గంపెడు పండుగ | sankranthi fesival Recipes special | Sakshi
Sakshi News home page

గంపెడు పండుగ

Published Sat, Jan 12 2019 2:34 AM | Last Updated on Sat, Jan 12 2019 2:34 AM

sankranthi fesival Recipes special - Sakshi

2019లో తొలి పండగ ఇది. తొలి సంక్రాంతి.గంపెడు ఆశలు, గంపెడు ఆకాంక్షలు, గంపెడు సంతోషాలు, గంపెడు సంబరాలు తీసుకొచ్చే పండగ. గంపెడు మంది బంధువులు వస్తారు. గంపెడు మంది అయినవాళ్లు తోడవుతారు. గంపెడు కబుర్లు సాగుతాయి. గంపెడు నవ్వులు వెల్లివిరుస్తాయి.సంతోషం ఎక్కువైతే ఆకలి కూడా కరకరలాడుతుంది. ఏం చేయాలి? గంపెడు వంటకాలు వండాలి.  తలా ఒక చేయి వేసి వంటగదిలో సందడి రేపాలి. ఆ తర్వాత ఏముంది? తిన్నంత... తబ్బిబ్బయ్యేంత.

మామిడికాయ బొబ్బట్లు
కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2 ; బొంబాయి రవ్వ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు+ పావు కప్పు; మైదా పిండి – ఒక కప్పు; ఉప్పు – చిటికెడు; నూనె – అర కప్పు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను.

తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి, సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, వేడెక్కిన తరవాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక, ఒక టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి మామిడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙ఐదు నిమిషాల తరవాత రెండు కప్పుల నీళ్లు, పంచదార జత చేసి, పంచదార కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక, వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙నెయ్యి జత చేసి బాగా కలియబెట్టి ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలిపి దింపి చల్లారిన తరవాత ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, కొద్దిగా నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ, చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె బాగా జత చేసి కలిపి, తడి వస్త్రంలో గంటసేపు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, చేతితో చిన్న పూరీలా ఒత్తి, ఒక ఉండను ఉంచి, అంచులు మూసేయాలి ∙ అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని కొద్దిగా నెయ్యి పూసి ఈ ఉండను దాని మీద ఉంచి చేతితో మృదువుగా బొబ్బట్లు మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్లును వేసి రెండువైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి తీసి వేడివేడిగా అందించాలి.

రవ్వ గారెలు
కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – 12 (పొడి చేయాలి); కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక టేబుల్‌ స్పూను (సన్నగా తరగాలి); పుల్లటి పెరుగు – అర కప్పు; బేకింగ్‌ సోడా – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
∙ఒక పాత్రలో బొంబాయి రవ్వ, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి కలపాలి ∙జీలకర్ర, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పుల్లటి పెరుగు, ఉప్పు, బేకింగ్‌ సోడా జత చేసి గారెల పిండిలా కలుపుకోవాలి ∙మూత పెట్టి అర గంట సేపు నాననివ్వాలి ∙పిండి ఎండినట్లుగా అనిపిస్తే మరి కాస్త పెరుగు కాని నీళ్లు కాని జత చేసి మరో పావు గంట సేపు ఉంచేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న పిండిని నిమ్మకాయ పరిమాణం లో చేతిలోకి తీసుకుని, నూనె పూసిన అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్‌ కవర్‌ మీద కాని గారె ఆకారంలో మృదువుగా ఒత్తి, కాగిన నూనెలో వేయాలి ∙రెండు వైపులా దోరగా వేగిన తరవాత కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకుని ఇష్టమైన చట్నీతో అందించాలి.

చెరకు రసం పొంగలి
కావలసినవి: పెసర పప్పు – పావు కప్పు; బియ్యం – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పచ్చకర్పూరం – కొద్దిగా; జీడిపప్పులు – ఒక టేబుల్‌ స్పూను; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; చెరకు రసం – 3 కప్పులు

తయారీ: ∙బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక పెసర పప్పు వేసి రంగు మారేవరకు వేయించి తీసేయాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ∙కుకర్‌లో పెసర పప్పు, బియ్యం వేసి కలపాలి ∙చెరకు రసం జత చేసి బాగా కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙మూత తీశాక గరిటెతో మెత్తగా మెదపాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, కిస్‌మిస్‌ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙సిద్ధంగా ఉన్న చక్కెరపొంగలిలో వేసి కలపాలి ∙ఏలకుల పొడి, పచ్చ కర్పూరం జత చేసి మరోమారు కలిపి, నైవేద్యం పెట్టి, వేడివేడిగా అందించాలి.

కొబ్బరి బూరెలు
కావలసినవి: మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పల్చగా ఉన్నా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె/నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి రెండూ కలిపి, కొద్దిగా గట్టి పడేవరకు ఉడికించాలి ∙చల్లారాక ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి (మరీ పల్చగాను, మరీ గట్టిగాను కాకుండా చూసుకోవాలి) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి/నువ్వుల నూనె వేసి కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి ఉండలను, మైదా పిండి మిశ్రమంలో ముంచి తీసి కాగిన నెయ్యి/నూనెలో వేసి దోరగా వేయించి కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙తినే ముందర బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి.

మద్దూర్‌  వడ
కావలసినవి: బియ్యప్పిండి – అర కప్పు; మైదా పిండి – పావు కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; కరివేపాకు – 6 రెమ్మలు (సన్నగా తరగాలి); కొత్తిమీర – 4 టీ స్పూన్లు (సన్నగా తరగాలి); ధనియాల పొడి – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఇంగువ – చిటికెడు; గోరు వెచ్చని నూనె – ఒక టేబుల్‌ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి వేసి కలపాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ∙ఉప్పు, ఇంగువ జత చేయాలి ∙గోరు వెచ్చని నూనె జత చేసి మరోమారు కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోసి గారెల పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేయాలి ∙రెండువైపులా దోరగా వేగిన తరవాత కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

పోలి పూర్ణం బూరెలు
కావలసినవి: మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా; నువ్వుల నూనె/నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పలచబడినా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙పెసర పప్పును రెండు గంటలపాటు నానబెట్టి, మిక్సీలో వేసి పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని ఇడ్లీ రేకులలో ఇడ్లీలా వేసి కుకర్‌లో ఉంచి, విజిల్‌ పెట్టకుండా ఆవిరి మీద ఉడికించి దింపేయాలి ∙చల్లారాక పిండిని చేతితో పొడిపొడిలా అయ్యేలా మెదపాలి ∙పంచదార, కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి కలిపాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌమీద బాణలిలో నెయ్యి/నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న ఉండలను మైదా పిండి మిశ్రమంలో ముంచి బూరెల మాదిరిగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙వేడి వేడి బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి.

ఖర్జూరం– పల్లీ/బాదం బొబ్బట్లు
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మైదా పిండి – ఒక కప్పు; ఖర్జూరాల ముద్ద – ఒక కప్పు; వేయించిన పల్లీలు/బాదం పప్పులు  – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – తగినంత; ఉప్పు – కొద్దిగా

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి∙తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె జత చేసి బాగా మెత్తగా కలిపి, పైన తడి వస్త్రం ఉంచి, గంట సేపు పక్కన ఉంచాలి ∙మిక్సీలో పల్లీలు/బాదం వేసి మెత్తగా పొడి చేయాలి ∙ఖర్జూరాల ముద్ద జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙గోధుమపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙అరటి ఆకు మీద కాని, నూనె పూసిన ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని ఈ ఉండను ఉంచి చిన్న సైజు పూరీలా ఒత్తాలి ∙ఖర్జూరం మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ∙ప్లాస్టిక్‌ కవర్‌ మీద బొబ్బట్టు మాదిరిగా పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, ఈ బొబ్బట్టును వేసి రెండువైపులా నెయ్యి వేస్తూ దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙తినే ముందు బొబ్బట్లు మీద కొద్దిగా నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది.

సూరన్‌ వడలు
కావలసినవి: కంద – పావు కేజీ; నిమ్మ రసం – అర టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; బియ్యప్పిండి – 3 టేబుల్‌ స్పూన్లు + ఒక టేబుల్‌ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత. పొడి కోసం... మిరియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; మెంతులు – 4 గింజలు; లవంగాలు – 2.

తయారీ: ∙కందను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి ∙విజిల్స్‌ వచ్చాక నీళ్లు వేరు చేసి, ముక్కలను చల్లారబెట్టాలి ∙మిక్సీ జార్‌లో మిరియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, లవంగాలు వేసి రవ్వలాగ వచ్చేలా పొడి చేయాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, మిరియాల పొడి మిశ్రమం, కొద్దిగా బియ్యప్పిండి, నిమ్మ రసం, అల్లం తురుము, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పాన్‌ ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి ∙సిద్ధంగా ఉన్న కంద మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేతిలోకి తీసుకుని, వడల మాదిరిగా చేతితో మృదువుగా ఒత్తి, నూనెలో వేయాలి ∙రెండువైపులా దోరగా వేగిన తరవాత, కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

కొబ్బరి బొబ్బట్లు
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; నువ్వుల నూనె/నెయ్యి – పావు కప్పు; ఉప్పు – చిటికెడు; పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; ఏలకుల పొడి – అర కప్పు.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి, నూనె, ఉప్పు వేసి కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, పైన తడి వస్త్రం మూతలా వేసి గంట సేపు నానబెట్టాలి ∙మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙మిశ్రమం దగ్గర పడగానే దింపేసి, చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చిన్న పూరీలా ఒత్తాలి ∙కొబ్బరి ఉండను మధ్యలో ఉంచి, నాలుగువైపులా మూసేయాలి ∙నూనె పూసిన అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్‌ కవర్‌ మీద కాని ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును పెనం మీద వేసి, రెండు వైపులా నెయ్యి వేసి కాల్చాలి ∙బొబ్బట్లను ప్లేట్‌లో ఉంచి, కరిగించిన నెయ్యి వేసి వేడివేడిగా అందించాలి.

నాటుకోడి పులుసు
కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; గసగసాలు – 150 గ్రాములు; ఎండుకొబ్బరి పొడి – 100 గ్రాములు; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; అల్లం + వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు ; చింతపండు గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టొమాటో – 1 (సన్నగా తరగాలి); జీలకర్ర – టీ స్పూన్‌; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; గరం మసాలా – అర టీ స్పూన్‌; ధనియాల పొడి – అర టీ స్పూన్‌; కొత్తిమీర – టేబుల్‌ స్పూన్‌.

తయారీ: ∙గసగసాలు వేయించి ఎండుకొబ్బరి పొడి కలిపి ముద్ద చేసి ఉంచాలి ∙నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అర గంట పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లి తరుగు వేసి, వేయించాక,  టొమాటో తరుగు నిలువుగా తరిగిన పచ్చి మిర్చి వేసి కలపాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద మిశ్రమంలో ఉంచిన నాటుకోడి ముక్కలను జత చేసి బాగా కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడికిన తరవాత కారం, ఉప్పు, గసగసాల మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి ∙ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి, మూడు నిమిషాలు ఉంచి దించాలి.

నువ్వుల బూరెలు
కావలసినవి: – మైదా పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; వేయించిన నువ్వులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – కొద్దిగా; నువ్వుల నూనె/నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండిలా కలుపుకోవాలి (ఎక్కువ పలచబడినా, ఎక్కువ గట్టిగా ఉన్నా బూరెలు సరిగా రావు) ∙మిక్సీలో నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి అన్నీ కలిసే వరకు మిక్సీ పట్టాలి ∙కొద్దిగా పాలు జత చేస్తూ, ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి (మరీ పల్చగాను, మరీ గట్టిగాను కాకుండా చూసుకోవాలి) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి/నువ్వుల నూనె వేసి కాచాలి ∙తయారుచేసి ఉంచుకున్న నువ్వుల ఉండలను మైదా పిండి మిశ్రమంలో ముంచి, కాగిన నెయ్యి/నూనెలో వేసి దోరగా వేయించి కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙బూరె మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసి అందిస్తే రుచిగా ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement