ఆ నవ్వుకు ఆయువు లేదు!
ఈ చిన్నారిని చూస్తే ఏం కనిపిస్తోంది? చక్రాల కుర్చీలో ఉన్నా ప్రపంచాన్ని చుట్టేయాలన్నంత తపన ఉంది. కాలు నేల మీద మోపలేకపోయినా అంతరిక్షంలో అడుగు పెట్టగలనన్నంత విశ్వాసం ఉంది. లేచి నిలబడలేకపోయినా నిలువునా, అణువణువునా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కల్మషమెరుగని ఆ చిరునవ్వుకు కఠిన శిలలైనా కరిగిపోతాయేమోననిపిస్తోంది కదూ!
కానీ ఆ నవ్వుకు ఆయువు లేదు.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ రెన్ సి. బయర్ తీసిన ఈ చిత్రం తీసేనాటికే ఆ పదకొండేళ్ల చిన్నారి డెరెక్ మ్యాడ్‌సన్ జీవితం క్యాన్సర్ కారణంగా చివరి దశకు చేరుకుంది. ఇది తీసిన కొద్ది రోజులకే అతడి ప్రాణదీపం ఆరిపోయింది. చివరి రోజుల్లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన డెరెక్‌ని, అతడి తల్లి సిండీ ఫ్రెంచ్ వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టి చల్లగాలిలో తిప్పడానికి బయటకు తీసుకు వచ్చింది. అప్పుడు ఆ చిట్టితండ్రి పడిన సంతోషం బయర్ కెమెరా కంట్లో పడింది. పులిట్జర్ ప్రైజు గెలుచుకునే చిత్రంగా వెలువడింది.