నవ్వు ఆరోగ్యానికి మంచిది అని అంటుంటారు. మనస్పూర్తిగా నవ్వేవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది తప్పని, చాలా రోగాలకు చిరునవ్వు చక్కటి ఔషధం అని విన్నాం. అయితే అది ఎలాగే ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు ఓ వైద్యుడు. ఏ డాక్టర్ చేయని రీతీలో రోగులకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తూనే కామెడీ షో నిర్వహిస్తున్నాడు. వారందర్నీ కడుపుబ్బా నవ్వేలా చేసి ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు. అంతేగాదు ఆయన కామెడీ షో వీడియోలను యోట్యూబ్‌లో ఉన్న క్రేజ్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ వైద్యుడు వైద్యలందరికంటే విభిన్నంగా ఈ జర్నీని ఎలా ఎంచుకున్నాడో తెలుసుకుందామా!
కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్‌గా పిలిచే పళనియప్పన్ మాణిక్కమ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ కోసం ఆరోగ్యానికి సంబంధించిన కామెడీ వీడియోలను చేశారు. అ తర్వాత అదే తన ప్రోఫెషన్‌గా మార్చుకున్నాడు. అందుకు ప్రధాన కారణం 2020లో వచిన కరోనా మహమ్మారి. ఆ టైంలో లాక్‌డౌన్‌లతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్య చెప్పేలా యూట్యూబ్‌లో ఈ కామెడీ వీడియోలు చేయడం నుంచి మొదలైంది ఆయన జర్నీ. అలా ఆయన తన వీడియోల్లో హాస్యాన్ని జోడిస్తు బరువు తగ్గడం, ఉపవాసం చేయడం తదితర చక్కటి ఆరోగ్య విషయాలను వివరించేవారు.
దీంతో అతని వీడియోలకు భారీ ఫాలోయింగ్ రావడం మొదలైంది. ఆయన తొలి వీడియో క్లిప్ ఏకంగా ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రాంలో అయితే మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'మెడ్‌కామ్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో తన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అందులో వైద్య సమాచారంతో కూడిన కామెడీ షో ఉంటుంది. అందులో హేమోరాయిడ్స్, అనోరెక్టల్ సమస్యలు, పెద్దప్రేగు పెద్దప్రేగు క్యాన్సర్ గురించి వైద్యుడు పాల్ మాట్లాడతారు. ఆ అనారోగ్య సమస్యలను తదదైన శైలిలో సామాన్య రోగికి కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక్కడ రోగి భయపడడు కాదుగదా! ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు.
అందువల్లే అతని వీడియోలకు ఇంత క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్ పాల్ యూఎస్‌లో వైద్యుడిగా చేస్తున్న టైంలో ఏకంగా 110 కిలోల బరువు ఉండేవాడు. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయోమోనని భయపడేవాడు. అసలు వైద్యుడిగా నేనే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించి తాను చికిత్స అందించే రోగులకు చెబితేనే దాని ప్రభావం ఉంటుందని గ్రహించాడు. చాలామంది రోగులకు బరువుతగ్గాలని, వ్యాయామాలు చేయాలని సూచిస్తామే గానీ వైద్యులే ముందుగా ఇవేమీ చేయరని అన్నారు. ఇలా పాల్ ముందుగా తనాఉ చక్కటి జీవనశైలిని అవలంభించి ఆ తర్వాత తన వీడియోలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు.
గుండెకు స్టంట్ వేయించుకుంటే సరిపోదు, బరువు పెరగకుండా చూసుకోవడమూ చాల ముఖ్యం అని అంటున్నారు వైద్యుడు పాల్. ఆయన తన వీడియోల్లో చాల వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకు శాశ్వత నివారణ లేదని చెబుతారు. ఇక్కడ కేవలం వైద్యుడి మీద రోగికి గల నమ్మకం, అతడి మానసిక స్థితి తదితరాలే వ్యాధిని నయం చేయగలవని అన్నారు. అందుకే తాను నమ్మకంగా చెప్పగలను పెదాలపై ఉండే చిరునవ్వు రోగి ఆయుర్ధాయాన్ని పెంచగలదని. అందుకే తాను ఇలా హాస్య భరితంగా ఆరోగ్య సలహలు ఇస్తున్నాని అన్నారు డాక్టర్ పాల్. దీని గురించే చాలామంది రోగులు ఆయన స్టాండప్ కామెడీ షోకి వస్తారు. అక్కడ ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాల తోపాటు హాస్య భరితంగా సాగే ఆరోగ్య సలహాలను మనసారా ఆశ్వాదిస్తారు.
తన కామెడీలో శర్వణ కుమార్ అనే కాల్పనిక పాత్రతో హాస్యం పండిస్తారు. ఆ పాత్ర అతిగా అల్పాహారాలు, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినే వ్యక్తి. ఇలా శరవణ్ కుమార్ 'తినడం' అనే వీక్‌నెస్ అతని ఆరోగ్యానికి ఎలా చేటు తెస్తుందో హాస్యంతో వివరించడం విశేషం. ఇలాంటి శరవన్ కుమార్‌లు మనలో ఎందరో ఉన్నారని చెబుతుంటారు పాల్. తినాలనే కోరిక మిమ్మల్ని ఎలాంటి వాటిని తినేలా ప్రోత్సహిస్తుందో గమనించాలి అంటారు. అంతేగాదు డైటింగ్, ఉపవాసాల పేరుతో నోరు కుట్టేసుకోకుండా ప్రతి ఫంక్షన్‌కి హాజరయ్యి ఎలా తక్కువుగా తినాలో వివరిస్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క పదార్థంతో అరటి ఆకు ప్లేట్‌ని నింపేలా కొద్ది కొద్దిగా వడ్డించుకోండి. ఇక్కడ మీ లోపల ఉన్న అంతరంగిక వ్యక్తి కోరిక తీరుతుంది. అన్ని రుచులు ఆశ్వాదిస్తూ తక్కువగా కడుపు ఫుల్ అయ్యేలా తినగలుగుతారని అంటారు డాక్టర్ పాల్ . మీరు కూడా అతని వీడియోలు చూసి మనసారా నవ్వుకుని హాయిగా జీవించండి.
(చదవండి: న్యూమోనియాతో పోరాడుతుండగానే కరోనా బారినపడ్డ నటుడు విజయ్‌కాంత్!అలా కాకుండా ఉండాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment