జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటన్నింటిని చిరునవ్వుతో జయించాలని అంటున్నట్టుగా ఉంది కదూ ఈ ఆదివాసీ వృద్ధురాలి చిత్రం!. తరగని చిరునవ్వులే తన ఆస్తిపాస్తులని చెప్పే ఈ వృద్ధురాలు.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అయితే ఏనాడూ ఓడిపోలేదని అంటోంది. మెడలో సర్రి, కాళ్లు, చేతులకు కడలు వేసుకొని ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెమెరి మండలం పెద్దపాట్నాపూర్‌లో కనిపించిందీ చిత్రం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
చలాకీ సత్యం
ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సత్యంకు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ పది తాడిచెట్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కి కల్లు గీస్తాడు. గీసిన కల్లును సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తాడు. 16 ఏళ్లుగా కల్లు గీస్తున్నానని, చెట్లెక్కినా అలసటనేదే రాదని అంటున్న ఈయన.. చెట్లు ఎక్కకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయని ‘సాక్షి’కి చెప్పాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదని, మధ్యాహ్న జొన్న జావ, రాత్రికి వరి అన్నం తింటానని చెబుతున్నాడు.
– సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం
వాగు దాటితేనే నాట్లు
ముమ్మరంగా నాట్లుపడే సమయంలో వానలు దంచికొడుతున్నాయి. పొలాలకు వెళ్దామంటే వాగులు వంకలూ ఉప్పొంగుతున్నాయి. అలాగని అదను దాటిపోతుంటే రైతులు చూస్తూ ఉండలేరు కదా.. అందుకే ఓ రైతు వరద నీట మునిగిన అర్కండ్ల వాగు (కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం) లోలెవల్ బ్రిడ్జి మీదుగా తన పొలానికి కూలీలను ఇలా ట్రాక్టర్‌పై తరలించాడు.
– శంకరపట్నం
పరుచుకున్న పచ్చదనం
ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఇలా పచ్చదనం నింపుకుంది. దట్టమైన అడవి, కొండ ప్రాంతంతో పాటు పార్క్ సమీపంలో నుంచి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారి ఇటు వ్యవసాయ పొలాలు చూడటానికి ఆకట్టుకుంటున్నాయి.
– పాలమూరు
పాకాలకు కొత్త అతిథులు
ఖానాపురం: తెల్లని రంగుతో, గరిటె లాంటి పొడవైన ముక్కు కలిగిన ఈ కొంగను తెడ్డుమూతి కొంగ అంటారు. ఇవి శీతాకాలంలో ఉష్ణ మండలాలకు వలస వస్తుంటాయి. నీటి మడుగులు, చెరువులు, నదీ ప్రాంతాల్లో, బురద నేలల్లో సంచరిస్తుంటాయి. ఈ కొంగలు మొదటిసారిగా పాకాల పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చెల్పూరి శ్యాంసుందర్ వీటిని కెమెరాలో బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment