ఆడపిల్లలు నవ్వితే ‘ఏంటా నవ్వు’ అని హద్దులు పెడుతుంది లోకం. కాని ఈ ఆడపిల్లల విషయంలో ‘ఇంకో జోకు చెప్పవా’ అని బతిమిలాడుతోంది లోకం. స్టాండప్ కామెడీలో మగవాళ్లే కనిపిస్తుంటారు ఎక్కువగా. కాని మేమూ తక్కువ కాదు అని ముందుకు వచ్చారు ఈ ఐదుగురు. సుముఖి సురేష్, కనీజ్ సుర్కా, మల్లికా దువా, అదితీ మిట్టల్, పుణ్యా అరోరాలు... పొట్ట చెక్కలు చేయడానికి మగవాళ్లే అయి ఉండక్కర్లేదు అని నిరూపిస్తున్నారు. వీళ్లను చూస్తే నవ్వు నాలుగు విధాల రైటు అనిపిస్తుంది.
సుముఖి సురేష్
‘పుష్పవల్లి’ అనే తమిళ క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన కమెడియన్ సుముఖి సురేష్. తన సృష్టించిన క్యారెక్టర్ పుష్పవల్లి లాగే సుముఖి కూడా తమిళియన్. కాని పెరిగింది నాగ్‌పూర్‌లో. చైన్నైలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే థియేటర్ పట్ల ఆసక్తి పెంచుకుంది. కాలేజ్ ఫెస్టివల్స్‌లో నాటకాల్లో నటించేది. డిగ్రీ అయిపోయాక బెంగళూరులోని ఓ ఫుడ్ ల్యాబరేటరీలో ఉద్యోగం రావడంతో బెంగుళూరు వెళ్లింది. 2013లో అక్కడే ‘ది ఇంప్రూవ్’ అనే తన తొలి కామెడీ షోను ప్రదర్శించింది. దానికి వచ్చిన రెస్పాన్స్‌తో ఆమె కెరీర్‌నే మార్చేసుకుంది.
ఓ రెండేళ్లు ఇటు ఉద్యోగం, అటు కామెడీ షోలు నిర్వహిస్తూనే 2015లో ఉద్యాగానికి రాజీనామా చేసి కామెడీనే ప్రొఫెషన్‌గా ఎంచుకుంది. తన జీవితం స్ఫూర్తిగా పుష్పవల్లి అనే క్యారెక్టరును క్రియేట్ చేసి అదే పేరుతో యూట్యూబ్ షోను మొదలుపెట్టింది. ‘ఉద్యోగం మానేసి స్టాండప్ కామెడీని వృత్తిగా స్వీకరిస్తుంటే మీ పేరెంట్స్ ఏమన్నారు?’ అని ప్రశ్నిస్తే.. ‘మా అమ్మకు మంచి హాస్య చతురత ఉంది. అదే నాకూ వచ్చినట్టుంది. అందుకే నేను స్టాండప్ కమేడియన్‌గా అవతారమెత్తున్నానని తెలియగానే చిరునవ్వుతో నన్ను బ్లెస్ చేసింది. బహుశా నాలో తనను చూసుకోవాలనుకుందేమో’ అంటుంది సుముఖి నవ్వుతూ.
ప్రస్తుతం ముంబైలో ఉంటూ ‘బెటర్ లైఫ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సుముఖి. ‘మీరు మహిళ అయినందువల్ల మీ హాస్య చతురతకు ఏమైనా పరిమితులు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు ‘ఆకాశమే హద్దు. నేను జోక్ వేయని అంశమేదీ లేదు. అయితే మగవాళ్ల కన్నా మేం కచ్చితంగా డిఫరెంటే. హాస్యం పట్ల వాళ్ల అప్రోచ్ వేరు. మా అప్రోచ్ వేరు. మాది సున్నతిమైన హాస్యం. మగవాళ్లు హాస్యం పేరిట మానవసంబంధాలను, మనుషులను ఓ ఫ్రేమ్‌లో పెడ్తారు. కాని మహిళలు అలా కాదు. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో చూసి, ఆలోచించి ఎవరినీ నొప్పించకుండా ప్రెజెంట్ చేస్తారు. ఎందుకంటే బేసిక్‌గా స్త్రీలు సున్నిత మనస్కులు కాబట్టి’ అంటుంది సుముఖి.
పుణ్య అరోరా
పుణ్య అరోరా ఒక టీచర్, ఫొటోగ్రాఫర్, స్టాండప్ కమేడియన్. ఒక్కమాటలో ఆమె ఒక ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ పంజాబీ అమ్మాయి ఎంబీఏ కంటే ముందు తన హాబీ అయిన ఫొటోగ్రఫీలో పీజీ డిప్లమా చేసింది. ఆ తర్వాత అదే ఇన్‌స్టిట్యూట్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేసింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీతోపాటు కామెడీని ఎంజాయ్ చేసేది చిన్నప్పటి నుంచి. అమ్మతో కలిసి కామెడీషోస్‌కు వెళ్లడం, ఆన్‌లైన్‌లో చూడటం చేసేది.
‘సరదా కోసం కామెడీని చూసేదాన్ని కాని ఏరోజూ అనుకోలేదు తర్వాత అదే నాకు సీరియస్ కెరీర్ అవుతుందని’ అంటుందిప్పుడు పుణ్య. ‘నా వరకు నాకు హాస్యానికి సంబంధించి స్పెసిఫిక్‌గా ఈ అంశం అంటూ ఏదీ ఉండదు. ఏదీ ఫన్నీగా అనిపిస్తే దాన్నే సబ్జెక్ట్‌గా తీసుకుంటా. అవి నా పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియెన్సెస్ కూడా కావచ్చు’ అంటుంది. ఫీమేల్ స్టాండప్ కమేడియన్స్ పట్ల ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అడిగితే... ‘స్టాండప్ కమేడియన్స్‌గా ఆడవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ప్రేక్షకుల్లో ఒకరకమైన కుతూహలం ఉంటుంది.
కానీ... ఆడ అయినా మగ అయినా ఒక కమేడియన్‌గా నువ్వు ఆడియెన్స్‌ను ఎంత నవ్విస్తున్నావనే అంశం మీదే వాళ్ల ఆదరణ ఆధారపడి ఉంటుంది. నవ్వించడమే కమేడియన్ క్వాలిటీ. దీనికి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదని నా ఉద్దేశం’ అని చెబుతుంది పుణ్య అరోరా.
అదితి మిట్టల్
ఇండియన్ స్టాండప్ కామెడీ సీన్ మీద అదితి మిట్టల్ కూడా ఫస్ట్ ఫీమేల్ కమెడియనే. అంతేకాదు ‘ఫూల్స్ గోల్డ్ అవార్డ్’, ‘రిప్పింగ్ ది డికేడ్’లలో నటించిన టాప్ స్టాండప్ కమేడియన్స్‌లో ఆమె ఒకరు. పుణెలో పుట్టిపెరిగిన అదితి యూకేలోని రాక్స్‌టన్ కాలేజ్‌లో డ్రమెటిక్ లిటరేచర్ చదివింది. అక్కడే కొంతకాలం పాటు పని చేసిన ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. 2009లో ఆల్ ఇండియన్ స్టాండప్ షోలో పాలుపంచుకుంది. ఆమె షోలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. దేనిమీదైనా హాస్యం పండించగలదు.
హాస్యంతో స్త్రీ సమస్యల మీద సమాజాన్ని చైతన్యం చేస్తోంది. మనుషులు, వాళ్ల ఆకారాలు, కులాలు, మతాల వంటి జోలికి పోకుండా మనుషుల నైజం, సమాజం తీరుతెన్నుల మీద వ్యంగ్యాన్ని గుప్పిస్తుంది, హాస్యాన్ని పండిస్తుంది. ‘మార్వాడీల పిసినారితనం మీద, మాయావతి లావు మీద జోకులు వేయడం హాస్యం కాదు. మనుషుల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి వాళ్లను దగ్గర చేయడమే హాస్యం ఉద్దేశం’ అంటుంది అదితి మిట్టల్.
మల్లికా దువా
‘మేకప్ దీదీ’గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా ఫేమస్ మల్లికా దువా. సరోజినీ నగర్ ఎడిషన్ అనే యూ ట్యూబ్ వీడియో కూడా ఆమెకు ఎనలేని అభిమానులను సంపాదించి పెట్టింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన మల్లికా ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కూతురు. తల్లి పద్మావతి డాక్టర్. మల్లికా విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది.
పెన్సిల్వేనియా రాష్ట్రం, ల్యాన్‌కాస్టర్‌లోని ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజ్‌లో చదివింది. చిన్నప్పట్నుంచీ హాస్యాన్ని ఇష్టపడే మల్లిక అడ్వర్టయిజింగ్ రంగంలోకి వచ్చింది. కాని ఎంతో కాలం నిలవలేక మళ్లీ నవ్వుల మీదే మనసు పారేసుకొని ఫన్నీ డబ్‌స్మాషెస్, స్నాప్‌చాట్ వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇది పేరుతో పాటు ఆదాయాన్ని తీసుకురావడంతో దీన్నే కెరీర్‌గా ఖాయం చేసుకుంది మల్లికా దువా.
కనీజ్ సుర్కా
సీఎన్‌ఎన్ – ఐబిఎన్ చానెల్‌లో ‘ది వీక్ దట్ వజన్ట్’ షో చూస్తున్న వాళ్లెవరకైనా తెలుస్తుంది కనీజ్ సుర్కా ఎవరో. సైరస్ బ్రొవోచా, కునాల్ విజయ్‌కర్‌లతో కలిసి సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్యపూరితమైన షోలు చేస్తుంటుంది. ‘ఇంప్రొవైజేషన్’లో దిట్ట. సౌత్ ఆఫ్రికాలో పుట్టిపెరిగిన ఆమె స్కూల్, కాలేజ్ చదవులన్నీ అక్కడే పూర్తి చేసింది. వీళ్ల కుటుంబం సౌత్ ఆఫ్రికాలో ఉంటే మిగిలిన బంధువులంతా ముంబైలో ఉండేవాళ్లు. దాంతో ప్రతి యేడాది ముంబైకి వచ్చే కనీజ్ యూనివర్సిటీ చదువు తర్వాత 2005లో ముంబైకి పూర్తిగా వచ్చేసింది.
ఓ యేడాది గడిపి తర్వాత మళ్లీ వెళ్లి ‘లా’లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేయాలనుకుంది. కాని తిరిగి వెళ్లనేలేదు. కామెడీకి కనెక్ట్ అయిపోయి ఇక్కడే స్థిరపడింది. మొదట థియేటర్‌లో పని చేసింది. రెండేళ్లు గడిచాక ఇంప్రొవైజేషన్ కళను ఇంకా బాగా నేర్చుకోవాలనిపించింది ఆమెకు. దాంతో ఇంప్రూవ్ కామెడీ చదవడం కోసం న్యూయార్క్ వెళ్లింది. ముంబై వచ్చాక ఇంప్రూవ్ కామెడీ షోలు చేయడం మొదలుపెట్టింది. 2007లో పెళ్లయింది. అప్పటికీ కామెడీని కెరీర్‌గా తీసుకోవాలనే సీరియస్‌నెస్ లేదు ఆమెకు. ఏదో చేయాలనే తపన మాత్రం ఉండేదట. కొన్ని కారణాల వల్ల 2011లో భర్తతో విడిపోయింది కనీజ్. చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
ఆఫ్రికా వచ్చేయమని తల్లిదండ్రులు, స్నేహితులు కోరినా వెళ్లలేదు. ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి అని నిర్ణయించుకొని అప్పటి నుంచి స్టాండప్ కామెడీ మీద దృష్టి పెట్టింది కనీజ్. అలా స్టాండప్ కమేడియన్‌గా మారిపోయింది. ‘స్టాండప్ కామెడీ అంటే మగవాళ్ల రాజ్యం అంటారు చాలామంది. కాని ఓ మహిళగా ఈ రంగంలో నేను ఎలాంటి వివక్షనూ ఎదుర్కోలేదు. ఫీమేల్ కమేడియన్‌గా నేను కోల్పోయిన అవకాశాలూ లేవు. కమేడియన్ కమ్యూనిటీ అంతా చాలా ఓపెన్‌గా, ఫ్రెండ్లీగానే ఉంటుంది’ అని చెప్తుంది కనీజ్ సుర్కా.
Comments
Please login to add a commentAdd a comment