Photo Story
-
Photo Feature: ప్రకృతి ప్రియుల మనసు దోచుకునే 'మే' పుష్పం
వికసించిన ‘మే’ పుష్పం కాజీపేట: ప్రకృతి ప్రియుల మనసు దోచుకునే మే పుష్పం విరబూసింది. ఏప్రిల్ చివరి వారంలో మొగ్గ తొడిగి మే మొదటి వారంలో పువ్వుగా మారడం మే మొక్కకున్న ప్రత్యేకత. అందుకే ఈ పుష్పాన్ని మే పుష్పం అని పిలుస్తుంటారు. కాగా, కాజీపేట 62వ డివిజన్ విష్ణుపురి కాలనీకి చెందిన డీసీసీబీ రిటైర్డ్ డీజీఎం పాక శ్రీనివాస్ మిద్దె తోటలో చాలా అరుదుగా కనిపించే మే పుష్పం మంగళవారం వికసించింది. ఈ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ఇళ్ల వారితో పాటు కాలనీవాసులు అధికంగా తరలివస్తున్నారు. -వరంగల్ ఆహ్లాదం.. నీలాకాశం తుఫాను ప్రభావంతో ఆకాశం నీలం రంగులోకి మారి ఇలా కనువిందు చేసింది. ఏలూరు నగరంలో మంగళవారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు 1920లో నిర్మించిన రక్షణగిరి స్థూపం(నాడు), వందేళ్ల తర్వాత చెక్కు చెదరని రక్షణగిరి స్థూపం (నేడు) వందేళ్ల జ్ఞాపకం రక్షణగిరి పుణ్యక్షేత్ర స్థూపం.. చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తోంది. 1920లో ఫ్రెంచ్ మిషనరీ రక్షణగిరి పుణ్యక్షేత్రాన్ని నిర్మించింది. ఇక్కడ నిర్మించిన స్థూపం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ స్థూపం వద్ద కూర్చొని ప్రార్థనలు చేస్తుంటే మనసుకు ప్రశాంతత చేకూరు తోందని క్రైస్తవుల విశ్వాసం. – జ్ఞానాపురం(విశాఖ దక్షిణ) ఆకులు లేని పూల చెట్టు చినగదిలిలో నార్త్ షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో ఓ పూల చెట్టు ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు ఆకులు çపూర్తిగా రాలిపోయాయి. వాటి స్థానంలో నిండుగా పూసిన గులాబి రంగు పూలతో అలరిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు ఈ చెట్టు వద్ద ఆగి దీని అందాన్ని తిలకిస్తున్నారు. ఈ పూల చెట్లు బీఆర్టీఎస్ రోడ్డులో పెదగదిలి నుంచి ముడసర్లోవ వరకు వాహనచోదకులకు కనువిందు చేస్తున్నాయి. – ఆరిలోవ(విశాఖ తూర్పు) -
Photo Feature: అమ్మ ప్రేమ కమ్మన..!
అమ్మ నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు, మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే, కనిపించే దైవం అమ్మ, అనురాగానికి చిరునామా అమ్మ, ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
ఆసక్తికర దృశ్యాలు: వానరమా.. ఇంత వయ్యారమా..
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: వానరం వయ్యారాలు పోయింది. చేతికి దొరికిన చీర కప్పుకుని కోతి ఇలా సిగ్గులొలికింది. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి వద్ద కనిపించిన ఈ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. చదవండి: Horsley Hills: హార్సిలీహిల్స్ అసలు పేరేంటో తెలుసా....! -
Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
బాసరలో ముగిసిన ఉత్సవాలు భైంసా(ముధోల్): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్‌లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం సాక్షి వరంగల్: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లా‹స్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్లోని బిగ్ రాంచ్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్‌లో ఆయుధ పూజ సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
Photo Story: విద్యార్థులకు ఇదో ‘పరీక్ష’!
పాఠశాల ప్రాంతం మొత్తం జలమయం నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కట్టంగూర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ముందు వర్షపునీరు భారీగా నిలిచిపోవడంతో ఆదివారం ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చిన చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఇక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా వర్షపునీరే ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకుని.. నీటిలోంచి వెళ్లి కేంద్రం వద్ద దింపారు. ఈ పాఠశాలకు రోజూ వచ్చే పిల్లలు, టీచర్లు ఎంతగా ఇబ్బంది పడుతున్నారోనని పరీక్షకు వచ్చినవారు చర్చించుకున్నారు. బొగత వద్ద పర్యాటకుల సందడి వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలధారలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలి వచ్చారు. ప్రకృతి ప్రేమికులు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు బారులుదీరాయి. ఆదివారం కావడంతో యాదాద్రి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కౌంటర్ల నుంచి వాహనాలు వెళ్లడంలో జాప్యమైంది. నగదు కౌంటర్లు రెండు మాత్రమే ఉండటంతో రద్దీ నెలకొనగా, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. -
Photo Story: చలాకీ సీక్రెట్, నవ్వుతూ బతకాలి
జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటన్నింటిని చిరునవ్వుతో జయించాలని అంటున్నట్టుగా ఉంది కదూ ఈ ఆదివాసీ వృద్ధురాలి చిత్రం!. తరగని చిరునవ్వులే తన ఆస్తిపాస్తులని చెప్పే ఈ వృద్ధురాలు.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అయితే ఏనాడూ ఓడిపోలేదని అంటోంది. మెడలో సర్రి, కాళ్లు, చేతులకు కడలు వేసుకొని ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెమెరి మండలం పెద్దపాట్నాపూర్లో కనిపించిందీ చిత్రం. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చలాకీ సత్యం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సత్యంకు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ పది తాడిచెట్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కి కల్లు గీస్తాడు. గీసిన కల్లును సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తాడు. 16 ఏళ్లుగా కల్లు గీస్తున్నానని, చెట్లెక్కినా అలసటనేదే రాదని అంటున్న ఈయన.. చెట్లు ఎక్కకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయని ‘సాక్షి’కి చెప్పాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదని, మధ్యాహ్న జొన్న జావ, రాత్రికి వరి అన్నం తింటానని చెబుతున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం వాగు దాటితేనే నాట్లు ముమ్మరంగా నాట్లుపడే సమయంలో వానలు దంచికొడుతున్నాయి. పొలాలకు వెళ్దామంటే వాగులు వంకలూ ఉప్పొంగుతున్నాయి. అలాగని అదను దాటిపోతుంటే రైతులు చూస్తూ ఉండలేరు కదా.. అందుకే ఓ రైతు వరద నీట మునిగిన అర్కండ్ల వాగు (కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం) లోలెవల్ బ్రిడ్జి మీదుగా తన పొలానికి కూలీలను ఇలా ట్రాక్టర్‌పై తరలించాడు. – శంకరపట్నం పరుచుకున్న పచ్చదనం ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఇలా పచ్చదనం నింపుకుంది. దట్టమైన అడవి, కొండ ప్రాంతంతో పాటు పార్క్ సమీపంలో నుంచి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారి ఇటు వ్యవసాయ పొలాలు చూడటానికి ఆకట్టుకుంటున్నాయి. – పాలమూరు పాకాలకు కొత్త అతిథులు ఖానాపురం: తెల్లని రంగుతో, గరిటె లాంటి పొడవైన ముక్కు కలిగిన ఈ కొంగను తెడ్డుమూతి కొంగ అంటారు. ఇవి శీతాకాలంలో ఉష్ణ మండలాలకు వలస వస్తుంటాయి. నీటి మడుగులు, చెరువులు, నదీ ప్రాంతాల్లో, బురద నేలల్లో సంచరిస్తుంటాయి. ఈ కొంగలు మొదటిసారిగా పాకాల పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చెల్పూరి శ్యాంసుందర్ వీటిని కెమెరాలో బంధించారు. -
Photo Story: చెట్లన్నీ పచ్చని తివాచీలా!
చుట్టూ పచ్చని చెట్లు.. దట్టమైన అడవులు.. పుడమి తల్లికి ఆకు పచ్చని చీర చుట్టినట్లే ఉంది కదూ..! అడవి మధ్య నుంచి తాచుపాము మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు ఉన్న ఈ తారు రోడ్డు ఆదిలాబాద్ జిల్లా నుంచి నాగ్‌పూర్ వెళ్లే 44వ నంబర్ రహదారి. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లన్నీ ఇలా పచ్చని తివాచీలా పరుచుకుని చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఇల్లెక్కిన రైలింజన్ మంచిర్యాల: రైలు ఇంజన్ ఇంటిపైకి ఎలా చేరిందా అని డౌటా? మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ ఇంటి యజమాని రైలు ఇంజన్ ఆకారంలో నీళ్ల ట్యాంకు నిర్మించి దానికి అచ్చం రైలు ఇంజన్లాగే రంగులు వేయించి అలంకరించారు. ఇది చూసిన వారు అచ్చం రైలు ఇంజన్ ఇంటిపైకి ఎక్కించారా అని ఆశ్చర్యపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల వరదొచ్చె.. ఇసుక రవాణా నిలిచె స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, ఇటుకులపహాడ్ వద్ద ఉన్న ఏడు క్వారీలు బంద్ అయ్యాయి. దీంతో ఇసుక కోసం వచ్చిన లారీలు ఇలా బారులుదీరాయి. జాజిరెడ్డిగూడెం హైవే బైపాస్ నుంచి శాలిగౌరారం మండలం వంగమర్తి వరకు జాతీయ రహదారిపై 200 లారీలు నిలిచిపోయాయి. వంగమర్తి క్వారీ వద్ద కూడా లారీలు క్యూకట్టాయి. – అర్వపల్లి, నల్లగొండ ఊరు బాగుండాలని.. ఊరంతా పచ్చగా ఉండాలని, పశుసంపద వృద్ధి చెందాలని వేడుకుంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గిరిజన తండాల్లో మంగళవారం శీత్లాభవాని వేడుకలు నిర్వహించారు. తండా పొలిమేరలో ప్రతిష్టించిన ఏడు విగ్రహాలను అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. తండాల్లోని 900 పశువులను గుట్టపైకి తీసుకొచ్చి దేవతా విగ్రహాల ముందు నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. –రుద్రంగి, రాజన్న సిరిసిల్ల మొక్క.. నాటాలి పక్కా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ముందు పచ్చదనం వెల్లివిరిసేలా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచిస్తున్నారు. పట్టణ ప్రగతి మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఆదిలాబాద్ పట్టణంలో 3 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గులాబీ, చామంతి, ఎర్రమందారం, మల్లెపువ్వు, బంతి తదితర రకాల పూల మొక్కలను మున్సిపల్ వాహనంలో ఇంటింటికీ తీసుకెళ్తూ అందచేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో కనిపించిన దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
Photo Story: భగీరథ.. ఏమిటీ వ్యథ!
కోడేర్ (కొల్లాపూర్): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఖానాపూర్ శివారులో మిషన్ భగీరథ గేటు వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. సోమవారం అది పెద్దదై మూడు గంటల పాటు నీళ్లు వృథాగా పోయాయి. పొలాల్లో ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు ప్రారంభించారు. మంగళవారంలోగా మరమ్మతు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇల్లెందు: పనికెళ్లాలంటే వాగు దాటాల్సిందే. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరేది.. చేసేదేం లేక ఇలా కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని ప్రవాహాన్ని దాటడానికి సాహసం చేశారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం గిరిజనుల పరిస్థితి. మొదుగులగూడెం – నడిమిగూడెం మధ్య కిన్నెరసానిపై ఎలాంటి వారధి లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇలాంటి కష్టాలు షరామామూలయ్యాయి. ఉడుము.. పట్టు మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, రేగులగూడెం, సింగారం తదితర గ్రామాల్లోని గిరిజనులు అడవుల్లో దొరికే ఉడుములను అమ్మడం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. దీని మాంసం నడుము, కీళ్లనొప్పుల్లాంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో కేజీ మాంసం రూ.800 వరకు పలుకుతోంది. దీనిపై పెగడపల్లి ఫారెస్ట్ రేంజర్ సుష్మారావు మాట్లాడుతూ ఉడుములను పట్టడం నేరమని, అటువంటి వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
Photo Story: తీగల వంతెన.. మబ్బులు అందేనా!
సిద్దిపేట: ఆకాశంలో దోబూచులాడుతున్న కారు మబ్బులు.. నిండుకుండలా ఉన్న చెరువుపై వేలాడుతున్న తీగల వంతెన.. ఈ చిత్రం చూపురులను కట్టిపడేస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలకు ప్రజలను అనుమతిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సస్సెన్షన్ బ్రిడ్జ్ కారుమబ్బుల నేపథ్యంలో ఇలా అందాలను చిందించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట అటవీప్రాంతంలో మంచెపై ఐసోలేషన్‌లో ఉన్న గిరిజనుడు గూడెంలో కోవిడ్ గడబిడ మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెంలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ 36 కుటుంబాలు, 174 మంది జనాభా ఉన్నారు. కొందరు గిరిజనులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసి వైద్యసిబ్బంది మూడు రోజుల క్రితం గూడేనికి వెళ్లి వైద్యపరీక్షలు చేయగా నలుగురికీ పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలున్న కొంతమంది నాటుమందులు వాడుతూ అటవీప్రాంతంలోని పంటపొలాల్లో మంచెలు, డేరాలలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా లక్షణాలున్న మరో 50మందికి వైద్యసిబ్బంది కిట్లను అందజేశారు. గూడెంవాసులు కరోనా పరీక్షలకు సహకరించట్లేదని జిల్లా మండల వైద్యాధికారి గోపీనాథ్ తెలిపారు. సాగు బడిలో బడి పాఠం పత్తి పంటలో కలుపు తీస్తూ పిల్లల పనులు ఓ వైపు... మరోవైపు పనుల్లో మునిగి తేలుతూ ఫోన్లో స్పీకర్ ఆన్ చేసుకొని బడి పాటాలు వింటూ చకచకా చిట్టి చేతులతో కొంకలు పట్టి పనుల్ని పరుగులు పెటించారు చిన్నారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లి గ్రామ çశివారు పత్తి పంటలో బడి పాఠాలు వింటూ పనులు చేస్తున్న పిల్లలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
Photo Stories: మొక్కకూ క్యూఆర్ కోడ్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కకు సంబంధించి వివరాలతో క్యూఆర్ కోడ్లను రూపొందించారు. ప్రతి మొక్క వద్ద ఉండే క్యూఆర్ కోడ్లను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే మొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు తెలుసుకోవచ్చునని ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. ఈ క్యూర్ కోడ్లను బాటనీ లెక్చరర్ సహకారంతో టీఎస్కేసీ మెంటార్ ఇమ్రాన్ రూపొందించారని చెప్పారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడు తా యన్నారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ బొగత పరవళ్లు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఎగువన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తుతూ జలపాతంలో కలుస్తోంది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో గల ఈ జలపాతాన్ని వీక్షించేందుకు శనివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. – వాజేడు ‘నీటి పిల్లుల’ హల్చల్ కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి పిల్లులు సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. గతేడాది నుంచి కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ పెరగడంతో గోదావరిలో నీటి పిల్లులు అధికంగా వచ్చి చేరాయి. రాత్రి వేళ సంచరిస్తూ అవి చేపలను తింటూ జాలర్లు వేసిన వలలను కొరికి తెంపేస్తున్నాయి. దీంతో జాలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ పరిధి మండలపురం గ్రామానికి చెందిన జాలరి కొమ్మలి గోదావరిలో తరుచూ చేపలు పడుతున్నాడు. కాగా వలలను తెంపి పాడుచేస్తున్న రెండు నీటి పిల్లులను శుక్రవారం రాత్రి పట్టుకుని తర్వాత గోదావరికి దూరంగా అడవిలో వదిలేశాడు. నేను గానీ వల వేస్తే.. వల విసరడమూ ఓ కళే. సరిగ్గా విసిరితేనే చేపలు చిక్కుతాయి. లేదంటే వల వేయలేక విలవిల్లాడాల్సిందే. శుక్రవారం కురిసిన వర్షానికి మంచిర్యాలలోని రాళ్లవాగులో వరద నీరు చేరింది. శనివారం చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉత్సాహం చూపారు. పోటీపడి వలలు విసురుతూ చేపలు పడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల భారీ మీనం.. మత్స్యకారుడి ఆనందం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో శనివారం ఓ జాలరికి 25 కిలోల చేప దొరికింది. చేప విలువ సుమారు రూ.5 వేలు ఉంటుందని జాలరీ గూండ్ల సాయిలు తెలిపారు. – ఎడపల్లి(బోధన్) -
Photo Story: వరదపాశం పెద్దబండపై పోసి..
అచ్చంపేట రూరల్: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ తల్లిదండ్రులు వర్షం రాక కోసం ఎదురుచూస్తుండటం చూసి మంగళవారం కొంతమంది చిన్నారులు, యువకులు గ్రామ సమీపంలోని పెద్దబండపై వరదపాశం పోశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో వర్షం కోసం పూజలు చేశారు. కప్పకావడితో ఊరంతా తిరిగారు. పోగైన డబ్బులతో వరదపాశం తయారుచేశారు. అనంతరం పెద్దబండపై పోసి ఆరగించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని వారి నమ్మకం. ఖమ్మం: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సే..షెల్టర్‌గా మారింది. ఖమ్మం నగరం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్‌షెల్టర్ లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు ఓ బస్‌ను ఇలా ఉంచి..తాత్కాలిక బస్ షెల్టర్ అంటూ ఫ్లెక్సీ కట్టారు. -సాక్షి ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం సిద్దిపేట కలెక్టరేట్లో ‘చైల్డ్ కేర్’ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట సమీకృత కలెక్టరేట్లో చైల్డ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతోపాటు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం పిల్లలతో వచ్చే తల్లులకు సైతం ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గది, ఆడుకోవడానికి గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. మహిళా ఉద్యోగుల పిల్లలను బేబీ కేర్‌కు పంపించకుండా విధులు నిర్వర్తిస్తూ వారిని చూసుకునేలా సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ, ఆటలు, పాటలు నేర్పించేందుకు అంగన్వాడీ టీచర్‌ను సైతం నియమించనున్నారు. చదవండి: ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్ సభకు అందని ఆహ్వానం -
Photo Story: ‘వరంగల్’.. జిగేల్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయమిది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో శనివారం ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించగా.. ఆ అందాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యమిది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ కాడెద్దులకు సాగు శిక్షణ మహాముత్తారం: వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం దుక్కులు దున్నే ఎద్దులు కనుమరుగవుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికీ భూములు దున్నేందుకు కాడెద్దులపైనే ఆధారపడుతున్నారు. అందుకోసం ఒక వయస్సుకు వచ్చిన ఎద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇస్తారు. తర్వాత బరువులను లాగడం, పొలాలు, చేన్లు దున్నే సమయంతో పాటు బండి కట్టినప్పుడు చెప్పినట్లుగా నడుచుకునేలా వాటికి మరికొన్ని రోజులు బండిపై తర్ఫీదు నిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతు కాడెద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇచ్చే దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి. నిండుకుండలా పార్వతీ బ్యారేజీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి లక్ష్మి, అన్నారం సరస్వతీ పంప్‌హౌస్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్లలోని పార్వతీ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. పార్వతీ పంప్‌హౌస్ నుంచి ఐదు మోటార్ల ద్వారా శనివారం ఒక టీఎంసీ నీటిని పార్వతీ బ్యారేజీలోకి డెలివరీ సిస్టర్న్ ద్వారా ఎత్తిపోశారు. దీంతో ఈ బ్యారేజీ జలకళను సంతరించుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి చదవండి: 25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ -
Photo Story: జాలువారుతున్న కారుమబ్బులు
సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – చింతలమానెపల్లి భానుడి కిరణాలు.. బంగారు వర్ణాలు.. కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది. – చింతలమానెపల్లి ఇవి కూడా చూడండి: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు -
Photo Stories: అరుదైన ‘ఎర్ర చందనం’ చేప
నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో బుధవారం జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. నాగారానికి చెందిన వీరగాని రమేశ్‌కు 12 కేజీల బరువున్న అరుదైన ‘ఎర్ర చందనం’ రకం చేప లభ్యమైంది. అయితే దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిణి సౌజన్యను వివరణ కోరగా.. ఎర్ర చందనం చేపలు తెలంగాణ ప్రాంతంలో అరుదుగా లభిస్తాయని, దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్ అని తెలిపారు. జోరువానతో కప్పల బెకబెక వరంగల్ రూరల్: వానాకాలం రావడంతో అన్నదాతలకే కాదు సకల జీవరాశికి పండుగ వచ్చేసినట్లే. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో ఖిలా వరంగల్ కోట పరిసరాల ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. వీటిని స్థానికులు ఆసక్తిగా చూశారు. చదవండి: ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు...
‘పిట్ట బతుకూ ఎంత హాయి’ అంటూ ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న పాటందుకుంటే ఏదో అనుకున్నాం. కానీ ఈ పక్షుల సమూహాన్ని చూస్తుంటే ‘నిజమే ఎంత హాయి’ అనిపిస్తుంది ఎవరికైనా. మాస్క్‌లు లేవు... భౌతిక దూరం బాధే లేదు... మందు, మాకూ చింతే లేదు... వ్యాక్సినేషన్ గొడవ అంతకన్నా లేదు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే మాటను మరచిపోయి ఏడాదిన్నరకుపైనే దాటిపోయింది. సరదాగా మీలా కూర్చొని నాలుగు కబుర్లు... మనసారా నవ్వులు ఊసే లేదు. వరుస మరణాలు సంభవిస్తే ‘పిట్టల్లా రాలిపోతున్నారు’ అనే వాళ్లం. కానీ ఇప్పుడు మా ‘నవ’ జాతే కూలిపోతోంది... మీ కిలకిలా రావాలు ఎప్పటిలానే వసంత రుతువును తలపిస్తోంది. మీలో ఉరకలెత్తే ఆ ఉత్సాహం... సంతోషం మా సొంతమయ్యేదెప్పుడో... ‘ఉందిలే మంచి కాలం ముందూముందునా... అందరూ సుఖపడాలి నందానందనా’ అని ఆలపించుకుంటూ... ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నామని గుమిగూడిన విహంగాల గుంపును చూసినవారు అభిలషించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు మార్గంలో ఓ ఫ్లెక్సీ ఐరన్ రాడ్లపై ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరా కంటపడగానే ‘క్లిక్’మంది. – సత్యనారాయణ, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం Photo Feature: రెడీ టు టేకాఫ్.. తిరుగు ప్రయాణానికి సిద్ధం -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి! -
నేల రాలిన జీవితం
ఫొటో స్టోరీ అది 1976.బోస్టన్లోని ఓ పత్రికాఫీసులో కూర్చుని పని చేసుకుంటున్నాడు ఫొటో గ్రాఫర్ స్టాన్లీ జె. ఫోర్మన్. అంతలో ఓ కబురు... అక్కడికి కొంత దూరంలోని ఓ ఆరంతస్తుల భవంతి మంటల్లో చిక్కుకుందని. వెంటనే కెమెరా తీసుకుని బయలుదేరాడు స్టాన్లీ. అతడు వెళ్లేసరికి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కలంతా దట్టంగా పొగ కమ్ముకుంది. దారుణమైన ఆ పరిస్థితిని ఫొటోలు తీయసాగాడు స్టాన్లీ. అప్పుడే అతడి కళ్లు పై అంతస్తు మీదికి మళ్లాయి. అక్కడ... కిటికీ దగ్గర... ఓ పందొమ్మిదేళ్ల యువతి, మూడేళ్ల పసిపాప నిలబడి ఉన్నారు. తమను ఎవరు కాపాడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతలో రెస్క్యూ టీమ్‌లోని ఓ సభ్యుడు భవనం పైనుంచి తాడు సహాయంతో కిందికి దిగసాగాడు. వారిని ఎలాగైనా కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడతను. కాసేపయితే కాపాడేవాడే. కానీ అంతలోనే ఘోరం జరిగి పోయింది. కిటికీ దగ్గర మంటలు తీవ్రమయ్యాయి. వారి కాలి కింది నేల కాలి, కరిగి, కదలసాగింది. దాంతో ఆ ఇద్దరూ ఒక్కసారిగా పైనుంచి పడిపోయారు. మొదట ఆ యువతి, ఆపైన ఆ చిన్నారి. యువతి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మీద పడటంతో చిన్నారి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. నాటి ఆ విషాద ఘటనకు... పులిట్జర్ బహుమతి పొందిన ఈ చిత్రం సాక్ష్యంగా నిలిచింది! -
తొలి సవ్వడి
ఫొటో స్టోరీ అమాయకతను ఒలకబోసే కన్నులు ఆశ్చర్యంతో అరమోడ్పు లయ్యాయెందుకు అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తే! ఈ చిన్నారి ముఖంలో కనిపించిన ఈ భావం వెనుక ఓ కథ ఉంది. ఓ ఆశ్చర్యం ఉంది. ఓ ఆనందం ఉంది. ఓ కొత్త అనుభవం ఉంది! హెరాల్డ్ విటిల్స్ అనే ఈ బుజ్జిగాడికి పుట్టుకతోనే చెవులు వినిపించవు. తండ్రి పిలుపు వినలేడు. తల్లి జోలపాటనూ ఆస్వాదించలేడు. ప్రపంచం లోని ఏ శబ్దమూ అతడిని కదిలించలేదు. అది అతడి తల్లిదండ్రుల్ని చాలా బాధించింది. వాళ్లు ఎలాగైనా తమ కొడుకుని బాగు చేసుకోవాలని తపించారు. వైద్యులకు చూపించారు. వైద్యులు పరీక్షలు చేసి, హెరాల్డ్ ఎడమ చెవిలో ఓ మిషన్‌ని బిగించారు. దాని పనితీరు తెలుసుకోవడం కోసం ‘హెరాల్డ్’ అని పిలిచారు. తొలిసారి ఒక శబ్దం తన చెవుల గుండా మనసుకు చేరడంతో ఆ చిన్నారి అవాక్కయిపోయాడు. సరిగ్గా అప్పుడే ఫొటోగ్రాఫర్ జాక్ బ్రాడ్లీ ఈ ఫొటో తీశాడు. దశాబ్దాల నాటి ఈ చిత్రం... బ్రాడ్లీకి ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది! -
శవాలకు పూసిన పూలు!
ఫొటో స్టోరీ ప్రముఖ ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్... 1993లో ఓసారి కంబోడియా వెళ్లారు. అక్కడ ఆయనను ఓ దృశ్యం ఆకర్షించింది. ఓ పేద అమ్మాయి... ఒక కొలనులో దిగి, కలువ పూలను ఏరుకుంటోంది. పువ్వును కోసిన ప్రతిసారీ ఆ చిన్నారి ముఖం సంతోషంతో విచ్చుకుంటోంది. అది చూసి ముచ్చటపడిన ఐజక్... ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ ఫొటో వెనుక... పెద్ద కథే ఉంది! కలువపూలతో కళకళలాడుతోన్న ఈ కొలను... కేవలం కొలను కాదు. ఓ పెద్ద శ్మశానవాటిక! అవును. హింస, భయానక వ్యాధులు, ఆకలి మంటల కారణంగా కంబోడియాలో ఎప్పుడూ మృత్యుదేవత స్వైరవిహారం చేస్తూనే ఉంటుంది. ఎందరినో కర్కశంగా కబళిస్తూ ఉంటుంది. వాళ్లందరికీ అంత్యక్రియలు చేయడం పెద్ద పని. కాబట్టి ఆ మృతదేహాలను తీసుకెళ్లి కొలనుల్లో పారేస్తుంటారు. అలాంటి కొలనుల్లో ఇదీ ఒకటి. పైకి పూల అందాలతో అలరిస్తోన్నా... అడుగున శవాల గుట్టలను తనలో దాచుకుందీ కొలను. అది తెలియని ఈ చిట్టితల్లి... చక్కగా కొలనులోకి దిగి, ఆనందంగా కలువపూలను రోజూ కోసుకుంటుంది. వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటుంది. పాపం తనకి మాత్రం ఏం తెలుసు... ఆ పూలు కొన్ని వందల విగత జీవుల మీద వికసించాయని, కొన్ని అభాగ్య జీవితాల ఆనవాళ్లను తమలో దాచుకున్నాయని! -
శోకమే మిగిలింది
ఫొటో స్టోరీ ఆశ... మనిషికి ఊపిరి. అది మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ అదే చచ్చిపోయినప్పుడు ఆ మనిషి ఏమవుతాడు? ప్రాణమున్న శవంలా మిగులుతాడు. బతుక్కి అర్థం తెలియక, చావును వెతుక్కుంటూ వెళ్లలేక ఉక్కిరిబిక్కిరవుతాడు. అప్పుడు తాను పడే వేదన సామాన్యమైనది కాదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో, గుండెల్ని ఎలా మెలిపెడుతుందో... ఈమెను అడిగితే అర్థమవుతుంది. కళ్లలో కొండంత వేదనను నింపుకున్న ఈ మహిళ పేరు అయిడా. ఉత్తర సిరియాలోని ఓ గ్రామంలో ఉండేది (ఈ ఫొటో తీసేనాటికి). మార్చ్ 10, 2012న ఆ ఊరి మీద సిరియా సైన్యాలు విరుచుకుపడ్డాయి. క్షణాల్లో వారి ఇళ్లను, సామాన్లను, జీవితాలను కూడా చెల్లాచెదురు చేసేశాయి. నాటి దాడిలో అయిడా భర్తతో పాటు ముద్దులొలికే ఆమె ఇద్దరు పిల్లలూ మరణించారు. తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయిన అయిడాను ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. స్పృహలోకి రాగానే ఆమె భర్త, పిల్లల కోసం వెతుక్కుంది. కానీ వాళ్లు కనిపించలేదు. ఇక ఎప్పటికీ కనిపించరని తెలియగానే ఆమె గుండె బద్దలైంది. హృదయం శోకసంద్రమైంది. కళ్లగుండా వేదన కన్నీరుగా పొంగి పొర్లింది. నాటి ఆమె ఆవేదనకు ప్రత్యక్ష సాక్ష్యంగా... ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోడ్రిగో తీసిన ఈ చిత్రం నిలిచిపోయింది. 2013లో ఈ ఫొటోకి పులిట్జర్ ప్రైజ్ తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే... ఆ రోజు అయిడా ఆవేదనను చూసి తన మనసు పడిన బాధే ఎక్కువని రోడ్రిగ్ వెల్లడించడం విశేషం! -
ఊపిరి పోసిన ముద్దు!
ఫొటో స్టోరీ అది 1967, జూలై. న్యూయార్క్‌లోని ‘వెస్ట్ 26 స్ట్రీట్’లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఫొటోగ్రాఫర్ రాకో మొరాబిటో. అనుకోకుండా అతడి కళ్లు రోడ్డు పక్కనే ఉన్న ఓ కరెంటు స్తంభం మీద పడ్డాయి. అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నాడు రాకో. ఓ లైన్‌మేన్ (ర్యాండల్ జి. చాంపియన్) స్తంభం మీది నుంచి తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. అతణ్నలా చూడగానే కారు బ్రేకు వేసి, కిందికి దిగాడు రాకో. అప్పటికే మరో లైన్‌మేన్ జె.డి.థామ్సన్ స్తంభం దగ్గరకు పరుగెడుతున్నాడు. ఏం జరిగివుంటుందో ఊహించిన రాకో అంబులెన్సుకు ఫోన్ చేసి, కెమెరా తీసుకుని స్తంభం దగ్గరకు పరుగుదీశాడు. చాంపియన్ స్తంభం మీద పని చేస్తుండగా తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలింది. ఒక్కసారిగా నాలుగు వేల వోల్టుల కరెంటు అతడి శరీరంలోకి ప్రవేశించింది. దాంతో అతడి గుండె ఆగిపోయింది. శరీరం కాస్త కిందికి జారి, స్తంభం మీద నుంచి అచేతనంగా వేళ్లాడసాగింది. తన సహోద్యోగిని అలా చూడగానే పరుగు పరుగున వెళ్లిన థామ్సన్... స్తంభం ఎక్కి, చాంపియన్ని చేతులతో పట్టుకుని, అతని నోటిలో నోరు పెట్టి కృత్రిమ శ్వాసను అందించడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా అతడిని బతికించాలని తపన పడ్డాడు. థామ్సన్ తపన వృథా కాలేదు. కాసేపటి తర్వాత చాంపియన్ శరీరం స్పందించడం మొదలుపెట్టింది. దాంతో అతడిని తన భుజాల మీద వేసుకుని జాగ్రత్తగా కిందికి దించాడు. తగిన సమయంలో చికిత్స అందేలా చేసి, చాంపియన్‌కి ప్రాణం పోశాడు. ఈ మొత్తం సంఘటననీ తన కెమెరాలో పలు చిత్రాలుగా బంధించాడు రాకో. వాటిలో ఇది ఒకటి. ‘కిస్ ఆఫ్ లైఫ్’ పేరుతో ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన ఈ ఫొటోకి గాను 1968లో పులిట్జర్ బహుమతి అందుకున్నాడు రాకో! -
రియల్ హీరో!
ఫొటో స్టోరీ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకోగానే హీరో వచ్చి కాపాడేస్తుంటాడు సినిమాల్లో. నిజ జీవితంలో అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం మనం. కానీ కొన్నిసార్లు అలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే ఈ చిత్రం. 1997లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరదలు సంభవించాయి. శాంటా రోసా నగరం నీట మునిగింది. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్ప కూలాయి. ఉధృతంగా వచ్చి ముంచేసిన వరద నీటిలో చాలామంది చిక్కుకుపోయారు. ఈ ఫొటోలో చూపిస్తున్న అమ్మాయి పరిస్థితి కూడా అదే. సుడులు తిరిగే వరద నీటిలో ఓ చెట్టు ఆధారంగా దొరికింది ఆ అమ్మాయికి. దాన్ని పట్టుకుని, ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలని ఆరాటపడిందామె. కానీ ఆమె వల్ల కాలేదు. ఇక మునిగిపోతుంది అనుకున్న సమయంలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ అధికారి అక్కడకు వచ్చాడు. వరద నీటికి ఎదురీదుతూ పోయి, ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడాడు. హెలికాప్టర్లో పయనిస్తూ వరద బీభత్సాన్ని తన లెన్సులో బంధిస్తోన్న ఫొటోగ్రాఫర్ ఆనీ వెల్స్ ఆ దృశ్యాన్ని ఒడిసిపట్టింది. బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ క్యాటగిరీలో ఆ యేడు పులిట్జర్ పురాస్కారాన్ని అందుకుంది! -
పసిడి నవ్వులు!
ఫొటో స్టోరీ ఈ ఫొటో 1946లో తీసినది. ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. తీసిన ఫొటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ... దీని వెనుక ఉన్న కథ మాత్రం ఎందరినో ఆలోచింపజేసింది. ఈ చిన్నారి ఆస్ట్రియాలోని ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు. తనవారు ఎవరో తెలియక, తనతో ఉన్నవారు తనకు ఏమవుతారో అర్థంకాక దిగులుగా ఉండేవాడు. అలాంటప్పుడే రెడ్‌క్రాస్ సభ్యులు ఆ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు. పిల్లలందరికీ రకరకాల బహుమతులు ఇచ్చారు. ఈ బుడతడికి ఒక జత బూట్లు ఇచ్చారు. వాటిని చూసి వాడి కళ్లు మెరిశాయి. ముఖం మతాబులా వెలిగిపోయింది. అంతవరకూ ఉన్న దిగులు మాయమైపోయింది. ఆ కొత్త బూట్ల జతను గుండెలకు హత్తుకుని తన ఆనందాన్ని ఇలా ప్రకటించాడు. మనం చేసే చిన్న సాయం అవతలివారికి కలిగించే సంతోషం ఎంతలా ఉంటుందో తెలియజేసిందీ చిత్రం! -
ప్రశ్నించిన చూపులు!
ఫొటో స్టోరీ ఈమె కళ్లలో ఏం కనిపిస్తోంది? ఎవ్వరూ సమాధానం చెప్పలేని ఓ ప్రశ్న కదలాడుతున్నట్టుగా అనిపించడం లేదూ! అవును. ఆమె నిజంగానే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని... వారి నిర్లక్ష్యాన్ని! అధికారుల్ని... వారి అలక్ష్యాన్ని! జనాలని... వారి నిస్సహాయతని! నవంబర్ 13, 1985. కొలంబియాలోని నెవడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం బద్దలై నిప్పులు కక్కింది. లావా పరవళ్లు తొక్కింది. చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలను అతలాకుతలం చేసింది. వాటిలో అర్మెరో ఒకటి. అగ్నిపర్వతానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఊరిలోనే ఉండేది ఒమైరా సాంచెజ్ (13) కుటుంబం. అగ్నిపర్వతం బద్దలయ్యే సమయానికి ఇంట్లోవాళ్లంతా బయటకు వెళ్లారు. పిన్నితోపాటు ఒమైరా మాత్రమే ఉంది. ఇల్లు కూలిపోయింది. బురద ముంచెత్తింది. పిన్ని చనిపోయింది. ఒమైరా బురద, కాంక్రీటు, నీరు కలిసిన మడుగులో చిక్కుబడిపోయింది. తెల్లారేసరికి రెస్క్యూ టీములు వచ్చాయి. ఒమైరాని బయటకు తీసే ప్రయత్నాలు మొదలెట్టాయి. కానీ ఆమె కాళ్లు ఇటుకల మధ్య ఇరుక్కుపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఓ దుంగను ఆసరాగా పట్టుకుని మూడు రాత్రులు అలానే ఉండిపోయింది ఒమైరా. నన్ను కాపాడలేరా అన్నట్టుగా ఆమె దీనంగా చూస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టారు. అవసరమైతే ఆమె కాళ్లు కోసేసి అయినా బయటకు లాగేయాలనుకున్నారు. కానీ తక్షణ చికిత్స అందించే అవకాశం లేకపోవడంతో... ఆమెనలా చనిపోనివ్వడమే మంచిదనుకున్నారు. విషయం తెలిసినా నాయకులు గానీ, అధికారులు గానీ ఆమెను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. అరవై గంటల పాటు నరకయాతన అనుభవించింది ఒమైరా. ఒళ్లంతా పాలిపోయింది. ముఖం ఉబ్బిపోయింది. కళ్లు వాచి, ఎర్రబడ్డాయి. ‘ఇక నన్నిలా వదిలేయండి, మీరెళ్లి విశ్రాంతి తీసుకోండి’ అని చెప్పింది. ఆసరాగా పట్టుకున్న దుంగను మెల్లగా వదిలేసింది. నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. అంతకు కొద్ది నిమిషాల ముందు ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ఫార్నియర్ ఈ చిత్రాన్ని తీశాడు. ప్రపంచ నేత్రాన్ని చెమ్మగిల్లేలా చేశాడు. పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నాడు! -
విషాద రాగం
ఫొటో స్టోరీ కాంతులు నిండాల్సిన కళ్లల్లో నీరు పొంగి పొర్లుతోంది. చురుకుతనం ఉండాల్సిన చూపుల్లో దైన్యత చోటు చేసుకుంది. పాలుగారాల్సిన ముఖం కన్నీటి వరదలో తడిసి ముద్దయ్యింది. హుషారుగా కదలాల్సిన చేతులు వాయులీనపు తీగెలపై విషాద రాగాలను వాయిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఎవరి మనసైనా చలించకుండా ఉంటుందా? ఆ చిట్టితండ్రి బాధ చూసినవారెవరి కన్నయినా చెమ్మగిల్లకుండా ఉంటుందా?! బ్రెజిల్‌కి చెందిన ఈ చిన్నారి పేరు... డీగో ఫ్రాజో టార్క్వాటో. పేదరికంలో పుట్టాడు. బాధల్లో పెరిగాడు. అలాంటి సమయంలో వారి ప్రాంతానికి జాన్ ఎవాండ్రో డిసిల్వా అనే వ్యక్తి వచ్చాడు. ఆయన డీగో లాంటి పిల్లలందరినీ చేరదీశాడు. వారికి అండగా నిలిచాడు. సంగీతం నేర్పించాడు. ప్రదర్శనలు ఇప్పించాడు. ఉపాధి మార్గాన్ని ఏర్పరచి పేదరికాన్ని దూరం చేశాడు. కానీ ఆయన ఉన్నట్టుండి అనారోగ్యంతో మరణించాడు. అది తట్టుకోలేకపోయారు ఆ చిన్నారులు. ముఖ్యంగా డీగో కదలిపోయాడు. తమ మాస్టారిని సమాధి చేస్తుంటే తన స్నేహితులతో కలిసి సంగీతాంజలి ఘటించాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఇలా కన్నీటి పర్యంతమయ్యాడు. అంతకన్నా విషాదం ఏమిటంటే... ఇది జరిగిన మూడేళ్లకి డీగో కూడా మరణించాడు... లుకేమియాతో!