నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' నవ్వలేకపోవడం ఒక 'రోగం'  | funday cover story | Sakshi
Sakshi News home page

నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' నవ్వలేకపోవడం ఒక 'రోగం' 

Published Sun, May 6 2018 12:08 AM | Last Updated on Sun, May 6 2018 12:08 AM

funday cover story - Sakshi

పిల్లవాడు పుట్టాక మనం నేర్పే తొలి విద్య నవ్వడమే. పైగా ‘టీ...టీ...చీ...చీ...’ అంటూ బుగ్గలు పుణికేస్తాం. చిటికేసివేనేస్తాం. పిల్లాడిని పకపకా నవ్విస్తాం. నవ్వించి... వేళ్ల కణుపులు టకటకమనేలా మెటికలు విరిచేస్తాం. పెద్దయ్యాక కూడా ఎవరైనా తెలిసినవారు ఎదురైనప్పుడు పలకరించేదీ నవ్వుతోనే. తెలియనివారిని పరిచయం చేసుకునేదీ చిరునవ్వుతోనే. పేరుకే ‘చిరు’నవ్వుగానీ... అది అచిరకాలం అక్షయంగా కొనసాగాలని కోరుకునే నవ్వు. ఆ నవ్వులోనూ ఎన్నో రకాలు... ముసిముసినవ్వు, మురిపెపు నవ్వు, మంచినవ్వు, మందహాసం, వెకిలినవ్వు, వెటకారపునవ్వు, అట్టహాసం, వికటపు నవ్వు, వికటాట్టహాసం... ఇలా ఎన్నో ఉన్నా ప్రస్తుతం అన్ని రకాల నవ్వులూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఆరోగ్యానికి హ్యూమర్‌ చేసే మేలు గురించి బైబిల్‌లో ఇలా ఉంది. ‘‘సంతోషం గల మనసు ఆరోగ్యకారణం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేలా చేస్తుందం’’టూ ప్రవచిస్తుంది. సాక్షాత్తూ బైబిలే అంతటి మాట చెప్పాక... మనిషి అన్నవాడు నవ్వకపోతే ఎలా... నవ్వుతూ ఉండకపోతే ఎలా? 

హెల్త్‌కీ, హ్యూమన్‌కీ అనుసంధానం... నవ్వుభక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానమైన అగర్‌బత్తీ లాగే... ఆరోగ్యాన్నీ , మనిషినీ అనుసంధానిస్తుంది నవ్వు. నవ్వును ఎందుకు గౌరవించాలో తెలుసా? నవ్వు ఓ డాక్టర్‌ కాప్‌. ఏడాదికి 365 రోజులూ అండర్‌ కవర్‌లో ఉంటుంది. రౌండ్‌ ద క్లాక్‌ ఆపరేషన్స్‌! రోజూ ఎన్నో వ్యాధుల్ని ఎన్‌కౌంటర్‌ చేస్తుంది. అది దాని ట్రాక్‌ రికార్డ్‌ మాత్రమే కాదు... ఆల్‌ టైమ్‌ రికార్డ్‌! అందుకోసమైనా దానికి సెల్యూట్‌ చేయాలి. యమగోల సినిమా చూశారా? ‘అవలోకనమాత్రవిచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర పాశాంకుశ’ అంటూ యమధర్మరాజు యమగా ఆవేశపడతాడు. అంత భారీ సంధులూ, అతిభారీ సమాసాలతో విరుచుకుపడతాడు. ఆయాసం వచ్చి చతికిలపడతాడు. అప్పుడు ఎన్టీఆర్‌ ఆయనకు మాత్ర ఇచ్చి, సేదదీర్చి ఇలా అంటాడు. ‘‘ఆవేశపడకండి సార్‌... మీరసలే బ్లడ్‌ప్రెషర్‌ మనుషులూ. ఆవేశపడితే ఆయాసం వస్తుందం’’టూ హితవు చెబుతాడు. అంటే... ఎక్కువగా కోపంతో ఉండేవారికీ, చీటికీ మాటికీ ఆవేశపడుతూ ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందన్నది అందరికీ తెలిసిన సంగతే. అయితే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేవారికి గుండెజబ్బులు రావడం చాలా తక్కువని ఎన్నో పరిశోధనల్లో వెల్లడయ్యింది. 

ఉదాహరణకు ఒక జర్నల్‌లో ప్రచురితమైన అంశం యథాతథంగా ఇలా ఉంది. హాస్యం వల్ల పిల్లలూ, పెద్దల్లో ఏ అంశంపైనైనా దృష్టికేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. మనం నవ్వడం మొదలుపెట్టగానే ఒత్తిడి కలిగించే హార్మోన్లయిన కార్డిసోల్, ఎపినెఫ్రిన్‌ స్రావాలు తగ్గిపోతాయి. ‘మీసోలింబిక్‌ డోపోమినెర్జిక్‌ రివార్డ్‌ సిస్టమ్‌’ అనే ప్రక్రియ యాక్టివేట్‌ అవుతుంది. డోపమైన్‌ స్రావం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. దాంతో మనకు సంతోషమూ, ఉల్లాసమూ కలిగించే విషయాన్ని పదే పదే చేస్తుంటాం. ఈ రివార్డ్‌ సిస్టమ్‌ పాజిటివ్‌గా ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం. స్కూల్లో ఒక అబ్బాయికి లెక్కల్లో నూటికి నూరు... సైన్స్‌లో నూటికి తొంభై మార్కులు వచ్చాయనుకుందాం. టీచర్‌ చాలా మెచ్చుకుంటుంది. అంటే టీచర్‌ ఇచ్చిన రివార్డుతో అతడిలో డోపమైన్‌ స్రవించి హుషారు పుడుతుంది. ఈ హుషారుకు... అంటే ప్లెజర్‌కు కారణం మెదడులోని ‘న్యూక్టియస్‌ ఎక్యుంబెన్స్‌’ అనే సెంటర్‌. దాన్నే ప్లెజర్‌ సెంటర్‌ అని కూడా అంటారు. జీవితంలో మనకు ఏది సంతోషం కలిగిస్తుందో... దానికి బీజం పడేదిక్కడే. ఆ తర్వాత పెద్దయ్యాక కూడా మనకు సంతోషం కలిగించే అవే పనులను చేస్తుండటానికి మెదడులోని  ఈ ‘ప్లెజర్‌ సెంటరే’ కారణం. ఒక రివార్డు కారణంగా మనకు సంతోషం కలుగుతుందని ఆ ‘సెంటర్‌’లో నమోదు అవుతుంది. అలా జరగగానే... ఇకపై ఆలాంటి రివార్డులను కోరుకున్న విద్యార్థి పదే పదే పాఠాలు బాగా చదివి మళ్లీ తొంభై, నూరు మార్కులు తెచ్చుకోవాలనుకుంటాడు. ఇలా విద్యార్థిలో చదువు ఆకాంక్షనూ, పెద్దయ్యాక ప్రయోజకుడు కావాలనే ఉద్దేశాన్ని కలిగిస్తుందీ మెకానిజమ్‌. 

తనపై తానే పరిశోధనలు చేసుకున్న ప్రొఫెసర్‌...నార్మన్‌ కజిన్స్‌ అనే ప్రొఫెసర్‌కి  యాంకలైజింగ్‌ స్పాండిలోసిస్‌ అనే డీజనరేటివ్‌ డిసీజ్‌ వచ్చింది. అప్పట్లో అది నయమయ్యే అవకాశం పెద్దగా లేదని తెలిసింది. అంతే... తానే స్వయంగా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కావడం వల్ల నవ్వుతో జీవరసాయనాల్లో వచ్చే మార్పులు, వాటి ఉపయోగాలు తెలిసిన ఆయన ఒక పని చేశాడు. తనకు ఎక్కువ మోతాదులో విటమిన్‌–సి ఇవ్వమని తన ఫిజీషియన్‌ను కోరాడు. ఆ తర్వాత హాస్య చిత్రాలను, హాస్యభరితమైన టీవీ షో లను చాలా ఎక్కువగా చూశాడు. అలా తన జబ్బు తీవ్రతను తానే హాస్యంతో ఎదుర్కొన్నాడు. దాంతో బాణం లాంటి జబ్బులకు హాస్యం అనే కవచం పనిచేస్తుందని నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తన ప్రయోగాలతో ఆయన నిరూపించిన అంశాలు చాలానే ఉన్నాయి. ‘‘పది నిమిషాలు హాయిగా గట్టిగా నవ్వితే... అది ఎలాంటి నొప్పులూ, బాధలూ లేని రెండు గంటల గాఢ నిద్రతో సమానం’’ అంటాడాయన. త్వరగానే చనిపోతాడనుకున్న ఆయన ఇలా తనకు తాను హాస్య చికిత్స చేసుకుంటూ జబ్బు సోకాక కూడా 25 ఏళ్లు హాయిగా బతికాడు. అంతేకాదు... తన అనుభవాలతో ‘అనాటమీ ఆఫ్‌ యాన్‌ ఇల్‌నెస్‌ యాజ్‌ పర్సీవ్‌డ్‌ బై ద పేషెంట్‌’ అనే పుస్తకం రాశాడు. ఇలాంటి  ‘ఆరోగ్యానికి నవ్వు – దాని ఉపయోగాలు’ వంటి పరిశోధలూ, పుస్తకాలూ  అసంఖ్యాకంగా ఉన్నాయి. 

హార్ట్‌కు రెండో అటాక్‌ను దూరం చేసే నవ్వు... 
మొదటిసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారు... ఆ తర్వాత మరోటీ, ఇంకోటీ వస్తే... ఇక తమ పని ఇంతేసంగతులని ఆందోళన పడుతుంటారు. గుండెను కొట్టుకొమ్మంటూ తాము తలకొట్టుకుంటూ దాన్ని బతిమాలుతుంటారు. కానీ గుండెకు గిలిగింతలు పెట్టి స్పందింపజేసే గుణం నవ్వుకు ఉంది. మనం నవ్వగానే ఎండార్ఫిన్స్‌ అనే రసాయనాలు మన దేహంలోకి వెలువడుతాయి. రక్తనాళాలను దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా ఉంచేందుకు అవి దోహదపడతాయి. అంతేకాదు... ఒకసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారు నిత్యం మనస్పూర్తిగా నవ్వుతూ ఉంటే రెండోసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయిని కూడా చాలా అధ్యయనాల్లో తేలింది. దీనికి కారణం ఉంది. నిత్యం నవ్వుతూ ఉండే రోగుల్లో అన్ని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని ఇచ్చే రక్తనాళాలు 50 శాతం అదనపు సామర్థ్యంతో వ్యాకోచిస్తాయి. అందుకే అన్ని అవయవాలకు సాఫీగా రక్తప్రసరణ సాగుతుంది.  అందుకే ఒకసారి ఎటాక్‌ వచ్చిన వారికి డాక్టర్లు జీవనశైలి (లైఫ్‌స్టైల్‌) మార్పులు సూచిస్తూ...   అనందంగా ఉండటం, హాయిగా నవ్వడం చేస్తుండాలని తమ పేషెంట్లకు చెబుతుంటారు.   నవ్వు శాస్త్రమని ఒకటుంది... పేరు గెలటాలజీ! 

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన విలియమ్స్‌ ఎఫ్‌. ఫ్రై అనే సైకాలజీ ప్రొఫెసర్‌ ఏకంగా నవ్వూ–ఆరోగ్యానికీ, చికిత్సకూ దాని ఉపయోగాల (థెరపాటిక్‌ యూజెస్‌) కోసం ఒక ప్రత్యేక విభాగాన్నే నెలకొల్పాడు. దాని పేరే ‘గెలటాలజీ’. గెలటాలజీ అంటే ద స్టడీ ఆఫ్‌ లాఫ్టర్‌. తెలుగులో చెప్పాలంటే ‘హాస్యశాస్త్రం’ అన్నమాట. దురదృష్టం ఏమిటంటే... వియత్నామ్‌ యుద్ధం కారణంగా తగినన్ని నిధులు దొరక్క అతడి అధ్యయనం అటకెక్కిపోయింది. అయినా... పట్టుదలతో తన పరిశోధనలను కొనసాగించాడు. హాస్యంతో జీవక్రియలలో వచ్చే మార్పులను అధ్యయనం చేశాడు. నవ్వు వల్ల మనకు చేకూరే సత్ఫలితాలను పుస్తకాలుగా రాశాడు. ‘ద రెస్పిరేటరీ కాంపోనెంట్స్‌ ఆఫ్‌ మిర్త్‌ఫుల్‌ లాఫ్టర్‌’, ‘ద బయాలజీ ఆఫ్‌ హ్యూమర్‌’ వంటివి అందులో కొన్ని. 

ఒక పల్స్‌ ఆక్సిమీటర్‌ సహాయంతో మూడు నిమిషాల పాటు అలాగే నవ్వుతూ ఉండటం వల్ల మన రక్తంలో పెరిగే ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ ఎంతో చూశాడు. ఆక్సిజన్‌ శాచురేషన్‌ అంతగా పెరగలేదు. కానీ నవ్వు వల్ల ఆక్సిజన్‌ వెంటిలేషన్‌ పెట్టిన ఫలితం ఉంటుందని నిరూపించాడు. కండరాలకు శక్తి సమకూరుతుందని తెలుసుకున్నాడు. ఎన్నో అనంతర పరిశోధనలకు అతడి తొలి అధ్యయనాలు మౌలికమయ్యాయి. నవ్వు – ఆరోగ్యం మీద దాని ప్రభావాలు, ప్రయోజనాల పేరిట జరిగిన వేలాది పరిశోధనల్లో ఇవి కొన్ని మాత్రమే. 

పిల్లలూ–పెద్దలూ నవ్వుకోండిలా... 
తెల్లారి లేచిన దగ్గర్నుంచి ప్రతివారికీ ఏవో సమస్యలూ, ఏవేవో బాధలు. అవి లేనిదెవరికీ? వాటిని అవాయిడ్‌ చేయలేం. కాబట్టి చేయాల్సిందేమిటి?  ఈతిబాధల్లోనే ఈదులాడాలి. ఆ ఈతను ఆనందించాలి. సంతోషంగా నవ్వుకోవాలి. భోజనాల వేళ పెద్దలూ పిల్లలూ భోజనాల బల్ల దగ్గర కూర్చొన్నట్టు... జోకులు వడ్డించండర్రా అంటూ పనిగట్టుకు కూర్చోవాలి. పిల్లలందరితోనూ ఏదో ఒక హాస్య సన్నివేశమో, కథో చెప్పిస్తుండాలి. వాళ్లకు జోకులేయడం రాకపోవచ్చు. కేకలేయడం మాత్రమే వచ్చి ఉండొచ్చు. కానీ వారి కేకలే జోకుల్లా ఉంటాయి. మీతో ‘కేక’ అనిపిస్తాయి. 

ఉదాహరణకు ఓరోజు డబ్బు కోసం మీ బుజ్జిగాడిని వెంటబెట్టుకొని ఎటీఎమ్‌కు వెళ్తారు. డబ్బు తీయడానికి ప్రయత్నించారు. ఎంతకీ డబ్బు రాదు. లాభం లేదని ఇంటికొస్తారు. కరెన్సీ లేక బుజ్జిగాడి కిడ్డీ బ్యాంకులోని కాయిన్సే తీస్తారు.  ‘‘నాన్నా... కాయిన్స్‌ పెట్‌డాగ్స్‌ లాంటివి’’ అంటాడు వాడు అకస్మాత్తుగా.  ‘‘అవున్రా. నోటును నమ్ముకుంటే పోటు తప్పదు. నువ్వు అన్నట్టు కాయిన్స్‌ తోక ఊపుకుంటూ మన వెంటే నమ్మకంగా ఉంటాయి’’ అంటారు మీరు.  ‘‘ఎహె అందుక్కాదు. నోటుతో నువ్వు హెడ్స్‌ టెయిల్స్‌ వేయగలవా? చూడు... కాయిన్‌కే హెడ్డూ టెయిలూ ఉంటాయి. అందుకే అవి తోక ఊపే మన టామీలా  విశ్వాసంగా ఉంటాయి’’ అంటాడు మీ బుజ్జిగాడు. అంతే... గాయబ్‌! ఇట్స్‌ గాన్‌!! డబ్బులు రాకపోవడం వల్ల మీకు కలిగిన చికాకు అదృశ్యమవుతుంది. మైండ్‌లోని విసుగు మాటుమాయం అవుతుంది. అంతటి చిరాకూ అంతర్థానమవుతుంది. ఆ తర్వాత మీలోని జ్ఞాన–చెక్కు మీద నవ్వుల సున్నాలు కోట్ల స్థానాల్లోకి చేరుతాయి. ఆ చెక్కు చక్కగా ఆనర్‌ అవుతుంది. ఏకత్కాలంలో మీ మనసు బ్యాంకులో కొన్ని కోట్ల రెట్ల ఆనందాలు రెమిటవుతాయి. 

లాఫ్‌రివల్యూషన్‌కు నాంది కావాల్సింది మనమే... 
రైతులకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేసేవాళ్లు తగ్గినట్టే... ఈమధ్య హాస్యానికీ ఆదరణ తగ్గింది. హాస్యం అంతగా పండటం లేదు. దానికి దృష్టాంతాలూ ఉన్నాయి. రైతులు మాత్రమే కాదు... ఆటలో దొంగ ఎవరో నిర్ణయించడానికి పిల్లలూ ‘పంటలు’ వేసేవారు. పంట పండిన వారు దొర. చివరి వరకూ ఎంతకూ పండనివాడు దొంగ. ఈ దొరలూ... ఆ దొంగలూ కలిసి ఆడుతూ ఉంటే... అటు పిల్లల ముఖాల్లో ఇటు పెద్దల ముఖాల్లో నవ్వుల పంట పండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడాడుతున్నారు? ఇప్పుడు వాళ్ల ప్లే గ్రౌండు వైశాల్యం మహాఅయితే మొబైల్‌ స్క్రీన్‌ అంత! మరీ విశాలమైన చోట ఆడటం చూడాలంటే... సదరు అతి విశాల ఆటస్థలం దర్శనమిచ్చేది కంప్యూటర్‌ మానిటర్‌ అంతటి సైజులోనే! ఇప్పుడు సాగుభూమి విస్తీర్ణం తగ్గుతున్నట్లుగానే చేతిఫోన్‌ స్క్రీనూ చిక్కిపోతోంది కదా. అందుకే ఉన్న స్థలంలోనే మనవంతుగా వీలైనన్ని జోకువిత్తనాలతో నాట్లు వేసి వీలైనంత నవ్వుల పంటను విరగబూయించేలా... అభినవ స్వామినాథన్‌ అవతారమెత్తాలి. ఇలా స్వయంగా మనమే ‘లాఫ్‌ రెవల్యూషన్‌’కు కారణమై టన్నులకొద్దీ నవ్వుబస్తాల దిగుబడితో హాస్యస్వావలంబన సాధిస్తే ఎంత బాగుంటుంది! 

ఇప్పుడు పెద్దలతో పాటు పిల్లల తలలూ ఏదో తప్పు చేసినట్టుగా ఫోన్లలో కూరుకుపోయి ఉంటున్నాయి. అవి పేరుకే స్మార్ట్‌ గానీ... కనీసం స్మార్ట్‌గా కూడా వాటిని యూజ్‌ చేసుకోవడం లేదు మనం. కనీసం వాట్సాప్పుల్లో వచ్చే జోకులనైనా చూసి ఫక్కున నవ్వాలి. అలా చేస్తేనైనా ఒక్కసారిగా మెడ జెండాకర్రలా ఠక్కున నిలబడుతుంది.  ముఖాన నవ్వు ఓ పతాకలా  రెపరెపలాడుతుంది. కనీసం ఈ చిన్ని చిట్కా కూడా పాటించడం లేదు మనం. జీవితంలో హాస్యంలో పండాలంటే కనీసం స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌జోకుల్లోనైనా మనం ముగ్గాలి కదా. ఏదో ఐకాన్‌ నొక్కగానే చక్కిలిగిలి పెట్టి బలవంతంగా నవ్వించే యాప్‌ కొత్త యాప్‌ మనకు వద్దు. అది కనుగొనాల్సిన దుస్థితీ  వద్దు. ఉన్న యాప్‌లతో కమ్యూనికేట్‌ అయ్యే జోకుల నవ్వులనే మన ఒంట్లోకి డౌన్‌లోడ్‌ చేసుకుందాం. 

చివరిగా... ఆనందబాష్పాలను నిర్వచించమంటే ఒకరు అన్న మాటలివి... ‘ఆనందంతో కన్నీళ్లు చిప్పిల్లితే... అక్కడ ఊరిన నీరు గుండెల్లోకి జారి, మనసు తడిబారుతుంది. ఆ చెమ్మతో బతుకు చల్లగా మారుతుంది’. మరి చిరునవ్వుతో పెదవులు విశాలమైతేనో?’ అడిగాడు ఆ మాట విన్న మరో వ్యక్తి. ‘శాస్త్రప్రకారం సేమ్‌ ఎఫెక్ట్‌ ఉండాలి కదా. పెదవులు విప్పారి, విస్తరిస్తాయి కాబట్టి  మనసూ విశాలమవుతుంది’ అన్నది జవాబు. అవును... అందుకే అందరం నవ్వుదాం... మనందరి మనసులూ విశాలం చేసుకుందాం. 

తగ్గుతున్న మనస్ఫూర్తి నవ్వు... 
ఒకప్పుడు మనిషి హాయిగా నవ్వుకునే వ్యవధి చాలా ఎక్కువగానే ఉండేది. అది క్రమంగా తగ్గిపోతోంది. ఒక అధ్యయనం ప్రకారం 1950 నాటి ప్రాంతాల్లో ప్రతి మనిషీ సగటున 18–20 నిమిషాలు నవ్వుతూ ఉండేవాడు. అయితే ఇప్పటికి ఇది 4 నుంచి 5 నిమిషాలకు పడిపోయింది. అంటే గత డెబ్బౖయెదేళ్లలో మనిషి నవ్వుతూ ఉండే సగటు వ్యవధి దాదాపు నాలుగో వంతుకు పడిపోయిందన్నమాట. రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతుండటం, పని గంటలు పెరుగుతుండటం, హాయిగా నవ్వుకునేందుకు సమయం దొరకకపోవడం వంటి అంశాలన్నీ మనిషి నవ్వుతూ ఉండే వ్యవధిని దారుణంగా తగ్గించివేస్తున్నాయి. ఇదెంతో ఆందోళనకరం.

హ్యూమరారోగ్యం... 
హ్యూజ్‌ నంబరాఫ్‌ అధ్యయనాలు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా–లాస్‌ ఏంజిల్స్‌లో ప్రొఫెసర్‌ నార్మన్‌ కజిన్స్‌ చేసిన చాలా పరిశోధనలలో... హాస్యం కారణంగా ఎన్నో వ్యాధులు తగ్గుతాయని నిరూపిత మైంది. ఉదాహరణకు... క్రానిక్‌ స్ట్రెస్‌  కారణంగా  రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడతాయన్నది  తెలిసిందే. బాగా హాస్యధోరణితో ఉండి, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారి రక్తనాళాల్లో వారి నిత్యసంతోష ధోరణి వల్ల బ్లడ్‌క్లాట్స్‌ ఏర్పడటం తగ్గుతుంది. దాంతో ఎన్నో గుండెజబ్బులు నివారితమవుతాయి. రోజూ కేవలం పదిహేను నిమిషాలు నవ్వితే చాలు... మనిషి ఆయుఃప్రమాణం రెండు రోజులు పెరుగుతుందని ఒక అధ్యయనం ముసిముసి మందహాసంతో  పేర్కొంటే... ఇక మిగతావారితో పోలిస్తే హాస్యస్ఫూర్తితో బతికేవారు ఎనిమిదేళ్లు ఎక్కువగా బతుకుతారని మరో అధ్యయనం వికటాట్టహాసం చేసి మరీ  చెబుతోంది. 

మీ కుక్క కరుస్తుందా?
అతనొక జనరల్‌ స్టోర్‌ దగ్గరికెళ్లి కౌంటర్‌ దగ్గర ఉన్న చిన్న కుక్కను చూసి ‘‘మీ కుక్క కరుస్తుందా?’’ అనడిగాడు. షాపతను ‘‘లేదండీ! కరవదు.’’ అన్నాడు నవ్వుతూ. అతను ఆ కుక్కను దువ్వుతూ కాసేపు సంబరపడ్డాడు. అది అతణ్ని గట్టిగా కరిచింది. ‘‘అదేంటీ! మీ కుక్క కరవదు అన్నారు కదా!’’ అని అరిచాడతను. షాపతను నెమ్మదిగా చెప్పాడు – ‘‘అదేగా చెప్తున్నాను. మా కుక్క కరవదు. ఇది మా కుక్క కాదు’’.

ఆహారానికి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్నాయిగానీ... 
నవ్వుకు లేవుఒక వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుడి దగ్గరికి వెళ్లాడనుకోండి. డాక్టర్‌ రకరకాల ప్రశ్నలు వేసి మందులిస్తారు. తిండి ఏం తింటున్నారని అడిగి... అవి వద్దని మందలిస్తారు. ‘‘ఉప్పు బాగా తగ్గించండి. అస్సలు వేసుకోకపోయినా పర్లేదు. కారం, మసాలాలూ తగ్గించాల్సిందే. కొవ్వులు డేంజర్‌. కాబట్టి ఆయిల్స్, నెయ్యి పెద్దగా తినకండి. గౌట్‌ లాంటి జబ్బులుంటే ప్రొటీన్లూ వద్దు. డయాబెటిస్‌ రావచ్చు కాబట్టి పిండిపదార్థాలూ ఎంత తక్కువగా తింటే అంతమంచిది... ’’ ఇలా ఉంటాయా సూచనలు. భోజనంలోని ప్రధాన అంశాలైన... కొవ్వులూ, ప్రొటీన్లు, పిండిపదార్థాలూ... ఈ మూడింటినీ పరిమితం చేయమంటారు. ఉప్పూ–కారం అయితే అసలు వద్దేవద్దంటారు. కానీ జోకులూ–నవ్వులో...?! అవి వద్దనో... కాస్త తగ్గించమనో ఎవరూ అనరు. మూడు పూటలకు బదులు రెండు పూటలే నవ్వమని ఏ డాక్టరూ నిబంధనలూ, నిబంధనాలూ, ఆంక్షలూ విధించడు. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటి? అన్నానికైనా దుష్ప్రభావాలు ఉంటాయేమోగానీ... జోకులకు ఉండవు. అధికస్య అధికం ఫలం. ఎంత ఎక్కువైతే అంత ఆరోగ్యం. సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఏకైక ఔషధం... హాస్యం!  
 – యాసీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement