జవాబు దొరకని ప్రశ్న
ఫొటో స్టోరీ
వెలుగులు జిమ్మే చిన్ని చిన్ని కళ్లల్లో దిగులు తెరలా కమ్ముకుంది. పాలుగారే చెంపల మీద కన్నీరు చారికలై కదలాడుతోంది. నవ్వులు రువ్వే ఆ పెదవుల వెనుక ఒక ప్రశ్న దాగి దోబూచులాడుతోంది. ఆ ప్రశ్న ఏమిటో తెలుసా... ‘అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎక్కడుంది?’
ఏప్రిల్ 24, 2013. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ‘రాణా ప్లాజా’ అకస్మాత్తుగా నేలకొరిగింది. ఎనిమిదంతస్తులు పేకమేడల్లా కూలిపోయాయి. వాటి కింద 1100 మంది ప్రాణాలు సమాధి అయిపోయాయి. శిథిలాల మధ్య నుంచి నుంచి తీసిన శవాల కుప్పల్లో తమవారిని గుర్తించేందుకు జనం ఆరాటపడ్డారు. అయినవారి జాడ కోసం అల్లాడిపోయారు. కనిపించకుండా పోయిన తమవారి ఫొటోలు చేతపట్టుకుని ‘వీరినెక్కడైనా చూశారా’ అంటూ కనిపించినవారందరినీ అడిగారు.
అది చూసి ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి చలించిపోయాడు. ఆటబొమ్మలుండాల్సిన చిట్టి చేతుల్లోకి వచ్చి చేరిన అమ్మ బొమ్మను చూసి అతడు కదిలిపోయాడు. దీనమైన చూపులతో అమ్మ జాడకోసం దిక్కులన్నీ వెతుకుతోన్న ఆ పసివాళ్లను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో నాటి దుర్ఘటనలో అమ్మలకు దూరమైన ఎందరో పిల్లల దయనీయ స్థితిని తెలిపింది. ప్రపంచంలోని ఎందరో అమ్మల గుండెల్ని పిండింది!