Toddy tree
-
బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): కుటుంబాన్ని పోషించేందుకు 20 ఏళ్లు గల్ఫ్ బాట పట్టిన ఇంటి పెద్ద.. ఇకపై కళ్లముందే ఉంటూ, తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించిన భార్యాబిడ్డల ఆశలు గల్లంతయ్యాయి. కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదే చెట్టుపై మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషా దం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ (59) బతుకుతెరువుకు 20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే గ్రామానికి వచ్చి కులవృత్తి చేసుకుంటూ ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. గౌడ సంఘంలో అతనికి 13 తాటి, 6 ఈత చెట్లను కేటాయించగా.. రెండు నెలలుగా కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు దిగుతుండగా మోకు జారి చెట్టుపైనే వెనక్కి వంగిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. మోకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు, గ్రామస్తులు జేసీబీ సా యంతో మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దింపారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు రజిత, నవ్య, కావ్య, స్వాతి, కొడుకు సాయి ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిగాయి. మూడో కూతురు హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కవల పిల్లలైన స్వాతి, సాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: ఆ ఇమ్యూనిటీతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది -
Photo Story: చలాకీ సీక్రెట్, నవ్వుతూ బతకాలి
జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటన్నింటిని చిరునవ్వుతో జయించాలని అంటున్నట్టుగా ఉంది కదూ ఈ ఆదివాసీ వృద్ధురాలి చిత్రం!. తరగని చిరునవ్వులే తన ఆస్తిపాస్తులని చెప్పే ఈ వృద్ధురాలు.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అయితే ఏనాడూ ఓడిపోలేదని అంటోంది. మెడలో సర్రి, కాళ్లు, చేతులకు కడలు వేసుకొని ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెమెరి మండలం పెద్దపాట్నాపూర్లో కనిపించిందీ చిత్రం. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చలాకీ సత్యం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సత్యంకు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ పది తాడిచెట్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కి కల్లు గీస్తాడు. గీసిన కల్లును సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తాడు. 16 ఏళ్లుగా కల్లు గీస్తున్నానని, చెట్లెక్కినా అలసటనేదే రాదని అంటున్న ఈయన.. చెట్లు ఎక్కకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయని ‘సాక్షి’కి చెప్పాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదని, మధ్యాహ్న జొన్న జావ, రాత్రికి వరి అన్నం తింటానని చెబుతున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం వాగు దాటితేనే నాట్లు ముమ్మరంగా నాట్లుపడే సమయంలో వానలు దంచికొడుతున్నాయి. పొలాలకు వెళ్దామంటే వాగులు వంకలూ ఉప్పొంగుతున్నాయి. అలాగని అదను దాటిపోతుంటే రైతులు చూస్తూ ఉండలేరు కదా.. అందుకే ఓ రైతు వరద నీట మునిగిన అర్కండ్ల వాగు (కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం) లోలెవల్ బ్రిడ్జి మీదుగా తన పొలానికి కూలీలను ఇలా ట్రాక్టర్‌పై తరలించాడు. – శంకరపట్నం పరుచుకున్న పచ్చదనం ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఇలా పచ్చదనం నింపుకుంది. దట్టమైన అడవి, కొండ ప్రాంతంతో పాటు పార్క్ సమీపంలో నుంచి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారి ఇటు వ్యవసాయ పొలాలు చూడటానికి ఆకట్టుకుంటున్నాయి. – పాలమూరు పాకాలకు కొత్త అతిథులు ఖానాపురం: తెల్లని రంగుతో, గరిటె లాంటి పొడవైన ముక్కు కలిగిన ఈ కొంగను తెడ్డుమూతి కొంగ అంటారు. ఇవి శీతాకాలంలో ఉష్ణ మండలాలకు వలస వస్తుంటాయి. నీటి మడుగులు, చెరువులు, నదీ ప్రాంతాల్లో, బురద నేలల్లో సంచరిస్తుంటాయి. ఈ కొంగలు మొదటిసారిగా పాకాల పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చెల్పూరి శ్యాంసుందర్ వీటిని కెమెరాలో బంధించారు. -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. బియ్యం శ్రీనివాస్(45) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రికి చికిత్సపొందుతూ మృతి చెందాడు. -
తాటాకు @ రూపాయి
తాటాకుల నరికివేతతో ఉపాధి ఏటా నాలుగు నెలలు పని ద్వారకాతిరుమల : తాటి ఆకులు సంప్రదాయానికి చిహ్నాలుగా ఉండటంతో పాటు ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. రానున్న వేసవి, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో గ్రామాల్లో తాటి ఆకులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాటి ఆకులు నరికే కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. ఏటా ఈ సీజన్లో తాటి ఆకుల నరికివేతను వృత్తిగా చేసుకుని ఎందరో జీవనాన్ని సాగిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, కోడిగూడెం, పి.కన్నాపురం, గోపాలపురం ప్రాంతాల్లో ఏడాదికి నాలుగు నెలలపాటు తాటి ఆకులు నరకడం ద్వారా వందలాది మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రమాదమని తెలిసినా.. తాటి చెట్లు ఎక్కేటప్పుడు గరికమ్మలు శరీరాన్ని చీల్చుతున్నా, ఆకులు నరికేటప్పుడు ప్రమాదవశాత్తు కత్తి తగిలి రక్తం కారుతున్నా కార్మికులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా ఈ సీజన్లో ఇదొక్కటే ఉపాధి అని వీరు అంటున్నారు. ఈ పనిలేనప్పుడు మేకలు మేపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు. రోజుకు 500 నుంచి వెయ్యి ఆకుల వరకు నరుకుతున్నామని, ఆకుకు రూపాయి చొప్పున తమకు కూలి లభిస్తోందని అంటున్నారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారులకు ఒక్కో ఆకును రూ.5 చొప్పున రైతులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజుకు రూ.500 సంపాదిస్తున్నా.. తాటి ఆకులు నరికే పని ప్రమాదమని తెలుసు. అయినా తప్పడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాటి ఆకులు నరుకుతూ ఉపాధి పొందుతున్నాం. ఒక్కో ఆకును నరికినందుకు రైతు రూపాయి ఇస్తాడు. ఇలా రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. -రాజినాల రామయ్య, ఐఎస్ జగన్నాథపురం నాలుగు నెలలపాటు.. వివాహాది శుభకార్యాలకు తాటి ఆకులను వాడుతున్నారు. చలువ పందిళ్లు నిర్మించడం దగ్గర నుంచి ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో చల్లదనం కోసం తాటి ఆకుల పందిళ్లు వేస్తుంటారు. దీంతో మాకు ఏటా నాలుగు నెలల పాటు చేతినిండా పని దొరుకుతుంది. - సొండు పాపారావు, ఐఎస్ జగన్నాథపురం