవ్వే నవ్వుల వల్ల ముఖ కండరాలకు, పొట్ట కండరాలకు తగినంత వ్యాయామం లభించి, కేలరీలు కరుగుతాయని జీవశాస్త్రవేత్త కూడా అయిన బ్రిటిష్ హాస్యనటి డాక్టర్ హెలెన్ పిల్చర్ చెబుతున్నారు. -
నిద్రలో మీరు ఎందుకు నవ్వారంటే...
నవ్వుతూ నవ్వుతూనే నిద్ర నుంచి మేల్కొంటాం.‘ఇంతకీ ఎందుకు నవ్వాను’’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తాజా కలను గుర్తు తెచ్చుకుంటాం. నిజానికి, అది మామూలు కల. నవ్వాల్సినంత సీనేమి దానిలో ఉండదు. మరి ‘నవ్వు’ సంగతి ఏమిటి? కలలో నవ్వు అనేది ఆహ్లాదకరమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒక సమస్యతో విపరీతంగా విసిగి వేసారి... ఎట్టకేలకు ఆ సమస్య నుంచి ‘విముక్తి’ దొరకడం కావచ్చు, పనిభారంతో ఒత్తిడికి గురవుతూ...ఆ పని పూర్తికాగానే లభించే ‘ఉపశమనం’ కావచ్చు, ఓటమి మీద ఓటమి ఎదురై...చివరికి ఊహించని అనూహ్యమైన విజయం ఎదురైనప్పుడు లభించే ‘ఆనందం’ కావచ్చు....ఇలా వివిధ రకాల ఆహ్లాదకర భావనల సమ్మేళనమే ఈ కల. ప్రేమలో పడినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. ప్రేమలోని గాఢతను ఈ నవ్వు సూచిస్తుంది. మరో కోణం ఏమిటంటే, సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిలోకి చేరినప్పుడు... ఎంత పెద్ద కష్టమైనా, దుఃఖమైనా మనసు తలుపు తట్టదు. ఇక్కడ ‘నవ్వడం’ అనేది భావోద్వేగాలకు అతీతమైన ‘సమ్యక్ దృష్టి’ అనే భావనను సూచిస్తుంది. -
నవ్వొద్దు... బతకద్దు
అసహనం చిక్కగా ఆవరించుకుంటోంది. మనిషి మీద మనిషికి అసహనం, ద్వేషం. ఒకప్పుడు లేవని కాదు. ఇప్పుడది ముదిరింది. అప్పుడు తెల్లవాళ్ళు ఆఫ్రికా, ఆసియాల కొచ్చి మనం నల్లగా ఉన్నందుకు అసహ్యం, అసహనం ఫీలయ్యారు. మనల్ని బానిసలని చేసి హింసించి వ్యాపారం చేశారు. పేరాశ, ఆధిపత్యం పేరిట రెండు ప్రపంచ యుద్ధాలూ జరిగాయి. కోట్ల మంది నెత్తురోడారు. అసహనం అలాగే మిగిలింది. మతం పేరిట మరింత కరడు కడుతోంది. కాశ్మీర్ మీదా, రామ జన్మభూమి మీదా ఎవరైనా డాక్యుమెంటరీలు తీస్తే ప్రదర్శన మూసే వరకూ నిరసనలూ హింసా ఆగవు. పీకే అనే సినిమా వస్తే చూడకుండానే నిరసనలు. నెహ్రూ ప్రభుత్వకాలంలో ‘శంకర్స్ వీక్లీ’’ కార్టూన్ పత్రికలో ఆయన మీద విమర్శల కార్టూన్లు వస్తే నవ్వుతూ రిసీవ్ చేసుకునే వాడు నెహ్రూ. పైగా ‘డోంట్ స్పేర్ మీ... శంకర్’’ అని చెప్పేవాడు. ఇప్పుడలాలేదు. సరదాలూ వెటకారాలకు రోజులు కాదు. నవ్వినా నవ్వించినా బతకడానికి సందు లేదని హిందు ముస్లిం ఫండమెంటలిస్టులు కలిసి లెవెన్త్ కమాండ్ రాసి పెట్టారు. ఇది మనుషుల మధ్య ప్రేమకీ, ఆనందానికీ, గుండె నిండా నవ్వుకోవడానికీ డేంజర్ సిగ్నల్. భూతాపంతో పోటీ పడి పెరుగుతోంది అసహనం. మనమిక నవ్వొద్దు మనమిక బతకొద్దు. - మోహన్, కార్టూనిస్ట్ -
కామెడీ నైట్స్ విత్ అలీ!
కామెడీ నైట్స్ అనగానే కపిల్‌శర్మ గుర్తొస్తాడు. కలర్స్ చానెల్లో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ పేరుతో అతడు నిర్వహించే కామెడీ షో... టీఆర్పీ రికార్డులను తిరగరాసింది. కౌన్ బనేగా కరోడ్‌పతి, బిగ్‌బాస్ లాంటి టాప్ రియాలిటీ షోలను వెనక్కి నెట్టేసింది. అలాంటి కామెడీ షో తెలుగులోనూ ఉంటే బాగుణ్ను అనుకున్నారో ఏమో... మాటీవీ వారు ‘అలీ టాకీస్’కి తెర తీశారు. అలీ టాకీస్‌ని కపిల్ కామెడీ నైట్స్‌తో పోల్చడం అవసరమా అంటే, అవును అనాల్సిందే! ఎందుకంటే... రెండు కాన్సెప్టులూ ఒకటే కాబట్టి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కాబోతున్నప్పుడో, రిలీజ్ అయినప్పుడో ఆ చిత్ర టీమ్‌ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటాడు కపిల్. ఇంటర్వ్యూకి కామెడీని రంగరించి తనదైన స్టయిల్లో అదరగొట్టేస్తాడు. మధ్యలో మరికొన్ని క్యారెక్టర్లు ఎంటరై నవ్వులు పండిస్తుంటాయి. అచ్చు ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే అలీ టాకీస్. అందుకే రెండిటినీ పోల్చాల్సి వచ్చింది. అక్కడ కపిల్ ఎంత ఫేమసో... ఇక్కడ అలీ కూడా అంత ఫేమస్సే. కాబట్టి ఈ షోకి అలీనే పెద్ద ప్లస్ పాయింట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన టైమింగ్‌తో షోని చక్కగా నడిపిస్తున్నాడు. మరి కపిల్ కామెడీ నైట్స్లాగే అలీ టాకీస్ కూడా టీఆర్పీ రికార్డులను బద్దలు కొడుతుందేమో చూద్దాం! -
ఆటలు ఎందుకు ఆడాలి?
జెన్ పథం అదొక మైదానం. అక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మార్గంలో నడుచుకుంటూ పోతున్న ఒక సాధువు ఆడుకుంటున్న పిల్లలను చూసి అక్కడే ఆగిపోయారు. పిల్లలు మహదానందంగా ఆడుకుంటున్నారు. వాళ్లకు చుట్టూ ఏం జరుగుతున్నదీ పట్టలేదు. వారి ఆటను చూసి సాధువు సంతోషించారు. ఓ గంటైంది. అనంతరం ఆయన చప్పట్లుకొట్టి వాళ్ల ముగ్గుర్నీ పిలిచారు. పిల్లలు ముగ్గురూ సాధువు వద్దకు వచ్చి ఆయనను ఎగాదిగా చూశారు. ఆయన వేషధారణ పిల్లలకు విచిత్రంగా అనిపించింది. పిల్లలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా సాధువు వారిని కోపగించుకోలేదు. వాళ్లు నవ్వు ఆపిన తర్వాత సాధువు వారివంక చూసి ‘‘మీరెప్పుడూ ఇక్కడే ఈ మైదానంలోనే ఆడుకుంటారా?’’అని అడిగారు. ‘‘అవును’’ అని ముగ్గురూ ఒక్క మాటగా చెప్పారు. ‘‘ఇంతకీ ఎందుకు రోజూ ఆడుకుంటారు? దాని వల్ల మీకు కలిగే లాభమేంటి?’’ అని సాధువు ముగ్గురినీ ప్రశ్నించారు. అప్పుడు మొదటి కుర్రాడు ‘‘బాగా ఆడితే శరీరానికి ఎంతో మంచిది. దేహం గట్టిపడుతుంది. బలమొస్తుంది. అంతేకాదు, ఎవరికీ భయపడక్కర్లేదు. ఎదురుగా ఎవరొచ్చినా వారిని ఇట్టే ఎదుర్కోవచ్చు’’ అన్నాడు. ఆ కుర్రాడి మాటలు విని సాధువుకు ఆనందమేసింది. ‘‘నువ్వు తప్పకుండా బలవంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. ఆ తర్వాత రెండో కుర్రాడు ‘‘హాయిగా ఆడితేనే మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. ఆ తర్వాత మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదివినదంతా బుర్ర కెక్కుతుంది’’ అన్నాడు. వాడి మాటలు విన్న సాధువు ‘‘బాగా చెప్పావు. నువ్వు గొప్ప విద్యావంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. అనంతరం మూడో కుర్రాడు ‘‘నాకు ఆటలంటే ఇష్టం. అందుకే ఆడతాను’’ అని టూకీగా చెప్పాడు. అంతకన్నా మరేమీ మాట్లాడలేదు. సాధువు వాడికి నమస్కరించి ‘‘ఇకమీదట నువ్వే నా గురువు’’ అని అన్నారు. మనం చేసే ప్రతి పనికీ ఏవేవో కార ణాలు, ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి. లాభనష్టాలు ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ అయోమయంలో పడిపోక మనమున్న క్షణాన్ని ఆవగింజంత కూడా మిగల్చక అనుభవించాలి. అదే జెన్ పథంలోని తొలి మెట్టు. అప్పుడే ఏ బాదరబందీలుండవు. - యామిజాల జగదీశ్ -
జవాబు దొరకని ప్రశ్న
ఫొటో స్టోరీ వెలుగులు జిమ్మే చిన్ని చిన్ని కళ్లల్లో దిగులు తెరలా కమ్ముకుంది. పాలుగారే చెంపల మీద కన్నీరు చారికలై కదలాడుతోంది. నవ్వులు రువ్వే ఆ పెదవుల వెనుక ఒక ప్రశ్న దాగి దోబూచులాడుతోంది. ఆ ప్రశ్న ఏమిటో తెలుసా... ‘అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎక్కడుంది?’ ఏప్రిల్ 24, 2013. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ‘రాణా ప్లాజా’ అకస్మాత్తుగా నేలకొరిగింది. ఎనిమిదంతస్తులు పేకమేడల్లా కూలిపోయాయి. వాటి కింద 1100 మంది ప్రాణాలు సమాధి అయిపోయాయి. శిథిలాల మధ్య నుంచి నుంచి తీసిన శవాల కుప్పల్లో తమవారిని గుర్తించేందుకు జనం ఆరాటపడ్డారు. అయినవారి జాడ కోసం అల్లాడిపోయారు. కనిపించకుండా పోయిన తమవారి ఫొటోలు చేతపట్టుకుని ‘వీరినెక్కడైనా చూశారా’ అంటూ కనిపించినవారందరినీ అడిగారు. అది చూసి ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి చలించిపోయాడు. ఆటబొమ్మలుండాల్సిన చిట్టి చేతుల్లోకి వచ్చి చేరిన అమ్మ బొమ్మను చూసి అతడు కదిలిపోయాడు. దీనమైన చూపులతో అమ్మ జాడకోసం దిక్కులన్నీ వెతుకుతోన్న ఆ పసివాళ్లను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో నాటి దుర్ఘటనలో అమ్మలకు దూరమైన ఎందరో పిల్లల దయనీయ స్థితిని తెలిపింది. ప్రపంచంలోని ఎందరో అమ్మల గుండెల్ని పిండింది! -
రూనా నవ్వింది!
మూడేళ్ల రూనా నవ్వింది... కానీ, ఆ నవ్వు కోసం కన్నపేగు ఎంతగా కన్నీరుకార్చిందో... డాక్టర్లు ఎన్ని శస్త్రచికిత్స చేశారో తెలిస్తే మీరు కూడా ఆ నవ్వు ఎంత విలువైందో అర్ధం చేసుకుంటారు. త్రిపురకు చెందిన అబ్దుల్లా రెహమన్, ఫాతిమాల గారాలపట్టి రూనా... తను అందరిలాంటి అమ్మాయి కాదు... పుట్టుకతోనే మృత్యవుతో పోరాటం చేసింది... పే...ద్ద తలతో పుట్టి అరుదైన వ్యాధితో మంచమెక్కింది. తమ బిడ్డ ప్రాణాల కోసం ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు. చివరకు గతేడాది రూనాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ వద్ద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి రూనా హైడ్రోసెఫలాస్తో (మొదడులో నీరు చేరడం) బాధపడుతున్నట్లు తేల్చారు. మామూలుగా కంటే మూడు రెట్లు పెద్దదైన తలతో రూనా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే రూనా బతకగలదన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 105 రోజులు ఆసుపత్రిలోనే గడిపిన రూనాకు డాక్టర్లు వందలకొద్ది శస్త్రచికిత్సలు చేశారు. అయినా ఏం లాభం లేదంటూ అదే ఏడాది ఆగస్టులో ఆమెను డి శ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. తర్వాత డిసెంబర్లో మరోసారి ఆమెకు సర్జరీ చేసి 37 ఇంచులున్న రూనా తలను 23 ఇంచులకు తగ్గించారు. బతికే ఛాన్సు మాత్రం తక్కేవనంటూ తల్లిదండ్రులను హెచ్చరిం చారు. కానీ, దేవుడు దయ తలిచా డు. రూనా తల్లిదండ్రుల వే దనను అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు రూ నా బతుకుతోంది. కాదుకాదు.. జీవిస్తుంది. అమ్మ ఒడిలో హాయి గా నవ్వుతూ.. గోరుముద్దలు కూడా తింటోంది. డాక్టర్లు చేతులెత్తేసినా తన బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం ఫాతిమాకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. చుట్టుపక్కల వాళ్లు రూనా అంటే నవ్వుతూ తన బిడ్డ బదులిస్తుందంటూ ఫాతిమా ఆనందంగా చెబుతోంది. ఏదో ఒకరోజు తను కూతురు కూడా అందరిలా స్కూల్‌కు కూడా వెళుతుందని రూనా తండ్రి అబ్దులా నమ్మకంగా చెబతున్నాడు. ఇక డాక్టర్లు వైద్యచరిత్రలో రూనా ఒక అద్భుతం అంటూ తెగపొగిడేస్తున్నారు. -
ఆ నవ్వుకు ఆయువు లేదు!
ఈ చిన్నారిని చూస్తే ఏం కనిపిస్తోంది? చక్రాల కుర్చీలో ఉన్నా ప్రపంచాన్ని చుట్టేయాలన్నంత తపన ఉంది. కాలు నేల మీద మోపలేకపోయినా అంతరిక్షంలో అడుగు పెట్టగలనన్నంత విశ్వాసం ఉంది. లేచి నిలబడలేకపోయినా నిలువునా, అణువణువునా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కల్మషమెరుగని ఆ చిరునవ్వుకు కఠిన శిలలైనా కరిగిపోతాయేమోననిపిస్తోంది కదూ! కానీ ఆ నవ్వుకు ఆయువు లేదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రెన్ సి. బయర్ తీసిన ఈ చిత్రం తీసేనాటికే ఆ పదకొండేళ్ల చిన్నారి డెరెక్ మ్యాడ్సన్ జీవితం క్యాన్సర్ కారణంగా చివరి దశకు చేరుకుంది. ఇది తీసిన కొద్ది రోజులకే అతడి ప్రాణదీపం ఆరిపోయింది. చివరి రోజుల్లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన డెరెక్‌ని, అతడి తల్లి సిండీ ఫ్రెంచ్ వీల్ చెయిర్లో కూర్చోబెట్టి చల్లగాలిలో తిప్పడానికి బయటకు తీసుకు వచ్చింది. అప్పుడు ఆ చిట్టితండ్రి పడిన సంతోషం బయర్ కెమెరా కంట్లో పడింది. పులిట్జర్ ప్రైజు గెలుచుకునే చిత్రంగా వెలువడింది.